డీ– అడిక్షన్ సెంటర్లకు పెరుగుతున్న రోగుల సంఖ్య
డ్రగ్స్, గంజాయి, మద్యానికి బానిసలైన వారికి డీ–అడిక్షన్ చికిత్సలు
ఇప్పటికే ఉన్న 16 కేంద్రాల్లో పనిచేస్తున్నవి 11 మాత్రమే..
ఇటీవలే మరో 26 కొత్త డీ–అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: మత్తుపదార్థాలు రవాణా చేసే ముఠాలను కట్టడి చేయడంతోపాటు మత్తుపదార్థాలకు అలవాటుపడిన వారిని అందులోంచి బయటపడేసే వ్యూహంతో ముందుకు వెళితేనే మత్తు మహమ్మారిని తరిమికొట్టడం సాధ్యమవుతుందని నిపుణులు చెపుతున్నారు. మద్యం, కల్తీకల్లు, గంజాయి, ఇతర మత్తుపదార్థాలకు బానిసలైన వారిని ఆ వ్యసనం నుంచి బయటపడేసేందుకు ఏర్పాటు చేసిన డీ–అడిక్షన్ సెంటర్లకు రోగుల సంఖ్య ఇటీవల పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. గతానికి భిన్నంగా గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాల గురించి అవగాహన పెరుగుతుండటంతో డీ–అడిక్షన్ సెంటర్లలో చేరే రోగుల సంఖ్యా పెరుగుతోంది.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా డీ–అడిక్షన్ సెంటర్ల పనితీరును టీజీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు ఇటీవలే పరిశీలించి ఓ నివేదికను తయారు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 16 డీ–అడిక్షన్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని కేంద్రాలు అద్భుతంగా పనిచేస్తుండగా.. ఐదు సెంటర్లు పూర్తిగా మూతపడినట్టు అధికారులు గుర్తించారు. ఇదిలా ఉండగా డీ–అడిక్షన్‌కు ప్రాధాన్యం పెరగడంతో
నషాముక్త భారత్ అభియాన్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26 ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో డీ–అడిక్షన్ సెంటర్లను కొత్తగా ఏర్పాటు చేశారు. వీటిల్లో కనీసం 10 చొప్పున బెడ్లు అందుబాటులోకి తెచ్చారు.
మద్యం బానిసలే ఎక్కువ..
డీ–అడిక్షన్ సెంటర్లలో చేరుతున్న రోగులలో ఎక్కువ మంది మద్యానికి బానిసలైన వారే ఉంటున్నారు. తర్వాత పెద్ద సంఖ్యలో గంజాయి బానిసలు ఉంటున్నారు. 2019 నుంచి ఈ ఏడాది ఆగస్టు 12 వరకు డీ–అడిక్షన్ సెంటర్లలో చేరిన రోగుల సంఖ్య ఆధారంగా చూస్తే.. హనుమకొండలోని డీ–అడిక్షన్ కేంద్రంలో 1,067 మంది మద్యానికి బానిసలైన వారుండగా, గంజాయి రోగులు 344 మంది ఉన్నారు. ఆదిలాబాద్ సెంటర్‌లో 781 మంది మద్యానికి బానిసలైన వారు చేరగా.. 53 మంది గంజాయి బాధితులు ఉన్నారు.
ఎల్బీనగర్‌లోని సెంటర్‌లో 933 మంది మద్యానికి బానిసలైన రోగులు, 39 మంది గంజాయికి బానిసలైన రోగులున్నారు. నల్లగొండ జిల్లా చిట్యాలలో 850 మంది మద్యం బానిసలు, 30 మంది గంజాయికి బానిసలైన రోగులు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరులోని సెంటర్‌లో 722 మంది మద్యానికి బానిసలైన వారు.. 24 మంది గంజాయికి అలవాటుపడిన వారున్నారు. ఖమ్మం జిల్లా మధిర‡ సెంటర్‌లో 427 మంది రోగులు మద్యానికి బానిసలైన వారుండగా, 23 మంది గంజాయి నుంచి డీ–అడిక్షన్ కోసం చేరారు.
డీ–అడిక్షన్ సెంటర్లు అంటే..?
మద్యం, గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాలకు బానిసలైన వారికి ఆ వ్యసనం నుంచి బయటపడేందుకు అవసరమైన వైద్య సహాయం, కౌన్సెలింగ్ అందించి వారిని తిరిగి ఆరోగ్యవంతులుగా మార్చే కేంద్రాలను డీ–అడిక్షన్ సెంటర్లుగా వ్యవహరిస్తారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ ఆధ్వర్యంలో నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ (ఎన్‌ఏపీడీడీఆర్) పథకం కింద ప్రభుత్వ ఆసుపత్రులలో డీ–అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచితంగా చికిత్స అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment