Land Details
-
అంతు చిక్కని భూముల లెక్కలు
సాక్షి, బోధన్: బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీకి చెందిన భూముల వ్యవహారం గందరగోళంగా మారింది.. ఫ్యాక్టరీ భూములకు సంబంధించి రికార్డుల్లో ఉన్న లెక్కలకు, వాస్తవ పరిస్థితులకు పొంతనే లేకుండా పోయింది. మొదట్లో 16 వేల ఎకరాలకు పైగా ఉన్న ఫ్యాక్టరీ భూములు క్రమంగా అన్యాక్రాంతమయ్యాయి. ప్రస్తుతం ఉన్న వాటిలో కూడా చాలా వరకు కబ్జాకు గురవుతున్నాయి! ఫ్యాక్టరీ భూముల కొనుగోళ్లు, పట్టామార్పిళ్లు, రిజిస్ట్రేషన్ల వ్యవహారం తరచూ వివాదాస్పదంగా మారుతోంది. ఫ్యాక్టరీకి సంబంధించిన భూ రికార్డులు రెవెన్యూ శాఖ వద్ద లేకపోవడం అక్రమార్కులకు కలిసి వస్తోంది. తాజాగా బోధన్ నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్) పరిధిలో గల కేన్యార్డును ఆనుకుని 2.30 ఎకరాల స్థలాన్ని కొందరు కబ్జా చేసేందుకు యత్నించడంతో మరోమారు ఈ భూముల వ్యవహారం చర్చనీయాంశమైంది. రూ.కోట్ల విలువైన ఖాళీ స్థలాన్ని ఇటీవల కొందరు జేసీబీతో చదును చేయిస్తుండగా, ఆ స్థలం పక్కనే ఉన్న హనుమాన్ టేకిడి కాలనీ యువకులు అడ్డుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కబ్జా వ్యవహారం తేల్చాలని అఖిలపక్షాలు ఆందోళనకు కూడా దిగాయి. 2002లో ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అనంతరం నిజాంషుగర్స్ భూములు, ఖాళీ స్థలాల రక్షణకు అప్పట్లో ప్రభుత్వం పలువురు అధికారులతో కోర్ కమిటీని నియమించింది. ప్రస్తుతం భూములు కబ్జాకు గురవుతుంటే ఈ కమిటీ ఏం చేస్తుందో ఏమో మరీ!? 16 వేల ఎకరాలు.. నిజాం పాలనలో 1938లో బోధన్‌లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని నెలకొల్పారు. ఫ్యాక్టరీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని 16 వేల ఎకరాల భూములను అప్పట్లో సాగు కోసం కేటాయించారు. బోధన్, ఎడపల్లి, రెంజల్, కోటగిరి, వర్ని, మోస్రా, చందూర్ తదితర మండలాల పరిధిలో ఈ భూముల్లో 16 వ్యవసాయ క్షేత్రాలు ఏర్పాటు చేసి చెరుకు పంట సాగును ప్రోత్సహించారు. 1992 నుంచి ఫ్యాక్టరీ భూముల విక్రయ ప్రక్రియ ప్రారంభమైంది. భూమి కొనుగోలు పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఆయా సామాజిక వర్గాల పేదలకు ఎకరం చొప్పున గత ప్రభుత్వాలు పంపిణీ చేశాయి. కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేసిన భూములు సుమారు 8,500 ఎకరాలు, బహిరంగ వేలంపాట ద్వారా మరో 3,500 ఎకరాలు విక్రయించారు. అలాగే, వీఆర్ఎస్ పొందిన కార్మికులకు 1,292 ఎకరాలను కేటాయించినట్లు ఎన్ఎస్ఎఫ్ కోర్ కమిటీ రికార్డులు చెబుతున్నాయి. పేదల ఇళ్ల స్థలాలు, పట్టణ డంపింగ్ యార్డులు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రార్థనాలయాలు, సంక్షేమ హస్టళ్ల భవనాలు కూడా ఫ్యాక్టరీ స్థలాల్లోనే నిర్మించారు. కొన్నిచోట్ల చెరువుల శిఖంలో ఫ్యాక్టరీ భూములుండగా, ఫ్యాక్టరీకి చెరుకు తరలింపు కోసం నిర్మించిన లైట్ రైల్వే లైన్ స్థలం 188 ఎకరాలు రోడ్లుగా మారాయి. ఎన్డీఎస్ఎల్ వద్ద 191 ఎకరాలు 2002లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిజాం షుగర్స్‌ను ప్రైవేటీకరించింది. 51 శాతం ప్రైవేట్ కంపెనీ వాటా, 49 శాతం ప్రభుత్వ వాటాతో ఫ్యాక్టరీ ప్రైవేట్పరమైంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎన్డీఎస్ఎల్ ప్రైవేట్ యాజమాన్యం చేతిలోకి వెళ్లింది. ప్రైవేట్ యాజమాన్యం ఫ్యాక్టరీ పరిసరాల్లో ఉన్న విలువైన భూములను కొనుగోలు చేసింది. 20 ఎకరాల్లో ఫ్యాక్టరీ ఉండగా, మిగిలిన భూములను కూడా కొనుగోలు చేసిందని కోర్ కమిటీ అధికారులంటున్నారు. 2015 డిసెంబర్ 23న ఎన్డీఎస్ఎల్ మూసివేతకు గురి కాగా, అక్రమార్కులు ఫ్యాక్టరీకి చెందిన విలువైన ఖాళీ స్థలాలపై కన్నేశారు. శక్కర్‌నగర్ ప్రాంతంలో పలు చోట్ల కోర్ కమిటీ ఆధీనంలో రూ.కోట్ల విలువైన స్థలాలున్నాయి. ఇందులో కొన్ని ఇప్పటికే ఆక్రమణకు గురయ్యాని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేదల ఇక్కట్లు.. మరోవైపు, కార్పొరేషన్ల ద్వారా పేదలు కొనుగోలు చేసిన భూములు చాలా చోట్ల వివాదాస్పదంగా మారాయి. కొందరికి భూములుంటే పట్టాలు లేవు.. పట్టాలున్న వారికి భూముల్లేవు. కొందరికి భూములున్నా హద్దులు చూపించలేదు. ప్రతి సోమవారం బోధన్ ఆర్డీవో ఆఫీసులో నిర్వహించే ప్రజావాణిలో ఇలాంటి వినతులు ఎన్నో వస్తుంటాయి. ఇలాంటి సమస్యలు సుమారు 500కు పైగానే ఉంటాయి. భూములపై దృష్టి సారించాం ఫ్యాక్టరీ భూములు, స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా దృష్టి సారించాం. కార్పొరేషన్ ద్వారా పేదలు కొనుగోలు చేసిన భూముల సమస్యలపై మా వద్దకు 350 వరకు వినతులు వచ్చాయి. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. – ఖాలిద్ అలీ, ఎన్ఎస్ఎఫ్ కోర్ కమిటీ అధికారి -
పట్టణాల్లో ప్రక్షాళన!
-
పట్టణాల్లో ప్రక్షాళన!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అన్ని రకాల భూములకు సరైన లెక్కలుండాలని, ప్రతీ అంగుళం భూమికి ఎవరు యజమానో తేల్చాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. భూ రికార్డుల ప్రక్షాళనతో గ్రామీణ ప్రాంతాల్లో భూముల వివరాల నిగ్గు తేలిందని, ఇదే తరహాలో పట్టణాలు, నగర ప్రాంతాల్లో కూడా భూముల వివరాలు తేల్చాలని స్పష్టం చేశారు. మార్చి 11న రాష్ట్రవ్యాప్తంగా కొత్త పాస్ పుస్తకాల పంపిణీ చేపట్టాలని నిర్ణయించినందున, ఆ నెల 5వ తేదీకల్లా పాస్ పుస్తకాలు జిల్లాలకు చేరేలా కార్యాచరణ రూపొందిం చుకోవాలని సూచించారు. కొత్త పాస్ పుస్తకాలు, పహాణీలు, భూ రికార్డుల ప్రక్షాళన, ధరణి నిర్వహణ తదితర అంశాలపై గురువారం ప్రగతి భవన్లో సీఎం సమీక్షించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, శాంతాకుమారి, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ల్యాండ్ రికార్డుల విభాగం డైరెక్టర్ వాకాటి కరుణ, మీ సేవ కమిషనర్ వెంకటేశ్వర్రావు, రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్ రావు, మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి, ఎమ్మెల్యే ఆలం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటు ఆస్తులకు ప్రత్యేక నంబర్లు ‘భూ రికార్డుల ప్రక్షాళన గొప్ప విజయం సాధించింది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతీ అంగుళం భూమి లెక్క తేలింది. 93 శాతం భూముల విషయంలో స్పష్టత వచ్చింది. కోర్టు కేసులు, ఇతర వివాదాల్లో ఉన్న భూములకు సంబంధించి పార్ట్–బిలో నిర్ణయం జరుగుతుంది. ఈ ప్రక్షాళనతో గ్రామీణ ప్రాంతాల్లో భూ వివాదాలు తగ్గిపోతాయని భావిస్తున్నాం. పట్టణాలు, నగరాల్లో కూడా ఈ వాతావరణం రావాలి. ఇందుకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలి. ప్రైవేటు ఆస్తులకు కూడా సర్వే నంబర్ల తరహాలో ప్రత్యేక నంబర్లు కేటాయించే విధానం తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలి. తెలంగాణ భూ భాగంలోని ప్రతీ అంగుళం భూమి ఎవరి ఆధీనంలో ఉంది, అందులో ఎలాంటి కార్యకలాపాలు జరగుతున్నాయి.. తదితర వివరాలన్నీ ప్రభుత్వం వద్ద ఉండాలి’అని సీఎం అధికారులకు సూచించారు. భవిష్యత్తులో భూ వివాదాలకు తావులేకుండా రికార్డులన్నీ ప్రక్షాళన చేయడంతోపాటు వాటిని పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. పాస్ పుస్తకంపై రైతు ఫొటో, ప్రత్యేక నంబర్ ‘పాస్ పుస్తకాలు, పహాణీల్లో ప్రస్తుతం 31 కాలమ్స్ ఉన్నాయి. కాలక్రమేణా వచ్చిన మార్పుల వల్ల చాలా కాలమ్స్ అవసరం లేదు. ప్రభుత్వం భూమి శిస్తు వసూలు చేసిన కాలంలో కొన్ని కాలమ్స్ అవసరం ఉండేది. ఇప్పుడు ఇవన్నీ ఉండటం వల్ల అనవసర గందరగోళం ఏర్పడుతుంది. రైతుల వద్ద ఉండే పాస్ పుస్తకాలు, పహాణీల్లో అన్ని వివరాలు అవసరం లేదు. అత్యవసరం అనుకున్న వివరాలుంటే చాలు. రైతు పేరు, ఖాతా నంబరు, సర్వే నంబరు, విస్తీర్ణం, భూమి పొందిన విధానం వంటి కొన్ని ముఖ్యమైన కాలమ్స్ ఉంటే సరిపోతుంది. పాస్ పుస్తకాల్లో, పహాణీల్లో పరభాషా పదాలు చాలా వాడుతున్నారు. అవి రైతులకు అర్థం కావు. కాబట్టి మన రైతులు వాడే పదాలనే పాస్ పుస్తకాలు, పహాణీల్లో వాడాలి. ఈ మార్పులతో కొత్త పాస్ పుస్తకాలు, పహాణీలు తయారు కావాలి’’అని సీఎం సూచించారు. ఈ మేరకు ఏ కాలమ్స్ ఉంచాలి, ఏ కాలమ్స్ తీసేయాలనే దానిపై విస్తృత చర్చ జరిపి నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగానే కొత్త పాస్ పుస్తకాలు, పహాణీలు పంపిణీ చేయాలని, పాస్ పుస్తకంపైన ఖచ్చితంగా రైతు ఫోటో ఉంచాలని, ప్రతీ పాస్ పుస్తకానికి ప్రత్యేక నంబరు కేటాయించాలని నిర్ణయించారు. -
పకడ్బందీగా పాస్ పుస్తకాలు!
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీకి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారు. మార్చి 11న నిర్వహించే ఈ కార్యక్రమం విజయవంతం కోసం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఊరికో నోడల్ అధికారిని నియమించడంతోపాటు రైతులకు అదేరోజున అందేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు. ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్ ప్రగతిభవన్‌లో కలెక్టర్లతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, పంచాయతీరాజ్ చట్ట సవరణ, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, గ్రామ పంచాయతీల ఎన్నికలు, అభివృద్ది పథకాల అమలు తదితర అంశాలపై జిల్లాల వారీగా సమీక్ష జరిపారు. బోగస్ దందాలకు ఇక సెలవు.. 16 అంశాలతో పాసుబుక్కుల ముద్రణ ప్రభుత్వం పకడ్బందీగా రూపొందించే ఈ–పాస్‌పుస్తకాలతో బోగస్ దందాలకు తెర పడుతుందని, 16 రకాల రక్షణ ప్రత్యేకతలతో పాసుబుక్కులను రూపొందించామని సీఎం కేసీఆర్ కలెక్టర్లకు సూచించారు. భూస్వామ్య వ్యవస్థ అంతకంతకు తగ్గిపోగా.. సన్న, చిన్నకారు రైతులతో పాటు భూమి ఉన్న ప్రతిఒక్కరికీ పాసు పుస్తకాలు అందేలా చూడాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో పకడ్బందీగా అమలయ్యేందుకు గ్రామానికో నోడల్ అధికారి ని నియమించాలని సూచించారు. పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ వ్యవహారంలో రెవెన్యూశాఖ మరింత కీలకంగా వ్యవహరించాలని, తహసీల్దారు, నాయబ్ తహసీల్దార్లు రిజిస్ట్రేషన్ల బాధ్యులుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. కొత్తగా రూపొందించిన పంచాయతీరాజ్ సవరణల ప్రకారమే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని, నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడినా ఎన్నికలను నిర్వహించేందుకు సర్వంసన్నద్ధం కావాలని సూచించారు. కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు సంబంధించి కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు ప్రతిపాదనలతోపాటు, తండాలను పంచాయతీలుగా మార్చే జాబితాపైనా చర్చించారు. ఉమ్మడి కరీంనగర్లో 6,62,345 రైతులు.. ఆ మేరకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ‘గణాంకాల పుస్తకం–2017’, భూరికార్డుల సర్వే ప్రకారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం భూమి 29,55,750 ఎకరాలుండగా, అటవీ, బంజరు, నివాస స్థలాలను మినహాయిస్తే సాగుభూమి 13,42,045 ఎకరాలు ఉన్నట్లు తేలింది. ఇందులో ఆహార పంటలు 7,88,975 ఎకరాలు కాగా, వాణిజ్య పంటలు 5,53,070 ఎకరాల్లో సాగవుతున్నాయి. జిల్లాలో మొత్తం రైతుల సంఖ్య 6,62,345 మంది ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతుండగా.. 5,09,098 పాసు పుస్తకాలు చెలామణిలో ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ–పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంతో కొత్త వాటి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వ్యవసా య భూములు, చిన్న, సన్నకారు, పెద్ద రైతుల సం ఖ్య ఆధారంగా పాసు పుస్తకాలను ముద్రిస్తున్న ప్రభుత్వం ఆ మేరకు మార్చి 11న పంపిణీ చేయనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ–పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడంతోపాటు, పండుగ వాతావరణంలా నిర్వహించేలా కలెక్టర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనం చేసినట్లు తెలిసింది. సమావేశానికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు సర్ఫరాజ్ అహ్మద్, శరత్, కృష్ణభాస్కర్, శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు. పరిధి రైతులు భూమి(ఎకరాల్లో) 1.25 ఎకరాల వరకు 2,74,368 1,78,063.75 1.25 నుంచి 2.5 1,72,669 315075.75 2.5 నుంచి 5 1,45,008 5,07,758.55 5 నుంచి 7.5 41,805 2,48,635.075 7.5 నుంచి 10 13,585 1,16,427.2 10 నుంచి 12.5 6,994 77,462.1 12,5 నుంచి 18.75 5,397 80,517.3 18.75 నుంచి 25 1,438 30,583.15 25 నుంచి 50 935 29,827.875 50 ఎకరాల పైన 146 12375.17 -
రైతులకు అండగా..
సాక్షి,ఆదిలాబాద్: రైతులకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో జిల్లా కలెక్టర్లతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా నుంచి కలెక్టర్ దివ్యదేవరాజన్, జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రధానంగా రైతు సమస్యల పరిష్కారంపై అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. భూ రికార్డుల ప్రక్షాళన, పట్టాపాస్‌బుక్‌ల పంపిణీ, పంట పెట్టుబడి, 24 గంటల విద్యుత్ సరఫరా, పంచాయతీ ఎన్నికలు, పంచాయతీరాజ్ చట్టం, మున్సిపల్ చట్టానికి సవరణ, గొర్రెల పంపిణీ, మండల కార్యాలయాల నుంచి రిజిస్ట్రేషన్లు, తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సదస్సు సాయంత్రం 7గంటల వరకు కొనసాగింది. పట్టాపాస్‌బుక్‌ల పంపిణీలో అందరి భాగస్వామ్యం.. భూరికార్డుల ప్రక్షాళనలో వివాదం లేని భూములకు సంబంధించి పార్ట్–ఏ పూర్తయినందున వ్యవసాయ భూములకు ప్రభుత్వం కొత్తగా జారీ చేయనున్న పట్టాపాస్‌బుక్‌లను మార్చి 11న ఒకేసారి పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. మండలానికి ఒక నోడల్ అధికారిని ఈ ప్రక్రియ పరిశీలనకు నియమించాలని కలెక్టర్లకు చెప్పారు. పాస్‌బుక్‌లు ఒకరోజు ముందు, లేనిపక్షంలో అదేరోజు గ్రామానికి పంపేలా ఏర్పాట్లు చేయాలని, గ్రామానికి ఒక వాహనాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించి అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పారు. పట్టాపాస్‌బుక్‌ల పంపిణీలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు అందరు భాగస్వాములై కార్యక్రమాన్ని ప్రహసనంగా నిర్వహించాలని తెలిపారు. భూరికార్డుల నమోదు కోసం ప్రభుత్వం కొత్తగా ‘ధరిణి’ వెబ్‌సైట్‌ను రూపొందించినట్లు తెలిపారు. మార్చి 12 వరకు ‘ధరిణి’ వెబ్సైట్లో పూర్తి భూ వివరాలను నమోదు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదేనన్నారు. అమ్మకం, కొనుగోలుదారుకు సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలు అప్డేట్ చేస్తుండాలని తెలిపారు. ఇందుకోసం మండలాల్లోనూ రిజిస్ట్రేషన్ చేపట్టాలని పేర్కొన్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు అదనంగా మండలాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతాయని వివరించారు. మండలాల్లో రిజిస్ట్రేషన్ల కోసం హైపవర్ కంప్యూటర్లు, అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఫిబ్రవరిలోనే పంచాయతీ ఎన్నికలు.. ఫిబ్రవరిలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సిబ్బంది మానసికంగా సిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కొత్త గ్రామపంచాయతీలను ఎలాంటి వివాదాలు లేకుండా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. భౌగోళిక సరిహద్దుల నిర్ధారణలో జాగ్రత్తగా వ్యవహరించాలని, సర్వే నంబర్లు వేర్వేరు గ్రామాలకు వేర్వేరుగా వచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈనెల 25లోగా ఈ చర్యలను పూర్తి చేయాలన్నారు. నూతన పంచాయతీరాజ్ చట్టం విషయంలో కొత్తగా వచ్చే సర్పంచులకు శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. పరిశుభ్రత, పచ్చదనం, వందశాతం పన్నుల వసూళ్ల విషయంలో గ్రామపంచాయతీలు క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన బాధ్యతను సర్పంచులకు తెలియజేయాలని సూచించారు. గ్రామ జనాభా ఆధారంగా రూ.5లక్షల నుంచి రూ.25లక్షల వరకు నిధులు అందజేస్తామని తెలిపారు. సర్పంచ్ ఎన్నికల నిర్వహణ విషయంలో అధికారులు తమ అభిప్రాయాలను ప్రిన్సిపల్ సెక్రెటరీకి మెయిల్ ద్వారా తెలియజేయాలని పేర్కొన్నారు. మున్సిపల్ చట్టానికి కూడా సవరణ చేసే అవకాశం ఉందని తెలిపారు. రైతు సమన్వయ సమితీల బాధ్యత.. రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పేర్కొన్నారు. పంటలను మార్కెట్లకు తెచ్చేందుకు, అమ్ముకునేందుకు రైతులకు సమన్వయ సమితీలు సహకారం అందిస్తాయని, మద్దతు ధర దక్కేలా చూస్తాయని పేర్కొన్నారు. పంట పెట్టుబడి పథకాన్ని కేంద్రం ప్రశంసిస్తుందని తెలిపారు. రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా ద్వారా పూర్తిస్థాయిలో మేలు చేయడం జరిగిందన్నారు. కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను నివారించడం ద్వారా రైతుకు పంటల విషయంలో న్యాయం చేయడం జరిగిందని పేర్కొన్నారు. పంట కాలనీలు ఏర్పాటు చేయడంలో రైతు సమితీలు కీలకంగా వ్యవహరించాయని ప్రశంసించారు. -
త్వరలో 250 సర్వేయర్ల పోస్టుల భర్తీ
విజయవాడ : త్వరలో 250 సర్వేయర్ల పోస్టులు భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తెలిపారు. రెండేళ్ల కాలంలో రెవెన్యూ శాఖలో 13 రకాల సంస్కరణలు తీసుకువచ్చామని ఆయన సోమవారమిక్కడ తెలిపారు. కొన్నిచోట్ల రెవెన్యూ రికార్డుల్లో పొరపాట్లు జరుగుతుందన్నమాట వాస్తవమేనని అంగీకరించారు. వెబ్ ల్యాండ్ కీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వద్ద ఉండటం వల్లే సమస్యలు వస్తున్నాయని కేఈ అన్నారు. భూముల వివరాలు నేరుగా తెలుసుకునేందుకే మీభూమి వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చామని ఆయన తెలిపారు. -
విమానాశ్రయ భూముల జాబితా విడుదల
దగదర్తి: దామవరంలో ఏర్పాటు కానున్న విమానాశ్రయం కోసం సేకరిస్తున్న దామవరం, కోత్తపల్లి కౌరుగుంట లబ్ధిదారుల జాబితాను శనివారం రెవెన్యూ అధికారులు విడుదల చేశారు. కోత్తపల్లి కౌరుగుంట పరిధిలోని సర్వే నెంబర్ 334,335లో గత నెలలో కోంత మేర చెల్లింపులు జరిగాయి. మిగిలిన 119 మందికి చెందిన లబ్ధిదారుల జాబితాను శనివారం రెవెన్యూ అధికారలు విడుదల చేశారు. విమానాశ్రయం కోసం సేకరిస్తున్న ఎలాంటి అభ్యంతరాలు లేని డీకేటీ భూములకు సంబంధించిన 11.54 ఎకరాలకు రెండు, మూడు రోజుల్లో పరిహారం అందచేయనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదని ఆందోళన సాక్ష్యాత్తు రాష్ట్ర ఉన్నతన్యాయస్థానం ఆదేశాలను పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వేనెంబరు 335లోని అనుభవదారులకు అనుకూలంగా ఇచ్చిన ఆదేశాలను రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తాము 25 ఏళ్లకు పైగా భూములను సాగుచేసుకుంటున్నామని, ప్రస్తుతం ఈ భూములను విమానాశ్రయం కోసం సేకరిస్తున్నారని పరిహారం అందుకోవడానికి తాము అనర్హులమని రెవెన్యూ అధికారులు చెప్పడంతో కోత్తపల్లికౌరుగుంటకు చెందిన 38 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై పలుమార్లు జిల్లా అధికారులకు తెలిపినా పట్టించుకోలేదన్నారు. దీంతో కోత్తపల్లి కౌరుగుంటకు చెందిన 38 మంది రైతులు సెప్టెబరు 7వ తేదీన హైకోర్టును ఆశ్రయించారు. రిట్ పిటిష¯ŒS పేరుతో ఫిర్యాదును స్వీకరించిన హైకోర్టు 17.9.2016 తేదీన కోత్తపల్లి కౌరుగుంటకు చెందిన 38 మంది రైతులను భూముల్లో నుంచి తొలగించరాదని, వారికి పరిహారం అందిచే విషయంలో ఏమి చర్యలు తీసుకోంటున్నారో తెలపాలని ఆదేశించిందన్నారు. ఈ విషయమై తాహసీల్దార్ మధుసూదనరావును వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లబ్ధిదారుల జాబితా ప్రకటించడం జరిగిందని, హైకోర్టు ఆదేశాలు తమ కార్యాలయానికి అందలేదన్నారు. ఆదేశాలు అందిన తరువాత పరిశీలిస్తామన్నారు. -
లంచం ఇస్తేనే ఆన్లైన్
రాయచోటి: రాయచోటి నియోజకవర్గ పరిధిలో లంచం ఇస్తే గాని భూముల వివరాలు ఆన్లైన్ చేయడం లేదని రైతులు వాపోతున్నారు. ఇటీవల ప్రభుత్వం వెబ్‌ల్యాండ్‌లో భూమి వివరాలు నమోదు చేస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్నా, ఆ వెబ్‌ల్యాండ్‌లో వివరాలు తప్పుల తడకగా నమోదు చేశారు. భూమి ఒకరి పేరుతో ఉంటే ఖాతా నెంబర్ మరొకరి పేరుతో ఉంటోంది. విస్తీర్ణం తక్కువగానో, ఎక్కువగానో నమోదు చేశారు. అలాగే సర్వే నెంబర్లు కూడా ఇష్టానుసారం నమోదు చేశారు. రాయచోటి మండలంలో ఇప్పటికి వెబ్‌ల్యాండ్ వివరాలు సక్రమంగా నమోదు చేయలేదు. సంబేపల్లె మండలంలో ఆన్లైన్ పూర్తి స్థాయిలో చేయక పోవడంతో మీ సేవలో 1బి రాక పలువురు రైతులు పంట రుణాలను నేటికీ రెన్యువల్ చేసుకోలేకపోతున్నారు. దీంతో పంటల బీమా రుసుము కూడా చెల్లించలేక పోయారు. లక్కిరెడ్డిపల్లె మండలంలో కాకుళారం గ్రామం మిద్దెల వాండ్లపల్లెలో ఒక రైతుకు సంబంధించిన పొలాన్ని మరొక రైతు పేరుతో ఆన్లైన్ చేయడంతో అక్కడ రైతుల మధ్య తగాదాకు దారితీసింది. కుర్నూతల, కస్తూరిరాజుగారిపల్లె గ్రామాల రెవెన్యూ రికార్డులు గందరగోళంగా మార్చడంతో పనులు సక్రమంగా జరగక రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఆన్లైన్ కోసం నెల రోజులుగా తిరుగుతున్నా ఆన్లైన్ కోసం నెల రోజులుగా తిరుగుతున్నా పని జరగడం లేదు. అధికారులను అడిగితే చూస్తాం, చేస్తాం అంటున్నారు. మీ సేవకు వెళితే వన్‌బీ రావడం లేదు. ఇప్పుడు ఆన్లైన్లో లేని భూములకు వెబ్‌ల్యాండ్ ద్వారా పాసుపుస్తకాలు రద్దు చేస్తారేమోనని భయంగా ఉంది. – లక్ష్మినారాయణ, బొట్ల చెరువు, రాయచోటి. మ్యుటేషన్ కోసం ఏడాదిగా తిరుగుతున్నా గతంలో మా తండ్రి పేరుతో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాన్ని తల్లి పేరుతో మార్చుకొనేందుకు ఏడాదిగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా మార్పు చేయలేదు. దీంతో బ్యాంక్‌లో పంట రుణాలు పొందలేక పోతున్నాము. – రెడ్డెయ్య, మిట్టావాండ్లపల్లె, రాయచోటి వెబ్‌ల్యాండ్‌తో ఆందోళన అవసరం లేదు: వెబ్‌ల్యాండ్‌తో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్ది త్వరలోనే రైతులందరికీ సక్రమమైన సమాచారాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. రైతులందరి భూముల వివరాలతో సహా ఆన్లైన్లో ఉంచుతాము. గుణభూషణ్‌రెడ్డి, తహసీల్దార్, రాయచోటి. -
‘మాయా’ల్యాండ్!
– వెబ్‌ల్యాండ్ నిర్వహణ అస్తవ్యస్తం – రాత్రికి రాత్రే మారిపోతున్న భూముల వివరాలు – పెరుగుతున్న వివాదాలు – పేరుకుపోతున్న మ్యూటేషన్ దర ఖాస్తులు – మండల కేంద్రమైన వెల్దుర్తికి చెందిన చింతకాలయ రామాంజనమ్మకు సర్వేనెం.831లో 2.60 ఎకరాల భూమి ఉంది. ఇది వారసత్వంగా సంక్రమించింది. రెండు నెలల క్రితం వరకు వెబ్‌ల్యాండ్‌లో భూమి వివరాలు రామాంజనమ్మ పేరుమీదనే ఉన్నాయి. తర్వాత వెబ్‌ల్యాండ్‌లోని వివరాలను పరిశీలిస్తే రామాంజనమ్మ స్థానంలో ఇతర సామాజిక వర్గానికి చెందిన రైతు ఉన్నారు. ఇది రెవెన్యూ అధికారుల లీల. దీంతో సంబంధిత మహిళా రైతు లబోదిబోమంటున్నారు. – ప్యాపిలి మండలం రాచర్ల రెవెన్యూ గ్రామంలోని సర్వే నెం.1–2లో 2ఎకరాల భూమిని నేరడుచెర్ల గ్రామానికిచెందిన ఓబులేసు, ఓబులవెంకటరాములు చెరో ఎకరాకొన్నారు. మేనెల చివరి వారంలో ప్యాపిలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకొని వెంటనే మ్యూటేషన్ కోసం అన్ని డాక్యుమెంట్లతో మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నారు. అప్లికేషన్ నెంబరు ఎంయూ 011602375627 మ్యూటేషన్‌కు నెల రోజుల్లో చేయాలి. 50 రోజులు గడిచినా పట్టించుకోలేదు. .. ఈ రెండు ఘటనలే కాదు. జిల్లాలో ఇలాంటివి అనేకం ఉన్నాయి. ఒకవైపు వెల్ల్యాండ్లోని వివరాలు రాత్రికి రాత్రే మారిపోతున్నాయి. మరోవైపు మ్యూటేషన్ల కో సం రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కర్నూలు (అగ్రికల్చర్) మ్యూటేషన్లకు, వెబ్‌ల్యాండ్‌లో సవరణల కోసం మీ సేవా కేంద్రాల్లో రైతులు దరఖాస్తు చేసుకుంటున్నారు. వీటిని సంబంధిత తహసీల్దార్లు నిర్ణీత గడువులోగా పరిష్కరించాల్సి ఉంది. గడువు దాటినా పట్టించుకోకపోవడంతో రైతులు పడుతున్న ఇక్కట్లు అన్నీ..ఇన్నీ కావు. తీరా అధికారులు వాటిని తిరస్కరిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. భూములు కొనుగోలు చేస్తే సబ్ రిజిస్ట్రార్కార్యాలయాలో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆ తర్వాత రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసుకోవాలి. వీటినే మ్యూటేషన్లు అంటారు. మ్యూటేషన్ జరుగకపోతే భూములు కొన్న రెవెన్యూ రికార్డుల్లో వారి వివరాలు నమోదు కావు. మ్యూటేషన్ల కోసం మీ సేవా కేంద్రాల ద్వారా దాదాపు 56 వేల దరఖాస్తులు వచ్చాయి. మామూళ్లు ముట్టచెబితే 24 గంటల్లోనే మార్పులు జరుగుతాయి. లేకపోతే నిర్ణీత గడువు దాటినా మార్పులు జరగవు. చివరికి తిరస్కరణ అస్త్రాన్ని ప్రయోగిస్తారు. 56 వేలకుపైగా మ్యూటేషన్ దరఖాస్తులు ఉంటే 30 వేల వరకు తిరస్కరించారు. దీన్నిబట్టి చూస్తే రైతులు ఇక్కట్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తోంది. గడువు తీరినా పరిష్కారానికి నోచుకోని దరఖాస్తులు 10వేలకుపైగా ఉన్నాయి. భూములు కొనుగోలు చేసినపుడు రెవెన్యూ రికార్డుల్లో అంటే వెబ్‌ల్యాండ్ మార్పులు జరగకపోతే ఎటువంటి ప్రయోజనం ఉండదు. అమ్మిన వారి వివరాలే ఉంటాయి. మ్యూటేషన్లను ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సి ఉన్నా పట్టించుకోడం లేదు. మ్యూటేషన్ల సమస్యలను అధిగమించేందుకు ఆటోమేటిక్ మ్యూటేషన్ల విధానాలన్ని అమలులోకి తీసుకురావాలని ప్రయత్నించినా ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది. ప్రజాసాధికార సర్వే కారణంగా ఆటోమేటిక్ మ్యూటేషన్ల అమలు రెండు నెలల వాయిదా పడింది. అడ్డుగోలుగా అక్రమాలు.. భూ వివరాలు ఆన్‌లైన్‌లోకి వచ్చిన తర్వాత రెవెన్యూ సిబ్బంది అడ్డుగోలుగా అక్రమాలకు పాల్పడుతున్నారు.రాత్రికి, రాత్రే రైతుల తలరాతలు మారుస్తున్నారు. తహసీల్దార్ల డిజిటల్ సిగ్నేచర్ కీలను కంప్యూటర్ ఆపరేటర్లకు అప్పగించడంతో అడ్డుగోలుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా మామూళ్లు పొంది ఆన్లైన్లో వివరాలు తారుమారు చేస్తున్న అధికారులు నిజమైన భూమి యజమానులు వచ్చి అన్ని వివరాలు చూపించినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇటువంటి సమస్యలు జిల్లాలో కోకొల్లలుగా ఉన్నాయి. వెబ్‌ల్యాండ్‌లో భూముల వివరాల సవరణకోసం 75 వేలకుపైగా దరఖాస్తులు మీ– సేవ కేంద్రాల ద్వారా వచ్చాయి. వీటిలో రెవెన్యూ అధికారులు 45 వేల వరకు తిరస్కరించారు.1 5 వేల దరఖాస్తులు గడువు తీరినా పట్టించుకున్న దాఖలాలు లేవు. అడ్డుగోలుగా వెబ్‌ల్యాండ్‌లోని భూముల వివరాలను మార్పులు చేస్తుండటం వల్ల భూ వివాదాలు పెరుగుతున్నాయి. రాత్రికి రాత్రే వెబ్‌ల్యాండ్‌లో మార్పులు చేయడం, సబ్ రిజిస్ట్రార్లను మామూళ్లతో లొంగదీసుకొని రిజిస్ట్రేషన్లు చేయించుకోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారు అయింది. -
కలెక్టరేట్ వద్ద రైతు ఆత్మహత్యాయత్నం
తన సమస్య పరిష్కారం కోసం కర్నూలు కలెక్టరేట్‌కు వచ్చిన ఓ రైతు అక్కడే ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల్లోకి వెళితే.. రుద్రవరం మండలం పెద్దకంబలూరు గ్రామానికి చెందిన రైతు బ్రహ్మయ్యకు నాలుగు ఎకరాలకు పైగా భూమి ఉంది. భూమి వివరాలు.. ఆన్ లైన్ చేసేందుకు చాలా కాలంగా వీఆర్వో చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు. దీంతో పై అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో విసిగి పోయిన బ్రహ్మయ్య సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టర్ ను కలిసేందుకు వచ్చాడు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందుబాటులోకి రాకపోవడంతో.. డీఆర్వోకు ఫిర్యాదు ఇచ్చాడు. తర్వాత వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు.. ఇది గమనించిన సిబ్బంది బ్రహ్మయ్యను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రైతుకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. -
‘మీ భూమి’
భూముల వివరాలు తెలుసుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారా? రెవెన్యూ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ అధికారుల తిరస్కారానికి గురవుతున్నారా? నీకు వివరాలు చెప్తే నాకేంటి? అని ఎవరైనా బేరాలాడుతూ గారాలు పోతున్నారా? ఈ సమస్యలను రైతులు, భూ విక్రేతలు, కొనుగోలు దారులు ఇకపై ఎదుర్కోవలసిన అవసరం లేదు. విజయనగరం కంటోన్మెంట్: రైతుకు భూమి ఎంత ఉంది? దాని సర్వే నంబర్లేమిటి? అన్న వివరాలు ధ్రువీకరించేందుకు అవసరమైన వివరాలు నెట్ ద్వారా రైతులకు అందుబాటులోకి రానున్నాయి. ఇంతవరకు రైతు తన భూమికి సంబంధించిన వివరాల కోసం రెవెన్యూ అధికారులు, మండల స్థాయి అధికారుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వచ్చేది. అయితే ఇక నుంచి ఆన్లైన్లో రైతు తన భూముల వివరాలు పొందవచ్చు. ఆ వివరాలకు సంబంధించిన కాపీలు కూడా తీసుకోవచ్చు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు భూపరిపాలనా శాఖ కమిషనర్ ఇటీవలే ప్రకటించారు. త్వరలో రైతుల కోసం మీ భూమి సాఫ్ట్‌వేర్‌ను రూపొందించనున్నారు. ఇందుకోసం అవసరమైన వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో జిల్లాలోని రైతులందరి భూముల వివరాలు, పట్టా నంబర్లు, సర్వే నంబర్లు, పొజిషన్ వివరాలన్న ్న ంటినీ పొందుపరచనున్నారు. అంతే కాకుండా ఈసేవలను ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా పొందవచ్చు. దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను ఈ సేవలను ఆండ్రాయిడ్ ద్వారా పొందేందుకు అవసరమయిన యాప్‌ను అభివృద్ధి చేసే పనిలో సీసీఎల్ఏ ఉంది. ప్రస్తుతం జిల్లాలో దాదాపు 5లక్షల ఎకరాల భూమి ఉంది. ఇందులో వ్యవసాయ సాగుకు పనికి వచ్చే భూమి సుమారుగా 3లక్షల ఎకరాలు ఉండగా ైరె తులు దాదాపు మూడున్నర లక్షల మంది ఉన్నారు. అయితే జిల్లాలోని రైతులకు అవసరమైన రికార్డు లకు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అడంగల్ కాపీ కావాలన్నా, పట్టాదారు పాసు పుస్తకాలు కావాలన్నా సంబంధిత రెవెన్యూ అధికారులకు లంచాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రతి వారం గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా రుణ మంజూరు విషయంలోనూ రిజిస్ట్రేషన్ విషయంలోనూ ఈ పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీని వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీసీఎల్ఏ ప్రకటించిన విధంగా ఈ యాప్‌లు, ప్రత్యేక వెబ్సైట్లు వస్తే గనక రైతులకు మంచి ప్రయోజనం కలుగుతుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం జిల్లాలో ప్రధానంగా సాగుతున్న వెబ్లాండ్ పనులు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. ఎవరైనా రైతులు తమ భూములు అమ్మాల్సి ఉన్నా, ఇతరుల వద్ద నుంచి కొనుగోలు చేయాల్సి ఉన్నా ఆ వివరాలు ఆన్లైన్ కాకుంటే వారి నుంచి లంచాలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కాస్త త్వరగా వెళ్లాలి. వెంటనే ఆన్లైన్ చేయాలంటే గనక తప్పనిసరిగా వారి నుంచి రెవెన్యూ అధికారులు లంచాలు ఆశిస్తున్నారు. లేకుంటే ఏదో వంక చెప్పి అంత త్వరగా అయ్యే పనికాదనీ, సిబ్బంది లేరనీ, కంప్యూటర్ ఆపరేటర్లు లేరని సాకులు చెబుతున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులు, భూ విక్రేతలు, కొనుగోలు దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు సీసీఎల్ఏ దీనిపై దృష్టి సారించి మీసేవల్లో పొందుపరిచినట్టుగా అన్ని వివరాలనూ ఒక వెబ్సైట్లో ఉంచి రైతులకు అందుబాటులోకి తేనుంది. దీని వల్ల జిల్లాలోని రైతులు తమకు అవసరమైన వివరాలను ఆన్లైన్ ద్వారా ఒక కాపీ తీసుకునే వెసులుబాటును క ల్పించారు. ఆధార్ నంబర్ ఇచ్చిన వారి వివరాలను ముందుగా పొందుపరుస్తారు. అనంతరం అన్ని రకాల భూములనూ ఈ వెబ్సైట్లో పొందుపరిచి అవసరమైన సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేస్తారు. దీనికి సంబంధించిన మెయిల్ అడ్రస్‌ను ప్రకటిస్తారు. ఈ విధానం రానుండడం పట్ల రైతాంగం హర్షం ప్రకటిస్తోంది. -
ఆన్లైన్లో భూ వివరాలు
ఖమ్మం జెడ్పీసెంటర్ : భూ సమస్యల సత్వర పరిష్కారం కోసం అన్ని వివరాలను ఆన్లైన్లో పొందుపర్చనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి ఆర్డీఓలు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలతో పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భూ బదలాయింపు, భూమి హక్కుల రికార్డులు(ఆర్ఓఆర్), మధ్యాహ్న భోజన పథకానికి సన్నబియ్యం వినియోగం, పదో తరగతిలో నూరుశాతం ఫలితాలు, ఆహార భద్రత కార్డుల ప్రక్రియ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూటేషన్, ఆర్ఓఆర్ అప్పీళ్ల సత్వర పరిష్కారం కోసం ఆన్లైన్ చేస్తున్నట్లు వివరించారు. 45 రోజులు గడిచిన అప్పీళ్లన్నింటినీ ఆర్డీఓలు వారి పరిధిలో పరిష్కరించే వీలుందన్నారు. ప్రస్తుతం పాల్వంచ ఆర్డీఓ పరిధిలో 58, భధ్రాచలం ఆర్డీఓ పరిధిలో 12 మూటేషన్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. బుధవారం నుంచి ఫైళ్ల క్లియరెన్స్ వీక్ (దస్త్రాల పరిష్కార వారోత్సవం) ప్రారంభిస్తున్నామని, ఆ సమయంలో పెండింగ్‌లో ఉన్న దస్త్రాలను పరిష్కరించాలని ఆదేశించారు. జేసీ సురేంద్ర మోహన్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకానికి కేటాయించిన సన్నబియ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయవద్దన్నారు. ఆ బియ్యానికి సంబంధించి రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు, ఇతర మండల స్థాయి అధికారులు తమ పరిధిలోని పాఠశాలలను విభజించుకుని దత్తత తీసుకోవాలని, ఆయా పాఠశాలల్లో విద్యాప్రమాణాల పెంపునకు కృషి చేయాలని చెప్పారు. పదో తరగతిలో నూరు శాతం ఫలితాలు సాధించేలా చూడాలన్నారు. సాయంత్రం వేళల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసి చదివించాలన్నారు. స్థానికుల సహకారంతో విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం సమకూర్చాలని సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. జిల్లాలో 70,300 ఆహారభద్రత కార్డులకు గాను 52,300 కార్డుల డేటా ఎంట్రీ పూర్తయిందని, మిగిలినవి ఈనెల 12లోగా పూర్తిచేసి 13, 14, 15 తేదీల్లో పంపిణీ చేయాలని అన్నారు. డీఈవో రవీంధ్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 36,728 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారని, పాఠశాలలకు ఈ నెల 10 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించామని తెలిపారు. వీసీలో డీఎస్ఓ హరిశంకర్, బీసీ సంక్షేమాధికారి వెంకటన ర్సయ్య, సాంఘిక సంక్షేమ అధికారి రాందాసు తదితరులు పాల్గొన్నారు. భూ పంపిణి ప్రకియను వేగవంతం చేయండి ఎస్సీలకు మూడెకరాల చొప్పున భూ పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలంబరితి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం సాయంత్రం భూమి కొనుగోలు పథకంపై జిల్లాస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మధిర, కూసుమంచి మండలాల పరిధిలో భూ గుర్తింపు సేకరణ వేగవంతం చేయాలన్నారు. రెవెన్యూ, ఎస్సీ కార్పొరేషన్, భూగర్భజల శాఖాధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. లబ్దిదారులకు పంపిణి చేసే భూమి వ్యవసాయానికి అనుకూలంగా, భూగర్భజలాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కూసుమంచి మండలంలో ఇంకా పంపిణీ చేయాల్సిన లబ్ధిదారులకు ప్రస్తుతం గుర్తించిన స్థలానికి బదులు మరోచోట సేకరించాలని ఆదేశించారు.