‘మాయా’ల్యాండ్!
Published Sun, Jul 17 2016 11:55 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM
– వెబ్‌ల్యాండ్ నిర్వహణ అస్తవ్యస్తం
– రాత్రికి రాత్రే మారిపోతున్న భూముల వివరాలు
– పెరుగుతున్న వివాదాలు
– పేరుకుపోతున్న మ్యూటేషన్ దర ఖాస్తులు
– మండల కేంద్రమైన వెల్దుర్తికి చెందిన చింతకాలయ రామాంజనమ్మకు సర్వేనెం.831లో 2.60 ఎకరాల భూమి ఉంది. ఇది వారసత్వంగా సంక్రమించింది. రెండు నెలల క్రితం వరకు వెబ్‌ల్యాండ్‌లో భూమి వివరాలు రామాంజనమ్మ పేరుమీదనే ఉన్నాయి. తర్వాత వెబ్‌ల్యాండ్‌లోని వివరాలను పరిశీలిస్తే రామాంజనమ్మ స్థానంలో ఇతర సామాజిక వర్గానికి చెందిన రైతు ఉన్నారు. ఇది రెవెన్యూ అధికారుల లీల. దీంతో సంబంధిత మహిళా రైతు లబోదిబోమంటున్నారు.
– ప్యాపిలి మండలం రాచర్ల రెవెన్యూ గ్రామంలోని సర్వే నెం.1–2లో 2ఎకరాల భూమిని నేరడుచెర్ల గ్రామానికిచెందిన ఓబులేసు, ఓబులవెంకటరాములు చెరో ఎకరాకొన్నారు. మేనెల చివరి వారంలో ప్యాపిలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకొని వెంటనే మ్యూటేషన్ కోసం అన్ని డాక్యుమెంట్లతో మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నారు. అప్లికేషన్ నెంబరు ఎంయూ 011602375627 మ్యూటేషన్‌కు నెల రోజుల్లో చేయాలి. 50 రోజులు గడిచినా పట్టించుకోలేదు.
.. ఈ రెండు ఘటనలే కాదు. జిల్లాలో ఇలాంటివి అనేకం ఉన్నాయి. ఒకవైపు వెల్‌ల్యాండ్‌లోని వివరాలు రాత్రికి రాత్రే మారిపోతున్నాయి. మరోవైపు మ్యూటేషన్‌ల కో సం రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
కర్నూలు (అగ్రికల్చర్)
మ్యూటేషన్‌లకు, వెబ్‌ల్యాండ్‌లో సవరణల కోసం మీ సేవా కేంద్రాల్లో రైతులు దరఖాస్తు చేసుకుంటున్నారు. వీటిని సంబంధిత తహసీల్దార్లు నిర్ణీత గడువులోగా పరిష్కరించాల్సి ఉంది. గడువు దాటినా పట్టించుకోకపోవడంతో రైతులు పడుతున్న ఇక్కట్లు అన్నీ..ఇన్నీ కావు. తీరా అధికారులు వాటిని తిరస్కరిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. భూములు కొనుగోలు చేస్తే సబ్ రిజిస్ట్రార్‌కార్యాలయాలో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆ తర్వాత రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసుకోవాలి. వీటినే మ్యూటేషన్‌లు అంటారు. మ్యూటేషన్ జరుగకపోతే భూములు కొన్న రెవెన్యూ రికార్డుల్లో వారి వివరాలు నమోదు కావు. మ్యూటేషన్‌ల కోసం మీ సేవా కేంద్రాల ద్వారా దాదాపు 56 వేల దరఖాస్తులు వచ్చాయి. మామూళ్లు ముట్టచెబితే 24 గంటల్లోనే మార్పులు జరుగుతాయి. లేకపోతే నిర్ణీత గడువు దాటినా మార్పులు జరగవు. చివరికి తిరస్కరణ అస్త్రాన్ని ప్రయోగిస్తారు. 56 వేలకుపైగా మ్యూటేషన్ దరఖాస్తులు ఉంటే 30 వేల వరకు తిరస్కరించారు. దీన్నిబట్టి చూస్తే రైతులు ఇక్కట్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తోంది. గడువు తీరినా పరిష్కారానికి నోచుకోని దరఖాస్తులు 10వేలకుపైగా ఉన్నాయి. భూములు కొనుగోలు చేసినపుడు రెవెన్యూ రికార్డుల్లో అంటే వెబ్‌ల్యాండ్ మార్పులు జరగకపోతే ఎటువంటి ప్రయోజనం ఉండదు. అమ్మిన వారి వివరాలే ఉంటాయి. మ్యూటేషన్‌లను ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సి ఉన్నా పట్టించుకోడం లేదు. మ్యూటేషన్‌ల సమస్యలను అధిగమించేందుకు ఆటోమేటిక్ మ్యూటేషన్‌ల విధానాలన్ని అమలులోకి తీసుకురావాలని ప్రయత్నించినా ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది. ప్రజాసాధికార సర్వే కారణంగా ఆటోమేటిక్ మ్యూటేషన్‌ల అమలు రెండు నెలల వాయిదా పడింది.
అడ్డుగోలుగా అక్రమాలు..
భూ వివరాలు ఆన్‌లైన్‌లోకి వచ్చిన తర్వాత రెవెన్యూ సిబ్బంది అడ్డుగోలుగా అక్రమాలకు పాల్పడుతున్నారు.రాత్రికి, రాత్రే రైతుల తలరాతలు మారుస్తున్నారు. తహసీల్దార్ల డిజిటల్ సిగ్నేచర్ కీలను కంప్యూటర్ ఆపరేటర్లకు అప్పగించడంతో అడ్డుగోలుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా మామూళ్లు పొంది ఆన్‌లైన్‌లో వివరాలు తారుమారు చేస్తున్న అధికారులు నిజమైన భూమి యజమానులు వచ్చి అన్ని వివరాలు చూపించినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇటువంటి సమస్యలు జిల్లాలో కోకొల్లలుగా ఉన్నాయి. వెబ్‌ల్యాండ్‌లో భూముల వివరాల సవరణకోసం 75 వేలకుపైగా దరఖాస్తులు మీ– సేవ కేంద్రాల ద్వారా వచ్చాయి. వీటిలో రెవెన్యూ అధికారులు 45 వేల వరకు తిరస్కరించారు.1 5 వేల దరఖాస్తులు గడువు తీరినా పట్టించుకున్న దాఖలాలు లేవు. అడ్డుగోలుగా వెబ్‌ల్యాండ్‌లోని భూముల వివరాలను మార్పులు చేస్తుండటం వల్ల భూ వివాదాలు పెరుగుతున్నాయి. రాత్రికి రాత్రే వెబ్‌ల్యాండ్‌లో మార్పులు చేయడం, సబ్ రిజిస్ట్రార్‌లను మామూళ్లతో లొంగదీసుకొని రిజిస్ట్రేషన్‌లు చేయించుకోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారు అయింది.
Advertisement
Advertisement