webland
-
కౌలు రైతులకు తీపికబురు
సాక్షి, అమరావతి: కౌలు రైతులకు మరింత అండగా నిలవాలని ప్రభుత్వం సంకల్పించింది. గడచిన నాలుగేళ్ల కంటే మిన్నగా ఈ ఏడాది పంట హక్కు సాగు పత్రాలు (కౌలు కార్డులు) జారీ చేసిన ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి పంట రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. ఇందుకోసం తొలిసారిగా సీసీఎల్ఏ వెబ్‌ల్యాండ్ పోర్టల్‌తో సీసీఆర్సీ వెబ్‌పోర్టల్‌ను అనుసంధానించింది. ఫలితంగా బ్యాంక్ లోన్చార్జ్ మాడ్యూల్లో భూ యజమానులతోపాటు కౌలుదారుల వివరాలను సైతం బ్యాంకర్లు ఖరారు చేసుకుని సాధ్యమైనంత ఎక్కువ మంది కౌలుదారులకు పంట రుణాలు మంజూరు చేసే అవకాశం కల్పించింది. సాధారణంగా సీసీఎల్ఏ వెబ్‌ల్యాండ్ పోర్టల్ బ్యాంకుల లోన్చార్జ్ మాడ్యూల్లో అనుసంధానమై ఉంటుంది. లోన్‌చార్జి మాడ్యూల్లో సర్వే నంబర్ లేదా ఆధార్ నంబర్ నమోదు చేయగానే భూ యజమానుల పేర్లు మాత్రమే కన్పించేవి. దీంతో కౌలుదారులకు రుణాల మంజూరు చేసేందుకు బ్యాంకర్లు ఏదో సాకుతో వెనుకడుగు వేస్తుండేవారు. రబీ సీజన్లో మరింత ఎక్కువ మంది కౌలుదారులకు రుణాలు మంజూరు చేయడమే లక్ష్యంతో సీసీఎల్ఏ వెబ్‌ల్యాండ్ పోర్టల్‌ను సీసీఆర్సీ వెబ్ పోర్టల్‌తో ప్రభుత్వం అనుసంధానించింది. లోన్చార్జ్ మాడ్యూల్తో సీసీఎల్ఎ వెబ్‌ల్యాంబ్ పోర్టల్ అనుసంధానించి ఉండడంతో ఆటోమేటిక్‌గా లోన్‌చార్జి మాడ్యుల్లో భూ యజమానుల వివరాలతో పాటు కౌలుదారుల వివరాలు కూడా బ్యాంకర్లకు కనిపిస్తాయి. భూ యజమానులను ఒప్పించి.. భూ యజమానుల వివరాలతో పాటు కౌలు రైతుల వివరాలను ఖరారు చేసుకుని బ్యాంకర్లు వారికి రుణాలు మంజూరు చేస్తారు. ఒకవేళ కౌలుకు ఇచ్చిన భూమిపై భూ యజమాని కనుక పంట రుణం తీసుకుని ఉంటే కౌలుదారులకు పంట రుణం మంజూరు చేయరు. అయితే, సాగు చేయకపోయినప్పటికీ వరుసగా రెండు సీజన్లలో భూ యజమాని కనుక పంట రుణం పొంది ఉంటే, అటువంటి వారిని గుర్తించి ఆర్బీకే స్థాయిలో అవగాహన కల్పిస్తారు. తమ భూమి కౌలుకు తీసుకున్న వాస్తవ సాగుదారులకు చేయూతనిచ్చేలా సహకరించాలని సూచిస్తారు. ఫలితంగా భూ యజమానుల స్థానంలో కౌలుదారులు పంట రుణాలు పొందే అవకాశం ఏర్పడుతుంది. నాలుగేళ్లలో రూ.6,906 కోట్ల పంట రుణాలు.. రాష్ట్రంలో 16 లక్షల మంది కౌలుదారులు ఉంటారని అంచనా. వీరికి ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.1.60 లక్షల వరకు పంట రుణం అందించే అవకాశం ఉన్నా.. ఆంక్షల పేరిట బ్యాంకులు మోకాలడ్డేవి. ప్రస్తుతం ఏటా 11 నెలల కాల పరిమితితో జారీ చేస్తున్న కౌలు కార్డుల ఆధారంగా పంట రుణాలతో పాటు సంక్షేమ ఫలాలు అందిస్తోంది. నాలుగేళ్లలో 17.61 లక్షల మందికి సీసీఆర్సీలు జారీ చేయగా.. వీరిలో 9.83 లక్షల మందికి రూ.6,905.76 కోట్ల పంట రుణాలు మంజూరు చేశారు. 2023–24 సీజన్లో 8.89 లక్షల మంది కౌలుదారులకు సీసీఆర్సీల జారీ లక్ష్యం కాగా.. ఇప్పటికే 8.19 లక్షల మందికి సీసీఆర్సీలు జారీ చేశారు. వీరికి కనీసం రూ.4 వేల కోట్ల పంట రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నారు. ఇప్పటికే 3.33 లక్షల మందికి రూ.1,085.42 కోట్ల పంట రుణాలు మంజూరు చేశారు. నూరు శాతం రుణాలు మంజూరే లక్ష్యం మరింత ఎక్కువ మంది కౌలుదారులకు పంట రుణాలు మంజూరు చేయడమే లక్ష్యంగా సీïసీఎల్ఏ వెబ్‌ల్యాండ్ పోర్టల్‌తో సీసీఆర్సీ పోర్టల్‌ను అనుసంధానం చేశాం. ఫలితంగా కౌలుదారులకు రుణాల మంజూరు విషయంలో బ్యాంకర్లకు మరింత వెసులుబాటు కలుగుతుంది. జేఎల్‌జీ గ్రూపులతో పాటు వ్యక్తిగతంగా కూడా కౌలుదారులు పంట రుణాలు మంజూరు చేయడమే లక్ష్యంగా ఈ మార్పు చేశాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
81 శాతం భూరికార్డుల స్వచ్ఛీకరణ
సాక్షి, అమరావతి: భూముల రీసర్వే నేపథ్యంలో నిర్వహిస్తున్న భూ రికార్డుల స్వచ్చికరణ (ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్) రాష్ట్రవ్యాప్తంగా 81 శాతం పూర్తయింది. రాష్ట్రంలో వందేళ్ల తర్వాత వైఎస్సార్ జగనన్న భూరక్ష, శాశ్వత భూహక్కు పథకం పేరుతో నిర్వహిస్తున్న రీసర్వేలో రికార్డుల ప్రక్షాళన అత్యంత కీలకంగా మారింది. రీసర్వే ప్రారంభించాలంటే రికార్డులను అప్డేట్ చేయడం తప్పనిసరి. వెబ్‌ల్యాండ్ అడంగల్‌లను ఆర్ఎస్ఆర్తో పోల్చి చూడడం, అడంగల్‌లో పట్టాదారు వివరాలన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో చూసి సరిచేయడం, పట్టాదారు, అనుభవదారుల వివరాల కరెక్షన్, అప్డేషన్, పట్టాదారు డేటాబేస్‌ను అప్డేట్ చేయడం వంటివన్నీ కచ్చితంగా పూర్తిచేయాల్సి ఉంది. రెవెన్యూ యంత్రాంగం ఇవన్నీ పూర్తిచేసిన తర్వాతే సర్వే బృందాలు రీసర్వే ప్రక్రియను ప్రారంభిస్తాయి. ఈ నేపథ్యంలోనే రికార్డుల స్వచ్చికరణపై ప్రత్యేకదృష్టి సారించి చేస్తున్నారు. 26 జిల్లాల్లోని 17,564 గ్రామాలను మూడు కేటగిరీలుగా విభజించి స్వచ్ఛీకరణ చేపట్టారు. ఇప్పటివరకు 14,235 గ్రామాల్లో (81 శాతం) పూర్తయింది. అల్లూరి జిల్లాలో 25 శాతం మాత్రమే అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వందశాతం రికార్డుల స్వచ్చికరణను పూర్తిచేశారు. అనంతపురం జిల్లాలో 504 గ్రామాలకు 504, కర్నూలు జిల్లాలో 472కి 472, నంద్యాల జిల్లాలో 441కి 441 గ్రామాల్లో స్వచ్చికరణ పూర్తయింది. చిత్తూరు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో 99 శాతం స్వచ్చికరణ పూర్తయింది. ఈ జిల్లాల్లో రెండేసి గ్రామాల్లో మాత్రమే ఇంకా పూర్తికావాల్సి ఉంది. సత్యసాయి, తూర్పుగోదావరి, ప శ్చిమగోదావరి, కృష్ణాజిల్లాల్లో 98 శాతం స్వచ్ఛీకరణ పూర్తయింది. అతి తక్కువగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 25 శాతం స్వచ్ఛీకరణనే పూర్తిచేయగలిగారు. ఆ తర్వాత విశాఖపట్నం జిల్లాలో 44 శాతం, పార్వతీపురం మన్యం జిల్లాలో 61 శాతం స్వచ్చికరణ పూర్తయింది. రెండునెలల్లో అన్ని జిల్లాల్లో వందశాతం రికార్డుల స్వచ్చికరణ పూర్తిచేసేందుకు రెవెన్యూశాఖ ప్రణాళిక రూపొందించి పనిచేస్తోంది. -
జేసీల పరిధిలోనూ ‘వెబ్‌ల్యాండ్’ సమస్యల పరిష్కారం
సాక్షి, అమరావతి: వెబ్‌ల్యాండ్‌లో భూములకు సంబంధించిన మార్పులు చేసే అవకాశాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్లకు ప్రభుత్వం కల్పించింది. మొన్నటివరకు ప్రాథమిక స్థాయిలో కేవలం తహశీల్దార్లు మాత్రమే వెబ్‌ల్యాండ్‌లో మార్పులు చేసే అవకాశం ఉండేది. ఆ తర్వాత ఉన్నత స్థాయిలో మార్పులు చేయాలంటే చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) కార్యాలయంలోని కంప్యూటరైజేషన్ ఆఫ్ మండల రెవెన్యూ ఆఫీసెస్ (సీఎంఆర్వో) ప్రాజెక్ట్ డైరెక్టర్‌కే అవకాశం ఉండేది. అంటే తహశీల్దార్ స్థాయిలో మార్పును తిరస్కరిస్తే దాన్ని పైస్థాయిలో సీసీఎల్ఏ కార్యాలయంలోనే మార్చడానికి అవకాశం ఉండేది. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. స్పందన కార్యక్రమంలో దీనిపై ప్రజల నుంచి పెద్దఎత్తున విజ్ఞప్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ అధికారాన్ని జాయింట్ కలెక్టర్లకు సైతం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వే నంబర్లు మిస్ అవడం, 22ఏ కేసుల్లో ప్రభుత్వ భూమి నుంచి ప్రైవేటు భూమిగా మార్పు చేయడం, సివిల్, రెవెన్యూ కోర్టులు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా చేయాల్సిన మార్పులతోపాటు భూసమీకరణ, భూ యాజమాన్య మార్పు, భూముల కేటాయింపునకు సంబంధించి మార్పులను జాయింట్ కలెక్టర్ల లాగిన్ నుంచి చేసేందుకు తాజాగా అవకాశం కల్పించారు. ఇందుకు అనుగుణంగా వెబ్‌ల్యాండ్‌లో మార్పులు చేస్తున్నారు. జాయింట్ కలెక్టర్లు ఈ మార్పులు చేసేముందు నిబంధనల ప్రకారం అన్ని విషయాలు పరిశీలించాలని, ఎందుకు మార్పు జరుగుతుందో వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసిన తర్వాతే మార్పులు చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సీసీఎల్ఏ జి.సాయిప్రసాద్ ఇటీవల సర్క్యులర్ జారీ చేశారు. -
లంచం తీసుకుంటూ దొరికిన వీఆర్వో
సాక్షి, నరసన్నపేట (శ్రీకాకుళం): వెబ్‌ల్యాండ్‌లో పేరు మార్పునకు ఐదు వేల రూపాయలు తీసుకుంటూ కోమర్తి వీఆర్వో ఏసీబీ అధికారులకు చిక్కాడు. తన ఆస్తిని భార్య పేరున మార్చమని కోరిన హోంగార్డు కె.శంకరరావును వీఆర్వో వై.రాజు లంచం అడిగాడు. బాధితుడు అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించడంతో అధికారులు వల పన్ని పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కరణం రాజేందర్, తెలిపిన వివరాలు.. శ్రీకాకుళంలో హోంగార్డుగా పనిచేస్తున్న కె.శంకరరావు భార్య లక్ష్మి పేరున యారబాడులో 33 సెంట్ల భూమి ఉంది. గడిచిన పదేళ్లుగా శిస్తు కడుతున్నారు. గత నెలలో ఈ భూమిని ఇతరులకు అమ్మేందుకు శంకరరావు ప్రయత్నించగా వెబ్‌ల్యాండులో శంకరరావు తండ్రి మల్లేశ్వరరావు పేరున ఉంది. ‘పట్టాదారు పుస్తకం భార్య పేరున ఉంది.. ఈమేరకు శిస్తు కడుతున్నాను.. ఎందుకిలా జరిగింద’ని బాధపడ్డ శంకరరావు పాస్ పుస్తకం ప్రకారం తన భార్య పేరున వెబ్‌ల్యాండులో పేరు మార్చాలని వీఆర్వో రాజును కోరాడు. పేరు మార్చడానికి వీఆర్వో రూ.5 వేలు డిమాండ్ చేశాడు. శంకరరావు రూ.2 వేలు ఇచ్చినా పని జరగలేదు. మిగిలిన డబ్బు ఇస్తేనే పనిచేస్తానని డిమాండ్ చేయడంతో శంకరరావు కడుపు మండి ఏసీబీని ఆశ్రయించారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా.. కొమర్తి స్కూల్ వద్ద వీఆర్వో ఉన్నట్లు తెలుసుకొని ఏసీబీ అధికారులు స్కూల్ వద్దకు గురువారం సాయంత్రం వచ్చారు. అక్కడ లేకపోవడంతో శంకరరావుతో ఫోన్ చేయించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్నాను.. రమ్మని వీఆర్వో రాజు చెప్పడంతో శంకరరావును తీసుకొని ఏసీబీ అధికారులు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు వచ్చారు. శంకరరావు నుంచి డబ్బులు తీసుకుంటుండగా పట్టుకొన్న ఏసీబీ సిబ్బంది తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువెళ్లి రికార్డులను పరిశీలించి.. వీఆర్వో ప్రవర్తనతో శంకరరావు ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించిన అనంతరం కేసు నమోదు చేశారు. వీఆర్వో రాజును అదుపులోనికి తీసుకున్నామని, శుక్రవారం ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ రాజేందర్ తెలిపారు. హడలిపోయిన రెవెన్యూ కార్యాలయ సిబ్బంది గురువారం సాయంత్రం ఉద్యోగులు ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్న వేళ.. ఏసీబీ అధికారులు ఒక్కసారిగా కార్యాలయానికి రావడంతో కలకలం రేగింది. ఏసీబీ అధికారులు ఎవరిని పట్టుకుంటారో.. ఎవరు దొరికిపోతారో అని రెవెన్యూ సిబ్బంది ఆందోళన చెందారు. చివరికి కోమర్తి వీఆర్వో లంచం తీసుకుంటూ పట్టుబడ్డట్టు తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. నాలాగ ఎందరో.. కోమర్తి, యారబాడు పంచాయతీల్లో తనలా అనేక మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని బాధితుడు శంకరరావు చెప్పారు. డబ్బు ముట్టందే వీఆర్వో రాజు పనులు చేయరని, చిన్న పనికి తనను అనేక అవస్ధలు పెట్టడంతో చివరికి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఏసీబీ అధికారుల సహకారంతో అవినీతి అధికారి ఆట కట్టిందన్నారు. -
అన్నీ తప్పులే
– తప్పులు తడకగా వెబ్‌ల్యాండ్ – కంప్యూటీకరణలో తప్పుగా నమోదు చేసిన సిబ్బంది – సరిచేసేందుకు డబ్బుల డిమాండ్ – పట్టించుకోని ఉన్నతాధికారులు – ఇబ్బందుల్లో అన్నదాతలు రైతు కొమ్మెర సుబ్బరాయుడుకి తలుపుల మండలం నూతన కాలువ పరిధిలో నాలుగు సర్వే నెంబర్లలో 2 ఎకరాల పొలం ఉంది. పట్టాదారు పాసు పుస్తకం నెంబరు ఏటీపీ 622384. పట్టా నెంబరు 574. సర్వే నెంబరు 18 లో 20 సెంట్లు ఉంది. 2010లో 1–బి తీసుకున్నప్పుడు భూమి విస్తీర్ణం సక్రమంగానే ఉంది. ఈ ఏడాది ఆగస్టు 17న మీ సేవలో 1–బి తీసుకుంటే సర్వే నెంబరు 18లో అతనికి ఐదు సెంట్లు మాత్రమే ఉన్నట్లు నమోదయ్యింది. ––––––––– రైతు కోటకొండ రామప్పనాయుడుకి తలుపుల మండలం నూతన కాలువ పరిధిలో నాలుగు సర్వే నెంబర్లలో 4.44 ఎకరాల భూమి ఉంది. 2015, జూన్ 3న మీ సేవలో 1–బి తీసుకుంటే విస్తీర్ణం సక్రమంగానే ఉంది. తరువాత ఆగస్టు 17న మీ సేవలో 1–బి తీసుకుంటే సర్వే నెంబరు 483లో 39 సెంట్లు, సర్వే నెంబరు 389లో 72 సెంట్ల భూమి నమోదు కాలేదు. వీరిద్దరిలాగే 1–బిలో తప్పుల తడకగా భూములు నమోదు కావడంతో వేలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తప్పుల్ని సరిచేయించుకునేందుకు అగచాట్లు పడుతున్నారు అనంతపురం అర్బన్ : రైతుల భూములకు సంబంధించి 1–బి అత్యంత కీలకమైన ఆధారం. ఇలాంటి కీలక ఆధారానికి సంబంధించి వెబ్‌ల్యాండ్ తప్పుల తడకగా తయారైంది. కంప్యూటీకరణ చేసే క్రమంలో తప్పుగా నమోదు చేశారు. ఈ విషయంలో దిగువ స్థాయి రెవెన్యూ సిబ్బంది చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. తప్పులు సరిజేసే విషయంలో ముడుపుల దందాకు శ్రీకారం చుట్టడంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. పైకి మాత్రం వెబ్‌ల్యాండ్ పక్కా ఉందంటూ అధికారులు ప్రకటనలు గుప్పిస్తున్నారు. ముడుపుల దందా జిల్లాలోని 7.60 లక్షల ఖాతాలు ఉన్నాయి. వీటికి సంబంధించి భూ విస్తీర్ణాన్ని వెబ్‌ల్యాండ్‌లో సక్రమంగా నమోదు చేయాలేదు. కొందరి 1–బిలో అదనంగా చేరిస్తే, మరికొందరి 1–బిలో ఉన్న భూమిని తొలగించారు. 1–బిలో వివరాలను సరిచేసేందుకు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ఇవ్వని వారిని పదేపదే తిప్పుకోవడం, గట్టిగా అడిగితే మీ ఇష్టమొచ్చినచోట చొప్పుకో అంటూ దురుసుగా సమాధానం ఇస్తున్నట్లు పలువురు వాపోతున్నారు. ఇబ్బంది పెడతున్నారు మా నాన్న కొమ్మెర సుబ్బరాయుడుకి సంబంధించి సర్వే నెంబర్ 18లో 20 సెంట్ల స్థలం ఉంటే కేవలం 5 సెంట్లు ఉన్నట్లు 1–బిలో చూపించారు. పట్టాదారు పాసు పుస్తకం తీసుకెళ్లి చూపించినా సరిచేయడం లేదు. ఇదేమని నిలదీస్తే దిక్కున్న చోట చొప్పుకో అంటూ దురుసుగా సమాధానమిస్తున్నారు. – కె.రమణ, తలుపుల -
వెబ్‌ల్యాండ్.. లోపాలపుట్ట
– వెబ్‌ల్యాండ్‌పై విరుచుకపడిన రైతులు, రైతు సంఘాల నేతలు – పట్టాదారుపాసు పుస్తకాలను రద్దు చేయడంపై తీవ్ర స్థాయిలో ధ్వజం – 271 జీఓను రద్దు చేయాలని డిమాండ్ – సాక్షి అవగాహన సదస్సులో వక్తల వెల్లడి కర్నూలు(అగ్రికల్చర్): ‘రెండు, మూడు తరాలుగా ఆస్తిగా వస్తున్న భూమిని కూడా మాదే అని నిరూపించుకోవాల్సిన దారుణ పరిస్థితి ఏర్పడింది. మా భూమిపై మాకే హక్కు లేకుండా చేస్తున్నారు. రైతులకు కష్టాలు తెచ్చి పెట్టే ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. వెబ్‌ల్యాండ్ పేరుతో రైతుల జీవితాలతో చెలగాటమాడుతోంది. రైతుల పాలిట శాపంగా మారిన 271 జీవోను రద్దు చేయాల్సిందే’ అని ఉద్యోగులు, పలు సంఘాల నేతలు, రైతులు డిమాండ్ చేశారు. కర్నూలు రాజ్‌విహార్‌లోని అంబేడ్కర్ భవన్లో శనివారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో రైతులు ఎదుర్కొంటున్న వెబ్‌ల్యాండ్ సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు వైఎస్ఆర్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వంగాల భరత్‌కుమార్‌రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. కర్నూలు, కల్లూరు, పగిడ్యాల, మిడుతూరు, దేవనకొండ, గూడూరు తదితర మండలాల రైతులు పాల్గొని వారు ఎదుర్కొంటున్న వెబ్‌ల్యాండ్ సమస్యలపై గళమెత్తారు. తహసీల్దార్ల చేతుల్లో డిజిటల్ కీ ఉండటంతో వెబ్‌ల్యాండ్ అక్రమాలకు పాల్పడుతున్నారని, డిజిటల్ కీని జేసీ ఆధ్వర్యంలో ఉంచితే అక్రమాలను తగ్గే అవకాశముందని వక్తలు సూచించారు. పట్టాదారు పాసుపుస్తకాలను రద్దు చేయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. వెబ్‌ల్యాండ్ సమస్యలను ఎలా పరిష్కరించాలి తదితర వాటికి కర్నూలు తహసీల్దారు రమేష్‌బాబు సూచనలు ఇచ్చారు. 271 జీవోతో సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం కూడా గుర్తించిందని త్వరలోనే జీఓను సవరించే అవకాశం ఉందని తెలిపారు. వేలాది మంది ఇబ్బందులు పడుతున్న వెబ్‌ల్యాండ్ సమస్యల పరిష్కారానికి ‘సాక్షి’ చొరవ తీసుకోవడంతో రైతులు, రైతు సంఘాల నేతలు, అధికారులు అభినందనలు తెలిపారు. అవగాహన సదస్సులో వక్తల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. పాసుపుస్తకాల ఆధారంగానే రిజిస్ట్రేషన్ చేయాలి: వంగాల భరత్‌కుమార్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వెబ్‌ల్యాండ్ రైతుల పాలిట శాపంగా మారింది. రాత్రికి రాత్రే ఒకరి పేరుమీద ఉన్న భూములు మరొకరిపేరుపై మారిపోతున్నాయి. వెబ్‌ల్యాండ్‌లోని 1–బీ, అడంగల్ ఆధారంగానే భూములు రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించడంతో భూములు తారుమారుతున్నాయి. ప్రభుత్వానికి రైతు సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదు. పట్టాదారు పాసుపుస్తకాల ఆధారంగానే భూములు రిజిస్ట్రేషన్లు జరిగే విధంగా చూడాలి. 1915 నుంచి రిజిస్ట్రేషన్లు జరిగిన భూములను కూడా ప్రభుత్వ భూములుగా చూపడం దారుణం. వెబ్‌ల్యాండ్ సమస్యలపై రైతుల్లో అవగాహన కల్పిస్తాం. రీ సర్వేతో సమస్యకు పరిష్కారం: రమేష్‌బాబు తహసీల్దారు కర్నూలు రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు పరిష్కారం కావాలంటే రీ సర్వే అవసరం. 1909లో బ్రిటీష్ వారు రూపొందించిన ఆర్‌ఎస్‌ఆర్‌పై ఇప్పటికి ఆధారపడుతున్నాం. రాష్ట్రంలో మూడు గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని భూముల రీ సర్వే జరుగుతోంది. కర్నూలు మండలంలోని దేవమాడ గ్రామంలో కూడా రీ సర్వే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వేకు అవకాశం ఉంది. వెబ్‌ల్యాండ్‌లో ఎలాంటి సమస్య ఉన్నా మీసేవ కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 271 జీఓతో సమస్యలు ఉన్నాయి. వీటిని ప్రభుత్వం కూడా గుర్తించింది. త్వరలోనే దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పారదర్శకత అంటే దోపిడీనే: రోషన్‌అలీ, రిటైర్డ్ తహశీల్దారు ఈ ప్రభుత్వంలో పారదర్శకత అంటే దోపిడీనే. రైతులకు అన్యాయం చేయడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుంది. వెబ్‌ల్యాండ్ పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల భూములను దౌర్జన్యంగా లాక్కునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెబ్‌ల్యాండ్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా లీగల్ సెల్ ఏర్పాటు చేయాలి. రైతులు కూడావెబ్ల్యాండ్ సమస్యలపై అవగాహన పెంచుకోవాలి. సాక్షి పత్రిక రైతుల పక్షాన నిలిచి రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయం. సవరణకు చర్యలు తీసుకోవాలి: తిరుపతిరెడ్డి అపార్డ్ సంస్థ అధినేత సంస్కరణల పేరుతో తీసుకువచ్చిన వెబ్‌ల్యాండ్ లోపాల పుట్టగా ఉంది. తప్పులు ఎవరు చేసినా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వెబ్ ల్యాండ్‌లో జరిగిన తప్పుల సవరణపై రైతులకు అవగాహన కల్పించేందుకు ‘సాక్షి’ బాధ్యత తీసుకోవడం అభినందనీయం. వెబ్‌ల్యాండ్‌లో జరిగిన తప్పుల సవరణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే గ్రామాల్లో జరిగే భూవివాదాలకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. రైతులకు కష్టాలు తెచ్చి పెట్టారు: సిద్ధారెడ్డి, భారతీయ కిసాన్ సంఘ్ నేత వెబ్‌ల్యాండ్ పేరుతో రైతులకు కష్టాలు తెచ్చే ప్రభుత్వాలు ఉండటం దురదష్టకరం. రెవెన్యూ రికార్డులను ఆన్లైన్లో పెట్టిన ప్రభుత్వం బాధ్యత రహితంగా వ్యవహరిస్తోంది. అన్నిటికీ వెబ్ల్యాండ్నే ప్రామాణికం చేసి రైతుల జీవితాలతో చెలగాటమాడుతోంది. వెబ్‌ల్యాండ్‌లో రెవెన్యూలోని అన్ని స్థాయిల వారు ఎవరికి వారు అడ్డుగోలుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి జిల్లాకు చెందినవారే అయినా వెబ్‌ల్యాండ్ సమస్యలపై చర్యలు తీసుకోవడం లేదు. పూర్వికుల డాక్యుమెంట్ ఎలా తేవాలి: కృష్ణ, కరివేముల, దేవనకొండ మండలం మాకు కరివేముల సర్వే నెంబర్ 68/3లో మూడు ఎకరాల భూమి ఉంది. మా నాయనకు జేజినాయన నుంచి సంక్రమించింది. ఈ భూమిని ఆన్లైన్లో ఎక్కించడం లేదు. మీ సేవ కేంద్రం ద్వారా వందలసార్లు దరఖాస్తు చేశాను. డాక్యుమెంటు తీసుకురమ్మంటున్నారు. పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమికి డాక్యుమెంటు ఎలా తేవాలి. వెబ్‌ల్యాండ్ పేరుతో ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతోంది. సొంత భూమిపై హక్కును కోల్పోవాల్సి వస్తోంది: పిట్టం ప్రతాప్ రెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం ప్రతినిధి వెబ్‌ల్యాండ్ కారణంగా మన భూములపై మనం హక్కులను కోల్పోయాం. వీఆర్వో రాసిందే రైతుల తలరాతగా మారిపోయింది. భూముల వివరాలను ఆన్లైన్లో పెట్టడంతో అరచేతిలో భూముల వివరాలను చూసుకోవచ్చు. వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది అడ్డుగోలుగా ఆన్లైన్లో మార్పులు చేస్తున్నారు. మన భూమి మనది అని నిరూపించుకోవడానికి అవస్థలు పడాల్సి వస్తోంది. 271 జీవోను రద్దు చేయాలి: కొమ్ముపాలెం శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ దళిత సమాఖ్య అధ్యక్షుడు ప్రభుత్వం తీసుకువచ్చిన 271 జీవో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ జీవోను తక్షణం రద్దు చేయాలి. తహసీల్దార్ల వద్ద ఉన్న డిజిటల్ కీని జేసీ ఆధ్వర్యంలో ఉంచాలి. హార్డ్ కాపీని తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. సర్వే రీసెటిల్మెంట్ చేయాలి. ఉమ్మడి భూమిని, ప్రతి సర్వే నెంబర్‌ను సబ్ డివిజన్ వేయాలి. 271 జీవోను రద్దు చేయకపోతే రైతుల భూములను ఎవరూ కాపాడలేరు. ప్రదక్షిణలు చేస్తున్నా: పి.మస్తాన్, పి.కోటకొండ, దేవనకొండ మండలం మా గ్రామంలోని 329 సర్వే నెంబర్లోని భూమి 88 సెంట్లను 1974లో కొన్నాము. దీనికి అడంగల్ 1బీ, పట్టాదారు పాసు పుస్తకం ఉన్నాయి. అయితే రెవెన్యూ అధికారులు ఆన్లైన్లో ఎక్కించడం లేదు. అడిగిన అన్ని వివరాలు ఇస్తున్నా ఏదో కారణంతో సమస్యను సాగదీస్తున్నారు. ‘సాక్షి’ నిర్వహించిన సదస్సులో నా ఆందోళనను అందరి దష్టికి తెస్తున్నాను. అధికారులకు దయ కలిగేదెప్పుడో: నరసింహారెడ్డి, కె.నాగలాపురం, గూడూరు మండలం మాకు కె.నాగలాపురంలోని సర్వే నెంబర్ 52/3లో 88 సెంట్ల భూమి ఉంది. దీనిని ఆన్లైన్లో ఎక్కించడంలో అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. నాలాగే వెబ్‌ల్యాండ్ సమస్యలు ఎదుర్కొనేవారు వందల మంది ఉన్నారు. ‘సాక్షి’ నిర్వహించిన అవగాహన సదస్సుతో సమస్యలను చెప్పుకునే అవకాశం లభించింది. ఇప్పటికైనా అధికారులకు దయ కలిగితే సంతోషం. చుక్కలు చూపిస్తున్నారు: టి.సోమన్న, ఎ.గోకులపాడు, కల్లూరు మండలం ఎ.గోకులపాడు గ్రామంలోని సర్వే నెంబర్ 60/5లో మూడు ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని ఆన్లైన్లో ఎక్కించడానికి అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇచ్చాం. కానీ ఆన్లైన్లో ఎక్కించడం లేదు. వెబ్‌ల్యాండ్‌తో ప్రభుత్వం సామాన్యులతో చెలగాటమాడుతోంది. -
వెబ్‌ల్యాండ్ మంచిది కాదు
పొదిలి/కొనకనమిట్ల : రెవెన్యూ వెబ్‌ల్యాండ్ ఆధారంగా భూముల క్రయ, విక్రయ రిజిస్ట్రేషన్లు చేయాలని, బ్యాంకులు పంట రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ‘మీ భూమి’ వెబ్‌ల్యాండ్‌లో లోపాల వల్ల రైతులు పడుతున్న కష్టాలు, రెవెన్యూ అధికారుల అక్రమాలతో వెబ్‌ల్యాంబ్ బాధిత రైతులు రోజురోజుకూ పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో రైతుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందకు ‘సాక్షి’ నడుంబిగించింది. మార్కాపురం నియోజకవర్గంలో పొదిలి మండలం ఆముదాలపల్లి, కొనకనమిట్ల మండలం గొట్లగట్టులో గురువారం అవగాహన సదస్సులు నిర్వహించింది. ‘వెబ్‌ల్యాండ్ అమలు చేయడం వల్ల అవకతవకలు, అక్రమాలు జరిగే అవకాశం ఉంది. భూమి క్రయ, విక్రయాల్లో తప్పులు జరుగుతున్నాయి. అసలు రికార్డులు సవరించకుండా వెబ్‌ల్యాండ్ అమలు చేయడం మంచిది కాదు’ అని పలువురు రైతులు సదస్సు దృష్టికి తెచ్చారు. గొట్లగట్టు పంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన సదస్సులో తహశీల్దార్ జ్వాలా నరసింహం మాట్లాడుతూ.. ‘వెబ్‌ల్యాండ్‌లో సమస్యలుంటే క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. జీఓ నెం.271 వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, పాత విధానమే బాగుందని రైతులు అంటున్నారు. ఈ–పాస్ పుస్తకాలకు సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఒక పుస్తకం (ఈ పాస్) ద్వారానే బ్యాంక్‌ల్లో రుణ ం ఇస్తున్నారు. సహకార బ్యాంక్‌ల్లో రుణాలివ్వని విషయంతోపాటు మిగిలిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం’ అన్నారు. ఆముదాలపల్లిలో వెబ్ ల్యాంyŠ అవగాహన సదస్సులో తహశీల్దార్ విద్యాసాగరుడు మాట్లాడుతూ.. రైతుల రికార్డుల ప్రకారం సరిచూసుకుని, లోపాలను సవరించాకే వెబ్‌ల్యాండ్‌లో భూముల వివరాలు నమోదు చేస్తున్నామని తెలిపారు. వివాదాలు వచ్చిన చోట ఇరువర్గాలతో మాట్లాడి ఆమోదయోగ్యమైతేనే వివరాలు నమోదు చేస్తున్నామన్నారు. భూ యజమానుల హక్కులకు భంగం కలిగేతే వెంటనే తనకు ఫిర్యాదు చేయాలన్నారు. రైతులు ముందుగా వారి భూములకు సంబంధించి విస్తీర్ణాలు, పాసు బుక్‌లో నమోదైన విస్తీర్ణాలు సరిచూసుకుని కంప్యూటరీకరణ కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రైతులు లేవనెత్తిన సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. -
వెబ్‌ల్యాండ్‌పై నేడు ‘సాక్షి’ అవగాహన సదస్సు
అమలాపురం : ప్రభుత్వం ఇటీవల అమలు చేస్తున్న వెబ్‌ల్యాండ్ విధానంలో నెలకొన్న అస్పష్టత పరిస్థితులు, లోపాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు అమలాపురంలో ‘సాక్షి’ దినపత్రిక బుధవారం ఉదయం 10 గంటలకు సదస్సు నిర్వహిస్తోంది. అమలాపురం సావరం బైపాస్ రోడ్డులోని గౌతమ మహర్షి గో సంరక్షణ సమితి గోశాలలో జరిగే ఈ అవగాహన సదస్సుకు ఆర్డీవో జి.గణేష్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై రైతులకు వెబ్‌ల్యాండ్‌పై అవగాహన కల్పిస్తారు. ఆయనతో తహసీల్దార్, అమలాపురం డివిజన్ సర్వే ఇన్స్పెక్టర్ సత్తి నాగేశ్వరరావు, వీఆర్వోలు పాల్గొంటారు. కోనసీమ స్థాయిలో జరిగే ఈ సదస్సుకు రైతులు హాజరై వెబ్‌ల్యాండ్‌పై తమ అనుమానాలు, సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. వెబ్‌ల్యాండ్ విధానంలో నెలకొన్న తికమకలను ఎలా సరిదిద్దుకోవాలి... ఆ ప్రక్రియలో రైతుల భూములు ఎలా భద్రంగా కాపాడుకోవాలి.. అందుకు ఎలా దరఖాస్తు చేసుకుని సమస్యలను పరిష్కరించుకోవచ్చు తదితర అంశాలపై ఈ సదస్సులో రెవెన్యూ అధికారులు అవగాహన కల్పిస్తారు. -
లంచం ఇస్తేనే ఆన్లైన్
రాయచోటి: రాయచోటి నియోజకవర్గ పరిధిలో లంచం ఇస్తే గాని భూముల వివరాలు ఆన్లైన్ చేయడం లేదని రైతులు వాపోతున్నారు. ఇటీవల ప్రభుత్వం వెబ్‌ల్యాండ్‌లో భూమి వివరాలు నమోదు చేస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్నా, ఆ వెబ్‌ల్యాండ్‌లో వివరాలు తప్పుల తడకగా నమోదు చేశారు. భూమి ఒకరి పేరుతో ఉంటే ఖాతా నెంబర్ మరొకరి పేరుతో ఉంటోంది. విస్తీర్ణం తక్కువగానో, ఎక్కువగానో నమోదు చేశారు. అలాగే సర్వే నెంబర్లు కూడా ఇష్టానుసారం నమోదు చేశారు. రాయచోటి మండలంలో ఇప్పటికి వెబ్‌ల్యాండ్ వివరాలు సక్రమంగా నమోదు చేయలేదు. సంబేపల్లె మండలంలో ఆన్లైన్ పూర్తి స్థాయిలో చేయక పోవడంతో మీ సేవలో 1బి రాక పలువురు రైతులు పంట రుణాలను నేటికీ రెన్యువల్ చేసుకోలేకపోతున్నారు. దీంతో పంటల బీమా రుసుము కూడా చెల్లించలేక పోయారు. లక్కిరెడ్డిపల్లె మండలంలో కాకుళారం గ్రామం మిద్దెల వాండ్లపల్లెలో ఒక రైతుకు సంబంధించిన పొలాన్ని మరొక రైతు పేరుతో ఆన్లైన్ చేయడంతో అక్కడ రైతుల మధ్య తగాదాకు దారితీసింది. కుర్నూతల, కస్తూరిరాజుగారిపల్లె గ్రామాల రెవెన్యూ రికార్డులు గందరగోళంగా మార్చడంతో పనులు సక్రమంగా జరగక రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఆన్లైన్ కోసం నెల రోజులుగా తిరుగుతున్నా ఆన్లైన్ కోసం నెల రోజులుగా తిరుగుతున్నా పని జరగడం లేదు. అధికారులను అడిగితే చూస్తాం, చేస్తాం అంటున్నారు. మీ సేవకు వెళితే వన్‌బీ రావడం లేదు. ఇప్పుడు ఆన్లైన్లో లేని భూములకు వెబ్‌ల్యాండ్ ద్వారా పాసుపుస్తకాలు రద్దు చేస్తారేమోనని భయంగా ఉంది. – లక్ష్మినారాయణ, బొట్ల చెరువు, రాయచోటి. మ్యుటేషన్ కోసం ఏడాదిగా తిరుగుతున్నా గతంలో మా తండ్రి పేరుతో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాన్ని తల్లి పేరుతో మార్చుకొనేందుకు ఏడాదిగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా మార్పు చేయలేదు. దీంతో బ్యాంక్‌లో పంట రుణాలు పొందలేక పోతున్నాము. – రెడ్డెయ్య, మిట్టావాండ్లపల్లె, రాయచోటి వెబ్‌ల్యాండ్‌తో ఆందోళన అవసరం లేదు: వెబ్‌ల్యాండ్‌తో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్ది త్వరలోనే రైతులందరికీ సక్రమమైన సమాచారాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. రైతులందరి భూముల వివరాలతో సహా ఆన్లైన్లో ఉంచుతాము. గుణభూషణ్‌రెడ్డి, తహసీల్దార్, రాయచోటి. -
రైతు సంక్షేమం కోసమే వెబ్‌ల్యాండ్
– రెవెన్యూ రికార్డుల సరళీకరణతో బోగస్ పట్టా పుస్తకాల ఏరివేత సాధ్యం – రైతు చెంతకు కీలకమైన 1–బి రికార్డు – మీ– భూమి పోర్టల్ ద్వారా భూమి వివరాలు – వెబ్‌ల్యాండ్‌పై ‘సాక్షి’ అవగాహన సదస్సులో ఇన్చార్జి కలెక్టర్ బి.లక్ష్మికాంతం అనంతపురం అర్బన్/ అనంతపురం : రెవెన్యూ రికార్డుల సరళీకరణ ప్రక్రియలో భాగంగా ఏర్పాటైన వెబ్‌ల్యాండ్ ద్వారా బోగస్ పట్టాదారు పాసు పుస్తకాల ఏరివేత సాధ్యమైందని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ లక్ష్మికాంతం అన్నారు. అనంతపురం రూరల్ మండలం ఇటుకలపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఎడిషన్ ఇన్చార్జ్ తోలేటి మహేశ్వరరెడ్డి అధ్యక్షతన మంగళవారం వెబ్‌ల్యాండ్‌పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సరళీకృత విధానం వల్ల రెవెన్యూ రికార్డుల్లో అత్యంత కీలకమైన 1–బి కోసం అధికారుల చుట్టూ రైతులు తిరిగే అవసరం లేదని, మీ–సేవ ద్వారా నేరుగా పొందే అవకాశముందని తెలిపారు. మీ–భూమి పోర్టర్ ద్వారా ఎవరైనా ఎక్కడి నుంచైనా తమ భూమి వివరాలను స్వయంగా తెలుసుకోవచ్చని అన్నారు. జిల్లాలో 7.71 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలు ఉండగా వీటిలో 99 శాతం ఆధార్ అనుసంధానం ప్రక్రియ పూర్తి అయిందన్నారు. వెబ్‌ల్యాండ్‌లోని వివరాలను ఎవరుపడితే వారు మార్పు చేయడానికి అవకాశం ఉండదని, దీనికి సంబంధించిన డిజిటల్ కీ ఆర్డీవో వద్దనే ఉంటుందని, ఈ విషయంలో ఎలాంటి అపోహలు వద్దని సూచించారు. ముఖ్యంగా భూమి నిరంతం క్రయ విక్రయాలు, భాగ పరిష్కారాలు, వారసత్వం ద్వారా మార్పు చెందుతుంటుందన్నారు. ఈ క్రమంలో చేర్పులు మార్పులకు అధికారుల చుట్టు తిరిగే సమస్య లేకుండా ఆటో మ్యూటేషన్ ప్రక్రియని కూడా త్వరలో చేపట్టనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో మలోల, తహశీల్దార్ శ్రీనివాసులు, సాక్షి బ్యూరో ఇన్చార్జ్ రవివర్మ, గ్రామ సర్పంచ్ పెద్దిరెడ్డి, వైఎస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శులు కేశవరెడ్డి, యూపీ నాగిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఒలిపిరెడ్డి శివారెడ్డి, దస్తగిరి రెడ్డి, రైతు సంఘం నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, రామాంజి, రైతులు పాల్గొన్నారు. బ్యాంక్ సమస్య పరిష్కారం (సపరేట్గా హైలెట్ కావాలి) ప్రస్తుతం తామంతా అనంతపురంలోని గుత్తిరోడ్డులో ఉన్న ఆంధ్రాబ్యాంక్ ద్వారా పంట రుణాలు పొందేవారమని, అయితే అధికారులు సహకరించకుండా ఇబ్బందులకు గురిచేస్తుండడంతో తమ గ్రామానికి కందుకూరులోని సిండికేట్ బ్యాంక్‌ను దత్త బ్యాంక్‌గా చేయాలంటూ ఇన్చార్జి కలెక్టర్‌ను రైతు సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ రైతులు కోరారు. దీనిపై స్పందించిన ఆయన తక్షణం లీడ్ బ్యాంక్ మేనేజర్‌తో మాట్లాడి, సమస్యకు పరిష్కారం చూపారు. ఈ మేరకు రైతులందరూ ఎల్డీఎంకు అర్జీ ఇస్తే దత్త బ్యాంక్‌గా సిండికేట్ బ్యాంక్‌ను చేసేందుకు ఎల్డీఎం అంగీకరించినట్లు తెలిపారు. –––––––––––––– పొరపాట్లు సరిదిద్దాలి వెబ్‌ల్యాండ్‌లోని పొరపాట్లను వందశాతం సరిదిద్దాలి. ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి భూములకు సంబంధించి సబ్ డివిజన్ సర్వే చేసి భూ రికార్డులను రూపొందించాలి. వెబ్‌ల్యాండ్‌లో భూముల వివరాలను తెలుసుకునే విషయంపై గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలి. – పి.పెద్దిరెడ్డి, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు –––––––––––––– రైతులకు ఇబ్బంది కలుగరాదు వెబ్‌ల్యాండ్‌లో కొందరు రైతుల వివరాలు తప్పుగా నమోదయ్యాయి. దీంతో వారంతా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వాటన్నింటినీ సరిచేయడంతో పాటు వెబ్‌ల్యాండ్‌పై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. – వెంకట చౌదరి, వైఎస్ఆర్సీసీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ––––––––––––– అవగాహన కల్పించాలి తగిన సమయం తీసుకుని రైతులకు వెబ్‌ల్యాండ్‌పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. లాభాలను తెలియజేయాలి. అటు తరువాత పట్టాదారు పాసు పుస్తకాలను తొలగించినా ఇబ్బంది ఉండదు. – సి.మల్లికార్జున, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సదస్సు బాగా ఉపయోగపడింది వెబ్‌ల్యాండ్ సమస్యలపై సాక్షి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు చాలా ఉపయోగపడింది. ఇన్చార్జి కలెక్టర్ లక్ష్మీకాంతం మంచి విషయాలు తెలిపారు. చదువురాని వారికి కూడా బాగా అర్థమైంది. ఇలాంటి సదస్సులు మరిన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. – వెంకటరెడ్డి రైతు, ఇటుకలపల్లి ––––––––––––––– సందేహాలు... నివృత్తి అక్కులప్ప, ఎంపీటీసీ : శివాయిజామి భూముల విషయంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించి వాటిని విక్రయించుకునే అవకాశం కల్పించాలి. వెబ్‌ల్యాండ్‌పై రైతుల్లో ఉన్న అపోహలను, సందేహాలను నివృత్తి చేయాలి. ఆర్డీఓ : శివాయిజామి భూముల వ్యవహారంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక రైతులకు వెబ్‌ల్యాండ్‌పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు, అపోహలు తొలగించేందుకు చర్యలు చేపడతాం. వనజ, మహిళా రైతు : మాకు కందుకూరు పొలం సర్వే 447లో 5.14 ఎకరాల భూమి ఉంది. 1–బిలో రెండున్నర ఎకరాలు ఉన్నట్లు చూపుతున్నారు. మీ సేవ ద్వారా అర్జీ పెట్టుకున్నా పరిష్కారం కాలేదు. ఆర్డీఓ : మీ సేవ రసీదు నకలు ఒకటి మాకు ఇవ్వండి. పొరపాటు ఎక్కడ జరిగిందో గుర్తించి రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తాం. వెంకటరాముడు, బాలబొజ్జప్ప, అక్కులప్ప, శ్రీరాములు : దేవాదుల కాలువ, శ్మశానానికి కేటాయించిన భూమికి పట్టాలిచ్చారు. దీంతో సమస్యగా మారింది. ఎవరూ పట్టించుకోవడం లేదు. తహశీల్దార్ శ్రీనివాసులు : దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. రెడ్డెప్ప, నల్లమాడ : నా భూమిలో వేరేవారికి అక్రమంగా పట్టాలిచ్చారు. తహశీల్దార్‌కు ఎన్నిమార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదు. ఆర్డీఓ : ఆర్డీఓకుS లేదా జాయింట్ కలెక్టర్‌కుS అప్పీలు చేస్తూ పిటీషన్ దాఖలు చేసుకోవాలి. పట్టా వివరాలు సమగ్రంగా తెలిపాలి. సమస్య పరిష్కారం అవుతుంది. పెద్దన్న, ఇటుకలపల్లి : పాసు బుక్కుల రద్దు నిర్ణయం సరికాదు. రైతుకు తన భూమికి సంబంధించిన ఆధారం అది ఒక్కటే. అదీ లేకపోతే ఇబ్బంది పడతారు. ఆర్డీఓ : 1–బి రికార్డు అసలైన ఆధారం. దీనినే నేరుగా రైతులకు అందజేస్తున్నాం. అలాంటప్పుడు పాసుబుక్కు వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. -
‘వెబ్‌ల్యాండ్’ మోసాలెన్నో!
రైతుసంఘాల నాయకులు ఆందోళన భూములపై హక్కులు కోల్పోయే అవకాశం మంగళగిరి: వెబ్ లాండ్ అక్రమార్కులకు వరంలా మారే అవకాశం ఉందని రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అటు అసలైన భూ యజమానులతో పాటు ఇటు ప్రభుత్వ భూములూ అక్రమార్కుల పరమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. సర్వేకు రాని భూముల వివరాలు తెలుసుకొని వాటిలో తమ పేర్లు నమోదుచేయించుకునేందుకు అక్రమార్కులకు అవకాశం కల్పించినట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. పట్టాదారు పాసుపుస్తకాలుంటే తప్పా బ్యాంకర్లు రైతులకు రుణాలివ్వరని చెప్పారు. ఈ విధానం కొందరు రెవెన్యూ అధికారులకూ అక్షయపాత్ర మాదిరిగా ఉంటుందని తెలిపారు. రూ. లక్ష ముట్టజెప్పి రికార్డుల్లో నమోదు... ఉదాహరణకు ఓ రైతు మండలంలోని ఓగ్రామంలో తమ భూమిని సర్యే నిర్వహించి రికార్డులలో నమోదు చేయాలని దరఖాస్తు చేశారు. భూమిని సర్యే చేసిన సర్యేయర్ ఎకరం పదిహేను సెంట్లు వుందని దానిని రైతుపేర రికార్డులలో పొందుపరచవచ్చని ధ్రువీకరించగా వీఆర్వో ఎకరం ఐదు సెంట్లు మాత్రమే నమోదు చేశారు. సెంటు లక్షలు పలుకుతుండడంతో వీఆర్వో కావాలనే పక్క రైతు వద్ద డబ్బులు తీసుకుని తనను మోసం చేశారని భావించిన రైతు మరలా వీర్వోను సంప్రదించగా మరో సారి దరఖాస్తు చేసుకోవాలని అప్పుడు మారుస్తానని చెప్పారు. అలా ఎందుకు నమోదు చే శారో చెప్పాలని రైతు ఆగ్రహం వ్యక్తం చేయగా మరలానైనా నమోదు చేయాల్సింది నేనే సెంటుకు పది వేలు ఇవ్వాలని లేదంటనే కుదరదని ఒక వేళ పై అధికారులకు ఫిర్యాదు చేస్తే ఆ పది సెంట్లు కాలువ భూమి అని రాస్తానని రైతును బెదిరించడం విశేషం. గత్యంతరం లేక రైతు రూ.లక్ష ముట్ట చెప్పి మరలా దరఖాస్తు చేసుకుని రికార్డులలో నమోదు చేయించుకోవాల్సిన దుస్థితి వచ్చింది. హక్కులు కోల్పోయే ప్రమాదం.. వెబ్లాండ్ విధానం కారణంగా రైతులు తమ భూములపై పూర్తిగా హక్కులు కోల్పోయే ప్రమాదముంది. అంతేకాక అక్రమార్కులు అధికారులతో కుమ్మక్కైతే ప్రభుత్వ, ప్రైవేటు భూములను కొట్టేసేందుకు సులువైన మార్గంగా వెబ్లాండ్ తయారైంది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు మానుకుని రైతులకు భూములపై పూర్తి హక్కులుండేలా పాసు పుస్తకాల విధానాన్ని కొనసాగించాలి. తక్షణమే వెబ్లాండ్ విధానం రద్దు చేయాలి. – సింహాద్రి లక్ష్మారెడ్డి, రైతు సంఘం నాయకులు -
వణుకు పుట్టిస్తున్న ‘వెబ్‌ల్యాండ్’
ఒకరి భూమి మరొకరి పేరిట నమోదు తప్పుల తడకగా రెవెన్యూ వెబ్సైట్ జీవో నెంబరు 271ను రద్దు చేయాలని రైతుల డిమాండ్ కైకలూరు : వెబ్‌ల్యాండ్.. ఇప్పుడు ఆ పేరు చెబితేనే రైతులు వణుకుతున్నారు. గతంలో భూమికి సంబంధించి పట్టాదారు పాస్‌పుస్తకాలు, టైటిల్‌డీడ్ రైతుల వద్ద ఉండేవి. అవి వారికి భరోసా కల్పించేవి. ఆపద సమయంలో ఆదుకునేవి. ప్రస్తుతం వాటిని రద్దుచేస్తూ ప్రభుత్వం జీవోనంబర్ 271 విడుదల చేసింది. వెబ్‌ల్యాండ్ ఆధారంగా క్రయ, విక్రయ రిజిస్ట్రేషన్లు, పంట రుణాలు ఇవ్వాలంటూ ప్రభుత్వం భూముల ఆన్లైన్ పక్రియను తెరపైకి తెచ్చింది. ఈ విధానంలో రైతుల భూముల వివరాలను నమోదు చేస్తున్నారు. పట్టాదారు పాసుపుస్తకం, రెవెన్యూ మాన్యువల్ రికార్డుల్లో ఒకరి పేరు ఉన్న ఆస్తులు ప్రభుత్వ వెబ్‌ల్యాండ్‌లో మరొకరి పేరుతో నమోదయ్యాయి. దీనిపై రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వారసత్వంగా సంక్రమించిన భూములు వెబ్‌ల్యాండ్ ప్రభుత్వ ఖాతాలో కనిపించడం లేదు. పంట రుణాల కోసం బ్యాంకులకు వెళుతుంటే వారి భూమి వివరాలు వెబ్‌ల్యాండ్‌లో కనిపించకపోవడంతో తిరస్కరిస్తున్నారు. కొండూరు కొంప ముంచారు మండలంలోని ఒక్క కొండూరు గ్రామంలోనే190 మంది ఖాతాల్లో తప్పులను గుర్తించారు. గ్రామంలో 135 ఎకరాల భూమి 1బీలో నమోదైనప్పటికి యజమానుల పేర్లు తప్పులు వచ్చాయి. ఖాతాదారుల జాబితాలో రెం డు, అంతకన్నా ఎక్కువ పేర్లు నమోదైన వారు 139 మం ది ఉన్నారు. ఉదాహరణకు గ్రామానికి చెందిన బొర్రా వెంకటలక్ష్మీ పేరుతో 190/2 సర్వే నెంబరులో 4 ఎకరాల 15 సెంట్ల చేపల చెరువు ఉంది. పాస్ బుక్, టైటిల్డీడ్లో ఆమె పేరు ఉంది. తీరా వెబ్‌ల్యాండ్‌లో యజ మానిగా పేరిచర్ల సత్యనారాయణరాజు అని ఉంది. అదే విధంగా గ్రామంలో ఓ 20 కుటుంబాలు 70 ఏళ్ల క్రితం 119/1,2 సర్వే నెంబర్లలో పట్టా భూమిని కొనుగోలు చేసి జీవిస్తున్నారు. వెబ్‌ల్యాండ్‌లో రుద్రరాజు బాలకుమారి అని ఉంది. ఆమె ఎవరో గ్రామస్తులు చెప్పలేకపోతున్నారు. -
‘మాయా’ల్యాండ్!
– వెబ్‌ల్యాండ్ నిర్వహణ అస్తవ్యస్తం – రాత్రికి రాత్రే మారిపోతున్న భూముల వివరాలు – పెరుగుతున్న వివాదాలు – పేరుకుపోతున్న మ్యూటేషన్ దర ఖాస్తులు – మండల కేంద్రమైన వెల్దుర్తికి చెందిన చింతకాలయ రామాంజనమ్మకు సర్వేనెం.831లో 2.60 ఎకరాల భూమి ఉంది. ఇది వారసత్వంగా సంక్రమించింది. రెండు నెలల క్రితం వరకు వెబ్‌ల్యాండ్‌లో భూమి వివరాలు రామాంజనమ్మ పేరుమీదనే ఉన్నాయి. తర్వాత వెబ్‌ల్యాండ్‌లోని వివరాలను పరిశీలిస్తే రామాంజనమ్మ స్థానంలో ఇతర సామాజిక వర్గానికి చెందిన రైతు ఉన్నారు. ఇది రెవెన్యూ అధికారుల లీల. దీంతో సంబంధిత మహిళా రైతు లబోదిబోమంటున్నారు. – ప్యాపిలి మండలం రాచర్ల రెవెన్యూ గ్రామంలోని సర్వే నెం.1–2లో 2ఎకరాల భూమిని నేరడుచెర్ల గ్రామానికిచెందిన ఓబులేసు, ఓబులవెంకటరాములు చెరో ఎకరాకొన్నారు. మేనెల చివరి వారంలో ప్యాపిలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకొని వెంటనే మ్యూటేషన్ కోసం అన్ని డాక్యుమెంట్లతో మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నారు. అప్లికేషన్ నెంబరు ఎంయూ 011602375627 మ్యూటేషన్‌కు నెల రోజుల్లో చేయాలి. 50 రోజులు గడిచినా పట్టించుకోలేదు. .. ఈ రెండు ఘటనలే కాదు. జిల్లాలో ఇలాంటివి అనేకం ఉన్నాయి. ఒకవైపు వెల్ల్యాండ్లోని వివరాలు రాత్రికి రాత్రే మారిపోతున్నాయి. మరోవైపు మ్యూటేషన్ల కో సం రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కర్నూలు (అగ్రికల్చర్) మ్యూటేషన్లకు, వెబ్‌ల్యాండ్‌లో సవరణల కోసం మీ సేవా కేంద్రాల్లో రైతులు దరఖాస్తు చేసుకుంటున్నారు. వీటిని సంబంధిత తహసీల్దార్లు నిర్ణీత గడువులోగా పరిష్కరించాల్సి ఉంది. గడువు దాటినా పట్టించుకోకపోవడంతో రైతులు పడుతున్న ఇక్కట్లు అన్నీ..ఇన్నీ కావు. తీరా అధికారులు వాటిని తిరస్కరిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. భూములు కొనుగోలు చేస్తే సబ్ రిజిస్ట్రార్కార్యాలయాలో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆ తర్వాత రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసుకోవాలి. వీటినే మ్యూటేషన్లు అంటారు. మ్యూటేషన్ జరుగకపోతే భూములు కొన్న రెవెన్యూ రికార్డుల్లో వారి వివరాలు నమోదు కావు. మ్యూటేషన్ల కోసం మీ సేవా కేంద్రాల ద్వారా దాదాపు 56 వేల దరఖాస్తులు వచ్చాయి. మామూళ్లు ముట్టచెబితే 24 గంటల్లోనే మార్పులు జరుగుతాయి. లేకపోతే నిర్ణీత గడువు దాటినా మార్పులు జరగవు. చివరికి తిరస్కరణ అస్త్రాన్ని ప్రయోగిస్తారు. 56 వేలకుపైగా మ్యూటేషన్ దరఖాస్తులు ఉంటే 30 వేల వరకు తిరస్కరించారు. దీన్నిబట్టి చూస్తే రైతులు ఇక్కట్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తోంది. గడువు తీరినా పరిష్కారానికి నోచుకోని దరఖాస్తులు 10వేలకుపైగా ఉన్నాయి. భూములు కొనుగోలు చేసినపుడు రెవెన్యూ రికార్డుల్లో అంటే వెబ్‌ల్యాండ్ మార్పులు జరగకపోతే ఎటువంటి ప్రయోజనం ఉండదు. అమ్మిన వారి వివరాలే ఉంటాయి. మ్యూటేషన్లను ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సి ఉన్నా పట్టించుకోడం లేదు. మ్యూటేషన్ల సమస్యలను అధిగమించేందుకు ఆటోమేటిక్ మ్యూటేషన్ల విధానాలన్ని అమలులోకి తీసుకురావాలని ప్రయత్నించినా ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది. ప్రజాసాధికార సర్వే కారణంగా ఆటోమేటిక్ మ్యూటేషన్ల అమలు రెండు నెలల వాయిదా పడింది. అడ్డుగోలుగా అక్రమాలు.. భూ వివరాలు ఆన్‌లైన్‌లోకి వచ్చిన తర్వాత రెవెన్యూ సిబ్బంది అడ్డుగోలుగా అక్రమాలకు పాల్పడుతున్నారు.రాత్రికి, రాత్రే రైతుల తలరాతలు మారుస్తున్నారు. తహసీల్దార్ల డిజిటల్ సిగ్నేచర్ కీలను కంప్యూటర్ ఆపరేటర్లకు అప్పగించడంతో అడ్డుగోలుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా మామూళ్లు పొంది ఆన్లైన్లో వివరాలు తారుమారు చేస్తున్న అధికారులు నిజమైన భూమి యజమానులు వచ్చి అన్ని వివరాలు చూపించినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇటువంటి సమస్యలు జిల్లాలో కోకొల్లలుగా ఉన్నాయి. వెబ్‌ల్యాండ్‌లో భూముల వివరాల సవరణకోసం 75 వేలకుపైగా దరఖాస్తులు మీ– సేవ కేంద్రాల ద్వారా వచ్చాయి. వీటిలో రెవెన్యూ అధికారులు 45 వేల వరకు తిరస్కరించారు.1 5 వేల దరఖాస్తులు గడువు తీరినా పట్టించుకున్న దాఖలాలు లేవు. అడ్డుగోలుగా వెబ్‌ల్యాండ్‌లోని భూముల వివరాలను మార్పులు చేస్తుండటం వల్ల భూ వివాదాలు పెరుగుతున్నాయి. రాత్రికి రాత్రే వెబ్‌ల్యాండ్‌లో మార్పులు చేయడం, సబ్ రిజిస్ట్రార్లను మామూళ్లతో లొంగదీసుకొని రిజిస్ట్రేషన్లు చేయించుకోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారు అయింది. -
వెబ్ ల్యాండ్‌తో గుండెలు లబ్‌డబ్
♦ పట్టాదారు పాసు పుస్తకాలు రద్దు చేయొద్దని వినతి ♦ తప్పుల తడకగా ఆన్లైన్లో భూ రికార్డులు రైతుల్లో ఆందోళన గురజాల: పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడంపై నియోజకవర్గంలోని రైతులు ఆందోళన చెందుతున్నారు. పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ ఉంటే భరోసాగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఆన్లైన్లో భూ రికార్డులు నమోదు కూడా తప్పుల తడకగా ఉందని, భూముల సర్వేల్లో తప్పులు, విస్తీర్ణాలు మారిపోవడం, హక్కుదార్ల పేర్లు కూడా వెబ్‌ల్యాండ్‌లో మారిపోయే అవకాశం ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్లో భూముల వివరాలు, విస్తీర్ణం నమోదు, యజమాని పేరు వంటివి చూసుకునే పరిజ్ఞానం రైతులకు ఉండదని వారు ఆయోమయంలో పడతారని రైతు సంఘాల నేతలు అంటున్నారు. పట్టాదారు పాసుపుస్తకాలను, టైటిల్ డీడ్స్‌ను వ్యవస్థను రద్దు చేయడం వల్ల రైతుల ఆస్తులకు రక్షణ ఉండదని, ఈ విధానం బడా బాబులకే కొమ్ము కాసేదిగా ఉందని వారు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా పాస్ పుస్తకాలను రద్దుచేస్తూ జారీ చేసిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఎల క్ట్రానిక్ పాస్ బుక్ (ఈ పాస్ బుక్) విధానంపై రైతులకు అసలు అవ గాహన లేదని, ఈ విధానం అమల్లోకి వస్తే అక్రమాలకు మరింత ఎక్కువవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలతో రైతులకు భరోసా పాసు పుస్తకాలు టైటిల్ డీడ్స్ రైతులకు ఒక భరోసానిస్తాయి. వెబ్ ల్యాండ్, ఈ పాస్ పుస్తకాలు విధానం లోపాల పుట్ట. యథావిధిగా పట్టాదారు పుస్తకాలు కొనసాగించాలి. పుస్తకాలు ఉంటేనే రైతులకు ధైర్యంగా ఉంటుంది. పాసు పుస్తకాల రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలి.ఆన్లైన్లో భూ రికార్డులు వ్యవహారం దారుణంగా ఉంది. -బత్తుల చంద్రం,రైతు ఆన్లైన్లో ఇబ్బందులు తప్పవు ఆన్‌లైన్‌తో రైతులకు ఇబ్బందులు తప్పవు. చదువురాని వారు పట్టాదారు పాసు పుస్తకాలు ఉంటే ధైర్యంగా ఉంటుంది. ఆన్లైన్లో చూసుకోవాలంటే వారికి తెలియదు. దీంతో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. పభుత్వం ప్రవేశపెట్టిన జీవోను రద్దు చేసి యథావిధిగా పట్టాదారు పుస్తకాలు కొనసాగించాలి. - ఎం. గంగానాయక్ -
రైతుల రుణానికి ‘వెబ్‌ల్యాండ్’ కళ్లెం
వ్యవసాయ రుణాల కట్టడికి కొత్త పోర్టల్ ఇకపై బ్యాంకులో రుణం తీసుకోగానే ‘వెబ్ ల్యాండ్’లో నమోదు మరో బ్యాంకు రుణం ఇవ్వకుండా ప్రభుత్వ వ్యూహం సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే రుణ విముక్తి పేరుతో రైతులకు వ్యవసాయ రుణాలు పుట్టకుండా చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు మరోలా వారిపై ఉక్కుపాదం మోపనుంది. ఒక సర్వే నంబర్‌పై రెండు బ్యాంకుల్లో రుణం పొందకుండా కట్టడి చేసే చర్యలు చేపట్టింది. సాధారణంగా స్థానిక రైతులతో ఉన్న సంబంధాలతో బ్యాంకులు వ్యవసాయ రుణాలు మంజూరు చేస్తాయి. అలాగే రైతులు కూడా తమ అవసరాల రీత్యా ఒక సర్వే నంబర్‌పై ఒకట్రెండు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు. ఇప్పుడు ఇలా రెండేసి రుణాలు తీసుకోకుండా వెబ్ ల్యాండ్ పోర్టల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగిస్తోంది. రాష్ట్రంలోని రైతుల భూములకు సంబంధించిన సర్వే నంబర్లు, పంటల సాగు వివరాలను వెబ్ ల్యాండ్ పోర్టల్‌లో నమోదు చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సాఫ్ట్వేర్ పరీక్షించే దశలో ఉంది. ఇకపై ప్రతీ ఖరీఫ్, రబీ సీజన్లో వెబ్ ల్యాండ్ పోర్టల్‌ను అప్డేట్ చేస్తూ ఉంటారు. వ్యవసాయ రుణం కోసం రైతుల బ్యాంకులకు వెళితే ఆయా రైతుల సర్వే నంబర్, భూమి, పంటల వివరాలను వెబ్‌ల్యాండ్ పోర్టల్‌లో పరిశీలిస్తారు. ఏ బ్యాంకులోను ఆ సీజన్లో ఆ సర్వే నెంబర్లోని భూమిపై రుణం తీసుకోకపోతేనే సదరు బ్యాంకు రుణం మంజూరు చేస్తుంది. రుణం మంజూరు చేయగానే ఆ సర్వే నెంబర్‌పై రుణం ఇచ్చినట్లు ఆన్లైన్లో బ్యాంకు చార్జి చేస్తుంది. ఫలితంగా ఆ సర్వే నంబర్‌పై మరో బ్యాంకు రుణం ఇవ్వదు. ప్రస్తుతం రైతులు సర్వే నంబర్ ఆధారంగా పంట రుణం పొందటంతో పాటు ఆ రుణం సరిపోకపోతే బంగారం కుదవపెట్టి అదే సర్వే నెంబర్‌పై అవసరమైన పంట రుణం తీసుకుంటున్నారు. బ్యాంకులు కూడా బంగారం ఉంది కదా అనే భరోసాతో రైతులకు పంట రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఇక నుంచి అటువంటి రుణాలు కూడా రైతులకు మంజూరు కావు. ఎందుకంటే ఆ సర్వే నెంబర్‌పై రుణం మంజూరు చేసినట్లు ఆ పోర్టల్‌లో ఉంటుంది. అసలే మాఫీతో ఇబ్బందులు పడుతున్న రైతులు భవిష్యత్‌లో బంగారం కుదవపెట్టి పంట రుణాలు తీసుకోకుండా రైతులను చార్జి పేరుతో కట్టడి చేస్తోంది. వెబ్‌ల్యాండ్‌పై సీఎస్ సమీక్ష వెబ్‌ల్యాండ్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ రికార్డులను సమీకృతం చేయడం, ప్రభుత్వ భూములు వ్యవహారాలపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సోమవారం సచివాలయంలో సమీక్షించారు. భూమిపై హక్కు కలిగిన వ్యక్తి దానిని ఎవరికైనా విక్రయించినా, ఆ వ్యక్తి చనిపోయినా తప్పకుండా మ్యుటేషన్ చేయించాలని నిర్ణయించారు. మ్యుటేషన్‌కు వీఆర్వోను బాధ్యుడిని చేయనున్నట్టు తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకాలు సంబంధిత వ్యక్తికి వారంలోగా ఎమ్మార్వో సంతకంతో చేరాలని, ఈ అంశంపై వారు క్రమం తప్పకుండా సమీక్షించాలని సీఎస్ ఆదేశించారు. -
‘వెబ్‌ల్యాండ్’ సాఫ్ట్‌వేర్‌తో జారీ ప్రక్రియ
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: మీ-సేవ కేంద్రాల రాకతో రెవెన్యూ శాఖలో అనూహ్య సంస్కరణలు చోటు చేసుకుంటున్నాయి. మాన్యువల్ ధ్రువీకరణ పత్రాల జారీ ఇప్పటికే గణనీయంగా తగ్గిపోయింది. తాజాగా పట్టాదారు పాసు పుస్తకాలను సైతం ‘మీసేవ’ల ద్వారానే జారీ చేసేందుకు సాఫ్ట్‌వేర్‌ను తీర్చిదిద్దారు. ఇప్పటి వరకు భూముల క్రయవిక్రయాలు అడ్డుగోలుగా చేపడుతుండటం.. భూములు చేతులు మారుతున్నా రెవెన్యూ రికార్డుల్లో మార్పులు జరగకపోవడం వల్ల పాలన అస్తవ్యస్తమవుతోంది. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు రెవెన్యూ శాఖ చర్యలు చేపట్టింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను రెవెన్యూ శాఖతో అనుసంధానం చేసి రెవెన్యూ రికార్డుల మేరకే భూముల రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. సాధారణంగా ఒక రైతు భూమిని విక్రయించి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలంటే ఆ వివరాలు 1బీ రికార్డుల్లో నమోదవ్వాలనే నిబంధన ఉంది. అదేవిధంగా విక్రయదారు పేరు మీద అడంగల్ తప్పనిసరి. కొనుగోలుదారు కూడా వెంటనే రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసుకోవాలి. ఈ నేపథ్యంలో పాలనను మరింత సులభతరం చేసేందుకు రెవెన్యూ రికార్డులను అనుసరించి పట్టాదారు పాసు పుస్తకాలను ఆన్లైన్ ద్వారా జారీ చేసేందుకు నిర్ణయించారు. ఇందుకోసం రెవెన్యూ శాఖ ఇటీవల వెబ్‌ల్యాండ్ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించి పుస్తకాల జారీకి శ్రీకారం చుట్టింది. భూముల క్రయవిక్రయాలకు అనుగుణంగా వెబ్‌ల్యాండ్‌లోనూ మార్పులు చోటు చేసుకోనున్నాయి. పాస్ పుస్తకాల జారీ ప్రక్రియ రెవెన్యూ యంత్రాంగానికి కాసుల పంట పండిస్తోంది. కొందరు అధికారులు రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇదే సమయంలో బోగస్ పట్టాదారు పాస్ పుస్తకాలు సైతం పుట్టగొడుగుల్లా పట్టుకొస్తున్నాయి. తాజాగా ఈ పాస్ పుస్తకాలు జారీ చేయనుండటంతో బోగస్‌లకు అడ్డుకట్ట పడనుంది. ఇప్పటికే వెబ్‌ల్యాండ్‌లో గ్రామం వారీగా 1బీ, అడంగల్ తదితర రెవెన్యూ రికార్డులను నమోదు చేస్తున్నారు. భూముల క్రయ విక్రయాలపై 30 నుంచి 40 శాతం వరకు రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చోటు చేసుకోకపోవడం వల్ల రికార్డుల్లో ఒక రైతు పేరుంటే.. క్షేత్ర స్థాయి లో మరొకరి పేరు ఉంటోంది. ఇలాంటి వారంతా మీ-సేవ కేంద్రాల్లో మార్పులు చేర్పులు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ-పాస్ పుస్తకాల కోసం రైతులు దరఖాస్తు చేసుకుంటున్నారు. రానున్న 45 రోజుల్లో ఎంతమందికి డిజిటల్ సంతకంతో ఈ-పాస్ పుస్తకాలు ఇస్తున్నారు.. పెండింగ్ ఏ స్థాయిలో ఉందనే విషయం తెలుస్తోంది. దీని ఆధారంగా కలెక్టర్, జేసీలు తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.