వణుకు పుట్టిస్తున్న ‘వెబ్‌ల్యాండ్’
వణుకు పుట్టిస్తున్న ‘వెబ్‌ల్యాండ్’
Published Thu, Aug 18 2016 11:15 PM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM
ఒకరి భూమి మరొకరి పేరిట నమోదు
తప్పుల తడకగా రెవెన్యూ వెబ్‌సైట్
జీవో నెంబరు 271ను
రద్దు చేయాలని రైతుల డిమాండ్
కైకలూరు :
వెబ్‌ల్యాండ్.. ఇప్పుడు ఆ పేరు చెబితేనే రైతులు వణుకుతున్నారు. గతంలో భూమికి సంబంధించి పట్టాదారు పాస్‌పుస్తకాలు, టైటిల్‌డీడ్ రైతుల వద్ద ఉండేవి. అవి వారికి భరోసా కల్పించేవి. ఆపద సమయంలో ఆదుకునేవి. ప్రస్తుతం వాటిని రద్దుచేస్తూ ప్రభుత్వం జీవోనంబర్ 271 విడుదల చేసింది. వెబ్‌ల్యాండ్ ఆధారంగా క్రయ, విక్రయ రిజిస్ట్రేషన్లు, పంట రుణాలు ఇవ్వాలంటూ ప్రభుత్వం భూముల ఆన్‌లైన్ పక్రియను తెరపైకి తెచ్చింది. ఈ విధానంలో రైతుల భూముల వివరాలను నమోదు చేస్తున్నారు. పట్టాదారు పాసుపుస్తకం, రెవెన్యూ మాన్యువల్ రికార్డుల్లో ఒకరి పేరు ఉన్న ఆస్తులు ప్రభుత్వ వెబ్‌ల్యాండ్‌లో మరొకరి పేరుతో నమోదయ్యాయి. దీనిపై రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వారసత్వంగా సంక్రమించిన భూములు వెబ్‌ల్యాండ్ ప్రభుత్వ ఖాతాలో కనిపించడం లేదు. పంట రుణాల కోసం బ్యాంకులకు వెళుతుంటే వారి భూమి వివరాలు వెబ్‌ల్యాండ్‌లో కనిపించకపోవడంతో తిరస్కరిస్తున్నారు.
కొండూరు కొంప ముంచారు
మండలంలోని ఒక్క కొండూరు గ్రామంలోనే190 మంది ఖాతాల్లో తప్పులను గుర్తించారు. గ్రామంలో 135 ఎకరాల భూమి 1బీలో నమోదైనప్పటికి యజమానుల పేర్లు తప్పులు వచ్చాయి. ఖాతాదారుల జాబితాలో రెం డు, అంతకన్నా ఎక్కువ పేర్లు నమోదైన వారు 139 మం ది ఉన్నారు. ఉదాహరణకు గ్రామానికి చెందిన బొర్రా వెంకటలక్ష్మీ పేరుతో 190/2 సర్వే నెంబరులో 4 ఎకరాల 15 సెంట్ల చేపల చెరువు ఉంది. పాస్ బుక్, టైటిల్‌డీడ్‌లో ఆమె పేరు ఉంది. తీరా వెబ్‌ల్యాండ్‌లో యజ మానిగా పేరిచర్ల సత్యనారాయణరాజు అని ఉంది. అదే విధంగా గ్రామంలో ఓ 20 కుటుంబాలు 70 ఏళ్ల క్రితం 119/1,2 సర్వే నెంబర్లలో పట్టా భూమిని కొనుగోలు చేసి జీవిస్తున్నారు. వెబ్‌ల్యాండ్‌లో రుద్రరాజు బాలకుమారి అని ఉంది. ఆమె ఎవరో గ్రామస్తులు చెప్పలేకపోతున్నారు.
Advertisement