కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: మీ-సేవ కేంద్రాల రాకతో రెవెన్యూ శాఖలో అనూహ్య సంస్కరణలు చోటు చేసుకుంటున్నాయి. మాన్యువల్ ధ్రువీకరణ పత్రాల జారీ ఇప్పటికే గణనీయంగా తగ్గిపోయింది. తాజాగా పట్టాదారు పాసు పుస్తకాలను సైతం ‘మీసేవ’ల ద్వారానే జారీ చేసేందుకు సాఫ్ట్‌వేర్‌ను తీర్చిదిద్దారు.
ఇప్పటి వరకు భూముల క్రయవిక్రయాలు అడ్డుగోలుగా చేపడుతుండటం.. భూములు చేతులు మారుతున్నా రెవెన్యూ రికార్డుల్లో మార్పులు జరగకపోవడం వల్ల పాలన అస్తవ్యస్తమవుతోంది. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు రెవెన్యూ శాఖ చర్యలు చేపట్టింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను రెవెన్యూ శాఖతో అనుసంధానం చేసి రెవెన్యూ రికార్డుల మేరకే భూముల రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.
సాధారణంగా ఒక రైతు భూమిని విక్రయించి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలంటే ఆ వివరాలు 1బీ రికార్డుల్లో నమోదవ్వాలనే నిబంధన ఉంది. అదేవిధంగా విక్రయదారు పేరు మీద అడంగల్ తప్పనిసరి. కొనుగోలుదారు కూడా వెంటనే రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసుకోవాలి. ఈ నేపథ్యంలో పాలనను మరింత సులభతరం చేసేందుకు రెవెన్యూ రికార్డులను అనుసరించి పట్టాదారు పాసు పుస్తకాలను ఆన్‌లైన్ ద్వారా జారీ చేసేందుకు నిర్ణయించారు. ఇందుకోసం రెవెన్యూ శాఖ ఇటీవల వెబ్‌ల్యాండ్ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించి పుస్తకాల జారీకి శ్రీకారం చుట్టింది. భూముల క్రయవిక్రయాలకు అనుగుణంగా వెబ్‌ల్యాండ్‌లోనూ మార్పులు చోటు చేసుకోనున్నాయి.
పాస్ పుస్తకాల జారీ ప్రక్రియ రెవెన్యూ యంత్రాంగానికి కాసుల పంట పండిస్తోంది. కొందరు అధికారులు రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇదే సమయంలో బోగస్ పట్టాదారు పాస్ పుస్తకాలు సైతం పుట్టగొడుగుల్లా పట్టుకొస్తున్నాయి. తాజాగా ఈ పాస్ పుస్తకాలు జారీ చేయనుండటంతో బోగస్‌లకు అడ్డుకట్ట పడనుంది. ఇప్పటికే వెబ్‌ల్యాండ్‌లో గ్రామం వారీగా 1బీ, అడంగల్ తదితర రెవెన్యూ రికార్డులను నమోదు చేస్తున్నారు. భూముల క్రయ విక్రయాలపై 30 నుంచి 40 శాతం వరకు రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చోటు చేసుకోకపోవడం వల్ల రికార్డుల్లో ఒక రైతు పేరుంటే.. క్షేత్ర స్థాయి లో మరొకరి పేరు ఉంటోంది.
ఇలాంటి వారంతా మీ-సేవ కేంద్రాల్లో మార్పులు చేర్పులు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ-పాస్ పుస్తకాల కోసం రైతులు దరఖాస్తు చేసుకుంటున్నారు. రానున్న 45 రోజుల్లో ఎంతమందికి డిజిటల్ సంతకంతో ఈ-పాస్ పుస్తకాలు ఇస్తున్నారు.. పెండింగ్ ఏ స్థాయిలో ఉందనే విషయం తెలుస్తోంది. దీని ఆధారంగా కలెక్టర్, జేసీలు తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
‘వెబ్‌ల్యాండ్’ సాఫ్ట్‌వేర్‌తో జారీ ప్రక్రియ
Published Sun, Nov 24 2013 4:28 AM | Last Updated on Sat, Sep 2 2017 12:54 AM
Advertisement
Advertisement