Revenue record
-
బుల్కాపూర్ నాలా మాయం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడలో మాజీ మంత్రి కేటీఆర్ లీజుకు తీసుకున్నట్లు చెబుతున్న ఫాంహౌస్‌కు ఆనుకుని ఉన్న బుల్కాపూర్ నాలాను మంగళవారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ తేజ, సర్వేయర్ సాయి తేజ, ఇరిగేషన్ ఇన్స్పెక్టర్ లింగంలు సందర్శించారు. రెవెన్యూ రికార్డులతో పాటు గ్రామ నక్ష ఆధారంగా.. కబ్జాకు గురైన బుల్కాపూర్ నాలా ఎటు నుంచి ఎటు వైపు వెళ్తోంది? ఎన్ని మీటర్ల మేర కబ్జాకు గురైంది? ఎవరి కబ్జాలో ఉంది? వంటి వివరాలపై ఆరా తీశారు. రెవెన్యూ రికార్డులను, క్షేత్రస్థాయిలో నాలా పరిస్థితిని సరిపోల్చుకున్నారు. శంకర్పల్లి–ఖానాపూర్ రోడు్డలో ఉన్న ఈ నాలా ప్రస్తుతం చాలావరకు కన్పించకుండా పోయింది. మాజీ మంత్రి కేటీఆర్ సన్నిహితునిదిగా చెబుతున్న జన్వాడ ఫాంహౌస్ ప్రధాన గేటు, ప్రహరీ ఈ నాలాపై నిర్మించినట్లు 2020 జూన్‌లోనే ఇరిగేషన్ అధికారులు నిర్ధారించారు. సర్వే నంబర్ 301, 302, 309, 311, 313లో దాదాపు 27 ఎకరాల్లో ఈ ఫాంహౌస్ ఉంది. ఇందులో అక్రమ నిర్మాణాలతో పాటు 2.24 ఎకరాల నాలా, 11 గుంటల బఫర్ జోన్ ఉన్నట్లు ధ్రువీకరించారు. ఫాంహౌస్ తూర్పు భాగంలో, నాలా, బఫర్ జోన్లు ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. తాజాగా నాలా ఎంత మేర కబ్జాకు గురైందనే అంశాన్ని నిర్ధారించేందుకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయికి చేరుకుని, కొలతలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా ఆయా విభాగాల అధికారులు బుధవారం మరోసారి జన్వాడను సందర్శించే అవకాశం ఉందని తెలిసింది. గతంలో రేవంత్‌పై కేసు, అరెస్టు సీఎం రేవంత్‌రెడ్డి గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జన్వాడ ఫాంహౌస్ సందర్శనకు వెళ్లారు. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నివసిస్తున్న ఈ ఫాంహౌస్‌పై డ్రోన్లు ఎగరేశారనే ఆరోపణలతో అప్పట్లో రేవంత్‌పై కేసు నమోదు చేసి, అరెస్టు కూడా చేశారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఇటీవల చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో హైడ్రాను తెరపైకి తీసుకురావడం తెలిసిందే. ఇదే క్రమంలో జన్వాడ ఫాంహౌస్‌కు నోటీసులు జారీ చేయగా, హైడ్రా చర్యలను ఆపాల్సిందిగా కోరుతూ కేటీఆర్ సన్నిహితుడు బి.ప్రదీప్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో నిబంధనల మేరకు నడుచుకోవాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. -
అసైన్డ్ భూములకు హక్కులపై మరింత స్పష్టత
సాక్షి, అమరావతి : అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించే విషయంలో రెవెన్యూ యంత్రాంగానికి ప్రభుత్వం మరింత స్పష్టత ఇచ్చింది. పలు కారణాలతో హక్కులు కల్పించేందుకు వెనుకాడుతున్న నేపథ్యంలో వాటన్నింటిపైనా ఎలా ముందుకెళ్లాలో తెలియజేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ మంగళవారం జీవో నంబర్ 596 జారీ చేశారు. పలు జిల్లాల కలెక్టర్లు, జేసీలు, ఆర్డీవోలు, తహశీల్దార్లతో ఇటీవల నిర్వహించిన వర్క్‌షాప్‌లో చర్చించిన మీదట అసైన్డ్ భూములపై ఆంక్షలు తొలగించే అంశాలపై తాజా ఆదేశాలు జారీ చేశారు. చుక్కల భూములు, ఈనాం భూములు, జాయింట్ ఎల్పీఎంల విభజన, ప్రొవిజనల్ పట్టాలు, ఎస్సీ కార్పొరేషన్ భూములకు సంబంధించి స్పష్టత ఇచ్చారు. ఈ కేసుల్లో యాజమాన్య హక్కులివ్వాలి ► డీకేటీ రిజిస్టర్, డీకేటీ పట్టా ఆఫీస్ కాపీ, అసైన్మెంట్ కమిటీ మినిట్స్ లేకపోయినా వెబ్లాండ్ అడంగల్, పీఓఎల్ఆర్, పాత అడంగల్, 10 (1) రిజిస్టర్ వంటి ఏదో ఒక రెవెన్యూ రికార్డులో సంబంధిత రైతు పేరు ఉన్నా, 2017 22ఏ జీవోలు లేక 20 సంవత్సరాల క్రితం జారీ అయిన పట్టాదారు పాస్‌బుక్ ఆధారంగానైనా సంబంధిత భూములకు యాజమాన్య హక్కులు కల్పించాలి. ఆ భూమిని కేటాయించిన పట్టాదారు ఆదీనంలో ఉంటేనే హక్కులు ఇవ్వాలి. ఒకవేళ ఎవరైనా పట్టాదారు సమర్పించిన పాస్‌బుక్ నకిలీదని తహశీల్దార్ ధ్రువీకరిస్తే, దానిని నిరూపించే బాధ్యత కూడా సంబంధిత తహశీల్దార్‌దే. కాల క్రమంలో రెవెన్యూ పరిపాలనలో జరిగిన మార్పుల వల్ల రికార్డులు అందుబాటులో లేవనే కారణంతో అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులను నిరాకరించకూడదు. ► భూ బదలాయింపు జరగకపోయినప్పటికీ, సుప్రీంకోర్టు ఉత్తర్వులు, హైకోర్టు రిట్ పిటిషన్ 140/2022 ఆదేశాల ప్రకారం మినహాయింపు పొందిన భూములకు హక్కులు కల్పించాలి. ► ఏడబ్ల్యూడీ భూములుగా మార్చకుండా తోపు/మేత పోరంబోకులను అసైన్ చేస్తే ఇప్పుడు జిల్లా కలెక్టర్లు ఏడబ్ల్యూడీగా మార్చి వాటికి యాజమాన్య హక్కులివ్వొచ్చు. ► డి పట్టా జారీ అయినా, రికార్డుల్లో ఆ సర్వే నంబర్‌తో సరిపోలకపోతే, వారి ఆదీనంలో ఉన్న భూమి సర్వే నంబర్‌ను నమోదు చేయాలి. అలాంటి భూములకు యాజమాన్య హక్కులు ఇవ్వడం కోసం వారికి భూమి అసైన్ చేసిన పాత తేదీని పరిగణనలోకి తీసుకోవాలి. ► ఖాతా నంబర్ 10 వేల లోపు ఉండి, మిగులు భూమిగా రికార్డయి, అసైన్డ్ భూములుగా నమోదవని వాటిని అసైన్మెంట్ రీ వెరిఫికేషన్‌కు పంపాలి. ఇలాంటి భూములకు యాజమాన్య హక్కులిచ్చేందుకు ఎల్రక్టానిక్ రెవెన్యూ రికార్డుల్లో పట్టాదార్ పేరును మార్చవచ్చు. ► అసైన్మెంట్ చేసిన రాస్తా పోరంబోకు భూములను ఇప్పుడు భూ మారి్పడి (లాండ్ కన్వర్షన్) చేసి వాటికి హక్కులివ్వాలి ► ఆర్‌ఎస్‌ఆర్‌లో అటవీ భూమిగా నమోదైన భూమి అసైన్మెంట్ జరిగి ఆర్ఓఆర్ రికార్డుల్లోనూ నమోదై ఉంటే.. ఆ భూమిని అటవీ చట్టంలోని సెక్షన్ 4(1) కింద నోటిఫికేషన్ జారీ చేయకపోతే దానిపై హక్కులివ్వొచ్చు. ► భూమి స్వభావంలో ‘ప్రభుత్వ భూమి – నాట్ ఎలాటెడ్’గా నమోదై.., వాస్తవానికి అసైన్మెంట్ జరిగి ఉన్న కేసులను జిల్లా స్థాయి వెరిఫికేషన్‌కు పంపాలి. వెరిఫికేషన్‌లో ఆ భూముల హక్కుల కల్పనకు అర్హత సాధిస్తే అప్పుడు వాటిపై హక్కులు ఇవ్వొచ్చు. ► అర్హత ఉన్న అసైన్డ్ భూములు పొరపాటున పట్టా భూమిగా నమోదై 22ఎ జాబితాలో ఉంటే, జిల్లా కలెక్టరు వాటిని ఆ జాబితా నుండి తొలగించాలి. రిమార్క్స్ కాలమ్‌లో యాజమాన్య హక్కులు ఇచ్చిన విధానాన్ని నమోదు చేయవచ్చు. ► 20 సంవత్సరాల క్రితం జారీ అయిన తాత్కాలిక పట్టాలైనా, డీకేటీ పట్టాలు జారీ అయ్యాయా లేదా అనే దాంతో సంబంధం లేకుండా వాటిపై యాజమాన్య హక్కులివ్వాలి. ► భూ బదలాయింపు (లాండ్ కన్వర్షన్) జరిగి, అసైన్మెంట్ జరిగి 20 సంవత్సరాలు పూర్తయిన జల వనరుల పోరంబోకు భూములపై యాజమాన్య హక్కులివ్వాలి. ► అసైన్డ్ భూములైనా ఆన్లైన్ రెవెన్యూ రికార్డుల్లో నమోదుకాని భూములను అసైన్డ్ భూముల జాబితాలో చేర్చేలా దరఖాస్తులను స్వీకరించడానికి ఏపీ సేవా పోర్టల్‌లో ఆప్షన్ ఉంది. ఇలాంటి కేసులను సుమోటోగా స్వీకరించేందుకు జేసీల లాగిన్‌లో అవకాశం కల్పిస్తాం. ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఆ భూములకు హక్కులు ఇవ్వాలి. ► రికార్డులు అందుబాటులో లేని, నీటి వనరులుగా గుర్తించిన కారణంగా యాజమాన్య హక్కులు ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకోలేని అసైన్డ్ భూములన్నింటినీ మళ్లీ ధ్రువీకరణ కోసం వీఆర్వో లాగిన్‌కు పంపాలి. ధ్రువీకరణలో అర్హత పొందితే వాటికి హక్కులివ్వాలి. -
మా భూమి.. మాకే కౌలు
సాక్షి, అమరావతి: టీడీపీ పెద్దలు తమను మభ్యపెట్టి కాజేసిన అసైన్డ్ భూములను తిరిగి దక్కించుకునేందుకు రైతన్నలు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు గతంలోనే పలువురు అసైన్డ్ రైతులు రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలు సమర్పించగా మంగళవారం విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయానికి చేరుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు అక్రమంగా దక్కించుకున్న తమ అసైన్డ్ భూములను తిరిగి ఇప్పించాలని కోరారు. అసైన్డ్ భూములకు ఎలాంటి పరిహారం చెల్లించకుండా గత ప్రభుత్వం తీసుకుంటుందని బెదిరించి తమ వద్ద నుంచి కాజేశారని సీఆర్డీఏ అధికారుల దృష్టికి తెచ్చారు. తమ భూములను కారుచౌకగా తీసుకున్న తరువాత టీడీపీ సర్కారు వాటికి ప్యాకేజీని ప్రకటించిందన్నారు. ఇప్పటికీ అవి రెవెన్యూ రికార్డుల్లో తమ పేరిటే ఉన్నాయని గుర్తుచేశారు. టీడీపీ నేతలు వాటిని భూసమీకరణ కింద సీఆర్డీఏకు ఇచ్చినట్లు చూపటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అసైన్డ్ భూములకు సీఆర్డీఏ ఇస్తున్న కౌలును తమకే చెల్లించాలని వినతిపత్రం అందించారు. భూసమీకరణ కింద అసైన్డ్ రైతులకు అందిస్తున్న ప్యాకేజీ తమకే ఇవ్వాలని, లేదంటే తమ భూములు తమకు తిరిగిస్తే సాగు చేసుకుంటామని విజ్ఞప్తి చేశారు. ఇకనైనా న్యాయం చేయాలి ‘టీడీపీ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. న్యాయం చేయాలని గతంలో అధికారులను ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదు. ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలని సీఆర్డీయే అధికారులకు వినతి పత్రం సమరి్పంచాం. ప్రభుత్వం స్పందించి మా భూముల కౌలు మాకే ఇప్పించాలని కోరుతున్నాం. – టి.బాబూరావు, అసైన్డ్ రైతు, రాయపూడి బెదిరించి తీసుకున్నారు.. అసైన్డ్ భూమికి పరిహారం ఇవ్వరని టీడీపీ సర్కారు ప్రచారం చేసి మమ్మల్ని మోసం చేసింది. దీంతో భయపడి టీడీపీ నేతలకు అమ్మేందుకు ఒప్పుకున్నాం. కానీ తరువాత మా నిర్ణయం మార్చుకున్నాం. ఇప్పటికీ ఆ భూములు మాపేరునే రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయి. సీఆర్డీయే రికార్డుల్లో కూడా వాటిని మా పేరిట మార్చాలని కోరాం. – ఆర్.పున్నారావు, అసైన్డ్ రైతు, రాయపూడి మా భూములిస్తే సాగు చేసుకుంటాం ‘అసైన్డ్ భూమికి ప్రభుత్వం పరిహారం ఇవ్వదని టీడీపీ నేతలు, దళారులు మమ్మల్ని ఆందోళనకు గురి చేశారు. ఎకరం రూ.కోటి పలికే భూమికి మాకు కేవలం రూ.6 లక్షలే ఇచ్చారు. మేం సంతకాలు చేసిన తరువాత టీడీపీ ప్రభుత్వం అసైన్డ్ భూములకు ప్యాకేజీ ప్రకటించింది. టీడీపీ పెద్దలు మోసం చేశారు. మా భూములు రిజిస్ట్రే షన్ కాలేదు కాబట్టి ప్యాకేజీ మాకే ఇవ్వాలి. లేదా మా భూములు మాకు తిరిగిస్తే సాగు చేసుకుంటాం. – రేమర్ల కోటేశ్వరరావు, అసైన్డ్ రైతు, వెంకటపాలెం ప్యాకేజీ, కౌలు ఇప్పించండి ‘మా భూమి పెండింగ్ రిజిస్ట్రేషన్‌లో ఉంది. సీఆర్డీయే రికార్డుల్లో మాత్రం టీడీపీ నేతల పేరిట ఉంది. ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలి. భూసమీకరణ ప్యాకేజీ, కౌలు మాకే ఇప్పించాలి’ – వి.నరసింహారావు, అసైన్డ్ రైతు, రాయపూడి -
విశ్వరూప్ దంపతులపై పిటిషన్ కొట్టివేత
సాక్షి, అమరావతి: భూమికి సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో తమ పేర్లను మోసపూరితంగా మార్పు చేసుకున్నారని ఆరోపిస్తూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ఆయన సతీమణి పినిపే బేబీ తదితరులపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రెవెన్యూ రికార్డుల్లో పేర్లు చేర్చినంత మాత్రాన ఆ ఆస్తిపై యాజమాన్యపు హక్కులు సంక్రమించవని స్పష్టం చేసింది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం గ్రామీణ మం డలం భట్నవిల్లి గ్రామంలోని 7.75 ఎకరాల భూమిని పినిపే బేబీ పేరిట సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేయడం ఎంతమాత్రం తప్పుకాదని, సబ్ రిజిస్ట్రార్ తన చట్టబద్ధ బాధ్యతలను నిర్వర్తించారని హైకోర్టు తెలిపింది. అలా రిజిస్టర్ చేయడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించలేమంది. ఆ భూమికి సంబంధించిన వివాదం అమలాపురం కోర్టులో పెండింగ్‌లో ఉన్న నేపథ్యం లో.. సంబంధిత సివిల్ కోర్టు ముందు పిటిషనర్ మౌఖిక, లిఖితపూర్వక ఆధారాలను ఉంచి, ఆ భూమి యాజమాన్య హక్కులను తేల్చుకోవాలని స్పష్టం చేసింది. సివిల్ కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అమ్మకపు ఒప్పందం మేరకే పినిపే బేబీ పేరిట డాక్యుమెంట్ రిజిస్టర్ చేశారని, దీనిని ఎంతమాత్రం మోసపూరితమని చెప్పజాలమంది. ఏపీ భూ హక్కులు, పాసు పుస్తకాల చట్టం ప్రకారం రెవెన్యూ రికార్డుల్లో ఉన్న పేర్లు తప్పని నిరూపితమయ్యేంత వరకు ఆ పేర్లు సరైనవేనని భావించాల్సి ఉంటుందని తేల్చి చెబుతూ.. సదరు పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పు వెలువరించారు. -
పేరు సరే.. ఊరేది?
సాక్షి ప్రతినిధి కడప: ఆ పంచాయతీ పేరు రెవెన్యూ రికార్డుల్లో ఉంటుంది. పంచాయతీ కార్యాలయం కూడా ఉంటుంది. కానీ భౌతికంగా ఆ ఊరు మాత్రం కనపడదు. ఆ ఊరికే ప్రస్తుతం వేరే పేరు స్థిరపడిపోయి ఉంటుంది. కొత్త పేరునే స్థానికులు వినియోగిస్తుంటారు. గతంలో ఓ వెలుగు వెలిగిన వందలాది గ్రామాలు శిథిల శకలాలుగా మిగిలి నేడు కనుమరుగైపోయాయి. ఆనాటి గ్రామాల్లో నివసించిన వారు కొత్తగ్రామాలను ఏర్పాటు చేసుకోవడమో, ఇతర గ్రామాలకు వలసవెళ్లిపోవడమో, పేరు మార్చుకోవడమో జరిగింది. ఇలాంటి గ్రామాలు వైఎస్సార్ జిల్లాలో వందలాదిగా ఉన్నాయి. ఉదాహరణకు కత్తెరగండ్ల అనే పెద్ద గ్రామం పూర్వం ఉండేది. కాలక్రమంలో ఆ గ్రామం కనుమరుగైపోయి చిన్న గ్రామాలుగా విడిపోయింది. ప్రస్తుతం రికార్డుల్లో కత్తెరగండ్ల ఉన్నా.. ఆ పంచాయతీ కార్యాలయం చెన్నవరం అనే గ్రామంలో ఉంటుంది. కత్తెరగండ్లకు బదులుగా చెన్నవరం పేరునే స్థానికులు వినియోగిస్తారు. బందిపోట్లు, దివిటి దొంగల దాడులు, పాలెగాళ్ల ఒత్తిళ్లు, ఫ్యాక్షన్ గొడవలు, కలరా లాంటి వ్యాధులు, సాగు, తాగునీరు లేకపోవడం తదితర కారణాలతో ఆనాటి ఊళ్లు ఖాళీ అయిపోయాయని చరిత్రకారులు చెబుతున్నారు. రికార్డుల్లో ఉండి భౌతికంగా లేని ఊళ్లు జిల్లాలో 100కు పైగా ఉంటే.. రికార్డుల్లో లేకుండా పూర్తిగా కనుమరుగైన ఊళ్లు దాదాపు 500 ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఒక్కో ఊరిది ఒక్కో కథ.. ► కాలగర్భంలో కలసిపోయిన ఒక్కో ఊరిది ఒక్కో కథ.. ► బద్వేలు ప్రాంతంలో దాదాపు 50 గ్రామాలు అదృశ్యమైపోయాయి. ► శ్రీఅవధూత కాశినాయన మండలంలోని కత్తెరగండ్ల కృష్ణదేవరాయల కాలంలో కుటీరపరిశ్రమలతో అలరారింది. ఈ ఊరు ఇప్పుడు శిథిలమైపోయింది. ఆ పేరు ఇప్పటికీ కొనసాగుతోంది. ► 13వ శతాబ్ది నుంచి రంపాడు అనే గ్రామం ఉంది. దండుబాటల కారణంతో దోపిడికి గురై గ్రామం కిలపడిపోయింది. కాలక్రమంలో ధర్మారంపాడు, పాపిరెడ్డిపల్లె, కొండపేట, లక్ష్మిగారిపల్లె తదితర గ్రామాలుగా మార్పు చెందింది. ఇప్పటికీ రంపాడు పేరుతోనే రికార్డులు ఉన్నాయి. ► గతంలో సిరులతో అలరారిన అక్కెంగుండ్ల గ్రామం దొంగల దాడులతో కాలగర్భంలో కలసిపోయింది. ► వాసుదేవాపురం, పగడాలపల్లె, నీలాపురం, టి.శేషంపల్లె, సంచర్ల, అనంతరాజుపురం గ్రామాల పేర్లు ఉన్నా ఊళ్లు మాత్రం కనబడవు. ► జమ్మలమడుగు మండలంలో తూగుట్లపల్లి, పాత కొండాపురం గ్రామాలు దోపిడీ దొంగల దాడులతో పూర్తిగా తుడిచి పెట్టుకునిపోయాయి. ఆనాటి బురుజులు, గంగమ్మ దేవాలయం మాత్రమే నేటి తరానికి సాక్ష్యాలు. ► రైల్వేకోడూరు, కమలాపురం నియోజకవర్గాల్లో పలుగ్రామాలు అంతరించి పోయినా పేర్లు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. చాలా పెద్దవి కాశినాయన మండలంలోని రంపాడు, కత్తెరగండ్ల, అక్కెంగుండ్ల, వాసుదేవపురం తదితర ఐదు రెవెన్యూ గ్రామాలు చరిత్రలో కలిసిపోయాయి. కొన్ని దోపిడి దొంగల దాడులు, వ్యాధులు, క్రూరమృగాల కారణంగా కిలపడిపోయాయి. కత్తెరగండ్ల, అక్కెంగుండ్ల గ్రామాలు చాలా పెద్దవి. ఒక్కో ఊరిలో వెయ్యికిపైగా కుటుంబాలుండేవి. వ్యవసాయం, పశుపోషణ, పరిశ్రమలతో కళకళలాడేవి. నేడు అవి పేర్లకే పరిమితయ్యాయి. – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, నవల, కథా రచయిత, కాశినాయన మండలం రెవెన్యూ రికార్డుల్లోనే ఉంది అంబవరం పంచాయతిలో తూగుట్లపల్లి గ్రామం ఉంది. ఆ గ్రామానికి సంబంధించిన పొలాల వివరాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం గ్రామం ఆనవాలు ఎక్కడ కనిపించదు. ఒక్క ఇల్లు కూడాలేదు. – శ్రీనివాసులు, వీఆర్వో, అంబవరం పంచాయతి. దోపిడీలతోనే గ్రామాలు ఖాళీ బందిపోట్లు, దివిటి దొంగల దాడులతో అటవీ శివారు గ్రామాలు ఖాళీ కాగా, జబ్బులు, నీటి వసతి లేక, ఫ్యాక్షన్ గొడవలు, పాలెగాళ్ల దాడులతో కొన్ని గ్రామాలు కనుమరుగయ్యాయి. బందిపోట్లను ఎదుర్కొని నిలిచిన కొన్ని గ్రామాలు మాత్రమే కొండ ప్రాంతాల్లో ఉండిపోయాయి. జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో గ్రామాలు కనుమరుగైనట్లు చరిత్ర చెబుతుంది. – తవ్వా ఓబుల్‌రెడ్డి, చరిత్ర పరిశోధకులు, మైదుకూరు -
ఏపీ సర్కార్‌కు చుక్కెదురు!
సాక్షి, అమరావతి : చుక్కల భూముల విషయంలో ఏపీ సర్కార్‌కు చుక్కలు కనబడుతున్నాయి. ఈ చుక్కల భూముల ఆర్డినెన్స్‌ను గవర్నర్ నరసింహన్ తిరస్కరించారు. సమస్యను పరిష్కరించే దిశగా ఆర్డినెన్స్ లేదని ప్రభుత్వానికి సూచించారు. జిల్లా స్థాయి రెవెన్యూ కమిటీల మార్పులను తప్పబడుతూ రెండు ఆర్డినెన్స్‌ల్లో ఒకటిని తిరస్కరించారు. ఇక 2 నెలల పరిష్కార సమయం పెట్టడాన్ని కూడా గవర్నర్ తప్పుబట్టారు. కేవలం అసైన్మెంట్ ఆర్డినెన్స్‌ను మాత్రమే ఆమోదించారు. దీంతో ఫిబ్రవరి 6న చుక్కల భూముల బిల్లును అసెంబ్లీలో పెట్టాలని భావించిన ప్రభుత్వం పునరాలోచనలో పడింది. స్వాతంత్య్రానంతరం రెవెన్యూ రికార్డులను తిరగరాసే సమయంలో కొన్ని సర్వే నంబర్లకు చెందిన భూమి ప్రభుత్వానిదా? ప్రైవేటు వ్యక్తులదా అన్న విషయం తేలలేదు. దీంతో ఆ భూముల రికార్డుల్లో హక్కుదారు కాలమ్‌లో చుక్క పెట్టి వదిలేశారు. వీటినే చుక్కల భూములుగా పిలుస్తారు. ఈ చుక్కల భూముల విషయంలో అధికారులు తనకే చుక్కలు చూపిస్తున్నారంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. చుక్కల భూములుగా నమోదైన లక్షలాది ఎకరాలపై తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ల కన్ను పడింది. అడంగల్‌లను తారుమారు చేసి, తామే అనుభవదారులుగా చూపించి, వాటన్నింటినీ సొంతం చేసుకొనే వ్యూహంలో టీడీపీ నేతలు ఉన్నారు. శాసన సభలో బిల్లు ద్వారా ఈ భూముల వివాదానికి శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇదే అదనుగా భావించిన టీడీపీ నేతలు ఈ భూముల అనుభవదారులుగా తమ పేర్లను నమోదు చేయిస్తున్నారు. బిల్లు ఆమోదం పొంది, చట్ట రూపం దాల్చేలోగా రికార్డుల్లో ఈ భూములకు అనుభవదారులుగా పేర్లు చేర్చడం ద్వారా వాటిని సొంతం చేసుకునేలా టీడీపీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. -
‘గోల్డ్‌స్టోన్’ ప్రసాద్‌కు ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూముల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న పీఎస్ ప్రసాద్ (గోల్డ్‌స్టోన్ ప్రసాద్), అతని కుటుంబసభ్యులకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు రూ.వెయ్యి కోట్ల విలువైన భూముల విషయంలో రంగారెడ్డి జాయింట్ కలెక్టర్(జేసీ) జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వారు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టేసింది. రంగారెడ్డి జిల్లా బాలానగర్ మండలం హస్మత్‌పేట సర్వే నంబర్ 1లోని 74.08 ఎకరాలు, సర్వే నంబర్ 57లోని 39 ఎకరాల భూమిపై ప్రసాద్, అతని కుటుంబసభ్యులు, కంపెనీలు, ఇతరులకు హక్కు కల్పిస్తూ పేర్లను రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయొ ద్దని సంబంధిత తహసీల్దార్‌ను ఆదేశించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని వందల ఎకరాల భూమిపై 1958 నుంచి కొనసాగుతున్న వివాదంలో తుది తీర్పు వచ్చేవరకు వాటిపై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు తేల్చి చెప్పింది. స్పష్టత వచ్చే వరకు ఆ భూములపై హక్కులు కోరజాలరని ప్రసాద్ తదితరులకు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ నక్కా బాలయోగిలతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రసాద్ తదితరులు చేసిన వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. కోర్టు తుది తీర్పు ఇవ్వకపోయినా, ఇచ్చినట్లు ప్రసాద్ తదితరులు చేస్తున్న వాదన పిడికెడు బియ్యంలో గంపెడు గుమ్మడికాయను దాచే ప్రయత్నంలా ఉందని ఆక్షేపించింది. 113 ఎకరాల భూమి విషయంలో కోర్టు తమకు అనుకూలంగా తుది తీర్పునిచ్చిందంటూ ప్రసాద్, అతని కుటుంబ సభ్యులు హక్కులు కోరారు. దీంతో బాలా నగర్ తహసీల్దార్ రెవెన్యూ రికార్డుల్లో వారి పేర్లను చేరుస్తూ 2011లో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు జేసీ ముందు రివిజన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన జేసీ 2018లో తహసీల్దార్ ఉత్తర్వులను రద్దు చేశారు. ఈ వ్యవహారంపై తిరిగి విచారణ జరిపి ఉత్తర్వులు జారీ చేయాలని తహసీల్దార్‌ను జేసీ ఆదేశించారు. జేసీ ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రసాద్, అతని కుటుంబసభ్యులు, అతని కంపెనీలు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయగా ధర్మాసనం విచారణ జరిపి తాజాగా తీర్పు వెలువరించింది. -
ప్రభుత్వమే పరిష్కరించాలి
హైదరాబాద్: జంట నగరాల తాగునీటి కోసం నిర్మించిన హిమాయత్ సాగర్ నుంచి తరలించి మరో చోట ఏర్పాటు చేసిన గ్రామమే కొత్వాల్‌గూడ. సాగర్ పక్కనే ఉన్న ఈ గ్రామస్తులు దశాబ్దాలుగా వారి స్థలాలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. తాజాగా పైసీస్ సంస్థ ఏకంగా ఊరంతా తాకట్టు పెట్టి రుణాలు పొందిందన్న వార్త ఇప్పుడు గ్రామస్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కొత్వాల్‌గూడకు సంబంధించిన కొన్ని సర్వే నంబర్ల భూమి కాస్తా ఎనిమీ ప్రాపర్టీ (స్వాతంత్ర సమయంలో ఇక్కడి భూమిని వదిలి ఇతర దేశాలకు వెళ్లిన వారి ఆస్తులు) కింద ఉండడంతో ఇక్కడ ఫాం 1బీ సర్టిఫికెట్లను కూడా గ్రామస్తులు పొందలేకపోయారు.. ఇప్పుడు ఇలా... కొత్వాల్‌గూడ సర్వే నంబర్ 1 నుంచి 170 వరకు ఉన్న భూములను గోవా కేంద్రంగా పనిచేస్తున్న పైసీస్ సంస్థ.. పీఈసీ (ప్రాజెక్ట్ అండ్ ఎక్విప్మెంట్ కార్పొరేషన్) వద్ద తాకట్టు పెట్టి రూ.332 కోట్ల రుణం పొందినట్లు తాజాగా అధికారులకు సమాచారం అందింది. అయితే రెవెన్యూ రికార్డులో మాత్రం ఎక్కడా పైసీస్కు సంబంధించిన పేర్లు లేవు. భూమి పొజిషన్లో కూడా వీరు లేరని ఇప్పటికే అధికారులు నివేదించినట్లు సమాచారం. ఊరంతా తాకట్టు పెట్టి రుణం పొందారనే సమాచారం వెలుగులోకి రావడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ భూమిని శివభూషణ్కి రిజిస్ట్రేషన్ చేసిన హసన్ కూడా 1965లో మరణించినట్లు గ్రామస్తులు తెలియజేస్తున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ 1977లో జరిగేందుకు అవకాశమే లేదంటున్నారు. రెవెన్యూ రికార్డుల్లో పేర్లు లేవు.. భూమిని తాకట్టు పెట్టిన వారి పేర్లు రెవెన్యూ రికార్డుల్లో లేవు. భూమి పొజిషన్లో కూడా లేరు. భూముల పట్టాలన్నీ గ్రామస్తుల పేర్ల మీదనే ఉన్నాయి. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన లేఖ ఆధారంగా విచారణ చేసి జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తాం. – సురేశ్‌కుమార్, తహసీల్దార్ ప్రభుత్వం విచారణ చేపట్టాలి వందేళ్లుగా ఉంటున్న గ్రామాన్ని ఏదో కంపెనీ ఎలా తాకట్టు పెడుతుంది. ఇది చాలా దారుణం. ప్రభుత్వం విచారణ చేపట్టాలి. ఇప్పటికే గ్రామంలో కొన్ని సర్వే నంబర్లలోని భూమిని ఎనిమి ప్రాపర్టీ అంటూ ఫాం 1బీ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. సాగు తప్ప వేరే ఆధారం లేని ప్రజలు ఇక్కడ ఉన్నారు. – గుర్రంపల్లి ప్రసన్న లింగం, సర్పంచ్, కొత్వాల్‌గూడ ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలి ఇక్కడి ప్రజలు వ్యవసాయం, చేపల విక్రయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. బోగస్ కంపెనీ మా ఊరి భూమిని ఎలా తాకట్టు పెడుతుంది. రెండు నెలల కిందట ఓ వ్యక్తి ఇక్కడ భూములన్నీ తనఖాలో ఉన్నాయని గ్రామంలో తిరిగి పరిశీలించాడు. బోగస్ సంస్థపై చర్యలు తీసుకోవాలి. –గుంటి మిట్టు, రైతు, కొత్వాల్‌గూడ -
ఏపీ ప్రభుత్వ వ్యవహారశైలిపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
-
ఏపీలో పాలనపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలిపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అక్కడి వ్యవహారాలను గమనిస్తుంటే గుండె దహించుకుపోతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. తమ ముందుకు వస్తున్న అనేక కేసులను విచారిస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అవగతమవుతోందని తెలిపింది. పాలన మొత్తం ఒక పద్ధతి లేకుండా గందరగోళంగా తయారైందని వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ మలేసియా, సింగపూర్, కొరియా కంపెనీలను ఆహ్వానిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక్కడి కంపెనీలు, పరిశ్రమల గురించి పట్టదా? అని ప్రశ్నించింది. పరిశ్రమ ఏర్పాటు కోసం భూములు కేటాయించినప్పుడు, రెవెన్యూ రికార్డుల్లో ఆ మేరకు మార్పులు చేయకపోగా, పరిశ్రమ ఏర్పాటు చేయలేదంటూ ఆ భూములు స్వాధీనం చేసుకోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రికార్డుల్లో మార్పులు చేయకపోవడం వల్ల ఆ పరిశ్రమ యాజమాన్యం రుణాలు తీసుకునే అవకాశం లేకుండా పోయిందని, దీంతో ఆ భూములను అలా వదిలేయాల్సి వచ్చిందని తెలిపింది. రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయాలని జిల్లా కలెక్టర్ చెప్పినా స్థానిక తహసీల్దార్ పట్టించుకోకపోవడం రాష్ట్రంలో పాలన తీరుకు అద్దం పడుతోందని వ్యాఖ్యానించింది. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు వచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పింది. పరిశ్రమకు కేటాయించిన భూమిని తిరిగి ఆ కంపెనీకి స్వాధీనం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి ఎం.ఎస్.రామచంద్రరావు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఐదేళ్ల పాటు భూ బదలాయింపు నిలుపుదల... శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వెంకటగిరి మండలం, చెవిరెడ్డిపల్లి గ్రామం, సర్వే నంబర్ 105లో స్పిన్నింగ్ మిల్లు ఏర్పాటు నిమిత్తం ఎస్కో కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం 1991లో మార్కెట్ ధరపై 30 ఎకరాల భూమిని బదలాయించింది. దీంతో ఆ కంపెనీ మిల్లు ఏర్పాటుకు అవసరమైన అనుమతుల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం భూ బదలాయింపును తాత్కాలికంగా నిలిపేస్తూ 1992లో ఉత్తర్వులిచ్చింది. ఐదేళ్ల తర్వాత 1997లో ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. దీంతో ఆ కంపెనీ ఏపీఐఐసీ, ఏపీఎస్‌ఎఫ్‌సీలను ఆశ్రయించి తిరిగి రుణం తీసుకునే ప్రయత్నాలను మొదలు పెట్టింది. అయితే కేటాయించిన భూమి తాలూకు ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకురావాల్సిందిగా ఏపీఎస్ఎఫ్సీ అధికారులు కోరారు. అయితే జిల్లా కలెక్టర్ ఆదేశించినా రికార్డుల్లో కంపెనీ పేరు చేర్చి మార్పులు చేయడానికి ఎమ్మార్వో నిరాకరించారు. రుణం అందకపోవడంతో ఆ కంపెనీ స్పిన్నింగ్ మిల్లు ఏర్పాటు పనులను నిలిపేసింది. 2016లో ఎస్కో కంపెనీకి అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పరిశ్రమ ఏర్పాటు చేయనందున భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోరాదో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. కంపెనీ ఇచ్చిన వివరణను పట్టించుకోకుండా ఆ భూమిని వెంకటగిరి మునిసిపాలిటీకి అప్పగించారు. ఇందుకు సంబంధించి ఎస్కో కంపెనీకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో ఎస్కో.. తమకు కేటాయించిన భూమిని తిరిగి తమకు స్వాధీనం చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ రామచంద్రరావు మంగళవారం మరోసారి విచారించారు. అధికారుల తీరు వల్లే కంపెనీ రుణాలు పొందలేకపోయిందని, ఆ కారణంగానే తాము పరిశ్రమ పనులను ప్రారంభించలేకపోయామని పిటిషనర్ తరఫు న్యాయవాది జి.జగదీష్ తెలిపారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. పిటిషనర్ ఏళ్ల తరబడి మౌనంగా ఉన్నారని, సంబంధిత అధికారులను కలసి తన ఇబ్బంది గురించి మాట్లాడలేదని అన్నారు. అధికారులు అన్యాయంగా వ్యవహరిస్తున్నారు.. న్యాయమూర్తి స్పందిస్తూ.. అధికారులను అడుక్కోవాలా? అని ప్రశ్నించారు. ‘ఈ కోర్టులో ఓ రోజు మీరు (ఏజీ) కూర్చోండి. అధికారులు ఏం చేస్తున్నారో మీకు తెలు స్తుంది. ఎంత అన్యాయంగా వ్యవహరిస్తు న్నారో అర్థమవుతుంది. వేధింపులకు సైతం అధికారులు వెనుకాడటం లేదు. ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తుంది. ఇక్కడ ఉన్న కంపెనీలు, పరిశ్రమల గురించి మాత్రం పట్టించుకోదు. పెట్టుబడులు ఊరికే వస్తాయా? అందుకు అనువైన వాతావరణం ఉండాలి కదా.. ప్రస్తుతం ఉన్న వాతావరణం ఇలాగే కొనసాగితే ఒక్క కంపెనీ కూడా రాష్ట్రానికి రాదు. నేను ఈ విషయాలను చాలా బాధతో చెబుతున్నా. మీరైనా ప్రభుత్వాన్ని గైడ్ చేయండి. కలెక్టర్ ఆదేశిస్తే తహసీల్దార్ చేయరా? ఇదేనా పాలన? దేవుడు వరమిచ్చినా పూజారి పట్టించుకోలేదంటే ఇదే. ఇలాగైతే రాష్ట్రానికి ఎవరొస్తారు?’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎస్కో నుంచి స్వాధీనం చేసుకున్న భూమిని తిరిగి ఆ కంపెనీకి ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. -
రికార్డుల ప్రక్షాళన సదవకాశం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/మెదక్ జోన్: భూవివాదాలను పరిష్కరించి భవిష్యత్ తరాలు ఇబ్బంది పడకుండా చూసేందుకే ప్రభుత్వం రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన చేపట్టిందని గవర్నర్ నరసింహన్ అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలకు ఈ ప్రక్షాళనతో పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. రైతులకు ఇది సదావకాశమని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం నాగసాలలో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పూర్తి కావడంతో సోమవారం గవర్నర్ ఆ గ్రామాన్ని సందర్శించారు. తర్వాత మెదక్ జిల్లాలోని పాషాపూర్ గ్రామంలో జరిగిన ప్రక్షాళన కార్యక్రమాన్ని పరిశీలించారు. రెండుచోట్ల ప్రజలతో ముఖాముఖీ మాట్లాడారు. నాగసాలలో గ్రామ నక్షను పరిశీలించారు. గ్రామంలో జనాభా, వారి పేరిట ఉన్న భూముల వివరాలు, సర్వే నంబర్లు తదితర సమాచారానికి సంబంధించిన ప్రత్యేక నోటీసులను పరి శీలించారు. గ్రామస్తులతో 20 నిమిషాల పాటు మాట్లాడి సర్వే ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లా డుతూ.. ప్రక్షాళన తర్వాత రైతులందరికీ అధికారులు ఈ–పాస్ పుస్తకాలు అందజేస్తా రన్నారు. అధికారులకు గ్రామస్తులు సహకరించాలని, రికార్డుల్లో తప్పులు దొర్లితే బ్యాంకులు రుణాలివ్వవని పేర్కొన్నారు. నాగసాలలో గ్రామస్తులతో గవర్నర్ మాటామంతీ.. గవర్నర్: ఏమ్మా మీకు ఎంత భూమి ఉంది? ఏమైనా సమస్యలున్నాయా? కుమ్మరి లలితమ్మ: సారూ.. మా తాతకు మాన్యం కింద ఇచ్చిన 1.5 ఎకరాల పొలం ఉంది. ఆయన చనిపోయిండు. భూమి మాత్రం ఆయన పేరిటే ఉంది. పరిష్కారం కాలేదు. 5 మందిమి ఉన్నం. ఎవరి పేర్ల మీద ఎక్కించలేదు. గవర్నర్: చూడండమ్మా.. మీరు 5 మంది ఉన్నరు. ఫస్టు మీ కుటుంబ సభ్యులందరూ కలసి మాట్లాడుకోండి. ఎవరెవరికి ఎంత మేర పంపకాలు జరగాలో చర్చించుకోండి. తర్వాత రెవెన్యూ అధికారులకు దరఖాస్తు పెట్టుకుంటే వాటిని అమలు చేస్తారు. గవర్నర్: ఏమ్మా.. మీకు భూమి ఉందా? పద్మమ్మ: సారూ.. 10 నెలల కింద ఊళ్ల ఊషన్నకు చెందిన భూమి కొన్న. పాసు పుస్తకాలు ఇస్తలేరు. లక్షల రూపాయలు పోసి కొన్నం. మిత్తిలు పెరుగుతున్నయి. గవర్నర్: ఎందుకు ఏమైనా సమస్య ఉందా? పద్మమ్మ: ఏమో సారు మా ఆయన పేరు మీద 6 ఎకరాలు, కోడలు పేరు మీద 2 ఎకరాలు, కొడుకు పేరు మీద 18 గుంటల భూమి కొన్నం. రిజిస్ట్రేషన్ కూడా అయ్యింది. సర్కారోళ్లు బుక్కులు ఇస్తలేరు. గవర్నర్: వీఆర్ఓ గారూ.. ఏం సమస్య.. వీళ్లకు ఎందుకు బుక్కులు రావడం లేదు? వీఆర్ఓ: సార్.. వీళ్లు కొనుగోలు చేసిన రిజిస్ట్రేషన్లోఉన్న భూమి, పొజిషన్ ఉన్న దానికి క్లారిటీ లేదు. దానిపై మాకు దరఖాస్తు ఇచ్చారు. పరిష్కారం చేసి బుక్కులు అందజేస్తాం. పూరిగుడిసెల్లోకి వెళ్లి.. పాషాపూర్‌లో భూ ప్రక్షాళన కార్యక్రమం అనంతరం గవర్నర్ గ్రామంలో పర్యటించారు. నవనీత–ఏసు, పోచయ్య, రాజులకు చెందిన పూరిగుడిసెల్లోకి వెళ్లి వారి బాగోగులు తెలుసుకున్నారు. గుడిసెల్లో ఎంతకాలం ఉంటున్నారని, పక్కా ఇళ్లు ఎందుకు కట్టుకోలేదని వారిని ప్రశ్నించారు. దీంతో వారు మాట్లాడుతూ చాలా కాలంగా పూరిపాకలోనే ఉంటున్నామని, రాత్రి వేళలో విషపురుగులతో భయంగా ఉందని, డబుల్బెడ్రూం ఇళ్లు మంజూరు చేయించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన గవర్నర్ గ్రామంలోని మరికొన్ని ఇళ్లను కలియ తిరుగుతూ మరుగుదొడ్లు నిర్మించుకున్న వారిని అభినందించారు. -
వ్యవసాయాధికారులకూ భాగస్వామ్యం
- రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో ఏఈవోలకూ స్థానం - జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశం సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో వ్యవసాయాధికారులను భాగస్వామ్యం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వ సీఎస్ ఎస్.పి.సింగ్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ, ఉద్యాన శాఖల కమిషనర్లకు లేఖ రాశారు. భూ రికార్డుల ప్రక్షాళన ప్రధాన ఉద్దేశం రైతు పెట్టుబడి పథకాన్ని సమగ్రంగా అమలు చేయడమని, దీనిపై రైతు సమగ్ర సర్వేలో పాల్గొన్న వ్యవ సాయ విస్తరణాధికారుల (ఏఈవో)ను భాగ స్వామ్యం చేయాలని విజ్ఞప్తి చేశారు. భూ రికార్డుల ప్రక్షాళనలో వ్యవసాయశాఖ అధికారులను భాగస్వామ్యం చేయకపోవడంపై ఇటీ వల వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే సీఎస్ ఈ ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. సమగ్ర సర్వేలో వ్యవసాయ భూముల వివరాలను ఇప్పటికే 90 శాతం వరకు సేకరించినందున ఏఈవోల సహకారం తప్పనిసరని ఆయన పేర్కొన్నారు. 1బీ రికార్డులు, రైతు సమగ్ర సర్వే సమాచారాన్ని కలిపి సరిచూసుకొని డిసెంబర్ నాటికి తుది భూరికార్డులను తయారు చేయాల్సి ఉందన్నారు. ఆ సమా చారం ఆధారంగానే రైతుల వ్యవసాయ భూముల వివరాలు తయారుచేసి వచ్చే ఖరీఫ్ నాటికి ఎకరానికి రూ.4 వేలు పెట్టుబడి ఇచ్చే పథకాన్ని ప్రారంభించాల్సి ఉందన్నారు. సీఎస్ ఆదేశాల నేపథ్యంలో ఏఈవోలంతా రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో పాలు పంచుకోవాలని వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారధి ఆదివారం ఆదేశించారు. సమగ్ర సర్వేలో రైతుకు సంబంధించిన సమగ్ర సమా చారం ఇప్పటికే సేకరించామన్నారు. -
‘చుక్కల’ భూములు చక్కబెట్టేద్దాం!
-
‘చుక్కల’ భూములు చక్కబెట్టేద్దాం!
24 లక్షల ఎకరాలకు ‘పచ్చ’తమ్ముళ్ల భారీ స్కెచ్... ⇒ రూ. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కొట్టేసేందుకు పన్నాగాలు.. అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు ⇒ అనుభవదారులు, రెవెన్యూ సిబ్బందికి బెదిరింపులు..మాట వినని సిబ్బందికి బదిలీలు ⇒ బోగస్ పత్రాలతో రికార్డులు తారుమారు ⇒ అనుభవదారుల స్థానంలో తమ పేర్లు రాయిస్తోన్న టీడీపీ నేతలు ⇒ త్వరలో అసెంబ్లీలో చుక్కల భూముల పరిష్కార బిల్లు ⇒ ఈలోగా రికార్డుల్లో అనుభవదారులుగా పేర్లు నమోదు చేయించుకుంటున్న తెలుగుదేశం తమ్ముళ్లు ⇒ చట్టం అమల్లోకి రాగానే భూములు సొంతం చేసుకొనే వ్యూహం సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎవరికీ చెందకుండా రెవెన్యూ రికార్డుల్లో చుక్కల భూములుగా నమోదైన లక్షలాది ఎకరాలపై తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ల కన్ను పడింది. అడంగల్‌లను తారుమారు చేసి, తామే అనుభవదారులుగా చూపించి, వాటన్నింటినీ సొంతం చేసుకొనే వ్యూహంలో టీడీపీ నేతలు ఉన్నారు. ఈ భూముల విషయంలో కొన్ని దశాబ్దాలుగా వివాదం ఉంది. స్వాతంత్య్రా నంతరం రెవెన్యూ రికార్డులను తిరగరాసే సమయంలో కొన్ని సర్వే నంబర్లకు చెందిన భూమి ప్రభుత్వానిదా? ప్రైవేటు వ్యక్తులదా అన్న విషయం తేలలేదు. దీంతో ఆ భూముల రికార్డుల్లో హక్కుదారు కాలమ్‌లో చుక్క పెట్టి వదిలేశారు. వీటినే చుక్కల భూములుగా పిలుస్తారు. ఇలాంటి భూములు రాష్ట్రంలో 24 లక్షల ఎకరాలు ఉన్నాయి. వీటిలో 3 లక్షల ఎకరాలు ప్రైవేటు వ్యక్తులవి చెందినవి. మరో 21 లక్షల ఎకరాలు ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. ఈ భూముల హక్కులపై వివాదం నడుస్తోంది. ఇవన్నీ ప్రభుత్వానివేనని రెవెన్యూ శాఖ వాదిస్తోంది. ఇవి తమవేనని అనుభవదారులు వాదిస్తున్నారు. ఈ వివాదం శాశ్వత పరిష్కారానికి త్వరలోనే శాసన సభలో బిల్లు రానుంది. ఇదే అదనుగా భావించిన టీడీపీ నేతలు ఈ భూముల అనుభవదారులుగా తమ పేర్లను నమోదు చేయిస్తున్నారు. బిల్లు ఆమోదం పొంది, చట్ట రూపం దాల్చేలోగా రికార్డుల్లో ఈ భూములకు అనుభవదారులుగా పేర్లు చేర్చడం ద్వారా వాటిని సొంతం చేసుకోవడం టీడీపీ నేతల వ్యూహం. మాట వినకపోతే బెదిరింపులు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులోని సర్వే నంబర్ 15లోని కొన్ని భూములు రెవెన్యూ రికార్డుల్లో చుక్కల భూములుగా నమోదయ్యాయి. అదే విధంగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం జంబులదిన్నె గ్రామంలో 100. 109, 149, 165, 175, 180, 190, 197, 201, 217 సర్వే నంబర్లలోని భూముల్లో కూడా కొన్ని చుక్కల భూములుగా ఉన్నాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 24 లక్షల ఎకరాలు ఉన్నాయి. వేల కోట్ల రూపాయల విలువైన ఈ చుక్కల భూముల్లో దశాబ్దాలుగా రైతులు సాగు చేసుకుంటున్నారు. ఈ భూములు వివాదాస్పదమైనవైనందున, వీటి అనుభవదారులకు ఈ భూములపై పంట రుణాలు అందడం లేదు. అత్యవసరమై అమ్ముకోవాలన్నా వీలుకాని పరిస్థితి. అందుకే ఈ చుక్కల సమస్యను పరిష్కరించాలని అనుభవదారులు కోరుతున్నారు. అయితే, దీన్ని ఆసరాగా చేసుకుని మొత్తం భూములను కొట్టేసే ప్రయత్నంలో అధికార పార్టీ నాయకులు ఉన్నారు. ఇప్పటికే పచ్చటి పంట పొలాలు, అసైన్డ్ భూములు, కొండ పోరంబోకు, లంక భూములను నయానో భయానో చేజిక్కించుకుంటున్న టీడీపీ నేతలు.. ఇప్పుడు చుక్కల భూములను కూడా సొంతం చేసుకొనే పనిలో పడ్డారు. రైతులను, రెవెన్యూ సిబ్బందిని బెదిరించి చుక్కల భూముల అనుభవదారులుగా అడంగల్‌లో తమ పేర్లు రాయించుకుంటున్నారు. ఇందుకు బోగస్ పత్రాలు సృష్టించి, అడంగళ్లనే మార్చేస్తున్నారు. మాట వినని క్షేత్రస్థాయి అధికారులను బెదిరిస్తున్నారు. ఇంకా అవసరమైతే బదిలీ కూడా చేయిస్తున్నారు. ఈ అరాచకాలకు అడ్డుకట్ట వేయకపోతే చుక్కల భూములన్నీ చేజారిపోతాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘చుక్కల భూములను తెలుగుదేశం వారి పరం చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. చూస్తూ ఊరుకోవడం మినహా ఏమీ చేయలేని పరిస్థితి’’ అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్పారు. బిల్లు రాకముందే రికార్డులు తారుమారు చుక్కల భూమలు సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం గతంలోనే కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలని సబ్ కమిటీ సూచించింది. సబ్ కమిటీ సిఫార్సులను అనుసరించి ఈ వివాదాన్ని పరిష్కరించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. విధి విధానాలను రూపొందించే బాధ్యతను రెవెన్యూ శాఖకు అప్పగించింది. ఈ భూములను ఐదు విభాగాలుగా వర్గీకరించి, వాటి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో రెవెన్యూ శాఖ విధివిధానాలు రూపొందించి, అసెంబ్లీలో బిల్లు కోసం ముసాయిదాను ప్రభుత్వానికి సమర్పించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి, చుక్కల భూముల వివాదాల పరిష్కార చట్టాన్ని అమల్లోకి తేవాలని యోచిస్తున్నారు. దీంతో అధికార పార్టీ నేతలు రంగప్రవేశం చేశారు. బిల్లు రాకముందే ఈ భూములను తమ ఖాతాలో వేయించుకునేందుకు గ్రామాల్లో టీడీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. రికార్డుల్లో ఈ భూములు తమవని తప్పుడు ఆధారాలు సృష్టించి పెడితే, బిల్లు చట్టరూపం దాల్చగానే దాని ప్రకారం చుక్కల స్థానంలో భూ యాజమాన్య రికార్డు (1–బి)లో తమ పేరు చేరుతుందని భావిస్తున్నారు. డబ్బు కోసం కొందరు, రాజకీయ ఒత్తిళ్ల వల్ల మరికొందరు క్షేత్రస్థాయి సిబ్బంది టీడీపీ నేతలకు సహకరించి, తప్పుడు రికార్డులు సృష్టిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోని చుక్కవ భూములను కూడా గుంజుకొంటున్నారు. వీటి అనుభవదారులును బెదిరించి, రికార్డులు తారుమారు చేస్తున్నట్లు సమాచారం. రికార్డుల్లో తమ పేరు ఉంటే, బిల్లు చట్ట రూపం దాల్చగానే భూములు సొంతం చేసుకోవచ్చన్నది అధికార పార్టీ నేతల వ్యూహం. -
రెవెన్యూ ప్రాంగణాల్లో రిజిస్ట్రేషన్ ఆఫీసులు
- రాజస్థాన్ తరహా వ్యవస్థ ఏర్పాటుకు సర్కారు నిర్ణయం - అనువైన స్థలాలను గుర్తించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశం - భవనాల నిర్మాణానికి ముందుకొచ్చిన పోలీస్ హౌసింగ్ బోర్డు సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ కార్యాలయాల ప్రాంగణాల్లోనే రిజిస్ట్రేషన్ ఆఫీసులను ఏర్పాటు చేయాలని సర్కారు సంకల్పించింది. వివిధ ఆస్తుల విక్రయాలకు సంబంధించి జరిగే ప్రతి రిజిస్ట్రేషన్‌కు రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయాల్సి ఉన్నందున, ప్రజలకు సౌలభ్యంగా ఉండేలా రాజస్థాన్ తరహా విధానాన్ని అవలంభించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ సమయంలో ఏవైనా అనుమానాలు వ్యక్తమైతే, సంబంధిత మండల తహశీల్దార్లతో చర్చించి ఆయా డాక్యుమెంట్లను, పాస్‌బుక్, టైటిల్డీడ్లను వెనువెంటనే తనిఖీ చేసుకునేందుకు వెసులుబాటు కలుగనుందని చెబుతున్నారు. కొత్తగా ఏర్పాటుచేయబోయే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను తహశీల్దారు కార్యాలయాల ప్రాంగణాల్లో నిర్మించాలని ప్రభుత్వం కూడా ఆదేశించడంతో స్థల సేకరణ నిమిత్తం అన్ని జిల్లాల కలెక్టర్లకు రిజిస్ట్రేసన్ల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ తాజాగా లేఖరాశారు. ఒకవేళ తహశీల్దారు కార్యాలయ ప్రాంగణంలో స్థలం దొరకనట్లయితే, పరిసర ప్రాంతాల్లోనైనా అనువైన స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను రెవెన్యూ ప్రాంగణాల్లోనే ఏర్పాటు చేసేలా స్థానికంగా ఆ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని జిల్లా రిజిస్ట్రార్లను కూడా ఆదేశించారు. ఇదిలా ఉంటే.. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం పట్ల రిజిస్ట్రేషన్ల శాఖ సిబ్బంది నుంచే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎలక్ట్రానిక్ పాస్‌బుక్‌లు పంపిణీ చేస్తున్న తరుణంలో సదరు సమాచారాన్ని ఆన్లైన్లోనే తనిఖీ చేసే వీలున్నందున కార్యాలయాలు పక్కపక్కనే ఉండాల్సిన అవసరమేంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో 460 రెవెన్యూ మండలాలు ఉండగా, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కేవలం 144 మాత్రమే ఉండడాన్ని మరో అడ్డంకిగా చూపుతున్నారు. పోలీస్ హౌసింగ్ బోర్డుకు నిర్మాణ బాధ్యతలు! రాష్ట్రవ్యాప్తంగా 87 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు మూడు విడతలుగా సొంత భవనాలను ఏర్పాటు చేయాలని రిజిస్ట్రేషన్లశాఖ నిర్ణయించింది. తొలిదశలో 22 భవనాల నిర్మాణాన్ని తెలంగాణ రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టగా, అందులో ఇప్పటికి 5 భవనాలు పూర్తయ్యాయి. అయితే.. తరచుగా భవనాల డిజైన్లను ఉన్నతాధికారులు మార్చుతుండడం, మార్చిన డిజైన్లను సకాలంలో ప్రభుత్వం ఆమోదించకపోతుండడం ఫలితంగా.. ఇకపై భవన నిర్మాణాలను తాము చేయలేమంటూ కార్పొరేషన్ చేతులెత్తేసింది. ఈ నే పథ్యంలో రిజిస్ట్రేషన్ల శాఖ ఈవోఐ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్) పిలవగా ఈడబ్ల్యుఐడీసీ, పోలీస్ హౌసింగ్ బోర్డు సంస్థలు ముందుకు వచ్చాయి. వీటిలో పోలీస్‌హౌసింగ్ బోర్డుకు నూతన భవనాల నిర్మాణ పనులను అప్పగించేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. అయితే.. నిర్మాణ వ్యయంలో 10 శాతం సొమ్మును ముందుగానే తమఖాతాలో జమ చేయాలంటూ సదరు నిర్మాణ సంస్థ షరతు పెట్టడం రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులకు మింగుడు పడని అంశంగా తయారైంది. ఈ విషయమై తదుపరి చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిసింది. -
నకిలీ..మకిలీ!
యాచారం రెవెన్యూలో అక్రమ బాగోతం నకిలీ సంతకాలతో పాసుపుస్తకాలు, పహాణీల జారీ రుణమాఫీ పథకాన్ని పొందిన వైనం రెవెన్యూ విభాగంలో మరో నకిలీ బాగోతం వెలుగులోకి వచ్చింది. భూమి లేకున్నా.. పట్టాదారు పాసుపుస్తకాలు జారీ అయ్యాయి. అంతేకాదు.. పహాణీలు సైతం క్రమం తప్పకుండా అప్డేట్ అవుతున్నాయి. ఇలాంటి పాసుపుస్తకాలు, పహాణీలతో కొందరు ఏకంగా రుణమాఫీ పథకాన్ని సైతం పొందడం గమనార్హం. యాచారం మండల రెవెన్యూ పరిధిలో బయటపడిన అక్రమ పాసుపుస్తకాల వ్యవహారంపై స్థానిక రెవెన్యూ అధికారులు తీగ లాగగా.. తప్పుడు పాసుపుస్తకాలు పొందిన డొంక మెల్లగా కదులుతోంది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా/ యాచారం సాక్షి, రంగారెడ్డి జిల్లా/ యాచారం: మండల రెవెన్యూ పరిధిలో నకిలీ పాసుపుస్తకాల గుట్టు బయటపడింది. రెవెన్యూ రికార్డుల్లోని వివరాలతో సంబంధం లేకుండా పదుల సంఖ్యలో పట్టాదారు పాసుపుస్తకాలు తయారయ్యాయి. ఆ పాసుపుస్తకాల్లో ఉన్న వారి పేర్లతో పహాణీలు సైతం జారీఅవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. యాచారం మండలం నక్కర్తమేడిపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వేన ంబరు 181, 184, 213 లలో 400 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉంది. గతంలో భూపంపిణీలో భాగంగా పలువురు రైతులకు అసైన్ చేసినప్పటికీ.. పొజిషన్ ఇవ్వలేదు. ఈ క్రమంలో కొందరు అక్రమార్కులు ఈభూమిపై కన్నేసి నకిలీ పట్టాదారు పుస్తకాలు సృష్టించారు. అంతేకాకుండా పహాణీలను సైతం తయారు చేసి ప్రభుత్వ పథకాలను అనుభవిస్తున్నారు. వెలుగులోకి ఇలా.. అక్రమంగా పాసుపుస్తకాలు పొందడమే కాకుండా ప్రభుత్వ పథకాలను అనుభవిస్తున్న తీరుపై పల్లెచెల్కతండాకు చెందిన స్థానికులు కొందరు ఈనెల 13న మండల తహసీల్దారుకు ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించి కొన్ని ఆధారాలు సైతం సమర్పించడంతో అధికారులు విచారణకు ఉపక్రమించారు. పట్టాదారు సర్టిఫికెట్లు జారీ చేసిన ఫైలుకు సంబంధించిన అంకెలను రెవెన్యూ రికార్డులతో సరిపోల్చారు. అయితే రెండింట్లో భిన్నమైన నంబర్లున్నట్లు గుర్తించారు. అదేవిధంగా సర్టిఫికెట్లు జారీ అయిన తేదీల్లో పనిచేసిన అధికారి కాకుండా ఇతర అధికారుల సంతకాలున్నట్లు తేల్చారు. దీంతో వాటిని నకిలీవిగా పరిగణిస్తూ మండల తహసీల్దారు ప్రాథమికంగా నిర్ధారించారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టి అసలు సంగతి పసిగడతామని తహసీల్దార్ వసంతకుమారి ‘సాక్షి’తో పేర్కొన్నారు. పహణీల జారీ నిలుపుదల.. నక్కర్తమేడిపల్లిలోని సర్వేనంబర్లు 181, 184, 213లోని భూమికి సంబంధించి ఫిర్యాదులు రావడంతో ఆ మేరకు ఆన్లైన్ పహణీల జారీని నిలిపివేయాలని తహసీల్దార్ వసంతకుమారి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. అదేవిధంగా విచారణ పూర్తయ్యేవరకు ఆ సర్వేనంబర్లలోని పట్టాదారులకు కొంతకాలం రుణాల మంజూరును కూడా నిలిపివేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. -
శిఖం..మాయం!
చెరువు ఎఫ్టీఎల్ హద్దు మీద ప్రైవేటు వ్యక్తులకు పట్టాలిస్తారా? శిఖం భూమిని అధికారికంగా ఎవరికైనా ధారాదత్తం చేయొచ్చా? నిబంధనలకు విరుద్ధంగా పొందిన భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయవచ్చా? పారిశ్రామిక నగరం పటాన్‌చెరువులో ఇవన్నీ సాధ్యమే. అధికారులను ప్రసన్నం చేసుకుంటే చాలు ఏకంగా చెరువును కూడా పట్టా పొందవచ్చు. అందుకు తాజా ఉదాహరణ పటాన్చెరు మండలం బీరంగూడలోని శెట్టికుంట. అధికారికంగానే చెరువును, శిఖం భూమిని సొంతం చేసుకున్న వ్యాపారులు ఇపుడు దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారికి కట్టబెట్టారు. అనధికారిక లేఅవుట్లతో ప్లాట్లుగా చేసి అమ్మకానికి సిద్ధం చేశారు. రూ.15 నుంచి రూ .20 కోట్ల ఈ భూదందాకు రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు ప్లాన్ గీస్తే ... రియల్ ఎస్టేట్ వ్యాపారులు పక్కాగా అమలు చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పటాన్చెరు మండలం పరిధిలోని బీరంగూడలోని శెట్టికుంట చెరువు శిఖం భూమిని కొందరు వ్యక్తులు దర్జాగా కబ్జా పెట్టారు. సర్వే నంబర్ 947లోని 12.04 ఎకరాల భూమి చెరువు శిఖం కింద ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉంది. ఈ భూమి పటేల్‌గూడ గ్రామంలోని ఊబగుంట చెరువు పరిధిలో ఎఫ్టీఎల్( ఫుల్ ట్యాంకు లెవల్) హద్దు పరిధిలోకి వస్తుందని చిన్న నీటిపారుదల శాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ చెరువు శిఖం మీద ప్రైవేటు వ్యక్తులకు పట్టాలివ్వడానికి ప్రభుత్వానికి కూడా సాధారణ అధికారులు లేవు. కానీ 1994-95 మధ్య కాలంలో 12.04 ఎకరాల చెరువు భూమిని మాజీ సైనికులకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పుడు తహ శీల్దార్‌గా పని చేసిన కిషన్‌నాయక్ ఈ తంతంగాన్ని నడిపినట్లు తెలుస్తోంది. తహశీల్దార్ చేసిన తప్పును సవరించి చెరువును కాపాడాల్సిన ఉన్నతాధికారి... ఆమ్యామ్యాలకు లొంగిపోయి తహశీల్దారుకే వత్తాసు పలికారు. అప్పట్లో ఆర్డీఓగా పని చేసిన మృత్యుంజయరావు ఏ రెవెన్యూ అధికారి కూడా చేయలేని ధైర్యం చేసి ఏకంగా చెరువు శిఖం భూమిని అమ్ముకునే అధికారం (ఎన్ఓసీ) ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారు. అంతా మాయ భూమి పొందిన వ్యక్తులు అప్పటి నుంచే చెరువును పూడ్చే పనులు ముమ్మరం చేశారు. రాత్రింబవళ్లు చెరువులో మట్టి నింపి చదును చేశారు. న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు దాన్ని ఒకరి నుంచి మరొకరికి.. వారి నుంచి ఇంకొకరికి మారుస్తూ..రిజిస్ట్రేషన్లు చేయించారు. తాజాగా ఈ మొత్తం భూమిని ప్లాట్లుగా చేసి, అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. నిబంధనల ప్రకారం వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చాలంటే ల్యాండ్ కన్వర్షన్ జరపాలి. కానీ 947 సర్వే నంబర్ భూమిని ల్యాండ్ కన్వర్షన్ చేయాలని తమకు ఎలాంటి దరఖాస్తు అందలేదనిరెవెన్యూ అధికారులు చెప్తున్నారు. కానీ అక్కడ పనులు మాత్రం చకచకా జరిగిపోతున్నాయి. జరుగుతున్న తంతు గ్రామ వీఆర్ఓ నుంచి తహశీల్దారు వరకు అందరికీ తెలిసినా ఎవరూ పట్టించుకోవడంలేదు. నిండు చెరువులో మట్టి పోస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఈ అక్రమంపై పత్రికల్లో కథనాలు వచ్చిన తర్వాత తహశీల్దారు ఓ నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. ఈ నోటీసుల ఆధారంగానే ఇపుడు వ్యాపారులు కోర్టును ఆశ్రయించారు. ఆ వెంచర్‌తో ప్రమాదం వ్యాపారులు వెంచర్ పూర్తి చేసి ప్లాట్లుగా మార్చి కోట్ల రూపాయలు గడించవచ్చు. కానీ ఈ ప్లాట్లు కొన్న వారు మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సర్వేనంబర్ 947 వాస్తవానికి చెరువు శిఖం భూమి అంటే ఎప్పటికీ నీటినిల్వ ఉండే ప్రాంతం. ఇప్పుడు నీరు లేకపోయినా, వర్షాలు బాగా కురిస్తే కనీసం 10 అడుగుల నీరు వచ్చే పరిస్థితి ఉంది. దాంట్లో నిర్మాణాలే జరిగితే భవిష్యత్‌లో ఎప్పుడైనా వరదలు వస్తే పూర్తిగా ఆ ప్రాంతం అంతా నీట మునగడం ఖాయం. అది శిఖం భూమే దీనిపై తహశీల్దార్ మహిపాల్‌రెడ్డి వివరణ కోరగా సర్వే నెంబర్ 947లో 1995 కంటే ముందు ఎక్స్సర్వీస్మెన్లకు 12.04 ఎకరాల భూమిని కేటాయించారని, అది పూర్తిగా చెరువు శిఖం పరిధిలోనే ఉందన్నారు. ఆ భూమిలో ఇప్పుడు వెంచర్ వేస్తున్నట్లు తెలిసి, ఎలాంటి పనులు చేపట్టకూడదని తాము నోటీసులు ఇచ్చామన్నారు. అయితే రియల్ వ్యాపారులు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని వెల్లడంచారు. పంచాయతీరాజ్ శాఖ ఈఓ పీఆర్ డీ దేవదాస్‌ను వివరణ కోర గా బీరంగూడలోని సర్వే నంబర్ 947లో వెంచ ర్ కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదన్నారు. -
పట్టా ఉన్న వారిదే భూమి
హైకోర్టు చరిత్రాత్మక తీర్పు పట్టా ఉన్న వ్యక్తి పేరు ఆర్‌ఎస్‌ఆర్‌లో లేకపోయినా అతనే యజమాని పట్టా లేనప్పుడే రెవెన్యూ రికార్డులను ఆధారం చేసుకోవాలి ఆర్‌ఎస్‌ఆర్‌లో ‘డాట్లు’ ఉన్నంత మాత్రాన అది ప్రభుత్వ భూమి కాదు పట్టాదారు వివరాలు ఖాళీగా ఉన్నా యాజమాన్యపు హక్కులు కోరొచ్చు యాజమాన్యపు సర్టిఫికెట్లు ఉన్న రక్షిత కౌలుదారే అసలైన యజమాని నిరుపయోగ, అసెస్డ్, అన్ అసెస్డ్ భూములన్నీ ప్రభుత్వ భూములు కావు 12 ఏళ్లకు పైగా భూమి స్వాధీనంలో ఉంటే, దాని బదలాయింపు కోరొచ్చు రైతుల పిటిషన్లపై ఇచ్చిన తీర్పులో జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారు వివరాలను పొందుపరిచేందుకు ఉద్దేశించిన కాలమ్‌ను ఖాళీగా వదిలి వేసినంత మాత్రాన, అందులో డాట్లు పెట్టినంత మాత్రాన.. ఆ భూమి ప్రభుత్వ భూమి కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఆ భూమికి సంబంధించి ఎవరి పేరు మీదైతే పట్టా ఉంటుందో, ఆ వ్యక్తే ఆ భూ యజమాని అవుతారని స్పష్టం చేసింది. పట్టాదారు వివరాలను ఎందుకు సంబంధిత కాలమ్‌లో నమోదు చేయలేదో వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని హైకోర్టు తన తాజా తీర్పులో పేర్కొంది. పట్టా లేనప్పుడు మాత్రమే రెవెన్యూ రికార్డులను ఆధారంగా చేసుకోవాలని అధికారులను ఆదేశించింది. అంతేకాక యాజమాన్యపు హక్కును సూచించే పట్టా లేదా గ్రాంట్ లేకుండా ఓ వ్యక్తి స్వాధీనంలో భూమి 12 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉంటే.. ఆ భూమిని తన పేరు మీద బదలాయించాలని కోరే హక్కు ఆ వ్యక్తికి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ భూమిపై అప్పటికే పలు అమ్మకపు లావాదేవీలు జరిగి ఉంటే యాజమాన్యపు హక్కు కోరేందుకు అవి ఆధారం అవుతాయని, దీనిపై అభ్యంతరం ఉంటే ప్రభుత్వమే సివిల్ కోర్టుకెళ్లి తేల్చుకోవాల్సి ఉంటుందని తెలిపింది. 18-6-1954 ముందు ఆంధ్ర ప్రాంతంలో అసైన్మెంట్ ఇచ్చి ఉంటే 25-7-1958కి ముందు తెలంగాణ ప్రాంతంలో లావణీ పట్టా జారీ చేసి ఉంటే ఆ భూములపై అసైనీకి పూర్తి యాజమాన్యపు హక్కులుంటాయని స్పష్టం చేసింది. అంతేకాక మార్కెట్ విలువ చెల్లించి లావణీ పట్టా పొందిన వ్యక్తి ఆ భూమిని ఎటువంటి ఆంక్షలు లేకుండా అమ్ముకోవచ్చునని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి ఇటీవల చారిత్రక తీర్పును వెలువరించారు. రెవెన్యూ రికార్డులను ఆధారంగా చూపుతూ భూముల యాజమాన్యపు హక్కుల విషయంలో ముఖ్యంగా గ్రామాల్లోని రైతులను ముప్పుతిప్పలు పెడుతున్న రెవెన్యూ అధికారులకు ముక్కుతాడు వేసే దిశగా హైకోర్టు ఈ 127 పేజీల తీర్పు వెలువరించింది. రెవెన్యూ అధికారులు తమ భూముల విషయంలో తమ యాజమాన్యపు హక్కులను నిరాకరిస్తుండటంపై రాష్ట్రంలో వేర్వేరు జిల్లాలకు చెందిన రైతులు, భూ యజమానులు హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ నాగార్జునరెడ్డి, అన్ని వ్యాజ్యాల్లో కలిపి ఉమ్మడి తీర్పునిచ్చారు. ‘కాలానుగుణంగా ఆస్తులు వ్యక్తుల చేతులు మారుతూ వచ్చాయి. రికార్డులను నిర్వహిస్తున్న వారు ఎప్పటికప్పుడు ఇలా మారుతూ వచ్చిన భూముల తాలుకు లావాదేవీలను రికార్డుల్లో పొందుపరచలేదు. రెవెన్యూ రికార్డుల్లో వివరాలు లేవనే కారణంతో.. చట్టబద్ధంగా భూమిని కలిగిన వ్యక్తికి యాజమాన్యపు హక్కులను నిరాకరించడానికి వీల్లేదు. గ్రామ, తాలుకా స్థాయిల్లో నీతి నియమాలు లేని కొందరు రెవెన్యూ అధికారులు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై రికార్డులను తారుమారు చేస్తున్నారు’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. ఈ తీర్పులో ముఖ్యాంశాలివీ... పట్టాతో పూర్తి యాజమాన్యం 1. (ఎ) భూములపై ఏ ఏ డాక్యుమెంట్లు యాజమాన్యపు హక్కులు కల్పిస్తాయి? (బి) యాజమాన్యపు హక్కులను నిర్ధారించేందుకు రెవెన్యూ రికార్డుల్లో పొందుపరిచిన వివరాలు ప్రామాణిక రుజువులా? ఒకవేళ కాకపోతే, యాజమాన్యపు హక్కును నిర్ధారించే సమయంలో ఆధారాలుగా పరిగణించే విలువ ఆ వివరాలకుందా? పట్టా జారీకి ఉద్దేశించిన బోర్డ్ స్టాండింగ్ ఆర్టర్ (బీఎస్ఓ) 27 కింద జారీ అయిన పట్టా పూర్తి యాజమాన్యపు హక్కులను కల్పిస్తుంది. ఆంధ్ర ప్రాంతంలో 18-6-1954కు ముందు బీఎస్ఓ 15 కింద అసైన్మెంట్ ఇచ్చి ఉంటే, తెలంగాణ ప్రాంతంలో 25-7-1958కి ముందు లావణి నిబంధనల కింద పట్టా జారీ చేసి ఉంటే, అసైనీకి ఆ భూములపై పూర్తి యాజమాన్యపు హక్కులు ఉంటాయి. అంతేకాక ఆ భూములను బదలాయించే హక్కు కూడా అసైనీకి ఉంటుంది. అయితే ఏపీ అసైన్డ్ భూముల (బదలాయింపు నిషేధం) చట్టం 1977లోని సెక్షన్ 2 (1) ప్రకారం ఆ భూమి అసైన్డ్ భూమి అని మొదట రెవెన్యూ అధికారులు సంతృప్తి చెందకుండా, అసైన్మెంట్ రద్దు కోసం ఎటువంటి ప్రొసీడింగ్స్ జారీ చేయకూడదు. మార్కెట్ విలువ వసూలు చేసి లావణి పట్టా జారీచేసి ఉంటే, ఆ భూమిని ఎటువంటి ఆంక్షలు లేకుండా అమ్ముకునే హక్కు పట్టాదారునికి ఉంటుంది. ఎస్టేట్, ఇనాం భూముల విషయంలో రైత్వారీ పట్టాలు, అక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికెట్లు యాజమాన్యపు హక్కును కల్పిస్తాయి. ఒకవేళ హైదరాబాద్ కౌలుదారు, వ్యవసాయ చట్టం 1950 కింద రక్షిత కౌలుదారులు అయితే వారు యాజమాన్యపు సర్టిఫికెట్లు కలిగి ఉంటే, అవి పూర్తి యాజమాన్యపు హక్కులను కల్పిస్తాయి. ఒకవేళ పట్టా లేకపోతే, యాజమాన్యపు హక్కులు నిర్దేశించేందుకు రెవెన్యూ రికార్డుల్లోని వివరాలే ఆధారం అవుతాయి. గ్రామ ఖాతాల్లో తదుపరి వివరాలు పొందుపరిచేందుకు ఆంధ్రా ప్రాంతంలో ఎ-రిజిస్టర్/డైగ్లాట్, లెడ్జర్/చిట్టా, తెలంగాణ ప్రాంతంలో సేత్వార్, అనుబంధ సేత్వార్, వసూల్ బాకీ ప్రాథమిక ఆధారాలు అవుతాయి. ఆంధ్రా ప్రాంతంలో రెవెన్యూ రికార్డుల ఏకీకరణకు ముందు నంబర్ 1, నంబర్ 2 వీలేజ్ అకౌంట్లు (పాతవి), నంబర్ 3 అకౌంట్, అకౌంట్ నంబర్ 10, రిజిస్ట్రార్ ఆఫ్ హోల్డింగ్స్ యాజమాన్యపు హక్కుల నిర్ధారణకు ఆధారం. అలాగే తెలంగాణ ప్రాంతంలో పహాణి పత్రిక, చౌఫాస్లా, ఫైసల్ పట్టీ, ఖాస్రా పహాణీలు ఆధారం. పట్టాదారు పాసు పుస్తకాల చట్టం 1971 కింద గ్రామ ఖాతాల ఏకీకరణ జరిగిన తరువాత, ముద్రించిన డైగ్లాట్ లేదా ఎ-రిజిస్టర్, విలేజ్ అకౌంట్ 1, అకౌంట్ 2, నంబర్ 3 రిజిస్టర్, విలేజ్ అకౌంట్ నెం 4, రిజిస్ట్రార్ ఆఫ్ హోల్డింగ్స్ తగిన రెవెన్యూ రికార్డులవుతాయి. రెవెన్యూ రికార్డుల్లోని వివరాలపై రెండు వైరి వర్గాలు ఆధారపడుతుంటే, ప్రాథమిక రికార్డులైన ఎ-రిజిస్టర్, రికార్డ్ ఆఫ్ హోల్డిం గ్స్‌లో ఏ వ్యక్తి పేరు నమోదై ఉంటుందో అతను, అతని వద్ద నుంచి ఆస్తిని కొనుగోలు చేసిన వ్యక్తి యాజమాని అవుతాడు. ఇటువంటి వివాదాలను పరిష్కరించేటప్పుడు రెవెన్యూ అధికారులు, న్యాయస్థానాలు అప్రమత్తంగా ఉండాలి. వైరి వర్గాలు చూపుతున్న సాక్ష్యాలను పరిశీలించడంతో పాటు పై చెప్పిన రికార్డుల్లోని వివరాలను పరిగణనలోకి తీసుకుని జాగ్రత్తగా ఓ నిర్ణయానికి రావాలి. ఒకవేళ ప్రైవేటు వ్యక్తులకు, ప్రభుత్వానికి మధ్య వివాదం ఉంటే, పై చెప్పిన రికార్డులు యాజమాన్యపు హక్కులను నిర్ధారించేందుకు ప్రాథమిక ఆధారాలవుతాయి. పోరంబోకు, సామాజిక ప్రయోజనాల కోసం ఉద్దేశించిన భూములన్నీ కూడా ప్రభుత్వానివే. నిరుపయోగ భూములు, అసెస్డ్, అనసెస్డ్ భూముల విషయంలో ఇటువంటి అభిప్రాయానికి తావు లేదు. నిరుపయోగ భూములు, అసెస్ట్, అనసెస్డ్ భూములపై వ్యక్తులెవరైనా హక్కులు కోరుతుంటే, ఆ వివాదాన్ని పరిష్కరించడానికి రికార్డుల్లో ఆర్ఎస్ఆర్ వివరాలు సరిపోవు. ఇటువంటి వివాదాల పరిష్కారానికి ఇతర రెవెన్యూ రికార్డులను పరిగణనలోకి తీసుకోవాలి. 12 ఏళ్లు స్వాధీనంలో ఉంటే.. యాజమాన్య హక్కు 2. ఎంతో కాలంగా ఆస్తి స్వాధీనంలో ఉన్నట్లు బహుళ రిజిస్టర్డ్ అమ్మకపు లావాదేవీలు ప్రతిబింబిస్తుంటే, దాని ఆధారంగా ఆస్తిపై యాజమాన్యపు హక్కు ఉన్నట్లు భావించవచ్చా? పట్టా లేని భూమి ఓ వ్యక్తి స్వాధీనంలో 12 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ కాలం ఉంటే, బీఎస్ఓ-31 పేరా 7 ప్రకారం ఆ భూమిని తన పేరు మీద బదలాయించాలని ఆ వ్యక్తి కోరవచ్చు. ఆ భూమికి సంబంధించి బహుళ అమ్మకపు లావాదేవీలు జరిగి ఉంటే, యాజమాన్యపు హక్కులు కోరేందుకు అవి ఆధారం అవుతాయి. ఇటువంటి సమయాల్లో ఆ భూమిపై వివాదాలు తలెత్తితే, ఆ భూమి తమదేనని నిరూపించుకోవాల్సిన బాధ్యత వైరి వర్గంపై లేదా ప్రభుత్వంపై ఉంటుంది. రిజిస్టర్డ్ అమ్మకపు లావాదేవీలు జరిగినా కూడా చాలా కేసుల్లో ప్రైవేటు వ్యక్తుల యాజమాన్యపు హక్కులను ప్రభుత్వం నిరాకరిస్తూ వస్తోంది. ఇటువంటి కేసుల్లో ఆ భూమిపై హక్కులు తమవేనని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఎక్కువగా ఉంటుంది. భూమి తనదేనని నిరూపించుకునే సాక్ష్యాలను ప్రభుత్వమే చూపాల్సి ఉంటుంది. ఆర్ఎస్ఆర్ ప్రామాణికం కాదు... 3. రీ సర్వే అండ్ రీ సెటిల్మెంట్ రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్), టౌన్ సర్వే ల్యాండ్ రిజిస్టర్ (టీఎస్ఎల్ఆర్)లలోని వివరాలు యాజమాన్యపు హక్కులను నిర్దేశించేందుకు ప్రామాణికమా? రీ సర్వే అండ్ రీ సెటిల్మెంట్ రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్)లో డాట్లు (....) అంశం తరచుగా అటు కోర్టులను, ఇటు కక్షిదారులను ఏళ్ల తరబడి ఇబ్బంది పెడుతోంది. చాలా కేసుల్లో పట్టాదారు/ఇనాందారుకు ఉద్దేశించిన కాలమ్‌ను ఖాళీగా వదిలివేయడం లేదా ... (డాట్లు) పెట్టడం చేస్తున్నారు. ఆర్ఎస్ఆర్ అనేది యాజమాన్యపు హక్కులను నిర్దేశించేందుకు ఉద్దేశించిన డాక్యుమెంట్ కాదు. పట్టాదారు కాలమ్‌ను ఖాళీగా వదలడం, డాట్లు పెడుతుండటంపై ప్రభుత్వం వివరణ ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. ఆర్ఎస్ఆర్ను, అందులో పొందుపరిచిన వివరాలను నిశ్చయాత్మక ఆధారాలుగా పరిగణనలోకి తీసుకుని యాజమాన్యపు హక్కును నిర్ధారించటానికి వీల్లేదు. యాజమాన్యపు హక్కును నిర్ధారించేందుకు ఉన్న పలు రెవెన్యూ రికార్డుల్లో ఒకటిగా ఆర్ఎస్ఆర్ను పరిగణించాలి. ఆర్ఎస్ఆర్ రికార్డుల్లో భూమి ప్రభుత్వ భూమిగా చూపుతుంటే, అది పట్టా భూమి కాదని అనుకోవాల్సిన పనిలేదు. దాని అర్థం ఇనాం భూమి కాదని మాత్రమే. ఆర్‌ఎస్‌ఆర్‌లో పట్టాదారు కాలమ్‌ను ఖాళీగా వదిలివేయడం లేదా డాట్లు పెట్టి ఉంటే ప్రభుత్వ భూమిగా భావించకూడదు. పట్టాదారు పాసు పుస్తకాల చట్టం 1971 చట్టానికి ముందు, తరువాత జారీ చేసిన పట్టా, రెవెన్యూ రికార్డుల్లో పొందుపరిచిన వివరాల ఆధారంగా ప్రైవేటు వ్యక్తి ఆ భూమిపై యాజమాన్యపు హక్కులను కోరవచ్చు. ఈ హక్కులతో ప్రభుత్వం విభేదిస్తుంటే, దానిపై సంబంధిత సివిల్ కోర్టును ఆశ్రయించాలి. టౌన్ సర్వే ల్యాండ్ రిజిస్టర్ (టీఎస్ఎల్ఆర్)లో పొందుపరిచిన వివరాలు యాజమాన్యపు హక్కును నిర్ధారించేందుకు ప్రామాణిక ఆధారం కాదు. వివాదముంటే సర్కారు కోర్టుకెళ్లాలి... 4. యాజమాన్యపు హక్కులపై వివాదం నమ్మదగినదైతే, భూ ఆక్రమణల చట్టం 1905 కింద భూమిని ఖాళీ చేయించేందుకు ప్రొసీడింగ్స్‌ను జారీ చేయవచ్చా? పబ్లిక్ రోడ్లు, వీధులు, వంతెనలు, సముద్రపు ఒడ్డు తదితరాలు కాకుండా మిగిలిన భూముల యాజమాన్య హక్కుల విషయంలో ఓ వ్యక్తి లేవనెత్తిన వివాదం నమ్మదగినదైతే, ఆ భూములపై భూ ఆక్రమణ చట్టం 1905 కింద ప్రొసీడింగ్స్ జారీ చేయడడానికి వీల్లేదు. ఆ వ్యక్తి కోరుతున్న యాజమాన్యపు హక్కులతో ప్రభుత్వం విభేదిస్తుంటే.. సివిల్ కోర్టును ఆశ్రయించి యాజమాన్యపు హక్కులు పొందవచ్చు. చిక్కులన్నీ ఆర్ఎస్ఆర్ డాట్లతోనే... ‘ఎన్నో ఏళ్ల నుంచి అటు కోర్టులను, ఇటు కక్షిదారులను ఆర్‌ఎస్‌ఆర్‌లో డాట్లు ఇబ్బంది పెడుతూ వస్తున్నాయి. అధికారులు చాలా కేసుల్లో పట్టాదారు/ఇనాందారు కోసం ఉద్దేశించిన కాలమ్‌ను ఖాళీగా వదిలివేయడం లేదా అందులో డాట్లు పెట్టడం చేస్తూ వస్తున్నారు. అధికారులు ఇలా ఎందుకు చేస్తున్నారో ప్రభుత్వం చెప్పడం లేదు. లోతైన విశ్లేషణ చేస్తే మూడు కారణాల వల్ల అధికారులు అలా చేస్తున్నారని ఈ కోర్టు భావిస్తోంది. మొదటిది.. ఆర్‌ఎస్‌ఆర్‌లు తయారు చేసే సర్వే సిబ్బందికి వాస్తవంగా భూమి ఎవరికి చెందినదనే విషయాలు, ఇతర సమాచారం అందుబాటులో లేకపోవడం. రెండోది.. రీసర్వే సమయంలో భూమి ఎవరిదో వారు ఆ గ్రామం విడిచి వెళ్లిపోవడం. మూడోది.. ఆర్‌ఎస్‌ఆర్‌లో పట్టాదారు కాలమ్‌కు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఉన్న కాలమ్‌ను పూరించకపోవడం. అలా అసంపూర్తిగా వదిలేసిన డాక్యుమెంట్ ఆధారంగా ఆ భూమి పట్టాదారుకు చెందినది కాదని లేదా రైతుకు చెందినది కాదని చెప్పడం సరికాదు. అదే సమయంలో అది ప్రభుత్వ భూమి అని చెప్పడం కూడా సమంజం కాదు. నా అభిప్రాయం ప్రకారం.. పట్టాదారు కాలమ్‌ను ఖాళీగా వదిలివేయడం లేదా అందులో డాట్లు పెట్టడమంటే, భూమిని ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించిన సమాచారం లేదని అర్థం. అటువంటి కేసుల్లో, భూమిని సాగు చేస్తున్న వ్యక్తికి పట్టా జారీ చేసి ఉండి, అతని పేరు పట్టాదారు కాలమ్‌లో లేకపోతే, ఆ భూమిని ప్రభుత్వ భూమి అనొచ్చా..? ఎంతమాత్రం ప్రభుత్వ భూమి అనడానికి వీల్లేదు. ఆర్ఎస్ఆర్కు ప్రభుత్వమే సంరక్షకురాలు. కాబట్టి ఆర్ఎస్ఆర్లోని పట్టాదారు కాలమ్‌ను ఎందుకు పూరించలేదో చెప్పాల్సిన బాధ్యత దానిపై ఉంది’ అని జస్టిస్ నాగార్జునరెడ్డి తన తీర్పులో పేర్కొన్నారు. -
‘కొల్లేర’వుతున్నా పట్టించుకోరా?
=యథేచ్ఛగా చేపల చెరువులు తవ్వకం = నిబంధనలు గాలికి... = పట్టించుకోని అధికారగణం ముదినేపల్లి రూరల్, న్యూస్‌లైన్ : పట్టా, అసైన్డ్, పోరంబోకుతో సహా పచ్చని పైరుతో కళకళలాడుతున్న ముదినేపల్లి మండలంలోని భూములన్నీ నేడు కొల్లేరును తలపిస్తున్నాయి. ఈ ప్రాంతంలోని బడా బాబులు సెంటు భూమినీ వదలకుండా విచ్చలవిడిగా చేపలు, రొయ్యల చెరువులుగా మార్చేయడమే దీనికి కారణం. ఓ వైపు రాజ కీయ పలుకుబడి, మరోవైపు ధనబలంతో ఉన్న వారు లొంగదీసుకుంటున్నందు వల్లే సంబంధిత అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. భూములను చెరువులుగా మార్చాలంటే చిత్తడి నేలలు మాత్రమే ఉండాలి. ఇతర భూముల్లో కానీ.. పంటభూముల్లోకానీ చెరువులు తవ్వేందుకు నిబంధనలు అనుమతించవు. అలాగే సాగునీటిని అస్సలు వినియోగించకూడదు. వీటన్నింటికీ తోడు సరిహద్దు రైతులు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకూడదు. ఇవన్నీ ఉంటేనే మండల స్థాయి కమిటీ దరఖాస్తులు పరిశీలిస్తుంది. ఆపై డివిజన్, జిల్లా స్థాయి కమిటీలు ఆమోదించిన తరువాత మాత్రమే చెరువుల తవ్వకాలు చేపట్టాలి. మండలంలో మాత్రం ఇలాంటి నిబంధనలు ఎక్కడా పాటించడంలేదనే విమర్శలొస్తున్నాయి. అనేక గ్రామాల్లో పంట భూములన్నీ చెరువులుగా మారిపోయినా రెవెన్యూ రికార్డుల్లో మాత్రం ఇప్పటికీ ఆ భూముల్లో వరిసాగు జరుగుతున్నట్లు నమోదు చేయడం గమనార్హం. వైవాక, ఊటుకూరు, దేవపూడి, చిగురుకోట, పెదగొన్నూరు తదిత ర గ్రామాల్లో నిబంధనలు అతిక్రమించి చెరువులు తవ్వినా సంబంధిత వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పత్రికల్లో వార్తలు వెలువడిన రోజున మాత్రం మొక్కుబడిగా ఒకటి రెండు పొక్లెయిన్లు స్వాధీనం చేసుకుని నామమాత్రపు జరిమానా వేసి వదలివేస్తున్నారు. తవ్వకాలకు పెద్ద మొత్తంలో వ్యయం చేస్తున్న బడా బాబులపై ఇలాంటి జరిమానాలు ఏమాత్రం ప్రభావం చూపడంలేదు. మాట వినని రెవెన్యూ అధికారులపై రాజకీయ పలుకుబడి ఉపయోగిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. దీంతో ఉద్యోగ భద్రతకోసం అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తూ తవ్వకాలకు పరోక్షంగా తమవంతు సహకారాన్ని అందిస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. కొంతమంది వీఆర్వోలు బడా బాబులను రెవెన్యూ అధికారుల కార్యాలయాలకు తీసుకెళ్లి తవ్వకాలకు ఆమోద ముద్ర వేయిస్తున్నారు. పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే అతి తక్కువ కాలంలోనే మండలం మొత్తం కొల్లేరుకు ప్రతిరూపంగా మారుతుందనడంలో సందేహం లేదనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని చెరువుల తవ్వకాలపై ఉక్కుపాదం మోపాలని కోరుతున్నారు. -
‘వెబ్‌ల్యాండ్’ సాఫ్ట్‌వేర్‌తో జారీ ప్రక్రియ
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: మీ-సేవ కేంద్రాల రాకతో రెవెన్యూ శాఖలో అనూహ్య సంస్కరణలు చోటు చేసుకుంటున్నాయి. మాన్యువల్ ధ్రువీకరణ పత్రాల జారీ ఇప్పటికే గణనీయంగా తగ్గిపోయింది. తాజాగా పట్టాదారు పాసు పుస్తకాలను సైతం ‘మీసేవ’ల ద్వారానే జారీ చేసేందుకు సాఫ్ట్‌వేర్‌ను తీర్చిదిద్దారు. ఇప్పటి వరకు భూముల క్రయవిక్రయాలు అడ్డుగోలుగా చేపడుతుండటం.. భూములు చేతులు మారుతున్నా రెవెన్యూ రికార్డుల్లో మార్పులు జరగకపోవడం వల్ల పాలన అస్తవ్యస్తమవుతోంది. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు రెవెన్యూ శాఖ చర్యలు చేపట్టింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను రెవెన్యూ శాఖతో అనుసంధానం చేసి రెవెన్యూ రికార్డుల మేరకే భూముల రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. సాధారణంగా ఒక రైతు భూమిని విక్రయించి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలంటే ఆ వివరాలు 1బీ రికార్డుల్లో నమోదవ్వాలనే నిబంధన ఉంది. అదేవిధంగా విక్రయదారు పేరు మీద అడంగల్ తప్పనిసరి. కొనుగోలుదారు కూడా వెంటనే రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసుకోవాలి. ఈ నేపథ్యంలో పాలనను మరింత సులభతరం చేసేందుకు రెవెన్యూ రికార్డులను అనుసరించి పట్టాదారు పాసు పుస్తకాలను ఆన్లైన్ ద్వారా జారీ చేసేందుకు నిర్ణయించారు. ఇందుకోసం రెవెన్యూ శాఖ ఇటీవల వెబ్‌ల్యాండ్ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించి పుస్తకాల జారీకి శ్రీకారం చుట్టింది. భూముల క్రయవిక్రయాలకు అనుగుణంగా వెబ్‌ల్యాండ్‌లోనూ మార్పులు చోటు చేసుకోనున్నాయి. పాస్ పుస్తకాల జారీ ప్రక్రియ రెవెన్యూ యంత్రాంగానికి కాసుల పంట పండిస్తోంది. కొందరు అధికారులు రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇదే సమయంలో బోగస్ పట్టాదారు పాస్ పుస్తకాలు సైతం పుట్టగొడుగుల్లా పట్టుకొస్తున్నాయి. తాజాగా ఈ పాస్ పుస్తకాలు జారీ చేయనుండటంతో బోగస్‌లకు అడ్డుకట్ట పడనుంది. ఇప్పటికే వెబ్‌ల్యాండ్‌లో గ్రామం వారీగా 1బీ, అడంగల్ తదితర రెవెన్యూ రికార్డులను నమోదు చేస్తున్నారు. భూముల క్రయ విక్రయాలపై 30 నుంచి 40 శాతం వరకు రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చోటు చేసుకోకపోవడం వల్ల రికార్డుల్లో ఒక రైతు పేరుంటే.. క్షేత్ర స్థాయి లో మరొకరి పేరు ఉంటోంది. ఇలాంటి వారంతా మీ-సేవ కేంద్రాల్లో మార్పులు చేర్పులు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ-పాస్ పుస్తకాల కోసం రైతులు దరఖాస్తు చేసుకుంటున్నారు. రానున్న 45 రోజుల్లో ఎంతమందికి డిజిటల్ సంతకంతో ఈ-పాస్ పుస్తకాలు ఇస్తున్నారు.. పెండింగ్ ఏ స్థాయిలో ఉందనే విషయం తెలుస్తోంది. దీని ఆధారంగా కలెక్టర్, జేసీలు తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
రికార్డుల్లో విస్తీర్ణం సరిచేయండి
అనంతపురం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సర్వే నంబర్లోని విస్తీర్ణానికి అనుగుణంగా రెవెన్యూ రికార్డుల్లో విస్తీర్ణం సరిచేయాలని భూ పరిపాలన శాఖ కమిషనర్ (సీసీఎల్ఏ) కృష్ణారావు అధికారులను ఆదేశించారు. రెవెన్యూ అంశాలపై గురువారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలె క్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సలో కమిషనర్ మాట్లాడారు. రెవెన్యూ రికార్డులను రైతుల ఆధార్ నంబర్‌కు అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ రెండు నెలల్లోపు పూర్తి చేయాలన్నారు. ఆధార్ అనుసంధానంలో రాష్ట్రంలో అనంతపురం జిల్లా మూడో స్థానంలో నిలిచినందుకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్లను అభినందించారు. పభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ లోకేష్‌కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో 7,741 ఎకరాలు, పట్టణప్రాంతాల్లో 12 ఎకరాల ప్రభుత్వ భూమి గుర్తించామని, వీటి పరిరక్షణకు ట్రెంచ్‌లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఏడో విడతలో 8,744 ఎకరాల భూ పంపిణీకి సిద్ధం చేశామని వివరించారు. కార్యక్రమంలో జేసీ సత్యనారాయణ, అనంతపురం, కదిరి, కళ్యాణదుర్గం ఆర్డీఓలు హుస్సేన్‌సాబ్, రాజశేఖర్, మలోలా, డీఆర్డీఏ పీడీ నీలకంఠారెడ్డి పాల్గొన్నారు.