రెవెన్యూ ప్రాంగణాల్లో రిజిస్ట్రేషన్ ఆఫీసులు
- రాజస్థాన్ తరహా వ్యవస్థ ఏర్పాటుకు సర్కారు నిర్ణయం
- అనువైన స్థలాలను గుర్తించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశం
- భవనాల నిర్మాణానికి ముందుకొచ్చిన పోలీస్ హౌసింగ్ బోర్డు
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ కార్యాలయాల ప్రాంగణాల్లోనే రిజిస్ట్రేషన్ ఆఫీసులను ఏర్పాటు చేయాలని సర్కారు సంకల్పించింది. వివిధ ఆస్తుల విక్రయాలకు సంబంధించి జరిగే ప్రతి రిజిస్ట్రేషన్‌కు రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయాల్సి ఉన్నందున, ప్రజలకు సౌలభ్యంగా ఉండేలా రాజస్థాన్ తరహా విధానాన్ని అవలంభించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ సమయంలో ఏవైనా అనుమానాలు వ్యక్తమైతే, సంబంధిత మండల తహశీల్దార్లతో చర్చించి ఆయా డాక్యుమెంట్లను, పాస్‌బుక్, టైటిల్‌డీడ్‌లను వెనువెంటనే తనిఖీ చేసుకునేందుకు వెసులుబాటు కలుగనుందని చెబుతున్నారు.
కొత్తగా ఏర్పాటుచేయబోయే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను తహశీల్దారు కార్యాలయాల ప్రాంగణాల్లో నిర్మించాలని ప్రభుత్వం కూడా ఆదేశించడంతో స్థల సేకరణ నిమిత్తం అన్ని జిల్లాల కలెక్టర్లకు రిజిస్ట్రేసన్ల శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ తాజాగా లేఖరాశారు. ఒకవేళ తహశీల్దారు కార్యాలయ ప్రాంగణంలో స్థలం దొరకనట్లయితే, పరిసర ప్రాంతాల్లోనైనా అనువైన స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను రెవెన్యూ ప్రాంగణాల్లోనే ఏర్పాటు చేసేలా స్థానికంగా ఆ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని జిల్లా రిజిస్ట్రార్లను కూడా ఆదేశించారు. ఇదిలా ఉంటే.. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం పట్ల రిజిస్ట్రేషన్ల శాఖ సిబ్బంది నుంచే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎలక్ట్రానిక్ పాస్‌బుక్‌లు పంపిణీ చేస్తున్న తరుణంలో సదరు సమాచారాన్ని ఆన్‌లైన్‌లోనే తనిఖీ చేసే వీలున్నందున కార్యాలయాలు పక్కపక్కనే ఉండాల్సిన అవసరమేంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో 460 రెవెన్యూ మండలాలు ఉండగా, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కేవలం 144 మాత్రమే ఉండడాన్ని మరో అడ్డంకిగా చూపుతున్నారు.
పోలీస్ హౌసింగ్ బోర్డుకు నిర్మాణ బాధ్యతలు!
రాష్ట్రవ్యాప్తంగా 87 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు మూడు విడతలుగా సొంత భవనాలను ఏర్పాటు చేయాలని రిజిస్ట్రేషన్లశాఖ నిర్ణయించింది. తొలిదశలో 22 భవనాల నిర్మాణాన్ని తెలంగాణ రాష్ట్ర మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేపట్టగా, అందులో ఇప్పటికి 5 భవనాలు పూర్తయ్యాయి. అయితే.. తరచుగా భవనాల డిజైన్లను ఉన్నతాధికారులు మార్చుతుండడం, మార్చిన డిజైన్లను సకాలంలో ప్రభుత్వం ఆమోదించకపోతుండడం ఫలితంగా.. ఇకపై భవన నిర్మాణాలను తాము చేయలేమంటూ కార్పొరేషన్ చేతులెత్తేసింది. ఈ నే పథ్యంలో రిజిస్ట్రేషన్ల శాఖ ఈవోఐ (ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్) పిలవగా ఈడబ్ల్యుఐడీసీ, పోలీస్ హౌసింగ్ బోర్డు సంస్థలు ముందుకు వచ్చాయి. వీటిలో పోలీస్‌హౌసింగ్ బోర్డుకు నూతన భవనాల నిర్మాణ పనులను అప్పగించేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. అయితే.. నిర్మాణ వ్యయంలో 10 శాతం సొమ్మును ముందుగానే తమఖాతాలో జమ చేయాలంటూ సదరు నిర్మాణ సంస్థ షరతు పెట్టడం రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులకు మింగుడు పడని అంశంగా తయారైంది. ఈ విషయమై తదుపరి చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిసింది.