revenue offices
-
ఎక్కువ దరఖాస్తులు వాటికే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే దరఖాస్తుల్లో ఎక్కువగా ఇంటిగ్రేటెడ్, ఇన్కమ్ సర్టిఫికెట్ల కోసమే వస్తున్నాయి. ఆ తర్వాత ఫ్యామిలీ సర్టిఫికెట్, పుట్టిన తేదీ, డెత్ సర్టిఫికెట్ల కోసం అందుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాలు, మీసేవా కేంద్రాలు, ఆన్లైన్ వెబ్ అప్లికేషన్లు, కాల్ సెంటర్ల ద్వారా వచ్చే ఈ దరఖాస్తులకు సంబంధించిన సర్టిఫికెట్లను సులభంగా జారీచేసేందుకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు అమలుచేస్తోంది. అలాగే, సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయం క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుండడంతో క్షేత్రస్థాయిలో మార్పు కనపడుతోంది. సర్టిఫికెట్ల కోసం ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడానికి కారణాలు గుర్తించి వాటి పరిష్కారానికి అవసరమైన మార్గదర్శకాలు ఇస్తున్నారు. దరఖాస్తుల తీరూతెన్నూ ఎలా ఉందంటే.. ► గత నెలలో 26 జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ (క్యాస్ట్, నేటివిటీ, పుట్టిన తేదీ) సర్టిఫికెట్ల కోసం 1.34 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 92 వేల సర్టిఫికెట్లను ఆమోదించి జారీచేయగా, 1,050 సర్టిఫికెట్లను తిరస్కరించారు. 40 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అంటే 30 శాతం సర్టిఫికెట్లు పెండింగ్‌లో ఉన్నాయి. మూడు నెలలుగా చూస్తే ఈ సర్టిఫికెట్ల కోసం 2.68 లక్షల దరఖాస్తులు రాగా, 2.15 లక్షల దరఖాస్తులను మంజూరు చేశారు. 8,100 దరఖాస్తులను తిరస్కరించగా, 45 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 3 నెలల్లో ఈ సర్టిఫికెట్ల పెండింగ్ శాతం 16 శాతంగా ఉంది. ► అలాగే, గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఇన్కమ్ సర్టిఫికెట్ కోసం 1.15 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 95 వేల దరఖాస్తులను మంజూరు చేశారు. 2,700 దరఖాస్తులను తిరస్కరించగా, 18 వేల దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టారు. మూడు నెలలుగా చూసుకుంటే.. మొత్తం 2.20 లక్షల దరఖాస్తులు రాగా 1.93 లక్షల దరఖాస్తులను ఆమోదించి, 7,500 దరఖాస్తులను తిరస్కరించారు. 18 వేల దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టారు. ► ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం గత నెలలో 15,500 దరఖాస్తులు రాగా 7,500 దరఖాస్తుల్ని ఆమోదించి జారీచేశారు. 1,600 దరఖాస్తుల్ని తిరస్కరించగా, 6,500 దరఖాస్తుల్ని పెండింగ్‌లో పెట్టారు. ఈ దరఖాస్తులు 41% పెండింగ్‌లో ఉంటున్నాయి. మూడు నెలలుగా చూసుకుంటే 44 వేల దరఖాస్తులు రాగా 28 వేల దరఖాస్తుల్ని ఆమోదించి జారీచేశారు. 8,300 దరఖాస్తుల్ని తిరస్కరించగా, 7,500 దరఖాస్తుల్ని పెండింగ్‌లో ఉంచారు. 3 నెలల్లో ఈ దరఖాస్తులు 16% పెండింగ్‌లో ఉన్నాయి. ఈ దరఖాస్తుకు సంబంధించి గతంలో కుటుంబ పెద్ద సర్టిఫికెట్ పొంది ఉంటే దాని ప్రకారం అప్పటికప్పుడు వెంటనే సర్టిఫికెట్ జారీచేయాల్సి ఉంటుంది. ► పుట్టిన తేదీ సర్టిఫికెట్ కోసం ఆలస్యంగా చేసుకున్న దరఖాస్తులు గత నెలలో 4,100 రాగా ఇందులో 570ని జారీచేశారు. 17 దరఖాస్తులను తిరస్కరించగా, 3,500కి పైగా పెండింగ్‌లో ఉంచారు. వీటి పెండింగ్ శాతం 86గా ఉండడం గమనార్హం. ► డెత్ సర్టిఫికెట్ కోసం ఆలస్యంగా పెట్టుకున్న దరఖాస్తులు గత నెలలో 1,600 రాగా కేవలం 128నే ఆమోదించి జారీచేశారు. 17 దరఖాస్తులను తిరస్కరించారు. 1,400కి పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 90 శాతానికి పైగా పెండింగ్‌లో ఉండడం గమనార్హం. ► అలాగే, పుట్టిన తేదీ సర్టిఫికెట్ కోసం ఆలస్యంగా వచ్చే దరఖాస్తులకు సంబంధించి పదో తరగతి సర్టిఫికెట్‌ను ప్రామాణికంగా తీసుకోవాలని సీసీఎల్ఏ ఆదేశాలిచ్చింది. -
లంచగొండులపై ఉక్కుపాదం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాల మాట వినిపించకూడదని, ఎక్కడ అవినీతి ఉన్నా కూకటివేళ్లతో పెకిలించాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ చేసిన ఆదేశాలతో అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) లంచ గొండుల భరతం పడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున దాడులకు శ్రీకారం చుట్టింది. అవినీతి నిరోధానికి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ‘14400’ కాల్ సెంటర్లకు పెద్దఎత్తున కాల్స్ వస్తుండడంతో వీటిపైనా ఏసీబీ వేగంగా స్పందిస్తోంది. ఇప్పటికే ఈ కాల్‌సెంటర్‌పై ప్రజల్లో అవగాహన బాగా పెరిగినప్పటికీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు దీనికి విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించింది. అలాగే, లంచగొండులపై నిఘాను ముమ్మరం చేసింది. 10 నెలల్లో 44,999 కాల్స్ ► గత ఏడాది నవంబర్‌లో ‘14400’ కాల్ సెంటర్‌ను ప్రారంభించారు. ► ఇప్పటివరకు ఈ కాల్ సెంటర్‌కు 44,999 కాల్స్ రాగా ఇందులో అవినీతికి సంబంధించిన కాల్స్ 1,747 ఉన్నాయి. ► ఇందులో 1,712 ఫిర్యాదులను పరిష్కరించారు. మరో 161 కాల్స్‌పై చర్యలు తీసుకుంటున్నారు. ఈ కాల్ సెంటర్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 13 ట్రాప్ కేసులను కూడా ఏసీబీ నమోదు చేసింది. మూడు కేసుల్లో క్రిమినల్ దుష్ప్రవర్తన చర్యలను చేపట్టింది. ► మరో 67 ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. ► 46 రెగ్యులర్ విచారణలు.. 32 డిస్క్రీట్ విచారణలను చేపట్టారు. ► దీంతో ఈ కాల్‌సెంటర్ సూపర్‌హిట్ అయ్యిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ► అలాగే, వస్తున్న కాల్స్ ద్వారా ఏఏ శాఖల్లో ఏఏ అంశాలపై అక్రమార్కులు ప్రజలను లంచాలు డిమాండ్ చేస్తున్నారో ఏసీబీ గుర్తించింది. ► దీని ద్వారా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన తిమింగలాలతో పాటు సామాన్య ప్రజలను లంచాల పేరుతో పీడించే వారిపై తక్షణం దృష్టిసారించాలని నిర్ణయించింది. ► ఇందులో భాగంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు, మున్సిపల్, వైద్య ఆరోగ్య, విద్య, విద్యుత్ శాఖల్లో అక్రమార్కులపై ప్రధానంగా నిఘా పెట్టనుంది. -
రిజిస్ట్రేషన్లకు ‘నెట్వర్క్’ కష్టాలు!
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలకు ‘నెట్వర్క్’ కష్టాలు తప్పేట్టు లేవు. రిజిస్ట్రేషన్లకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించే నెట్‌వర్క్‌ను తహసీల్దార్ కార్యాలయాలకు అనుసంధానం చేయడం సమస్యగా మారే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఇటీవల ఏర్పాటు చేసుకున్న నెట్‌వర్క్‌ను ఇప్పుడు మరో 473 తహసీల్దార్ కార్యాలయాలకు విస్తృతం చేయాల్సి రావడమే ఇబ్బందిగా మారనుంది. నెట్‌వర్క్‌ను యేటా సమకూరుస్తున్న రెయిల్‌టెల్.. రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు మాత్రమే నెట్‌వర్క్‌ను సమకూరుస్తుందా.. లేదా అన్ని చోట్లకు విస్తరిస్తుందా.. అనే దానిపై స్పష్టత రావట్లేదు. విస్తరించని పక్షంలో తహసీల్దార్ కార్యాలయాల్లో స్వాన్ నెట్వర్క్ ద్వారానే రిజిస్ట్రేషన్లు జరపాల్సి వస్తుందా అన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. నెట్వర్క్.. చాలా టఫ్! రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు ఎలాంటి అంతరాయం లేకుండా సాగేందుకు ఇటీవల రైల్వే శాఖ టెక్నికల్ విభాగమైన ‘రెయిల్‌టెల్’ సహకారంతో రిజిస్ట్రేషన్ల శాఖ కొత్త నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంది. ఈ నెట్వర్క్ ద్వారానే ప్రస్తుతం రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పని చేస్తున్నాయి. ఇందుకు ఏటా రెయిల్‌టెల్‌కు రూ.1.20 కోట్ల రుసుము చెల్లిస్తోంది. ఇప్పుడు తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరగాలంటే ఈ నెట్‌వర్క్‌ను తప్పకుండా పొడిగించాల్సిన పరిస్థితి. అయితే మారుమూల ప్రాంతాల్లోని తహసీల్దార్ కార్యాలయాలకు నెట్‌వర్క్‌ను సమకూర్చి, నిర్వహించేందుకు రెయిల్‌టెల్ సంసిద్ధత వ్యక్తం చేస్తుందా అనేది అనుమానంగా కనిపిస్తోంది. స్వాన్‌తో చుక్కలే.. ఒకవేళ రెయిల్‌టెల్ చేతులెత్తేస్తే తహసీల్దార్ కార్యాలయాల్లో రిజి స్ట్రేషన్లకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఐటీ శాఖ అందించే స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్ (స్వాన్)తోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. గతంలో ఈ నెట్వర్క్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చింది. రెండు, మూడు రోజులకోసారి సర్వర్లు డౌన్ అయి తరచూ ఆటంకాలు ఎదురయ్యేవి. ఎక్కడ సమస్య వచ్చినా రాష్ట్రమంతటా కార్యకలాపాలు నిలిచిపోయేవి. ఈ నేపథ్యంలో రెయిల్‌టెల్ అంగీకరించకుండా స్వాన్‌తో సరిపెట్టుకోవాల్సి వస్తే మాత్రం మారుమూల ప్రాంతాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరగడం గగనమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
తహసీల్దార్ రిజిస్ట్రేషన్లు.. అంత ఈజీ కాదట!
సాక్షి, హైదరాబాద్ : రెవెన్యూ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందించే ప్రతిపాదనపై భిన్నాభి ప్రాయం వ్యక్తమవుతోంది. అటు ప్రభుత్వ పెద్దలుగానీ, ఇటు ఉన్నతాధికారులుగానీ పైకి ఏమీ మాట్లాడకపోయినా ఈ ప్రతిపాదన సాధ్యాసాధ్యాలపై తీవ్రమైన తర్జనభర్జన జరుగుతోంది. కొత్త విధానం అమలు అంత సులువుకాదని, ప్రస్తుత విధానం కొనసాగింపే మేలన్న భావన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఈనెల 8న జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అంతర్గతంగా ఇచ్చిన నివేదిక కీలకంగా మారింది. ఎమ్మార్వో కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవల అమలు సాధ్యాసాధ్యాలకు సంబంధించి ఆ నివేదికలో పేర్కొన్న గణాంకాలు, సూచనలు ప్రభుత్వ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. ప్రస్తుత విధానాన్ని కొనసాగించడమే మంచిదని ఆ నివేదిక స్పష్టం చేసినట్లు తెలిసింది.నివేదికలోని ముఖ్యాంశాలివీ.. రోజుకు ఒకటి రెండు డాక్యుమెంట్లే! గతేడాది రాష్ట్రంలోని 567 గ్రామీణ మండలాల్లో వ్యవసాయ భూముల కేటగిరీలో 4,54,607 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. అందులో 373 మండలాల్లో సగటున రోజుకు మూడు అంతకన్నా తక్కువ సంఖ్యలో (260 మండలాల్లో రోజుకు రెండు.. ఇందులో 128 మండలాల్లో రోజుకో డాక్యుమెంట్ మాత్రమే) డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. మిగతా 194 మండలాలకుగాను 65 చోట్ల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. అంటే సబ్రిజిస్ట్రార్లు లేని 129 మండలాల్లో మాత్రమే రోజుకు మూడు కన్నా ఎక్కువ లావాదేవీలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని మండల కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలు, మానవ వనరుల కల్పన అనవసరపు భారంగా మారుతుంది. ‘శిక్షణ’తో తలనొప్పి ప్రస్తుతం డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ల చట్టం–1908, స్టాంపుల చట్టం–1899 ప్రకారం రిజిస్టర్ అవుతున్నాయి. ఇప్పుడు ఎమ్మార్వో కార్యాలయాల్లో రిజిస్టర్ చేయాలంటే.. ఎమ్మార్వోలకు ఈ చట్టాలు, నియమ నిబంధనలు, స్టాండింగ్ ఆర్డర్ల గురించి శిక్షణ ఇవ్వాలి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రస్తుతం అమలు చేస్తున్న ‘కార్డ్ (కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్)’ వ్యవస్థపై కూడా 443 మంది ఎమ్మార్వోలకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్లున్న మండలాల్లో పనిచేస్తున్న ఎమ్మార్వోలకు వీటి గురించి అవగాహన ఉండదు. వారు తర్వాత సబ్రిజిస్ట్రార్లు లేని మండలాలకు బదిలీ అయితే శిక్షణ ఇవ్వాల్సి వస్తుంది. బోలెడు సిబ్బంది అవసరం ప్రతి సబ్‌రిజిస్ట్రార్‌కు ఒక సీనియర్ అసిస్టెంట్, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు సబార్డినేట్లు, క్లర్కులు కావాలి. మార్కెట్ విలువ సర్టిఫికెట్ల జారీ, చెక్స్లిప్ల తయారీ, డాక్యుమెంట్ల స్కానింగ్, చలానాలు, ఈసీల తయారీ, బయోమెట్రిక్ వివరాల సేకరణ, వెబ్‌ల్యాండ్‌ను పోల్చడం, పాస్ పుస్తకాల పరిశీలన, రికార్డుల మెయింటెనెన్స్, స్టాంపుల అమ్మకాల వంటి బాధ్యతలు ఉంటాయి. ఈ మేరకు పోస్టులు మంజూరు చేయాల్సి ఉంటుంది. ‘నెట్వర్క్’ ఎలా..? రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ‘కార్డ్ (కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్)’ వ్యవస్థ ఆధారంగా డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఎమ్మార్వో కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేయాలంటే ఆ మేరకు కంప్యూటర్లు, ఇంటర్నెట్ నెట్వర్క్ అనుసంధానం అవసరం. రాష్ట్రంలోని భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతమున్న 141 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు నెట్‌వర్క్‌ను నిర్వహించడమే గగనంగా ఉంది మారుమూల ప్రాంతాల్లోని 584 ఎమ్మార్వో కార్యాలయాలకు నెట్వర్క్ అందించడం చాలా కష్టం. సబ్రిజిస్ట్రార్ల పరిధితో తిప్పలు ప్రస్తుతం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు మండలాల ప్రాతిపదికన లేవు. కొన్ని మండలాల్లో సగం గ్రామాలు ఓ సబ్‌రిజిస్ట్రార్, మరిన్ని గ్రామాలు మరో సబ్‌రిజిస్ట్రార్ పరిధిలో ఉన్నాయి. ఇప్పుడు ఎమ్మార్వో కార్యాలయాల వారీగా విధానం అమలుతో.. పలు సబ్రిజిస్ట్రార్ల కార్యాలయాల పరిధిని మార్చాల్సి ఉంటుంది. పర్యవేక్షణకు ఇబ్బందులు ఇప్పుడున్న వ్యవస్థ ప్రకారం సబ్రిజిస్ట్రార్లు జిల్లా రిజిస్ట్రార్లకు, వారు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్‌కు బాధ్యులుగా ఉంటారు. ఎమ్మార్వోలు నేరుగా కలెక్టర్లకు బాధ్యులుగా ఉంటారు. ఇప్పుడు సబ్‌రిజిస్ట్రార్లతోపాటు ఎమ్మార్వోలు రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తే.. వారు ఎవరికి బాధ్యులుగా ఉండాలన్న సందేహం తలెత్తుతోంది. దీనితో ఇరు శాఖల సమన్వయంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశముంది. ఎమ్మార్వోలు అందుబాటులో లేకుంటే..? ఎమ్మార్వోల వ్యవస్థ అత్యంత క్రియాశీలంగా ఉంటుంది. వారు వారంలో మూడు రోజుల పాటు తమ పరిధిలో క్షేత్రస్థాయి పరిశీలనలతోపాటు వ్యవసాయం, సాగునీరు, ప్రోటోకాల్ లాంటి విధులకు హాజరుకావాల్సి ఉంటుంది. ‘క్రాస్ చెకింగ్’కు ఇబ్బందే ప్రస్తుతం భూముల మార్కెట్ విలువలను సబ్రిజిస్ట్రార్లు కన్వీనర్లుగా ఉన్న కమిటీ నిర్ధారిస్తుంది. అందులో ఎమ్మార్వో సభ్యుడిగా ఉంటారు. ఇప్పుడు ఈ రెండూ ఎమ్మార్వోనే చేయాల్సి వస్తుంది. ఇక నిషేధిత భూముల జాబితాలను ఎమ్మార్వోలే సబ్రిజిస్ట్రార్లకు ఇస్తారు. సబ్ రిజిస్ట్రార్లు వాటిని పరిశీలించి రిజిస్ట్రేషన్ల సమయంలో క్రాస్ చెకింగ్ చేస్తారు. కొత్త విధానంతో రెండు పనులూ ఎమ్మార్వోనే చేయాల్సి వస్తే క్రాస్ చెకింగ్‌కు అవకాశం లేకుండా పోతుంది. ఏటా తప్పని ఖర్చు రెవెన్యూ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందించాలంటే ఏర్పాట్ల కోసం ఒక్కో మండలంలో రూ.10 లక్షల వరకు అవసరం. ఈ లెక్కన రూ.44.3 కోట్లు ఖర్చవుతాయి. తర్వాత నిర్వహణ కోసం కూడా ఏటా రూ.5 కోట్ల వరకు అదనంగా ఖర్చవుతుంది. ఇది అనవసరపు భారంగా పరిణమిస్తుంది. ఈ యోచన సమంజసం కాదు! కొత్త పాస్ పుస్తకాలు రైతులకు ఇబ్బంది లేకుండా సకాలంలో అందించాలంటే.. రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖలను ఎలక్ట్రానిక్ అనుసంధానం చేస్తే సరిపోతుంది. ప్రభుత్వం అప్పటికీ చేయాలనుకుంటే రిజిస్ట్రేషన్ల చట్టానికి అనుగుణంగా ప్రతి మండలానికి, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు నోటిఫికేషన్లు జారీ చేయాలి. -
రెవెన్యూ ప్రాంగణాల్లో రిజిస్ట్రేషన్ ఆఫీసులు
- రాజస్థాన్ తరహా వ్యవస్థ ఏర్పాటుకు సర్కారు నిర్ణయం - అనువైన స్థలాలను గుర్తించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశం - భవనాల నిర్మాణానికి ముందుకొచ్చిన పోలీస్ హౌసింగ్ బోర్డు సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ కార్యాలయాల ప్రాంగణాల్లోనే రిజిస్ట్రేషన్ ఆఫీసులను ఏర్పాటు చేయాలని సర్కారు సంకల్పించింది. వివిధ ఆస్తుల విక్రయాలకు సంబంధించి జరిగే ప్రతి రిజిస్ట్రేషన్‌కు రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయాల్సి ఉన్నందున, ప్రజలకు సౌలభ్యంగా ఉండేలా రాజస్థాన్ తరహా విధానాన్ని అవలంభించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ సమయంలో ఏవైనా అనుమానాలు వ్యక్తమైతే, సంబంధిత మండల తహశీల్దార్లతో చర్చించి ఆయా డాక్యుమెంట్లను, పాస్‌బుక్, టైటిల్డీడ్లను వెనువెంటనే తనిఖీ చేసుకునేందుకు వెసులుబాటు కలుగనుందని చెబుతున్నారు. కొత్తగా ఏర్పాటుచేయబోయే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను తహశీల్దారు కార్యాలయాల ప్రాంగణాల్లో నిర్మించాలని ప్రభుత్వం కూడా ఆదేశించడంతో స్థల సేకరణ నిమిత్తం అన్ని జిల్లాల కలెక్టర్లకు రిజిస్ట్రేసన్ల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ తాజాగా లేఖరాశారు. ఒకవేళ తహశీల్దారు కార్యాలయ ప్రాంగణంలో స్థలం దొరకనట్లయితే, పరిసర ప్రాంతాల్లోనైనా అనువైన స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను రెవెన్యూ ప్రాంగణాల్లోనే ఏర్పాటు చేసేలా స్థానికంగా ఆ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని జిల్లా రిజిస్ట్రార్లను కూడా ఆదేశించారు. ఇదిలా ఉంటే.. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం పట్ల రిజిస్ట్రేషన్ల శాఖ సిబ్బంది నుంచే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎలక్ట్రానిక్ పాస్‌బుక్‌లు పంపిణీ చేస్తున్న తరుణంలో సదరు సమాచారాన్ని ఆన్లైన్లోనే తనిఖీ చేసే వీలున్నందున కార్యాలయాలు పక్కపక్కనే ఉండాల్సిన అవసరమేంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో 460 రెవెన్యూ మండలాలు ఉండగా, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కేవలం 144 మాత్రమే ఉండడాన్ని మరో అడ్డంకిగా చూపుతున్నారు. పోలీస్ హౌసింగ్ బోర్డుకు నిర్మాణ బాధ్యతలు! రాష్ట్రవ్యాప్తంగా 87 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు మూడు విడతలుగా సొంత భవనాలను ఏర్పాటు చేయాలని రిజిస్ట్రేషన్లశాఖ నిర్ణయించింది. తొలిదశలో 22 భవనాల నిర్మాణాన్ని తెలంగాణ రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టగా, అందులో ఇప్పటికి 5 భవనాలు పూర్తయ్యాయి. అయితే.. తరచుగా భవనాల డిజైన్లను ఉన్నతాధికారులు మార్చుతుండడం, మార్చిన డిజైన్లను సకాలంలో ప్రభుత్వం ఆమోదించకపోతుండడం ఫలితంగా.. ఇకపై భవన నిర్మాణాలను తాము చేయలేమంటూ కార్పొరేషన్ చేతులెత్తేసింది. ఈ నే పథ్యంలో రిజిస్ట్రేషన్ల శాఖ ఈవోఐ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్) పిలవగా ఈడబ్ల్యుఐడీసీ, పోలీస్ హౌసింగ్ బోర్డు సంస్థలు ముందుకు వచ్చాయి. వీటిలో పోలీస్‌హౌసింగ్ బోర్డుకు నూతన భవనాల నిర్మాణ పనులను అప్పగించేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. అయితే.. నిర్మాణ వ్యయంలో 10 శాతం సొమ్మును ముందుగానే తమఖాతాలో జమ చేయాలంటూ సదరు నిర్మాణ సంస్థ షరతు పెట్టడం రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులకు మింగుడు పడని అంశంగా తయారైంది. ఈ విషయమై తదుపరి చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిసింది. -
చెత్తబుట్టలో ‘పట్టాదార్’
♦ వెబ్‌ల్యాండ్ ముప్పతిప్పలు పెడుతున్న అధికారులు ♦ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న అన్నదాతలు ♦ అలసి, సొలసి ఆత్మహత్యల బాట పడుతున్న రైతన్నలు ♦ అక్రమాలకు నిలయంగా వెబ్‌ల్యాండ్ సాక్షి, హైదరాబాద్: పట్టాదారు పాస్‌పుస్తకం అంటే.. రైతుకు ఒక భరోసా. తన భూమి భద్రంగా ఉందనే నమ్మకం. అలాంటి పట్టాదారు పాస్ పుస్తకాలను రద్దు చేయాలని నిర్ణయించి రైతన్న హక్కును లాగేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఎత్తుగడ వేసింది. భూముల రికార్డు కోసం వెబ్‌ల్యాండ్ అంటూ మాయా ప్రపంచాన్ని సృష్టించి భూ కుంభకోణాలకు కొత్తదారులు ఏర్పాటు చేసింది. తద్వారా పట్టాదారు పాస్ పుస్తకాలకు మంగళం పాడాలని నిర్ణయించింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతలో వెనక్కి తగ్గిన ప్రభుత్వం దొడ్డిదారిన తన నిర్ణయాన్ని అమలు చేయిస్తోంది. ఇందులో భాగంగా పట్టాదారు పాస్ పుస్తకాల కోసం వచ్చిన దరఖాస్తులను భారీ సంఖ్యలో తిరస్కరిస్తోంది. దరఖాస్తులను పెండింగ్ పెడుతోంది. అంతేగాక పట్టాదారు పాస్‌పుస్తకాల కోసం దరఖాస్తు చేసిన రైతులను అధికారులు ముప్పతిప్పలు పెడుతున్నారు. కనీసం వాటిని పరిశీలించకుండా చెత్తబుట్టపాల్జేస్తున్నారు. చెత్తబుట్టలోకి దరఖాస్తులు..: పట్టాదారు పాసుపుస్తకాల జారీ, రెవెన్యూ రికార్డుల్లో సవరణల కోసం వచ్చిన దరఖాస్తులను అధికారులు చెత్తబుట్టలో వేస్తున్నారు. 2013 జూన్ 16 నుంచి ఈనెల 12వ తేదీ వరకూ పట్టాదారు పాసు పుస్తకాలు, రెవెన్యూ రికార్డుల్లో మార్పు చేర్పులు (మ్యుటేషన్ల) కోసం వచ్చిన అర్జీల్లో 37.35 శాతం దరఖాస్తులను అధికారులు రకరకాల సాకులతో తిరస్కరించి పక్కన పడేశారు. దీంతో వారు ఇందుకోసం చెల్లించిన సొమ్ము కూడా బూడిదలో పోసినట్లయింది. మరో 3.99 శాతం (40,514) అర్జీలు నిర్ణీత కాలం దాటినా పెండింగులో ఉన్నాయి. అర్జీదారుల్లో 41.44 శాతం మందికి (37.35 శాతం తిరస్కరణ, 3.99 శాతం దీర్ఘకాలిక పెండింగుతో కలిపి) తిరస్కరణే ఎదురైందని దీనిని బట్టి స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో వచ్చిన అర్జీల్లో ఆమోదించిన వాటి కంటే తిరస్కరించినవే ఎక్కువగా ఉండటం గమనార్హం. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన ఒక రైతు కొన్నేళ్ల కిందట నాలుగు ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఇది ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్నందున విలువ పెరిగింది. రెవెన్యూ రికార్డుల్లో ఈ భూమి యజమానిగా తన పేరు చేర్చాలని ఆయన ఏడాదన్నర కిందట దరఖాస్తు పెట్టుకోగా వివాదం ఉందనే సాకుతో అధికారులు తిరస్కరించారు. కుమార్తె వివాహం కోసం ఈ భూమిని అత్యవసరంగా అమ్ముకోవాలని ఆయన రెవెన్యూ కార్యాలయం చుట్టూ అనేక సార్లు తిరిగారు. చివరకు దళారీని సంప్రదించి రూ. 30 వేలు సమర్పించడంతో అధికారులు ఆ భూమిని వెబ్‌ల్యాండ్‌లో ఆయన పేరుతో మ్యుటేషన్ చేశారు. సీఎం సొంత జిల్లాలో మ్యుటేషన్, పట్టాదారు పాసు పుస్తకాల కోసం 1,28,482 అర్జీలు రాగా 57,747 దరఖాస్తులను అధికారులు ఆమోదించారు. 58,653 అర్జీలను తిరస్కరించారు. 12,082 దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. వేధింపులు భరించలేక.. :పట్టాదారు పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేసి, ఎన్నిసార్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకోవడంలేదనే ఆవేదనతో రైతులు ప్రత్యామ్నాయం లేక ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు చేసుకుంటున్న ఘటనలు కోకొల్లలు. తన భూమికి సంబంధించి పట్టాదారు పాస్‌పుస్తకం ఇవ్వాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా తహసీల్దార్ కనికరించకపోవడంతో వేరే మార్గం లేక ఆత్మహత్య చేసుకుంటున్నానని వైఎస్సార్ జిల్లా నందలూరు మండలానికి చెందిన ఒక రైతు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. అదే జిల్లాలోని చిట్వేలి మండలానికి చెందిన నారాయణరెడ్డి అనే రైతు పట్టాదారు పాసు పుస్తకం కోసం ఏడాది కిందట దరఖాస్తు చేస్తే తహసీల్దారు తిరస్కరించారు. అలాగే విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి పాల్గొన్న బహిరంగసభలోనే మరో రైతు ఆత్మహత్యయత్నం చేశాడు. విశాఖ జిల్లా సబ్బవరం మండలానికి చెందిన ఒక రైతు తనకు చట్టబద్ధంగా సంక్రమించిన భూమికి పాస్ పుస్తకం ఇవ్వాలని దరఖాస్తు చేసుకోగా.. రెవెన్యూ అధికారి తిరస్కరించారు. బాధిత రైతు జిల్లా కలెక్టర్‌కు అప్పీల్ చేసుకోగా.. నిజమైన వారనసత్వ హక్కు సదరు రైతుకే ఉన్నందున పాస్‌బుక్ ఇవ్వాలని ఆదేశించారు. వెబ్‌ల్యాండ్‌తో అక్రమాలకు అవకాశం.. రెవెన్యూ రికార్డులన్నీ కంప్యూటరీకరించి ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతున్నామని చెబుతున్న ప్రభుత్వం.. పరోక్షంగా పట్టాదారు పాస్‌పుస్తకాలకు మంగళం పాడే ఉద్దేశాన్ని దీని ద్వారా తెలియచెబుతోంది. పాస్ పుస్తకం అంటే అది రైతు వద్దే ఉంటుంది. వెబ్‌ల్యాండ్ రెవెన్యూ అధికారుల చేతుల్లో ఉండటంతో దానిని ఎలా మార్చేసే వెసులుబాటు వారికి ఉంటుంది. నిరక్షరాస్యులు దానిని తెలుసుకునే అవకాశమే లేదు. అసలే అక్రమాలకు అలవాటు పడ్డ అధికారులు, ప్రభుత్వ నేతలు ఈ వెబ్‌ల్యాండ్‌లో భూముల యజమానులను మార్చేసినా ఎవరికీ తెలియదు. వెబ్‌ల్యాండ్‌లో భూముల వివరాలను సులువుగా మార్చేసే అవకాశం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక వెబ్‌ల్యాండ్ డేటా ఆధారంగానే భూముల రిజిస్ట్రేషన్లు, వ్యవసాయ లోన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే అసలు రైతు పేరు మార్చేసి వేరే వాళ్లు వాటిని దక్కించుకునే అవకాశం లేకపోలేదు. -
'ప్రతిశాఖలోనూ రాబందులు ఉన్నారు'
రాజమండ్రి: ప్రతి శాఖలోనూ రాబందులు ఉన్నారని ఆంధ్రప్రదేశ్ రెవెన్యు ఎంప్లాయిస్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఘాటుగా విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఒకరిద్దరి గురించి మొత్తం వ్యవస్థను తప్పు పట్టడం సరికాదన్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు జరగడం లేదన్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. రెవెన్యు కార్యాలయల్లో ఆర్ఎస్ఆర్- ఎస్ఎల్ఆర్ లేకపోవడంతోనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. -
ఎదురు చూపులు
జిల్లాలో 1.15 లక్షల మంది రేషన్ కార్డులకోసం దరఖాస్తులు వీటిలో 99,915 దరఖాస్తులు అర్హమైనవిగా గుర్తింపు కార్డుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పేదలు సంక్షేమ కార్యక్రమాలకు రేషన్‌కార్డు లింకు పట్టించుకోని ప్రభుత్వం తిరుపతి: రేషన్‌కార్డుల కోసం పేద ప్రజలు అర్జీలు చేతబట్టుకుని రెవెన్యూ కార్యాలయాలు, నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలకు పైగా అయినప్పటికీ అదిగో ఇదిగో కొత్త రేషన్ కార్డులు ఇస్తామంటూ ప్రజలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మభ్యపెడుతూనే ఉన్నారు. గతంలో జరిగిన రెండు జన్మభూమి కార్యక్రమాలు, ప్రజావాణితో పాటు మండల కార్యాలయాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు జిల్లాలో 1.15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. జన్మభూమి కమిటీలు ఆమోదం తెలిపి అర్హులుగా గుర్తించిన తరువాత వీటిని తహశీల్దారు కార్యాలయానికి పంపి ఈపీడీఎస్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. తర్వాత ప్రభుత్వం వీరికి కొత్త కార్డులను మంజూరు చేస్తుంది. -
2 నుంచే ఇళ్ల పట్టాల పంపిణీ
ఆరుగురు మహిళలకు లాంఛనంగా పట్టాలను పంపిణీ చేయనున్న సీఎం కేసీఆర్ క్రమబద్ధీకరణ ప్రక్రియకు జూలైదాకా గడువు పెంపు సాక్షి, హైదరాబాద్: ఇళ్ల పట్టాల పంపిణీకి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేయనున్న ఆవిర్భావ దినోత్సవ వేదికపై వివిధ ప్రాంతాలకు చెందిన ఆరుగురు మహిళలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయించింది. ప్రభుత్వ స్థలాల్లో నివాసమేర్పరచుకున్న పేదలకు ఆయా స్థలాలను ఉచితంగా క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం గత డిసెంబర్లో ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇళ్ల పట్టాల కోసం వేచి చూస్తున్న సుమారు 1.30 లక్షలమంది అర్హులైన పేదలకు స్థానిక మండల రెవెన్యూ కార్యాలయాల ద్వారా పట్టాలను పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. జూలై వరకు గడువు పెంపు: ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల(జీవో 58, 59) మేరకు క్రమబద్ధీకరణ ప్రక్రియకు ఏప్రిల్ నెలాఖరుతో గడువు ముగిసింది. వీలైనంత ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం క్రమబద్ధీకరణ ప్రక్రియ గడువును జూలై నెలాఖరు వరకు పొడిగించిందని అధికారులు తెలిపారు. వాస్తవానికి క్రమబద్ధీకరణ కోసమని రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,66,150 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 3,36,869 మంది జీవో 58 ప్రకారం ఉచిత క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోగా, 29,281 వేలమంది జీవో 59 మేరకు చెల్లింపు కేటగిరీ కింద దరఖాస్తులు సమర్పించారు. అయితే.. ఉచిత కేటగిరీ కింద అందిన దరఖాస్తుల్లో కేంద్ర ప్రభుత్వ, రైల్వే మిలిటరీ.. తదితర సంస్థల భూములకు చెందిన దరఖాస్తులు లక్షకుపైగా ఉన్నట్లు నిర్ధారించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కూడా 21 రకాల అభ్యంతరకరమైన భూములకు చెందిన దరఖాస్తులు లక్షకు పైగా ఉన్నట్లు తేలింది. పురుషుల పేరిటా పట్టాలు క్రమబద్ధీకరణ ప్రక్రియ కింద ఇచ్చే ఇళ్ల పట్టాలను ఆయా కుటుంబాల్లోని మహిళల పేరిటే ఇవ్వాలని సర్కారు ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే.. రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న సుమారు 20 వేల కుటుంబాల్లో మహిళలు లే రని తేలింది. క్షేత్రస్థాయి అధికారుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మహిళలు లేని కుటుంబాల్లో పురుషుల పేరిట పట్టాలు ఇవ్వాలని అధికారులను సర్కారు ఆదేశించిం ది. ఇదిలా ఉంటే.. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని అభ్యంతరకర భూముల క్రమబద్ధీకరణ విషయమై ఆయా విభాగాలతో చర్చించేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. అలాగే.. చెల్లింపు కేటగిరీలో దరఖాస్తుల పరిశీలన కూడా గడువులోగా పూర్తి చేయాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. జూలై నెలాఖరులోగా క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి కాకుంటే క్రమబద్దీకరణ ప్రక్రియ గడువును మరోమారు పొడిగించే అవకాశం లేకపోలేదని రెవెన్యూ శాఖలోని ఓ కీలక అధికారి తెలిపారు. క్రమబద్ధీకరణ ప్రక్రియ ఇలా.. అందిన దరఖాస్తులు 3,66,150 ఉచిత కేటగిరీకి చెందినవి 3,36,869 చెల్లింపు కేటగిరీలో వచ్చినవి 29,281 కేంద్రానికి చెందిన భూములు 1,03,331 పట్టాలకు ఎంపికైన దరఖాస్తులు 1,32,819 సిద్ధంగా ఉన్న పట్టాలు 1,30,000 -
ఒకే సముదాయంలోకి ‘రెవెన్యూ’
రూ. 20 కోట్లు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ హైదరాబాద్: భూములతో సం బంధమున్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఒకే సముదాయంలో నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటికోసం రూ. 20 కోట్లు మంజూరు చేస్తున్నట్టుగా ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి మహమూద్ అలీ ప్రకటించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు, జిల్లా రిజిష్ట్రార్లతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. విభజన తర్వాత స్టాంపుల విక్రయం, రిజిస్ట్రేషన్ల ద్వారా తగ్గిన ఆదాయాన్ని, అందుకు కారణాలను మంత్రి తెలుసుకున్నారు. సబ్ రిజిష్ట్రారు కార్యాలయాలున్న పట్టణాల్లో రెవెన్యూ, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలకు ఒకే సముదాయంలో నిర్మించాలని నిర్ణయించారు. కలెక్టరేట్లలోనే రిజిస్ట్రేషన్ కార్యాలయాలను, ఆర్డీవో, మండల రెవెన్యూ కార్యాలయాలని నిర్మించాలని ఆదేశించారు. దీనికోసం రూ. 20 కోట్లు మం జూరు చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ సమావేశంలో రెవెన్యూ ముఖ్య కార్యదర్శి వినోద్‌కుమార్ అగర్వాల్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనరు డి. విజయకుమార్, జాయింట్ ఐజీ వెంకటరాజేష్, డీఐజీ శ్రీనివాసులు, జిల్లా రిజి ష్ట్రార్లు తదితరులు పాల్గొన్నారు. -
రేషన్‌కు గండం
నర్సీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలో 10.84 లక్షల మంది రేషన్ కార్డు వినియోగదారులకు ప్రభుత్వం రాయితీపై బియ్యం, కిరోసిన్, నూనె, కందిపప్పు, పంచదారతో పాటు వివిధ రకాలైన సరకులు పంపిణీ చేస్తోంది. ఈ విధంగా ప్రతి నెలా వినియోగదారులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 1,980 రేషన్ షాపులను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ప్రతి నెలా పంపిణీ చేసేందుకు బియ్యం 17 వేల టన్నులు, పంచదార 542 టన్నులు, కిరోసిన్ 2,112 కిలో లీటర్లు, నూనె, కందిపప్పు, చింతపండు, ఉప్పు 10.84 వేల క్వింటాళ్ల వంతున దిగుమతి చేసి రేషన్ షాపుల ద్వారా వినియోగదారులకు అందజేస్తోంది. 18 నుంచే ప్రక్రియ ప్రారంభం : ప్రతి నెలా పంపిణీ చేసే రేషన్ సరుకుల ప్రక్రియ ముందు నెల 20 నుంచే ప్రారంభమవుతుంది. 18 నుంచి రేషన్ షాపుల డీలర్లు రెవెన్యూ అధికారులకు సరుకుల మొత్తానికి అవసరమైన సొమ్మును డీడీల రూపంలో చెల్లిస్తుంటారు. వీటిని తీసుకున్న రెవెన్యూ అధికారులు సరుకుల విడుదలకు సంబంధించిన ఆర్ఓ (రూట్ ఆర్డర్) ఇస్తారు. దీనిని తీసుకున్న డీలర్లు ప్రతి నెలా 25 నుంచి మండల స్టాక్ పాయింట్ వద్ద నుంచి అవసరమైన సరుకులను రేషన్ షాపులకు తరలిస్తుంటారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత డీలర్లు తదుపరి నెల ప్రారంభం నుంచి సరుకులను వినియోగదారులకు అమ్మకాలు చేస్తుంటారు. నిలిచిపోయిన ప్రక్రియ : రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులంతా సమ్మెలో పాల్గొనడంతో పాటు డీలర్లు, హమాలీలు కూడా ఉద్యమంలో భాగస్వాములు కావడంతో సెప్టెంబరు నెలకు సరుకుల విడుదలకు సంబంధించిన ప్రక్రియ దాదాపుగా నిలిచిపోయింది. ఇప్పటికే కొంతమంది డీలర్లు డీడీలు తీసి, రెవెన్యూ కార్యాలయాలకు వెళ్లినా వాటిని తీసుకునే నాథుడే కరువయ్యాడు. తహశీల్దారులంతా సమ్మెలో పాల్గొనడంతో వీటికి అవసరమైన ఆర్ఓలు ఇచ్చేందుకు ఇబ్బందులెదురవుతున్నాయి. దీంతో ఇప్పటికే రేషన్ షాపులకు పంపిణీ కావాల్సిన సరుకుల సరఫరా ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ విషయాన్ని గుర్తించిన పౌరసరఫరాల కమిషనర్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించినా నేటికీ ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఈ పరిస్థితుల్లో సెప్టెంబరు నెల రేషన్ సరుకుల పంపిణీ జరుగుతుందో లేదోనని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.