చెత్తబుట్టలో ‘పట్టాదార్’
♦ వెబ్‌ల్యాండ్ ముప్పతిప్పలు పెడుతున్న అధికారులు
♦ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న అన్నదాతలు
♦ అలసి, సొలసి ఆత్మహత్యల బాట పడుతున్న రైతన్నలు
♦ అక్రమాలకు నిలయంగా వెబ్‌ల్యాండ్
సాక్షి, హైదరాబాద్: పట్టాదారు పాస్‌పుస్తకం అంటే.. రైతుకు ఒక భరోసా. తన భూమి భద్రంగా ఉందనే నమ్మకం. అలాంటి పట్టాదారు పాస్ పుస్తకాలను రద్దు చేయాలని నిర్ణయించి రైతన్న హక్కును లాగేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఎత్తుగడ వేసింది. భూముల రికార్డు కోసం వెబ్‌ల్యాండ్ అంటూ మాయా ప్రపంచాన్ని సృష్టించి భూ కుంభకోణాలకు కొత్తదారులు ఏర్పాటు చేసింది. తద్వారా పట్టాదారు పాస్ పుస్తకాలకు మంగళం పాడాలని నిర్ణయించింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతలో వెనక్కి తగ్గిన ప్రభుత్వం దొడ్డిదారిన తన నిర్ణయాన్ని అమలు చేయిస్తోంది. ఇందులో భాగంగా పట్టాదారు పాస్ పుస్తకాల కోసం వచ్చిన దరఖాస్తులను భారీ సంఖ్యలో తిరస్కరిస్తోంది. దరఖాస్తులను పెండింగ్ పెడుతోంది. అంతేగాక పట్టాదారు పాస్‌పుస్తకాల కోసం దరఖాస్తు చేసిన రైతులను అధికారులు ముప్పతిప్పలు పెడుతున్నారు. కనీసం వాటిని పరిశీలించకుండా చెత్తబుట్టపాల్జేస్తున్నారు.
చెత్తబుట్టలోకి దరఖాస్తులు..: పట్టాదారు పాసుపుస్తకాల జారీ, రెవెన్యూ రికార్డుల్లో సవరణల కోసం వచ్చిన దరఖాస్తులను అధికారులు చెత్తబుట్టలో వేస్తున్నారు. 2013 జూన్ 16 నుంచి ఈనెల 12వ తేదీ వరకూ పట్టాదారు పాసు పుస్తకాలు, రెవెన్యూ రికార్డుల్లో మార్పు చేర్పులు (మ్యుటేషన్ల) కోసం వచ్చిన అర్జీల్లో 37.35 శాతం దరఖాస్తులను అధికారులు రకరకాల సాకులతో తిరస్కరించి పక్కన పడేశారు. దీంతో వారు ఇందుకోసం చెల్లించిన సొమ్ము కూడా బూడిదలో పోసినట్లయింది. మరో 3.99 శాతం (40,514) అర్జీలు నిర్ణీత కాలం దాటినా పెండింగులో ఉన్నాయి. అర్జీదారుల్లో 41.44 శాతం మందికి (37.35 శాతం తిరస్కరణ, 3.99 శాతం దీర్ఘకాలిక పెండింగుతో కలిపి) తిరస్కరణే ఎదురైందని దీనిని బట్టి స్పష్టమవుతోంది.
ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో వచ్చిన అర్జీల్లో ఆమోదించిన వాటి కంటే తిరస్కరించినవే ఎక్కువగా ఉండటం గమనార్హం. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన ఒక రైతు కొన్నేళ్ల కిందట నాలుగు ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఇది ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్నందున విలువ పెరిగింది. రెవెన్యూ రికార్డుల్లో ఈ భూమి యజమానిగా తన పేరు చేర్చాలని ఆయన ఏడాదన్నర కిందట దరఖాస్తు పెట్టుకోగా వివాదం ఉందనే సాకుతో అధికారులు తిరస్కరించారు. కుమార్తె వివాహం కోసం ఈ భూమిని అత్యవసరంగా అమ్ముకోవాలని ఆయన రెవెన్యూ కార్యాలయం చుట్టూ అనేక సార్లు తిరిగారు. చివరకు దళారీని సంప్రదించి రూ. 30 వేలు సమర్పించడంతో అధికారులు ఆ భూమిని వెబ్‌ల్యాండ్‌లో ఆయన పేరుతో మ్యుటేషన్ చేశారు. సీఎం సొంత జిల్లాలో మ్యుటేషన్, పట్టాదారు పాసు పుస్తకాల కోసం 1,28,482 అర్జీలు రాగా 57,747 దరఖాస్తులను అధికారులు ఆమోదించారు. 58,653 అర్జీలను తిరస్కరించారు.
12,082 దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి.
వేధింపులు భరించలేక.. :పట్టాదారు పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేసి, ఎన్నిసార్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకోవడంలేదనే ఆవేదనతో రైతులు ప్రత్యామ్నాయం లేక ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు చేసుకుంటున్న ఘటనలు కోకొల్లలు. తన భూమికి సంబంధించి పట్టాదారు పాస్‌పుస్తకం ఇవ్వాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా తహసీల్దార్ కనికరించకపోవడంతో వేరే మార్గం లేక ఆత్మహత్య చేసుకుంటున్నానని వైఎస్సార్ జిల్లా నందలూరు మండలానికి చెందిన ఒక రైతు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. అదే జిల్లాలోని చిట్వేలి మండలానికి చెందిన నారాయణరెడ్డి అనే రైతు పట్టాదారు పాసు పుస్తకం కోసం ఏడాది కిందట దరఖాస్తు చేస్తే తహసీల్దారు తిరస్కరించారు. అలాగే విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి పాల్గొన్న బహిరంగసభలోనే మరో రైతు ఆత్మహత్యయత్నం చేశాడు. విశాఖ జిల్లా సబ్బవరం మండలానికి చెందిన ఒక రైతు తనకు చట్టబద్ధంగా సంక్రమించిన భూమికి పాస్ పుస్తకం ఇవ్వాలని దరఖాస్తు చేసుకోగా.. రెవెన్యూ అధికారి తిరస్కరించారు. బాధిత రైతు జిల్లా కలెక్టర్‌కు అప్పీల్ చేసుకోగా.. నిజమైన వారనసత్వ హక్కు సదరు రైతుకే ఉన్నందున పాస్‌బుక్ ఇవ్వాలని ఆదేశించారు.
వెబ్‌ల్యాండ్‌తో అక్రమాలకు అవకాశం..
రెవెన్యూ రికార్డులన్నీ కంప్యూటరీకరించి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతున్నామని చెబుతున్న ప్రభుత్వం.. పరోక్షంగా పట్టాదారు పాస్‌పుస్తకాలకు మంగళం పాడే ఉద్దేశాన్ని దీని ద్వారా తెలియచెబుతోంది. పాస్ పుస్తకం అంటే అది రైతు వద్దే ఉంటుంది. వెబ్‌ల్యాండ్ రెవెన్యూ అధికారుల చేతుల్లో ఉండటంతో దానిని ఎలా మార్చేసే వెసులుబాటు వారికి ఉంటుంది. నిరక్షరాస్యులు దానిని తెలుసుకునే అవకాశమే లేదు. అసలే అక్రమాలకు అలవాటు పడ్డ అధికారులు, ప్రభుత్వ నేతలు ఈ వెబ్‌ల్యాండ్‌లో భూముల యజమానులను మార్చేసినా ఎవరికీ తెలియదు. వెబ్‌ల్యాండ్‌లో భూముల వివరాలను సులువుగా మార్చేసే అవకాశం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక వెబ్‌ల్యాండ్ డేటా ఆధారంగానే భూముల రిజిస్ట్రేషన్లు, వ్యవసాయ లోన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే అసలు రైతు పేరు మార్చేసి వేరే వాళ్లు వాటిని దక్కించుకునే అవకాశం లేకపోలేదు.