తెలుగింట నెల వ్యవధిలో 22 మంది ఆత్మహత్య
రైతులకోసం ఎంతో చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. అదంతా నిజం కాదని వాస్తవ పరిస్థితి నిరూపిస్తోంది. రాష్ట్రంలో కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యలే ఇందుకు నిదర్శనం. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలోనే రైతుల ఆత్మహత్యలు అధికంగా నమోదవుతుండడం తీవ్ర విషాదకరం. ముఖ్యంగా కౌలు రైతులు పెద్ద ఎత్తున బలవన్మరణాలకు పాల్పడుతుండడం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. కొన్నాళ్లుగా రాష్ట్రంలో నమోదైన కౌలు రైతుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన జూన్ నుంచి ఇప్పటివరకు 148 మంది కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడగా.. గడిచిన నెలరోజుల్లోనే 22 మంది తమ ప్రాణాలను పురుగుమందుకో, ఉరితాడుకో బలివ్వడం గుండెలను పిండేస్తున్న నిజం. తాను నిరంతర విద్యార్థినని చెప్పుకుంటున్న ప్రభుత్వ పెద్దకు మాత్రం ఇవేవీ పట్టవు. అధికారంలోకి రాకముందు కౌలు రైతులకు ఇచ్చిన హామీలు గుర్తుకురావు గాక రావు.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కౌలురైతుల ఇంట చావుడప్పు మోగుతోంది. పండిన పంటకు గిట్టుబాటు లేక కొందరు, అప్పు పుట్టక ఇంకొందరు, చేసిన అప్పు తీర్చలేక మరికొందరు, ప్రకృతి వైపరీత్యాలకు ఇంకొందరు తనువు చాలిస్తున్నారు. కౌలు రైతులను ఆదుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు. ఎన్నికలకు ముందు కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు, పంట రుణాలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడా ఊసే మరిచారు. కౌలు రైతులకు అప్పు పుట్టక వడ్డీ వ్యాపారులపై ఆధారపడుతున్నారు. దిగుబడి లేక, గిట్టుబాటు ధర రాక, అప్పు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన జూన్ నుంచి ఇప్పటివరకు 148 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
గుంటూరు జిల్లాలోనే అధికం...
గత నెలరోజుల వ్యవధిలో రాష్ట్రంలో 22 మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో 8 మంది ఒక్క గుంటూరు జిల్లాకు చెందినవారు. నాగార్జునసాగర్ కుడికాల్వ కింద ఆయకట్టుకు నాలుగేళ్లుగా నీళ్లు ఇవ్వకపోవడంతో రైతుల పరిస్థితి దుర్భరంగా తయారైంది. రుణమాఫీ వర్తించకపోవడం, అప్పులిచ్చే విషయంలో బ్యాంకులు ముఖం చాటేయడంతో అధిక వడ్డీలకు అప్పు తెచ్చి పంటలేశారు. గిట్టుబాటు ధర లేక, అప్పుల ఊబి నుంచి బయటపడలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత 31 రోజుల్లో రాయలసీమలో ఏడుగురు, ఉత్తర కోస్తాలో ఇద్దరు, దక్షిణ కోస్తాలో 13 మంది చనిపోయారు. జిల్లాలవారీగా చూస్తే అనంతపురంలో ముగ్గురు, ప్రకాశంలో ఇద్దరు, గుంటూరులో 8 మంది, కర్నూలు, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున, చిత్తూరు, వైఎస్సార్, తూర్పుగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కౌలు రైతులు ప్రాణాలు తీసుకున్నారు.
ఏ ఒక్క హామీ అమలు కాకనే...
రాష్ట్రంలో 30 లక్షల మందికిపైగా కౌలు రైతులున్నట్టు అనధికార అంచనా. రాష్ట్రప్రభుత్వం మాత్రం 16 లక్షల మంది ఉన్నట్టు గుర్తించి వీరిలో 11 లక్షల మందికి ఈ ఏడాది రుణఅర్హత పత్రాలు, సాగు ధ్రువీకరణ పత్రాలు ఇస్తామని ప్రకటించింది. అయితే ఇందులో మూడో వంతు మందికి కూడా ఇవి అందలేదు. రెవెన్యూ శాఖ 1,70,403 మందికి మాత్రమే రుణ అర్హత పత్రాలిచ్చింది. వ్యవసాయ శాఖ 72,893 మందికి సర్టిఫికెట్ ఆఫ్ కల్టివేషన్ కార్డులు ఇచ్చింది. ఈ ఖరీఫ్ సీజన్‌లో 2,43,296 మందికి మాత్రమే బ్యాంకుల ద్వారా అది కూడా కేవలం 666.73 కోట్ల రుణం మంజూరైంది. అయితే మొత్తం 16 లక్షల మంది కౌలుదారులకు కలపి రూ.5 వేల కోట్ల రుణాలు ఇవ్వాలన్న లక్ష్యమెక్కడ? ఇచ్చిన రుణాలు ఎక్కడ? ప్రభుత్వం చెబుతున్న రుణ లెక్కలపై రైతు సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. కౌలు రైతులకు రూ.200 కోట్లకు మించి ఇవ్వలేదని, ప్రభుత్వం చెబుతున్నవి కాకిలెక్కలని ఆక్షేపిస్తున్నాయి.
రాష్ట్రప్రభుత్వం కౌలు రైతులకిస్తానన్న పంట రుణాలివ్వలేదని, వడ్డీ లేని, పావలావడ్డీ రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా చెల్లించాల్సిన నగదు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి ఎదురవుతోందని మండిపడుతున్నాయి. మొత్తం పంట రుణాల్లో పది శాతానికిపైగా కౌలుదారులకు ఇవ్వాల్సి ఉండగా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు మాత్రం కేవలం 0.45 శాతమే ఇస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. కౌలు రైతుల ఆత్మహత్యలకు రాష్ట్రప్రభుత్వానిదే బాధ్యతని విమర్శిస్తున్నాయి. కౌలు రైతులకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నాయి. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని సూచిస్తున్నాయి. కౌలు రైతుల ఆత్మహత్యల నివారణకు పలు పరిష్కార మార్గాలను సూచించాయి. ఈ రకమైన రక్షణ కల్పించనంత వరకు కౌలు రైతుల బలవన్మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని సంఘాల నేతలు ఎంవీఎస్ నాగిరెడ్డి, కేవీవీ ప్రసాద్, పి.జమలయ్య, కేశవరావు, రావుల వెంకయ్య అభిప్రాయపడ్డారు.