ఒకేదఫాలో రైతు రుణమాఫీ చేయాలి
రైతు ఆత్మహత్యల నివారణ కమిటీ
బజార్‌హత్నూర్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఒకే దఫాలో రైతు రుణమాఫీ చేసి బ్యాంకుల ద్వారా కొత్త పంట రుణాలను రైతులకు మంజూరు చేయాలని రైతు ఆత్మహత్యల నివారణ కమిటీ జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్తి పంట సాగును తగ్గించమని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం పప్పు దినుసులకు కేవలం రూ.5వేల ధర కల్పించడం దారుణమని వాపోయారు. కంది పప్పు ధర మార్కెట్‌లో క్వింటాలుకు రూ.16,000 ఉందని, రైతులు పండించే కందులకు మాత్రం రూ.5వేలు మద్దతు ధర ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు.
రైతులకు భరోసానిచ్చేందుకు ఒకే దఫాలో రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం 42మంది రైతు కుటుంబాలకు మాత్రమే ఆర్థిక తోడ్పాటు అందించిందని తెలిపారు. ప్రభుత్వం రైతులకు అండగా నిలువాలని కోరారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల పిల్లలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించాలని, కుటుంబ యజమానురాలికి ప్రతి నెల రూ.5వేలు పింఛన్ ఇవ్వాలని, రూ.10లక్షలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చట్ల విలాస్, రైతులు చట్ల జగదీష్, దీసి విజేందర్, కొత్త గంగయ్య పాల్గొన్నారు.