గుర్రంకొండ: సంక్రాంతి విశిష్టత.. ఆ పండుగ సందడి గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే అలాంటి పర్వదినానికి కొన్ని గ్రామాలు కొన్నేళ్ల నుంచి దూరంగా ఉంటున్నాయి. ఇది అక్కడి ఆచారంగా కొనసాగుతుండటం గమనార్హం. ఇలాంటి పల్లె సీమలు అన్నమయ్య జిల్లా గుర్రకొండ మండలంలో 18 ఉన్నాయి. పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని.. ఆ గ్రామాల వాసులు ఆధునిక కాలంలో కూడా పాటిస్తుండటం విశేషం. ఎప్పుడో పెద్దలు ఏర్పాటు చేసుకొన్న కట్టుబాట్లను కలసికట్టుగా అమలు చేస్తుండటం వారి ప్రత్యేకత.
మార్చిలో ఉత్సవాలే వారికి సంక్రాంతి
మండలంలోని మారుమూల టి.పసలవాండ్లపల్లె పంచాయతీలో 18 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల వాసులందరూ కలిసి టి.పసలవాండ్లపల్లెలో ఉన్న శ్రీ పల్లావలమ్మ అమ్మవారిని గ్రామ దేవతగా కొలుస్తారు. ఏటా మార్చిలో నిర్వహించే గ్రామదేవత శ్రీ పల్లావలమ్మ జాతర ఉత్సవాలే ఇక్కడి ప్రజలకు సంక్రాంతి పండుగ. శ్రీ పల్లావలమ్మ ఆజ్ఞానుసారం ఈ పర్వదినం జరపకూడదంటూ పూర్వకాలంలో గ్రామపెద్దలు నిర్ణయించారు. వారి ఆదేశాలనే నేటికీ పాటిస్తున్నారు. గ్రామంలో కొన్ని పశువులను గ్రామదేవత పల్లావలమ్మ పేరుమీద వదిలేసి కొందరు వాటిని మేపుతుంటారు. వాటిలో ఆవులను అమ్మవారి ఉత్సవాల రోజున అందంగా అలంకరించి ఆలయం వద్దకు ఊరేగింపుగా తీసుకెళతారు. అక్కడ వాటికి భక్తిశ్రద్ధలతో అందరూ పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అదే వారికి సంక్రాంతి పండుగ.
పాడి ఆవులతో వ్యవసాయం నిషేధం
పాడి ఆవులపై ఎంతో ప్రేమ కలిగిన ఈ గ్రామాల్లో.. పాడి ఆవులతో వ్యవసాయం చేయడం నిషేధం. సాధారణంగా రైతులు ఇప్పటికీ చాలా గ్రామాల్లో పాడిఆవులతో వ్యవసాయం చేస్తుంటారు. అయితే ఈ 18 గ్రామాల్లో మాత్రం పాడిఆవులతో వ్యవసాయ పనులు చేయరు. గోమాతను భక్తిశ్రద్ధలతో పూజించే సంస్కృతి ఇక్కడ ఎప్పటి నుంచో కొనసాగుతుండటం విశేషం. పూర్వపు తమ పెద్దల ఆచారం ప్రకారమే ఈ సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు.
ఆచారాలను మరువబోం
మా పూరీ్వకులు ఆచరించిన ఆచారాలను మరవబోము. గ్రామ దేవత శ్రీపల్లావలమ్మ ఉత్సవాల రోజున అమ్మవారి ఆవులను ఆలయం వద్దకు తీసుకొచ్చి పూజలు నిర్వహిస్తాం. అదే మాకు సంక్రాంతి.
–బ్రహ్మయ్య, ఆలయ పూజారి, బత్తినగారిపల్లె
పూర్వీకుల అడుగుజాడల్లో..
పూర్వీకుల సంప్రదాయాన్ని గౌరవిస్తూ నేటికీ వారి అడుగుజాడల్లోనే నడుస్తున్నాం. మా ప్రాంతంలోని 18 గ్రామా ల ప్రజలు సంక్రాంతి పండుగను జరుపుకోబోము. మా పెద్దోళ్ల కాలం నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది. ఈ సంస్కృతిని ముందు తరాల వారు కూడా పాటిస్తారని నమ్ముతున్నాం.
– కరుణాకర్, టి.గొల్లపల్లె, టి.పసలవాండ్లపల్లె పంచాయతీ
Comments
Please login to add a commentAdd a comment