పాత బైక్‌లు, సైకిళ్లతో కొత్త వ్యవసాయ పరికరాలు
లీటరు పెట్రోల్‌తో ఒకటిన్నర ఎకరా సేద్యం
రూ.15 వేలకే యంత్రాలు తయారు చేసి రైతులకు ఇస్తున్న ఎడ్లూరుపాడు మెకానిక్ హజరత్ వలి
విభిన్న వ్యవసాయ యంత్రాల తయారీలో దిట్ట
కందుకూరు రూరల్: మెకానిక్ షేక్ హజరత్ వలి.. చదివింది తక్కువే.. అయినా తన నైపుణ్యంతో వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాడు. పాత బైకులు, సైకిళ్లతో విభిన్న వ్యవసాయ పరికరాలు తయారు చేస్తూ.. రైతుల మన్ననలు పొందుతున్నాడు. వాటిని అతి తక్కువ ధరకే అన్నదాతలకు అందజేసి.. అందరి అభిమానం చూరగొంటున్నాడు.
బైక్ మెకానిక్‌గా మొదలుపెట్టి..
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు సమీపంలోని ఎడ్లూరుపాడుకు చెందిన షేక్ హజరత్ వలి ఎనిమిదో తరగతి వరకే చదువుకున్నాడు. ఆ తర్వాత బైక్ మెకానిక్ పని నేర్చుకొని.. ఇంటి వద్దే చిన్న షాపు ఏర్పాటు చేసుకున్నాడు. అనంతరం లేత్ మిషన్ కొనుగోలు చేసుకొని.. వెల్డింగ్ పనులు చేస్తూ మల్టీపర్పస్ షాపుగా మార్చుకున్నాడు.
రైతుల కష్టాన్ని కళ్లారా చూసిన హజరత్‌వలి.. ఖాళీ సమయంలో చిన్నచిన్న వ్యవసాయ పరికరాలు తయారు చేసి వారికి అందిస్తుండేవాడు. ఈక్రమంలో పాత బైక్ ఇంజన్‌తో మల్టీపర్పస్ వ్యవసాయ యంత్రాన్ని తయారు చేశాడు. దానికి సరిగ్గా సరిపోయేలా గొర్రును కూడా తయారుచేసి.. రైతులకు మరింత చేరువయ్యాడు. మెకానిక్ షాపును కాస్తా ‘అగ్రికల్చర్ ఫార్మింగ్ టూల్స్’గా మార్చేశాడు.
పాత బైక్‌తో నూతన యంత్రం..
ఎవరైనా పాత బైక్‌ను తీసుకెళ్లి హజరత్ వలికి ఇస్తే.. దానికి ఆరు చెక్కల గొర్రు అమర్చి.. నాలుగు చక్రాలు, మూడు చక్రాలు ఏర్పాటు చేసుకునే విధంగా తయారు చేసి ఇస్తున్నాడు. పొగాకు, మిరప, బొబ్బాయి, అరటి, పత్తి తదితర పంటల్లో దున్నేందుకు వీలుగా ఉంటుంది.
గొర్రు, గుంటక, నాగలి వంటివి ఆ బైక్‌కు అమర్చుకోవచ్చు. ఒక లీటర్ పెట్రోల్‌తో ఒకటిన్నర ఎకరా పొలం దున్నుకోవచ్చని హజరత్ వలి చెబుతున్నాడు. ఈ యంత్రం తయారీకి రూ.15 వేలు మాత్రమే తీసుకుంటున్నట్లు తెలిపాడు. ఇలా ఇప్పటికే 20 యంత్రాలు తయారు చేసి రైతులకు అందజేసినట్లు వెల్లడించాడు.
పారిశుధ్య కార్మికులకుసాయంగా..
పారిశుధ్య కార్మికులకు సాయంగా ఓ పరికరాన్ని కూడా హజరత్ వలి తయారు చేశాడు. చెత్తాచెదారంతో పాటు దుర్వాసన వెదజల్లే ఏ వ్యర్థాన్ని అయినా పారిశుధ్య కార్మికులు చేతితో పట్టుకోకుండా.. తాను తయారు చేసిన పరికరం ద్వారా చెత్తబుట్టలో వేయొచ్చని వలి చెప్పాడు.
పది కిలోల బరువును సులభంగా తీసి చెత్తబుట్టలో వేయొచ్చని తెలిపాడు. తన వద్ద కొనుగోలు చేసిన యంత్రాలు ఏవైనా మరమ్మతులకు గురైతే.. వాటిని బాగు చేసి ఇస్తానని తెలిపాడు.
ప్రభుత్వం సహకారం అందిస్తే మరింతగా రాణిస్తా
రైతులకు తక్కువ ఖర్చుతో వ్యవసాయ పరికరాలను అందుబాటులోకి తేవడమే నా లక్ష్యం. అయితే నా దగ్గర చాలా ఆలోచనలు ఉన్నా.. తగినంత డబ్బు లేదు. అందుకే కేవలం పాత సామగ్రితో అతి తక్కువ ఖర్చుతో రైతులకు యంత్రాలు, పరికరాలు తయారు చేసి ఇస్తున్నా.
ప్రభుత్వం నుంచి సహకారం అందితే మరిన్ని యంత్రాలు తయారు చేస్తా. రైతులు ఎవరైనా అతి తక్కువ ధరకు పరికరాలు కావాలంటే 75699 72889 నంబర్‌ను సంప్రదించవచ్చు. – షేక్.హజరత్‌వలి, మెకానిక్
Comments
Please login to add a commentAdd a comment