
సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటనపై టీడీపీ కుట్రలకు తెరలేపింది. జులై 3న వైఎస్ జగన్ పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తోంది. హెలిప్యాడ్‌కి అనుమతి ఇవ్వకుండా అడ్డంకులు కలిగిస్తోంది. వైఎస్ జగన్ ప్రజాదరణ చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు. 27న వైఎస్ జగన్ పర్యటన కోసం వైఎస్సార్‌సీపీ నేతలు దరఖాస్తు చేశారు.
ఇప్పటికి అనుమతి ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. కేవలం 100 మందే రావాలంటూ పార్టీ నేతలకు పోలీసులు ఆంక్షలు విధించారు. హెలిప్యాడ్ స్థలం యజమానికి అధికారులు, పోలీసులు ద్వారా బెదిరింపులకు దిగుతున్నారు. వైఎస్ జగన్ ఏ జిల్లాకు వెళ్లిన పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. దీంతో ఆయన పర్యటనపై టీడీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారు. అక్కసుతో హెలిప్యాడ్ రద్దు చేయించేలా టీడీపీ నేతలు కుట్రలు పన్నుతూ.. అడుగడుగునా అడ్డంకులు పెడుతున్నారు.
ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్ రావడం తథ్యం: అనిల్
వైఎస్ జగన్ పర్యటనపై 10 రోజుల క్రితమే సమాచారం ఇచ్చామని.. పర్మిషన్ ఇవ్వకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్ రావడం తథ్యమన్నారు.