రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలంటూ వైఎస్సార్ జిల్లా కడపలోని తహసీల్దార్ ఆఫీసు ఎదుట ఆందోళన చేస్తున్న ఏపీ రైతు సంఘం నాయకులు
తక్షణమే రూ.20 వేల పెట్టుబడి సాయం ఇవ్వాలంటూ రైతు సంఘాల ఆందోళన
రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసనలు, ధర్నాలు
కేంద్రం మాట నిలబెట్టుకున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని మండిపాటు
అన్నదాత సుఖీభవతో ఆదుకోకుంటే ఆందోళన చేస్తామని ప్రకటన
భూ యజమానులతో పాటు కౌలుదారులకూ ఇవ్వాలని డిమాండ్
సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా అందరికీ వర్తింపచేయాలని వినతి
గత ఐదేళ్లుగా సీజన్‌కు ముందే తొలివిడత సాయం అందేది..
కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని రైతుల ఆందోళన
సాక్షి, అమరావతి, నెట్‌వర్క్: తాము అధికారంలోకి రాగానే ప్రతీ రైతుకు రూ.20 వేలు చొప్పున సాగు సాయం అందిస్తామంటూ సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఏపీ కౌలు రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ తొలి విడత సాయాన్ని ఇటీవలే జమ చేసిందని, అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం సైతం అన్నదాతా సుఖీభవ ద్వారా రైతన్నలకు పెట్టుబడి సాయం అందించి ఆదుకోవాలని కోరాయి.
వ్యవసాయదారులకు తొలి విడత పెట్టుబడి సాయాన్ని వెంటనే జమ చేయాలని కోరుతూ ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా రైతులతో పాటు కౌలు రైతులు, అటవీ, దేవదాయ, అసైన్డ్ భూసాగుదారులకు పెట్టుబడి సాయం అందించాలని కోరుతూ తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు.
ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య కడపలో, ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.కాటమయ్య పుట్టపర్తిలో, ఆయా సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కేవీవీ ప్రసాద్, పి.జమలయ్య విజయవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిర్వహించిన ప్రదర్శనల్లో పాల్గొన్నారు.
గత ఐదేళ్లుగా పీఎం కిసాన్ – వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున మూడు విడతల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందించిందని గుర్తు చేశారు. తొలివిడత సాయాన్ని గత ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందుగానే జమ చేసిందని చెప్పారు. ఆ డబ్బులు దుక్కి పనులు, విత్తనాల కొనుగోలు లాంటి సాగు అవసరాలకు రైతులకు ఎంతగానో ఉపయోగపడేవన్నారు.
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున సాగు సాయం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం చేశారని, ఈ హామీని వెంటనే అమలులోకి తేవాలని సూచించారు. తొలి విడత సాయం అందకపోవడంతో పెట్టుబడి ఖర్చుల కోసం ఖరీఫ్ సీజన్‌లో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పీఎం కిసాన్‌తో సంబంధం లేకుండా రూ.20 వేలు చొప్పున సాగు సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా జమ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్ని విడతల్లో ఎంత జమ చేస్తారో స్పష్టత ఇవ్వడంతో పాటు త్వరలో ప్రవేశపెట్టనున్న పూర్తి స్థాయి బడ్జెట్‌లో ఈ మేరకు కేటాయింపులు కూడా జరపాలన్నారు. పెరిగిన సాగు ఖర్చులకు అనుగుణంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను పెంచి పంట రుణాలు అందించాలన్నారు. రూ.3 లక్షల వరకు వడ్డీ లేకుండా, రూ.5 లక్షల వరకు పావలా వడ్డీతో రైతు, కౌలురైతులకు రుణాలివ్వాలని కోరారు. సాగు చేస్తున్న భూమి దామాషాను పరిగణలోకి తీసుకొని పంటరుణాలు మంజూరు చేయాలన్నారు.
ప్రాజెక్టుల కింద ఉన్న ప్రధాన కాలువలు, మేజర్, మైనర్ కాలువలతోపాటు డెల్టా ప్రాంతంలోని మురుగునీటి కాలువల మరమ్మతులు వెంటనే చేపట్టాలన్నారు. వ్యవసాయ మోటార్లకు బిగించిన స్మార్ట్ మీటర్లను వెంటనే తొలగించి ఉచిత విద్యుత్ పథకాన్ని సమర్ధంగా అమలు చేయాలన్నారు. గత ప్రభుత్వం 2019లో తెచ్చిన పంట సాగుదారు హక్కుల చట్టాన్ని సవరించాలని, గ్రామ సభలోనే కౌలు రైతులను గుర్తించి స్వీయ ధృవీకరణ ఆధారంగా గుర్తింపు కార్డులు జారీ చేయాలని కోరారు.
గుర్తింపు కార్డులు ఇప్పటివరకు జారీ చేయనందున కౌలు రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుని పచ్చి రొట్ట విత్తనాలు, అన్ని రకాల పంటల విత్తనాలు, సూక్ష్మ పోషకాలు, ఎరువులు, పురుగు మందులు 90% సబ్సిడీపై అందించాలన్నారు. దేవదాయ, ధర్మాదాయ సాగు భూముల వేలం పాటలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. గత సీజన్‌లో వర్షాభావం, తుపాను వల్ల నష్టపోయిన కౌలురైతులకు కౌలు రేట్లు తగ్గించి నామమాత్రపు ధరతో లీజుకు ఇవ్వాలని కోరారు.
ఏలూరులో ధర్నా..
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున సాగు సాయం కింద రూ.20 వేలు వెంటనే రైతులకు అందించాలంటూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని, పోలవరం నిర్మాణం వేగంగా చేపట్టాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డేగా ప్రభాకర్ డిమాండ్ చేశారు. వ్యవసాయానికి అవసరమైన ఎద్దులు, బండ్లు, నాగలి తదితర పనిముట్లు కొనుగోలుపై 50 శాతం రాయితీ అందించాలన్నారు.
ట్రాక్టర్లకు 50 శాతం సబ్సిడీపై డీజిల్ సరఫరా చేయాలని, కల్తీ విత్తనాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు వెంటనే అందించాలని కోరుతూ అనకాపల్లి జిల్లా చోడవరం తహసీల్దార్‌కు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. సాయం అందకపోవడంతో రైతులు అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఖరీఫ్ రైతులకు సకాలంలో బ్యాంకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం కర్నూలులో డీఆర్‌ఓకు వినతిపత్రం అందచేశారు.
తక్షణమే పెట్టుబడి సాయం ఇవ్వాలి
సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీ మేరకు రూ.20 వేల పెట్టుబడి సాయం పంపిణీని కూటమి ప్రభుత్వం తక్షణమే ఆచరణలో పెట్టాలి. ఎన్ని విడతల్లో జమ చేస్తారో స్పష్టత ఇవ్వాలి. ఈ మేరకు బడ్జెట్‌లో కేటాయింపులు జరపాలి. తక్షణమే తొలి విడత సాయం అందించి రైతులకు అండగా నిలవాలి. లేదంటే దశలవారీగా ఆందోళన చేస్తాం.
–జి.ఈశ్వరయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘం
ప్రతీ కౌలు రైతుకూ సాయం
సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా ప్రతీ కౌలు రైతుకూ సాగు సాయం అందించాలి. గతంలో సీజన్‌కు ముందుగానే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సీసీఆర్సీ కార్డులు ఇచ్చారు. పంటసాగు హక్కుదారుల చట్టం 2019ని సవరించి స్వీయ ధ్రువీకరణతో ప్రతీ కౌలుదారుడికి సీసీఆర్సీ కార్డులివ్వాలి. సాగు సాయంతో పాటు సంక్షేమ ఫలాలన్నీ కౌలు రైతులందరికీ అందించేలా చర్యలు తీసుకోవాలి.
–కె.కాటమయ్య, అధ్యక్షుడు, ఏపీ కౌలురైతు సంఘం
Comments
Please login to add a commentAdd a comment