ఎంపీ విజయసాయి రెడ్డి, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి పరషోత్తమ రూపాలా
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో 2016లో 804 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడినట్లు వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి పరషోత్తమ రూపాలా వెల్లడించారు. రాజ్య సభలో శుక్రవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. కేంద్ర హోం మంత్రిశ్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్‌బీ) రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరుస్తూ ప్రతి ఏటా నివేదకలను సమర్పిస్తుందని ఆయన తెలిపారు.
2014-15లో ఎన్సీఆర్‌బీ సమర్పించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో 632 మంది రైతులు, 916 మంది రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఎన్సీఆర్‌బీ ప్రతి ఏటా సమర్పించే ఈ నివేదికలు 2015 సంవత్సరం వరకు మాత్రమే ఆ సంస్థ వెబ్ సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. 2016 తర్వాత నివేదికలు ఇంకా వెబ్ సైట్‌లో ప్రచురించలేదు. అయితే ఎన్సీఆర్‌బీ 2016 సంవత్సరానికి పొందుపరచి ఇంకా ప్రచురించని సమాచారం ప్రకారం రాష్ట్రంలో 806 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడినట్లు తెలుస్తోందని మంత్రి తన సమాధానంలో వివరించారు.
2015లో ఎన్సీఆర్‌బీ ప్రచురించిన నివేదిక ప్రకారం దివాలా, అప్పుల ఊబిలో కూరుకుపోవడం, వ్యవసాయంలో సంభవించే నష్టాలు రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణాలలో కొన్నిగా పేర్కొనడం జరిగింది. రైతులలో అత్యధిక శాతం దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారే. వ్యవసాయ రంగంలో సంక్షోభం తలెత్తిన ప్రతిసారి ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ ధోరణిని సమర్థవంతంగా నిలువరించాలంటే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం ఒక్కటే మార్గమని మంత్రి వివరించారు.
వ్యవసాయం రాష్ట్రానికి సంబంధించిన అంశం. అయినప్పటికీ 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్య సాధన కోసం వ్యవసాయ, సహకారం రైతు సంక్షేమ విభాగాలు ఒక అంతర్ మంత్రిత్వ శాఖ బృందాన్ని ఏర్పాటు చేసి రైతుల ఆదాయానికి సంబంధించిన వివిధ ధృక్కోణాలను పరిశీలించి సముచితమైన వ్యూహాన్ని సిఫార్సు చేస్తుంది. అలాగే ప్రభుత్వం కూడా వ్యవసాయ ఉత్పాదకత నుంచి రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా చొరవ తీసుకునేలా తన ప్రాధామ్యాలను మలుచుకుంటుందని మంత్రి తెలిపారు.
ఆహార ధాన్యాల సేకరణ కోసం కొత్త పథకం
రైతులు పండించిన ఆహార ధాన్యాల సేకరణ కోసం కేంద్ర ప్రభఉత్వం మార్కెట్ హామీ పథకం (ఎమ్‌ఏఎస్) పేరిట ఒక కొత్త పథకాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆహార, ప్రజా పంపిణీ శాఖల మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ శుక్రవారం రాజ్య సభలో ప్రకటించారు. విజయసాయి రెడ్డి అడగిన ఒక ప్రశ్నకు రాతపూర్వకంగా జవాబిస్తూ మంత్రి ఈ విషయం వెల్లడించారు. ఈ కొత్త పథకానికి సంబంధించిన కాన్సెప్ట్ పేపర్‌ను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిశీలనకు పంపించినట్లు మంత్రి తెలిపారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో కేంద్ర బృందాలు రెండు దఫాలుగా జరిపిన చర్చల ద్వారా సేకరించిన అభిప్రాయాలను క్రోడీకరిస్తూ వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ విభాగాలు సవరించిన కాన్సెప్ట్ పేపర్‌ను రూపొందించినట్లు మంత్రి చెప్పారు.
దక్షిణ మధ్య రైల్వే భద్రతా విభాగంలో 10 వేల పోస్టులు ఖాళీ
దక్షిణ మధ్య రైల్వేలోని రక్షణ, భద్రతా విభాగాలలో దాదాపుగా 10 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీ రంజన్ గోహెయిన్ తెలిపారు. శుక్రవారం రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ, దక్షిణ మధ్య రైల్వేలోని రక్షణ, భద్రత విభాగాలకు మొత్తం 3,309, 58,622 పోస్టులు మంజూరు కాగా అందులో రక్షణ విభాగంలో 784, భద్రత విభాగంలో 9.372 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో ఖాళీలు ఏర్పడటం నిరంతరం సాగే ప్రక్రియ. రిటైర్మెట్లు, ప్రమోషన్లు, మరణాలు, రాజీనామాల వంటి కారణాలతో ఏర్పడే ఈ ఖాళీలను, డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్లను నిబంధనల ప్రకారం బహిరంగ నియామకాల ద్వారా చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. రక్షణ, భద్రత విభాగాలలో ఖాళీల భర్తీ కోసం స్పెషల్ డ్రైవ్ వంటివి ఏవీ నిర్వహించడం లేదని చెప్పారు.
పోస్టల్ శాఖ ఏపీ సర్కిల్‌లో 1922 పోస్టులు ఖాళీ
పోస్టల్ శాఖ ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో మల్టీ టాస్కింగ్ సిబ్బంది, పోస్ట్‌మాన్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మాస్టర్ గ్రేడ్, ఇన్‌స్పెక్టర్ పోస్టులు మొత్తం కలిపి 1922 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి శ్రీ మనోజ్ సిన్హా శుక్రవారం రాజ్య సభలో విజయసాయి రెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
విశాఖలో వ్యాగన్ వర్క్‌షాప్‌కు 150 కోట్లు
విశాఖపట్నంలో రైల్వే పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వర్క్ షాప్ (వ్యాగన్ వర్క్‌షాప్) నిర్మాణానికి ప్రస్తుత ఈ ఏడాది బడ్జెట్‌లో 150 కోట్ల రూపాయలు కేటాయించినట్లు రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీ రంజన్ గొహెయిన్ వెల్లడించారు. వ్యాగన్ వర్క్‌షాప్ నిర్మాణ పనులలో ఎలాంటి జాప్యం జరగడం లేదని 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దీని నిర్మాణం కోసం మొత్తం 265 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment