2024 నాటికి 63 లక్షల ఇళ్ళకు కుళాయి కనెక్షన్లు | Minister Answers Vijaya Sai Reddy Question In Rajya Sabha | Sakshi
Sakshi News home page

2024 నాటికి 63 లక్షల ఇళ్ళకు కుళాయి నీటి కనెక్షన్లు

Published Mon, Sep 14 2020 8:07 PM | Last Updated on Mon, Sep 14 2020 8:47 PM

Minister Answers Vijaya Sai Reddy Question In Rajya Sabha - Sakshi

న్యూఢిల్లీ: జలజీవన్‌ మిషన్‌ (జేజేఎం) కింద 2024 నాటికి గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఇళ్ళకు కుళాయి నీటి కనెక్షన్లు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జల శక్తి శాఖ సహాయ మంత్రి రతన్‌ లాల్‌ కటారియా వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్‌సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ మంత్రి ఈ విషయం తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని 63 లక్షల 72 వేల ఇళ్ళకు 2024 నాటికి కుళాయి కనెక్షన్‌ కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వార్షిక ప్రణాళికను రూపొందించినట్లు ఆయన చెప్పారు. ఈ ప్రణాళిక కింద ఈ ఏడాది ఏప్రిల్‌ 1నాటికి రాష్ట్రంలో 31 లక్షల 93 వేల ఇళ్ళకు కుళాయి నీటి సదుపాయం కల్పించినట్లు తెలిపారు.  (హరివంశ్‌ నారాయణ్‌కు అభినందనలు)

కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా జలజీవన్‌ మిషన్‌ పనులకు కూడా ఆటంకం ఏర్పడింది. అయితే అన్‌లాక్‌లో భాగంగా  నిర్మాణ పనుల పునఃప్రారంభానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతించిన నేపథ్యంలో జల జీవన్‌ మిషన్‌ పనులను తిరిగి ప్రారంభించినట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కోటి 32 లక్షల ఇళ్ళకు కుళాయి కనెక్షన్‌ సదుపాయం కల్పించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగించడానికి అన్ని రాష్ట్రాలకు తగినన్ని నిధులు కూడా అందుబాటులో ఉంచినట్లు మంత్రి చెప్పారు. 

కాలుష్యం కోరల్లో 13 నగరాలు
ఆంధ్రప్రదేశ్‌లో 13 నగరాలు వాయు కాలుష్యం బారినపడినట్లు కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి బాబుల్‌ సుప్రియో రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా జవాబిస్తూ 2014 నుంచి 2018 మధ్య దేశంలోని వివిధ నగరాలలో గాలి నాణ్యతపై జరిపిన అధ్యయనంలో రాష్ట్రంలోని అనంతపురం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో స్వచ్ఛమైన గాలి నాణ్యత అత్యల్పంగా ఉన్నట్లు గుర్తించనట్లు మంత్రి తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రామ్‌ (ఎన్‌కాప్‌) కింద కాలుష్యం బారిన పడిన నగరాలల్లో గాలి నాణ్యతను మెరుగుపరచేందుకు దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. ఎన్‌కాప్‌లో భాగంగా వాయు కాలుష్యం బారినపడిన నగరాల్లో కాలష్యానికి ప్రధాన కారణాలను గుర్తించడానికి పలు అధ్యయనాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. రోడ్లపై ఆవరించే ధూళి కణాలు, వాహన కాలుష్యం, చెత్త తగులబెట్టడం, నిర్మాణ, కూల్చివేత పనులు, పారిశ్రామిక కాలుష్యం వంటివి నగరాలలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలుగా గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. వాయుకాలుష్యం నుంచి నగరాలను కాపాడి గాలి నాణ్యతను మెరుగుపరచేందుకు నగరాల వారీగా ప్రణాళికలు సిద్దం చేసినట్లు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement