రాజ్యసభలో మాట్లాడుతున్న విజయసాయి రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గత నాలుగేళ్లుగా పోరాడుతోందని రాజ్యసభ సభ్యుడు, పార్టీ పార్లమెంటరీ నేత వీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. హోదా రాష్ట్రానికి సంజీవని అని వైఎస్సార్ సీపీ నమ్ముతోందని, హోదా సంజీవని కాదని టీడీపీ బాహాటంగా చెప్పిందని అన్నారు. రాష్ట్రానికి హోదా సంజీవని అని వైఎస్సార్ సీపీ, జనసేన, వామపక్షాలు బలంగా నమ్ముతున్నాయన్నారు.
ఏపీ విభజన చట్టంపై రాజ్యసభలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఏపీకి హోదా రాకపోవడానికి తొలి ముద్దాయి బీజేపీ, రెండో ముద్దాయి టీడీపీ, మూడో ముద్దాయి కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. హోదా నిందితులను 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు తగు రీతిలో శిక్షిస్తారని హెచ్చరించారు.
2014లో బీజేపీ అధికారంలోకి వచ్చేనాటికే కేబినెట్ తీర్మానం అమల్లో ఉందని, గత ప్రభుత్వ తీర్మానాన్ని రద్దు చేసే అధికారం బీజేపీ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా గత ప్రభుత్వ నిర్ణయాలను గౌరవించాలన్నారు. 14వ ఆర్థిక సంఘం పేరుతో బీజేపీ ప్రభుత్వం ఏపీకి హోదా ఇవ్వకపోవడం సరైంది కాదన్నారు.
ప్రసంగం పూర్తికాకుండానే..
ఏపీకి ప్రత్యేక హోదా ఎంత అవసరమనే అంశంతో పాటు పూర్వాపరాలను వివరించే క్రమంలోనే కేటాయించిన సమయం అయిపోయిందని, ప్రసంగం ముగించాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఒత్తిడి చేశారు. కీలక అంశంపై తనకు మరింత సమయం ఇవ్వాలని, కనీసం 15 నిమిషాలు మాట్లాడేందుకు అనుమతించాలని విజయసాయిరెడ్డి కోరారు. టీడీపీకి 27 నిమిషాలు సమయం ఇచ్చారని తనకు మరింత సమయం ఇవ్వాలని కోరినా వెంకయ్యనాయుడు నిరాకరించారు.
Comments
Please login to add a commentAdd a comment