సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలకు ‘నెట్‌వర్క్’ కష్టాలు తప్పేట్టు లేవు. రిజిస్ట్రేషన్లకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించే నెట్‌వర్క్‌ను తహసీల్దార్ కార్యాలయాలకు అనుసంధానం చేయడం సమస్యగా మారే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఇటీవల ఏర్పాటు చేసుకున్న నెట్‌వర్క్‌ను ఇప్పుడు మరో 473 తహసీల్దార్ కార్యాలయాలకు విస్తృతం చేయాల్సి రావడమే ఇబ్బందిగా మారనుంది. నెట్‌వర్క్‌ను యేటా సమకూరుస్తున్న రెయిల్‌టెల్.. రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు మాత్రమే నెట్‌వర్క్‌ను సమకూరుస్తుందా.. లేదా అన్ని చోట్లకు విస్తరిస్తుందా.. అనే దానిపై స్పష్టత రావట్లేదు. విస్తరించని పక్షంలో తహసీల్దార్ కార్యాలయాల్లో స్వాన్ నెట్‌వర్క్ ద్వారానే రిజిస్ట్రేషన్లు జరపాల్సి వస్తుందా అన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
నెట్‌వర్క్.. చాలా టఫ్!
రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు ఎలాంటి అంతరాయం లేకుండా సాగేందుకు ఇటీవల రైల్వే శాఖ టెక్నికల్ విభాగమైన ‘రెయిల్‌టెల్’ సహకారంతో రిజిస్ట్రేషన్ల శాఖ కొత్త నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంది. ఈ నెట్‌వర్క్ ద్వారానే ప్రస్తుతం రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పని చేస్తున్నాయి. ఇందుకు ఏటా రెయిల్‌టెల్‌కు రూ.1.20 కోట్ల రుసుము చెల్లిస్తోంది. ఇప్పుడు తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరగాలంటే ఈ నెట్‌వర్క్‌ను తప్పకుండా పొడిగించాల్సిన పరిస్థితి. అయితే మారుమూల ప్రాంతాల్లోని తహసీల్దార్ కార్యాలయాలకు నెట్‌వర్క్‌ను సమకూర్చి, నిర్వహించేందుకు రెయిల్‌టెల్ సంసిద్ధత వ్యక్తం చేస్తుందా అనేది అనుమానంగా కనిపిస్తోంది.
స్వాన్‌తో చుక్కలే..
ఒకవేళ రెయిల్‌టెల్ చేతులెత్తేస్తే తహసీల్దార్ కార్యాలయాల్లో రిజి స్ట్రేషన్లకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఐటీ శాఖ అందించే స్టేట్ వైడ్ ఏరియా నెట్‌వర్క్ (స్వాన్)తోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. గతంలో ఈ నెట్‌వర్క్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చింది. రెండు, మూడు రోజులకోసారి సర్వర్లు డౌన్ అయి తరచూ ఆటంకాలు ఎదురయ్యేవి. ఎక్కడ సమస్య వచ్చినా రాష్ట్రమంతటా కార్యకలాపాలు నిలిచిపోయేవి. ఈ నేపథ్యంలో రెయిల్‌టెల్ అంగీకరించకుండా స్వాన్‌తో సరిపెట్టుకోవాల్సి వస్తే మాత్రం మారుమూల ప్రాంతాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరగడం గగనమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రిజిస్ట్రేషన్లకు ‘నెట్‌వర్క్’ కష్టాలు!
Published Thu, Feb 8 2018 3:26 AM | Last Updated on Thu, Feb 8 2018 3:26 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment