2 నుంచే ఇళ్ల పట్టాల పంపిణీ | Distribution of houses documents from June 2 | Sakshi
Sakshi News home page

2 నుంచే ఇళ్ల పట్టాల పంపిణీ

Published Sun, May 31 2015 3:16 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

2 నుంచే ఇళ్ల పట్టాల పంపిణీ - Sakshi

2 నుంచే ఇళ్ల పట్టాల పంపిణీ

ఆరుగురు మహిళలకు లాంఛనంగా పట్టాలను పంపిణీ చేయనున్న సీఎం కేసీఆర్
క్రమబద్ధీకరణ ప్రక్రియకు జూలైదాకా గడువు పెంపు

 
 సాక్షి, హైదరాబాద్: ఇళ్ల పట్టాల పంపిణీకి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేయనున్న ఆవిర్భావ దినోత్సవ వేదికపై వివిధ ప్రాంతాలకు చెందిన ఆరుగురు మహిళలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయించింది. ప్రభుత్వ స్థలాల్లో నివాసమేర్పరచుకున్న పేదలకు ఆయా స్థలాలను ఉచితంగా క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం గత డిసెంబర్‌లో ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇళ్ల పట్టాల కోసం వేచి చూస్తున్న సుమారు 1.30 లక్షలమంది అర్హులైన పేదలకు స్థానిక మండల రెవెన్యూ కార్యాలయాల ద్వారా పట్టాలను పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
 
 జూలై వరకు గడువు పెంపు: ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల(జీవో 58, 59) మేరకు క్రమబద్ధీకరణ ప్రక్రియకు ఏప్రిల్ నెలాఖరుతో గడువు ముగిసింది. వీలైనంత ఎక్కువ  మందికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం క్రమబద్ధీకరణ ప్రక్రియ గడువును జూలై నెలాఖరు వరకు  పొడిగించిందని అధికారులు తెలిపారు. వాస్తవానికి క్రమబద్ధీకరణ కోసమని రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,66,150 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 3,36,869 మంది జీవో 58 ప్రకారం ఉచిత క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోగా, 29,281 వేలమంది జీవో 59 మేరకు చెల్లింపు కేటగిరీ కింద దరఖాస్తులు సమర్పించారు. అయితే.. ఉచిత కేటగిరీ కింద అందిన దరఖాస్తుల్లో కేంద్ర ప్రభుత్వ, రైల్వే మిలిటరీ.. తదితర సంస్థల భూములకు చెందిన దరఖాస్తులు లక్షకుపైగా ఉన్నట్లు నిర్ధారించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కూడా 21 రకాల అభ్యంతరకరమైన భూములకు చెందిన దరఖాస్తులు లక్షకు పైగా ఉన్నట్లు తేలింది.
 
 పురుషుల పేరిటా పట్టాలు
 క్రమబద్ధీకరణ ప్రక్రియ కింద ఇచ్చే ఇళ్ల పట్టాలను ఆయా కుటుంబాల్లోని మహిళల పేరిటే ఇవ్వాలని సర్కారు ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే.. రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న సుమారు 20 వేల కుటుంబాల్లో మహిళలు లే రని తేలింది. క్షేత్రస్థాయి అధికారుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మహిళలు లేని కుటుంబాల్లో పురుషుల పేరిట పట్టాలు ఇవ్వాలని అధికారులను సర్కారు ఆదేశించిం ది. ఇదిలా ఉంటే.. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని అభ్యంతరకర భూముల క్రమబద్ధీకరణ విషయమై ఆయా విభాగాలతో చర్చించేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. అలాగే.. చెల్లింపు కేటగిరీలో దరఖాస్తుల పరిశీలన కూడా గడువులోగా పూర్తి చేయాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. జూలై నెలాఖరులోగా క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి కాకుంటే క్రమబద్దీకరణ ప్రక్రియ గడువును మరోమారు పొడిగించే అవకాశం లేకపోలేదని రెవెన్యూ శాఖలోని ఓ కీలక అధికారి తెలిపారు.
 
 క్రమబద్ధీకరణ ప్రక్రియ ఇలా..
 అందిన దరఖాస్తులు                          3,66,150
 ఉచిత కేటగిరీకి చెందినవి                  3,36,869
 చెల్లింపు కేటగిరీలో వచ్చినవి                29,281
 కేంద్రానికి చెందిన భూములు              1,03,331
 పట్టాలకు ఎంపికైన దరఖాస్తులు           1,32,819
 సిద్ధంగా ఉన్న పట్టాలు                          1,30,000

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement