ఒకే సముదాయంలోకి ‘రెవెన్యూ’
రూ. 20 కోట్లు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
హైదరాబాద్: భూములతో సం బంధమున్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఒకే సముదాయంలో నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటికోసం రూ. 20 కోట్లు మంజూరు చేస్తున్నట్టుగా ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి మహమూద్ అలీ ప్రకటించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు, జిల్లా రిజిష్ట్రార్లతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. విభజన తర్వాత స్టాంపుల విక్రయం, రిజిస్ట్రేషన్ల ద్వారా తగ్గిన ఆదాయాన్ని, అందుకు కారణాలను మంత్రి తెలుసుకున్నారు.
సబ్ రిజిష్ట్రారు కార్యాలయాలున్న పట్టణాల్లో రెవెన్యూ, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలకు ఒకే సముదాయంలో నిర్మించాలని నిర్ణయించారు. కలెక్టరేట్లలోనే రిజిస్ట్రేషన్ కార్యాలయాలను, ఆర్‌డీవో, మండల రెవెన్యూ కార్యాలయాలని నిర్మించాలని ఆదేశించారు. దీనికోసం రూ. 20 కోట్లు మం జూరు చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ సమావేశంలో రెవెన్యూ ముఖ్య కార్యదర్శి వినోద్‌కుమార్ అగర్వాల్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనరు డి. విజయకుమార్, జాయింట్ ఐజీ వెంకటరాజేష్, డీఐజీ శ్రీనివాసులు, జిల్లా రిజి ష్ట్రార్లు తదితరులు పాల్గొన్నారు.