ఈ-చలాన్లతో రిజిస్ట్రేషన్ ఇబ్బందులకు చెక్
ఈ-స్టాంప్స్ మాడ్యూల్‌ను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, బ్యాంకుల వద్ద గంటల కొద్దీ నిరీక్షించే పనిలేకుండా ఈ-చలాన్లతో విని యోగదారులు ఎంచక్కా తమ రిజిస్ట్రేషన్లను పూర్తిచేసుకోవచ్చని ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) మహమూద్ అలీ అన్నారు. రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ నూతనంగా రూపొందించిన ఈ-స్టాంప్స్ (ఈ-స్టాంప్ డ్యూటీ ఇన్ తెలంగాణ తెలంగాణ అసెస్‌మెంట్, మేనేజ్‌మెంట్ అండ్ పేమెంట్ సిస్టమ్)మాడ్యూల్‌ను సోమవారం సచివాల యంలో ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. వినియోగదారులకు మెరుగైన సేవలందించడం వల్ల రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం 2014-15లో కన్నా 2015-16 ఆర్థిక సంవత్సరంలో 24% పెరిగిందని చెప్పారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆన్‌లైన్ సేవలతో పాటు త్వరలోనే ప్రభుత్వ భూములు, లిటిగేషన్‌లో ఉన్న భూముల వివరాలనూ ఆన్‌లైన్‌లో పెడతామన్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకు రిజిస్ట్రేషన్ సేవలందించేందుకు వీలుగా కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో షిఫ్ట్ పద్ధతిని అమలు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. రిజిస్ట్రేషన్ల శాఖలో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని, రెండు వారాల్లోగా అర్హులైన సిబ్బందికి పదోన్నతులు, ఉన్నత స్థాయిలో పూర్తిస్థాయి అధికారులను నియమిస్తామని ఆయన స్పష్టం చేశారు.
రెండు గంటల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ
గతంలో ఏదైనా ఆస్తి రిజిస్ట్రేషన్ చేయాలంటే రెండు మూడు రోజులు పట్టేదని, రిజిస్ట్రేషన్ల శాఖలో పూర్తిస్థాయి కంప్యూటరైజేషన్ ఫలితంగా ఆయా దశలన్నీ రెండు గంటల్లో పూర్తిచేసేందుకు వీలు కానుందని రిజిస్ట్రేషన్ల విభాగం ఇన్‌స్పెక్టర్ జనరల్ అహ్మద్ నదీమ్ చెప్పారు. ఆన్‌లైన్‌లోనే వినియోగదారుడు స్వయంగా డాక్యుమెంట్‌ను తయారు చేసుకోవడంతో పాటు స్టాంప్ డ్యూటీ అసెస్‌మెంట్‌నూ చేసుకోవచ్చన్నారు. ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా స్టాంపుడ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాక, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసమే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఈ-చలాన్ల నిమిత్తం రాష్ట్రవ్యాప్తంగా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్బీహెచ్)తో ఎంవోయూ కుదుర్చుకున్నామని, రిజిస్ట్రేషన్ కోరుకునే విని యోగదారుడు ఆన్‌లైన్(ఇంటర్నెట్ బ్యాంకిం గ్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా)తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ ఏ ఎస్బీహెచ్ శాఖ నుంచైనా స్టాంప్‌డ్యూటీ చెల్లించవచ్చన్నారు. కార్యక్రమంలో ఎస్‌బీహెచ్ సీజేఎం విశ్వనాథన్, రిజిస్ట్రేషన్ల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి తదితరులు పాల్గొన్నారు.