నర్సీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలో 10.84 లక్షల మంది రేషన్ కార్డు వినియోగదారులకు ప్రభుత్వం రాయితీపై బియ్యం, కిరోసిన్, నూనె, కందిపప్పు, పంచదారతో పాటు వివిధ రకాలైన సరకులు పంపిణీ చేస్తోంది. ఈ విధంగా ప్రతి నెలా వినియోగదారులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 1,980 రేషన్ షాపులను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ప్రతి నెలా పంపిణీ చేసేందుకు బియ్యం 17 వేల టన్నులు, పంచదార 542 టన్నులు, కిరోసిన్ 2,112 కిలో లీటర్లు, నూనె, కందిపప్పు, చింతపండు, ఉప్పు 10.84 వేల క్వింటాళ్ల వంతున దిగుమతి చేసి రేషన్ షాపుల ద్వారా వినియోగదారులకు అందజేస్తోంది.
18 నుంచే ప్రక్రియ ప్రారంభం : ప్రతి నెలా పంపిణీ చేసే రేషన్ సరుకుల ప్రక్రియ ముందు నెల 20 నుంచే ప్రారంభమవుతుంది. 18 నుంచి రేషన్ షాపుల డీలర్లు రెవెన్యూ అధికారులకు సరుకుల మొత్తానికి అవసరమైన సొమ్మును డీడీల రూపంలో చెల్లిస్తుంటారు. వీటిని తీసుకున్న రెవెన్యూ అధికారులు సరుకుల విడుదలకు సంబంధించిన ఆర్‌ఓ (రూట్ ఆర్డర్) ఇస్తారు. దీనిని తీసుకున్న డీలర్లు ప్రతి నెలా 25 నుంచి మండల స్టాక్ పాయింట్ వద్ద నుంచి అవసరమైన సరుకులను రేషన్ షాపులకు తరలిస్తుంటారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత డీలర్లు తదుపరి నెల ప్రారంభం నుంచి సరుకులను వినియోగదారులకు అమ్మకాలు చేస్తుంటారు.
నిలిచిపోయిన ప్రక్రియ : రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులంతా సమ్మెలో పాల్గొనడంతో పాటు డీలర్లు, హమాలీలు కూడా ఉద్యమంలో భాగస్వాములు కావడంతో సెప్టెంబరు నెలకు సరుకుల విడుదలకు సంబంధించిన ప్రక్రియ దాదాపుగా నిలిచిపోయింది. ఇప్పటికే కొంతమంది డీలర్లు డీడీలు తీసి, రెవెన్యూ కార్యాలయాలకు వెళ్లినా వాటిని తీసుకునే నాథుడే కరువయ్యాడు. తహశీల్దారులంతా సమ్మెలో పాల్గొనడంతో వీటికి అవసరమైన ఆర్‌ఓలు ఇచ్చేందుకు ఇబ్బందులెదురవుతున్నాయి.
దీంతో ఇప్పటికే రేషన్ షాపులకు పంపిణీ కావాల్సిన సరుకుల సరఫరా ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ విషయాన్ని గుర్తించిన పౌరసరఫరాల కమిషనర్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించినా నేటికీ ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఈ పరిస్థితుల్లో సెప్టెంబరు నెల రేషన్ సరుకుల పంపిణీ జరుగుతుందో లేదోనని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
రేషన్‌కు గండం
Published Tue, Aug 27 2013 3:51 AM | Last Updated on Fri, Sep 1 2017 10:08 PM
Advertisement
Advertisement