
వేరు కాపురాలు పెట్టిన దంపతుల కష్టాలు
రేషన్ కార్డు దరఖాస్తుల కోసం తిప్పలు
తల్లిదండ్రుల కార్డులో పేర్లు తొలగిస్తేనే అవకాశం
సివిల్ సప్లయ్ సర్కిల్ కార్యాలయాలకు పరుగో పరుగు
అయిదేళ్ల క్రితం వివాహమైన రజితకు ఇద్దరు పిల్లలు. భర్త శ్రీనివాస్ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. మాదన్నపేటలో నివాసం. ఈ కుటుంబానికి రేషన్ కార్డు లేదు. ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు స్వీకరిస్తుండటంతో మీ సేవ కేంద్రం ఆన్‌లైన్ ద్వారా నమోదుకు ప్రయత్నించారు. ఆన్‌లైన్ దరఖాస్తులో ఆధార్ నంబర్ కొట్టగానే ఇప్పటికే ఆహార భద్రత (రేషన్) కార్డు లబి్ధదారుగా చూపించింది. భర్త శ్రీనివాస్ ఆధార్ నంబర్‌కు కూడా అదే పరిస్థితి ఎదురైంది. పెళ్లి కాకముందు వారు తల్లిదండ్రుల రేషన్ కార్డులో సభ్యులుగా ఉన్నారు. ఆ కార్డుల్లో సభ్యులుగా తొలగిస్తే తప్ప కొత్తగా దరఖాస్తులకు సాధ్యం కాదని మీ సేవ సెంటర్ నిర్వాహకులు స్పష్టం చేశారు. దీంతో తల్లిదండ్రుల రేషన్ కార్డుల్లోంచి తమ పేర్లు తొలగించేందుకు దరఖాస్తు చేసుకున్నారు. పేర్లు తొలగించేంత వరకు కొత్త కార్డుల కోసం దరఖాస్తులు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇది ఒక రజిత, శ్రీనివాస్ దంపతులకు ఎదురైన సమస్య కాదు.. నగరంలో కొత్త కాపురం పెట్టిన అన్ని కుటుంబాల పరిస్థితి ఇలాగే ఉంది.
సాక్షి, సిటీబ్యూరో : కొత్తగా వివాహమై వేరుపడిన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డు దరఖాస్తుల కోసం తిప్పలు తప్పడం లేదు. తల్లిదండ్రుల కుటుంబాల రేషన్ కార్డుల నుంచి వీరి పేర్లు తొలగిస్తే కానీ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. మీ సేవ ద్వారా కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రయతి్నంచినా.. ఇప్పటికే ఎఫ్‌ఎస్‌సీ లబి్ధదారులని ఆన్‌లైన్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీంతో పేర్లు తొలగించేందుకు, దరఖాస్తు చేసుకునేందుకు రెవెన్యూ, సివిల్ సప్లయ్ సర్కిల్ ఆఫీసులకు బారులు తీరుతున్నారు. అయినా పాత కార్డుల నుంచి తక్షణ పేర్ల తొలగింపునకు సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవైపు కొత్త రేషన్ కార్డుల కోసం ఆన్‌లైన్ ద్వారా చేసుకున్న దరఖాస్తు ప్రతులను సమరి్పంచేందుకు సర్కిల్ ఆఫీస్‌లకు క్యూ కట్టడం, మరోవైపు పాత కార్డులో పేర్ల తొలగింపునకు దరఖాస్తులు వస్తుండటంతో పరిస్థితి గందరగోళంగా తయారైంది.
నాలుగేళ్ల తర్వాత అవకాశం..
కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు నాలుగేళ్ల తర్వాత అవకాశం లభించింది. గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ అంటూనే పదేళ్లలో మొక్కుబడిగానే జారీ చేసి చేతులు దులుపుకొంది. వాస్తవంగా నాలుగేళ్ల క్రితం కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే సివిల్ సప్లయ్ వెబ్‌సైట్‌లో ఎఫ్‌ఎస్‌సీ లాగిన్‌ను నిలిపివేసింది. అప్పటి నుంచి దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు లేకుండాపోయింది. అంతకు ముందు పెండింగ్‌లోని ఆన్‌లైన్ దరఖాస్తులను పరిశీలించి కొన్ని కార్డులను అమోదించి మెజారిటీ దరఖాస్తులను తిరస్కరించింది. తాజాగా దరఖాస్తు చేసుకునే లాగిన్ పునరుద్ధరించడంతో కొత్త కుటుంబాలు అసక్తి కనబర్చుతున్నా.. తల్లిదండ్రుల పాత కార్డులో లబి్ధదారులుగా పేర్లు ఉండటం సమస్యగా తయారైంది. మరోవైపు కొత్త కార్డులు ఎప్పుడు మంజూరవుతాయో తెలియని పరిస్థితి. దీంతో తల్లిదండ్రుల కార్డుల్లో పేర్లు తొలగించుకుంటే కొత్త కార్డులు మంజూరయ్యే వరకు పరిస్థితేంటనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. రేషన్‌కార్డుతో ఆరోగ్య శ్రీ,ఇతర సంక్షేమ ఫధకాలు ముడి పడి ఉండటంతో తల్లిదండ్రుల పాత కార్డులో పేర్లు తొలగించుకునేందుకు కొన్ని కొత్త కుటుంబాలు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.
పేర్లను తొలగిస్తాం
కొత్తగా ఏర్పడిన కుటుంబాలు వారి పేర్లు తల్లిదండ్రుల పాత కార్డులోంచి తొలగించేందుకు స్థానిక సివిల్ సప్లయ్ సర్కిల్ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు మూడు రోజుల వ్యవధిలో పాత కార్డులోని సదరు సభ్యుడి పేరును తొలగించేలా చర్యలు చేపట్టాం. పేర్ల తొలగింపు అనంతరం కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
– దేవినేని దీప్తి, ఇన్‌చార్జి డీఎస్వో, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment