
ఈపాస్ మిషన్‌లో నమోదు చేయని పేర్లు
సాంకేతిక కారణమంటూ తప్పించుకుంటున్న అధికారులు
బహుదూర్‌ఖాన్‌పేటలో రెండునెలలుగా లబ్ధిదారుల నిరీక్షణ
ఈ ఫొటోలో రేషన్‌కార్డు ప్రొసీడింగ్ కాపీతో కనిపిస్తున్న మహిళ పేరు దొమ్మాటి అనూష. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన కరీంనగర్ మండలం బహుదూర్‌ఖాన్‌పేటకు చెందిన అనూషకు పదేళ్ల నుంచి రేషన్‌కార్డు లేదు. గణతంత్ర దినోత్సవం రోజు అధికారులు భర్త అనిల్ పేరిట కొత్త రేషన్‌కార్డు ఇచ్చారు. ఫిబ్రవరి 1 నుంచి బియ్యం వస్తాయని అధికారులు చెప్పగా రేషన్ డీలర్ మాత్రం ఈ పాస్ మిషన్‌లో పేర్లు రాలేదని చెప్పారు. ఈ సమస్య ఒక్క అనూషది మాత్రమే కాదు గ్రామంలోని 17మంది కొత్తకార్డుదారులది. రెండు నెలల నుంచి బియ్యం కోసం డీలరు, అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం బహుదూర్‌ఖాన్‌పేట గ్రామాన్ని సంక్షేమ పథకాల అమలు కోసం అధికారులు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని జనవరి 26న ఇందిరమ్మ ఇండ్లు 106మంది, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 11, రైతుభరోసా 92మంది, 17 మందికి కొత్తరేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఫిబ్రవరి 1 నుంచి బియ్యం పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించారు.
కానీ రేషన్ డీలర్‌కు బియ్యం కోటా వచ్చినప్పటికీ కొత్త రేషన్‌కార్డు లబ్ధిదారుల పేర్లు ఈపాస్ మిషన్‌లో నమోదు చేయకపోవడంతో బియ్యం ఇవ్వలేదు. మార్చినెలలో సైతం ఇదే పరిస్థితి నెలకొనడంతో లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయలేదు. కొత్త రేషన్‌కార్డు వచ్చి రెండు నెలలవుతున్నప్పటికీ బియ్యం రావడంలేదని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. బహుదూర్‌ఖాన్‌పేటలో మొత్తం 254 రేషన్‌కార్డులుండగా ప్రతినెలా 86 క్వింటాళ్ల బియ్యం స్టాక్ వస్తోంది. అయితే జనవరి 26న బహుదూర్‌ఖాన్‌పేటతోపాటు రెవెన్యూ గ్రామమైన చామనపల్లిలోని 36 మందికి కొత్తరేషన్‌కార్డులను అధికారులు మంజూరు చేశారు.
చామనపల్లికి చెందిన లబ్ధిదారుల పేర్లు ఈపాస్ మిషన్‌లో నమోదు కాగా పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన బహుదూర్‌ఖాన్‌పేట గ్రామ లబ్ధిదారుల పేర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడం సివిల్‌సప్‌లై అధికారుల పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. దాదాపుగా 40రోజుల నుంచి సమస్యను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. అయితే కొత్త రేషన్‌కార్డు నెంబర్లు కొన్ని సాంకేతిక కారణాలతో స్టేట్ కమీషనరేట్ కార్యాలయం నుంచి జనరేట్ కాలేదని సివిల్ సప్లయి డీటీ సురేందర్ తెలిపారు. వచ్చేనెలలో సమస్యను పరిష్కరించి మే నెల నుంచి లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేసే అవకాశముందని పేర్కొన్నారు.
ఏడేళ్ల తర్వాత కొత్తకార్డు
పెళ్లయిన ఏడేళ్లకు కొత్త రేషన్‌కార్డు వచ్చింది. గతంలో నా పేరు తల్లిదండ్రుల రేషన్‌కార్డులో ఉంది. అయితే కొత్తగా భార్య, ఇద్దరు పిల్లల పేర్లతో అధికారులు రేషన్‌కార్డు ఇచ్చారు. రెండునెలలుగా బియ్యం కోసం రేషన్ దుకాణానికి వెళ్తే కొత్త పేర్ల జాబితా రాలేదని డీలర్ చెప్పడంతో నిరాశపడ్డాను.
– అజయ్, బహుదూర్‌ఖాన్‌పేట
బియ్యం కోటా వచ్చింది
ఫిబ్రవరి, మార్చి నెలల్లో అదనంగా ఆరు క్వింటాళ్ల బియ్యం కోటా వచ్చింది. ఈపాస్ మిషన్‌లో కొత్త రేషన్‌కార్డుదారుల పేర్లు రావడం లేదు. పేర్లు లేకపోవడంతో బియ్యం ఇవ్వడం లేదు.
– తప్పెట్ల తిరుమల, రేషన్ డీలర్, బహుదూర్‌ఖాన్‌పేట
Comments
Please login to add a commentAdd a comment