government subsidy
-
ఆకు పచ్చని బంగారం!
వెదురు.. పేదవాడి కలప! ఆర్థికపరంగానే కాకుండా పర్యావరణపరంగా కూడా అభివృద్ధికి దోహదపడే పంటగా వెదురు గుర్తింపు పొందింది. గ్రామీణ పేదలకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కూడా ఇది మంచి సాధనం. అందుకే దీన్ని ‘గ్రీన్ గోల్డ్’ (ఆకుపచ్చని బంగారం) అని పిలుస్తుంటారు. పంటల సాగుకు తగినంత సారం లేని భూములు, అటవీయేతర ప్రభుత్వ భూములు వెదురు తోటల సాగుకు అనుకూలం. ఇందుకోసం ప్రత్యేకంగా ‘బాంబూ మిషన్’ ద్వారా ఈ ఏడాది ఖరీఫ్ నుంచే ప్రోత్సాహకాలు ఇవ్వడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాయత్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా రెండేళ్లలో 1,05,000 హెక్టార్లలో వెదురు తోటల సాగే లక్ష్యం. వెదురు రైతులకు మూడేళ్ల పాటు ప్రభుత్వ సహాయం అందుతుంది. నాలుగో ఏడాది నుంచి వెదురు కోతకు వస్తుంది. ఒక్కసారి నాటితే చాలు.. 60 ఏళ్లపాటు ఏటా రైతుకు ఆదాయం వస్తుందని చెబుతున్నారు. ఈ ఏడాది వెయ్యి ఎకరాల్లో డ్రిప్ ద్వారా వెదురు సాగును ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ‘సాగుబడి’ ప్రత్యేక కథనం. వెదురు అనాదిగా మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నది. సుమారు 1500 రకాలుగా వెదురు ఉపయోగపడుతున్నట్లు అంచనా. అయితే, మన దేశంలో వెదురు ఇన్నాళ్లూ సంరక్షించదగిన అటవీ చెట్ల జాబితాలో ఉంది. అందువల్లనే మన పొలంలో పెరిగిన వెదురు బొంగులను నరకాలన్నా అటవీ శాఖ అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. ఈ ఆంక్షల వల్ల ప్రజల అవసరానికి తగినంత వెదురు దొరక్కుండా పోయింది. అందుకని, కేంద్ర ప్రభుత్వం కొద్ది నెలల క్రితం వెదురును అటవీ చెట్ల జాబితాలో నుంచి తొలగించింది. దీంతో పొలాల్లో వెదురు తోటలు సాగు చేయడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. మధ్యప్రదేశ్ రైతు వెదురుతోట ఏరియల్ వ్యూ ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెదురు సాగుకు ప్రోత్సాహకాలను ప్రకటిస్తూ ‘బాంబూ మిషన్’ను ప్రారంభించింది. ఖర్చులో 60% కేంద్రం, 40% రాష్ట్రం భరించే విధంగా మార్గదర్శకాలు ఇటీవల విడుదలయ్యాయి. తెలంగాణ అదనపు అటవీ సంరక్షణాధికారి రాకేశ్ మోహన్ డోబ్రియల్ ‘సాగుబడి’ ప్రతినిధితో ముఖాముఖిలో వివరించారు. వాతావరణ మార్పులను తట్టుకోవడానికి హరిత విస్తీర్ణాన్ని పెంపొందించే లక్ష్యంతో సాగుకు అంతగా యోగ్యం కాని ప్రైవేటు, అటవీయేతర భూముల్లో వెదురు సాగును ప్రోత్సహిస్తున్నట్లు ఆయన వివరించారు. భూసారం పెద్దగా లేక పడావు పడిన ప్రభుత్వేతర, అటవీయేతర భూముల్లో వెదురు సాగును ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. సాగుతోపాటు.. నర్సరీల ఏర్పాటుకు, వెదురుతో అగరొత్తులు, ఫర్నిచర్ వంటి అనేక ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేందుకు కూడా బాంబూ మిషన్ నిధులను సమకూర్చుతున్నది. ఈ కార్యక్రమాల అమలుకు జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో వెదురు అభివృద్ధి సంస్థ(బి.డి.ఎ.) రూపుదిద్దుకుంటున్నది. వ్యవసాయ, ఉద్యాన, అటవీ, గ్రామీణాభివృద్ధి, పరిశ్రమల శాఖల అధికారులు, స్వయం సహాయక బృందాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉంటారు. రెండు వెదురు జాతులు అనుకూలం! వెదురును వాణిజ్యపరంగా సాగు చేయదలచినప్పుడు ప్రధానంగా రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. 1. ముళ్లు తక్కువగా ఉండి, లావుగా, నిటారుగా పెరిగే రకమై ఉండాలి. 2. రెండు కణుపుల మధ్య దూరం ఎంత ఎక్కువగా ఉంటే అంత ప్రయోజనకరమైనదిగా భావిస్తారు. ఇటువంటివి ఎక్కువ ధర పలుకుతాయి.ప్రకృతిలో వెదురు జాతులు చాలా ఉన్నప్పటికీ బాంబూసా బాల్కోవా, బాంబూసా టుల్డ అనే రెండు రకాలు రైతులు సాగు చేసి అధికాదాయం పొందడానికి అనువైనవిగా గుర్తించినట్లు డోబ్రియల్ తెలిపారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో వెదురును ఇప్పటికే రైతులు కొందరు సాగు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అధికారుల బృందం ఇటీవల ఈ రాష్ట్రాల్లో పర్యటించి ఏయే వెదురు రకాలు మేలైనవో గుర్తించింది.నీరు నిలవని ఎర్ర నేలలు వెదురు సాగుకు అనుకూలం. మధ్యప్రదేశ్‌లో కొందరు రైతులు నల్లరేగడి భూముల్లో (4“4 మీ. దూరంలో) సాగు చేస్తున్నారు. భూసారం తక్కువగా ఉన్న భూముల్లో కూడా వెదురు పెరుగుతుంది. అయితే, దిగుబడి కొంచెం తక్కువగా వస్తుంది. వెదురు తోటలు నాటిన నాలుగో ఏడాది నుంచి బొంగులను నరకవచ్చు. అప్పటి నుంచి సుమారు 60 ఏళ్ల వరకు ఏటా ఆదాయం వస్తుందని చెబుతున్నారు. వెదురు తోటల్లో అంతర పంటలు కూడా సాగు చేసుకోవచ్చు.తప్పనిసరిగా డ్రిప్‌ను ఏర్పాటు చేసుకొని.. తగినంత ఎరువులను అందిస్తే.. భూసారం అంతగా లేని భూముల్లోనూ వెదురు సాగు ద్వారా మంచి దిగుబడి పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. భూగర్భజలాలు అడుగంటిన భూముల్లో అయితే ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో మీటరు వెడల్పు, మీటరు లోతులో పొలం అంతటా వాలుకు అడ్డంగా కందకాలు తవ్వుకోవడం ద్వారా నీటి లభ్యతను పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కుండపోత వర్షాలకు కందకాల నుంచి పొంగిపొర్లే నీటిని కూడా పొదివి పట్టుకోవడానికి నీటి కుంటలు తవ్వుకోవచ్చు. బాంబూసా టుల్డ రకం ఇది థాయ్‌లాండ్‌కు చెందిన రకం. చైనా, భూటాన్, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్, ఉత్తర భారత రాష్ట్రాలలో సాగులో ఉంది. దీన్ని భవన నిర్మాణ రంగంలోను, పేపర్ మిల్లుల్లోను ఎక్కువగా వాడుతున్నారు. బొంగులు ఆకుపచ్చగా 5–10 సెం.మీ. లావుతో 7–23 మీటర్ల ఎత్తున పెరుగుతాయి. కణుపుల మధ్య 40–70 సెం.మీ. దూరం ఉంటుంది. కింది వైపు కణుపులకు పీచు వేళ్లు ఉంటాయి. బాల్కోవా రకానికి పెద్దపీట బాంబూసా బాల్కోవా రకం వెదురు నున్నగా అందంగా, ఆకు పచ్చగా, లావుగా, నిటారుగా ఎదుగుతుంది. బొంగులు 12–20 మీటర్ల ఎత్తున, 8–15 సెం.మీ. లావున ఎదుగుతాయి. కణుపుల మధ్య 20–40 సెం.మీ. లావున ఎదుగుతాయి. మన దేశంతోపాటు థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, నేపాల్‌లలో బాల్కోవా రకం కనిపిస్తుంది. దక్షిణాసియా దేశాల్లో ఈ రకం వెదురు ఎక్కువగా సాగులో ఉంది. దీని మొలకలు ఆహారంగా తీసుకోవచ్చు. భవన నిర్మాణంలో, బుట్టలు, తడికెలు వంటివి అల్లడానికి ఈ వెదురు బాగుంటుంది. 5 లక్షల టిష్యూకల్చర్ మొక్కలు ఈ ఏడాది పైలట్ ప్రాజెక్టులో భాగంగా సుమారు 5 లక్షల బాంబూసా బాల్కోవా రకానికి చెందిన నాణ్యమైన టిష్యూకల్చర్ మొక్కలను కనీసం వెయ్యి మంది రైతులకు అందిస్తామని ఆయన తెలిపారు. డ్రిప్‌ను సబ్సిడీపై అందిస్తామన్నారు. నర్సరీలను ఏర్పాటు చేసే ప్రభుత్వ సంస్థలకు 100%, ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు 50% సబ్సిడీ ఇస్తారు. వెదురు ఉత్పత్తుల తయారీ కేంద్రాల ఏర్పాటును ప్రోత్సహిస్తారు. స్థానికులకు ఉపాధి అవకాశాలూ పెరుగుతాయని భావిస్తున్నారు. వీటన్నిటికీ మించి.. బీళ్లుగా ఉన్న భూముల్లో పచ్చని చెట్లు ఏడాది పొడవునా పెరుగుతూ ఉంటే.. భూతాపం తగ్గడానికి వీలవుతుంది. ఈ లక్ష్యంతోనే వాతావరణ మార్పులను ఎదుర్కొనే ఒక ఉపాయంగా వెదురు సాగును ఇండోనేషియా వంటి దేశాలు ప్రోత్సహిస్తున్నాయి. ఎకరానికి రూ. లక్ష ఆదాయం అంచనా కనీసం 6 నెలల నుంచి 2 ఏళ్ల వయసు మొక్కలను నాటుకోవాలి. వరుసల మధ్య 4 మీటర్లు, మొక్కల మధ్య 3 మీటర్ల(4“3)దూరంలో నాటుకోవచ్చు. ఎకరానికి 330 మొక్కలు నాటి డ్రిప్‌తో ఎరువులు, నీరు తగినంతగా అందిస్తే.. నాలుగేళ్లలో రూ. 4 లక్షల ఖర్చవుతుంది. నాలుగేళ్ల తర్వాత కుదురుకు 8 చొప్పున సుమారు 2,640 బొంగులు వస్తాయి. బొంగు రూ. 50 చొప్పున ఎకరానికి రూ. 1,32,000 ఆదాయం వస్తుంది. బొంగు బరువు 15 కిలోల చొప్పున 60 వేల కిలోల వెదురు ఉత్పత్తవుతుందని భావిస్తున్నట్లు తెలంగాణ అదనపు అటవీ సంరక్షణాధికారి రాకేశ్ మోహన్ డోబ్రియల్ తెలిపారు. ఆ తర్వాత ఎకరానికి ప్రతి ఏటా రూ. 25 వేలు ఖర్చవుతుంది. ఎకరానికి ఏటా ఆదాయం రూ. లక్ష వస్తుందని అంచనా వేస్తున్నారు. వెదురు బొంగుల నుంచే మొక్కలు! వెదురు మొక్కలను రైతులే స్వయంగా తయారు చేసుకునే సులువైన మార్గం ఇది. వెదురు గింజలు మొలవడానికి చాలా రోజులు పడుతుంది. అన్ని గింజలూ మొలవకపోవచ్చు. కాబట్టి, పచ్చి బొంగులను భూమిలో పాతి పెట్టి 60 రోజుల్లో మొక్కలు తయారు చేసుకోవడం ఉత్తమం. ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని కేంద్రీయ అటవీ వ్యవసాయ పరిశోధనా సంస్థ(ఐ.సి.ఎ.ఆర్. అనుబంధ సంస్థ) శాస్త్రవేత్తలు ఈ పద్ధతిని రైతులకు సూచిస్తున్నారు. రెండేళ్ల వయసున్న ఒక పచ్చి వెదురు బొంగుతో 165 మొక్కలను తయారు చేసుకోవడం మేలని ఐ.సి.ఎ.ఆర్. శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఒక ఏడాది, మూడేళ్ల బొంగుల కన్నా రెండేళ్ల బొంగులతోనే నాణ్యమైన ఎక్కువ మొక్కలు పొందవచ్చని అధ్యయనంలో తేల్చారు. బాంబూసా వల్గారిస్ అనే వెదురు రకం సాగుకు అనువైనదని వారు చెబుతున్నారు. మట్టి తవ్వి పచ్చి బొంగులను ఉంచి.. వాటిపైన.. మట్టి (ఎర్రమట్టి, ఇసుక, పశువుల ఎరువును సమపాళ్లలో కలిపిన) మిశ్రమాన్ని 3 సెం.మీ. మందాన వేయాలి. తేమ ఆరిపోకుండా తగుమాత్రంగా తడుపుతూ ఉండాలి. కణుపుల దగ్గర నుంచి 14వ రోజు నుంచి మొలకలు రావడం మొదలై 35 రోజుల్లో పూర్తవుతుంది. ఒక కణుపు తర్వాత మరో కణుపునకు మాత్రమే మొలకలు, వేర్లు మొలుస్తాయి. బొంగును మట్టిలో పాతిపెట్టిన 60 రోజులకు మొలకలను బొంగు నుంచి వేరు చేయవచ్చు. బొంగుకు ఇరువైపులా మట్టిని జాగ్రత్తగా తీసివేసి మొక్కలను సికేచర్తో కత్తిరించి సేకరించాలి. మట్టి మిశ్రమాన్ని నింపిన పాలిథిన్ బ్యాగులలో మొక్కలను పెట్టి, పెంచుకోవాలి. కనీసం ఆరు నెలల మొక్కలనే పొలంలో నాటుకోవాలి. పొలం చుట్టూ గట్లపైన పచ్చి బొంగులను భూమిలో పాతి పెడితే.. మొలకలు వస్తాయి. వాటిని అలాగే పెరగనిస్తే చాలు. అడవి జంతువుల నుంచి పంటను రక్షించుకోవడానికి వెదురు జీవ కంచెను ఇలా పెంచుకోవచ్చు. 1. బాంబూసా వల్గారిస్ వరి రకం బొంగులు భూమిలో పాతిన 28 రోజులకు పెరిగిన మొలకలు. 2. బొంగులో ఒక కణుపు తర్వాత మరో కణుపునకు మొలకలు, వేర్లు వచ్చిన దృశ్యం 3. బొంగు మొదలు దగ్గరలో ఉన్న కణుపుల్లో వేర్లు వస్తాయి కానీ మొలకలు రావు. 4. పాలిథిన్ బ్యాగ్‌లలో నాటిన బాంబూసా వల్గారిస్ మొక్కల – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
కరెంట్ బిల్లుల్లో ‘సబ్సిడీ’ లెక్కలు!
సాక్షి, హైదరాబాద్: గృహ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న విద్యుత్ సబ్సిడీల వివరాలను ఇకపై కరెంటు బిల్లుల్లో పొందు పరచనున్నారు. వినియోగించిన విద్యుత్, ప్రభుత్వ సబ్సిడీ పోగా చెల్లించాల్సిన చార్జీల వివరాలను మాత్రమే ఇప్పటివరకు బిల్లుల్లో పేర్కొనేవారు. సబ్సిడీ మినహాయించిన తర్వాత ప్రతి యూనిట్ విద్యుత్ వినియోగంపై చెల్లించాల్సిన విద్యుత్ టారీఫ్ పట్టికను బిల్లుల వెనక ముద్రించేవారు. దీంతో ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీల గురించి గృహ వినియోగదారులకు పెద్దగా అవగాహన ఉండటం లేదు. ఈ నేపథ్యంలో వినియోగించిన విద్యుత్, విద్యుత్ సరఫరాకు జరిగిన వాస్తవ ఖర్చు, అందులో రాష్ట్ర ప్రభుత్వం భరించే రాయితీలు, రాయితీలు పోగా వినియోగదారులు చెల్లించాల్సిన చార్జీల వివరాలను బిల్లుల్లో పొందుపరుస్తారు. ఈ మేరకు రాష్ట్రంలో 2018–19లో అమలు చేయాల్సిన కొత్త విద్యుత్ టారిఫ్‌ను ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ (టీఎస్ఈఆర్సీ) తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. సబ్సిడీ వివరాలను బిల్లుల్లో పొందుపరచాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో వరుసగా రెండేళ్లపాటు చార్జీలు పెంచకపోవడం, సాధారణ ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో ప్రభుత్వానికి ప్రచారం కల్పించేందుకు ఈఆర్సీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రూ.4,984 కోట్ల సబ్సిడీ.. వ్యవసాయానికి ఉచితంగా, గృహ వినియోగదారులకు తక్కువ చార్జీలతో విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు ఏటా సబ్సిడీలు మంజూరు చేస్తోంది. 2018–19లో రూ.4,984.3 కోట్ల సబ్సిడీ ఇచ్చేందుకు అంగీకరించింది. ఈఆర్సీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యయం (కాస్ట్ ఆఫ్ సప్లై) సగటున యూనిట్‌కు రూ.6.04 అవుతోంది. నెలకు 200 యూనిట్ల లోపు వినియోగించే పేద, మధ్య తరగతి గృహ వినియోగదారులకు ప్రభుత్వ సబ్సిడీతో అంతకంటే తక్కువ ధరకు విద్యుత్ అందుతోంది. 100 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తే తొలి 50 యూనిట్లకు రూ.1.45 చొప్పున, 51–100 లోపు యూనిట్లకు రూ.2.60 చొప్పున మాత్రమే చార్జీలు వసూలు చేస్తున్నారు. వినియోగం 100–200 యూనిట్ల మధ్య ఉంటే తొలి 100 యూనిట్లకు రూ.3.30, 101–200 యూనిట్లకు రూ.4.30 చొప్పున చార్జీలు వర్తింపజేస్తున్నారు. 200 యూనిట్లకు మించితే? అయితే విద్యుత్ సరఫరా 200 యూనిట్లు దాటితే ఎలాంటి సబ్సిడీలు వర్తించకపోగా, వాస్తవ విద్యుత్ సరఫరా వ్యయం కన్నా అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్నారు. వినియోగం 200 యూనిట్లకు మించితే తొలి 200 యూనిట్లకు రూ.5, ఆపై 201–300 యూనిట్లకు రూ.7.2, 301–400 యూనిట్లకు రూ.8.5, 401–800 యూనిట్లకు రూ.9 చొప్పున చార్జీలు మోత మోగిస్తున్నారు. వినియోగం 800కు మించిన తర్వాతి యూనిట్లకు 9.5 చొప్పున చార్జీలు వడ్డిస్తున్నారు. ఈ వినియోగదారులకు జారీ చేసే బిల్లుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ఈఆర్సీ స్పష్టత ఇవ్వలేదు. -
ఆకేసి...లాగేసి !
విజయనగరం కంటోన్మెంట్ :బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు కాకపోవడంతో దరఖాస్తుచేసుకున్న వారు ఇబ్బందులకు గురవుతున్నారు. రుణం వస్తుంది కదా అని వ్యయప్రయాసలకోర్చి దరఖాస్తు చేసుకున్న వారు రుణాల కోసం కళ్లుకాయలుకాసేలా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో బీసీ కార్పొరేషన్ ద్వారా గత ఏడాది 4,941 యూనిట్లకు రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించారు. వీరికి రూ.19.94 కోట్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందులో 1,154 యూనిట్లకు రూ.3.5 కోట్ల రుణం ఆన్లైన్ ద్వారా మంజూరయింది. దీని కోసం ఒకటి సబ్సిడీకి, మరొకటి రుణానికి వినియోగించేలా ప్రతి లబ్ధిదారుడూ రెండేసి బ్యాంక్ ఖాతాలు తెరిచారు. కానీ ఆ సొమ్ము ఇంతవరకూ లబ్ధిదారులకుఅందలేదు. 50 శాతం సబ్సిడీ సొమ్మును ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. కాగా, ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేస్తేనే, రుణాలు అందజేయాలని బ్యాంకర్లకు ఆదేశాలు అందాయి. దీంతో బ్యాంకర్లు రుణాలు మంజూరు చేసి ఖాతాల్లో వేసి ఉంచారు. ప్రభుత్వం మాత్రం సబ్సిడీని విడుదల చేయకపోవడంతో మంజూరైన రుణ మొత్తం బ్యాంకు ఖాతాల్లో మూలుగుతోంది. ఇది గత ఏడాది పరిస్థితి. ఈ ఏడాది కూడా పరిస్థితి అలాగే ఉంది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి రుణ ప్రణాళిక ఖరారైంది. ఇందుకోసం లక్ష్యాలు కూడా నిర్దేశించారు. కానీ ఇప్పటివరకూ ఆదేశాలు మాత్రం ఇవ్వలేదు. గతంలో బ్యాంకర్లు రుణాలిచ్చినా సబ్సిడీ విడుదల చేయని ప్రభుత్వ యంత్రాంగం, ఇప్పుడు వార్షిక రుణప్రణాళిక విడుదల చేసి ఉత్తర్వులు నిలిపివేసింది. దీంతో బీసీ కార్పొరేషన్ రుణాల కోసం లబ్ధిదారులు ఎదరుచూడవలసి వస్తోంది. ఈ ఏడాదికి మార్జిన్ మనీ కింద 8,588 యూనిట్లు, రాజీవ్ అభ్యుదయ యోజన కింద 805, ఆర్థిక సహాయం కింద 510 యూనిట్లు కేటాయిస్తూ వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. దీనికి సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలన్న ప్రకటన మాత్రం విడుదల చేయలేదు. దీంతో ఏం చేయాలా అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ ఏడాది జిల్లాకు మొత్తం 9,903 యూనిట్లు మంజూరయ్యాయి. రూ. 89.90 కోట్లను రుణంగా అందజేయడానికి లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందులో మార్జిన్ మనీ కింద రూ.47.17 కోట్లు, మున్సిపాలిటీల్లో రాజీవ్ అభ్యుదయ కింద 805 యూనిట్లకు రూ.4.42 కోట్లు, ఆర్ధిక సహాయం కింద 510 యూనిట్లకు రూ.38.30 కోట్లు కేటాయించారు. అయితే రుణ ప్రణాళిక విడుదలై రోజులు గడుస్తున్నప్పటికీ ఏఏ యూనిట్లకు ఎవరు అర్హులు? ఏఏ యూనిట్లకు ప్రాధాన్యం ఇవ్వాలి? విద్య,వయోపరిమితి ఎంత? అన్న విషయాలపై ఇంకా ప్రకటన ఇవ్వకుండా, కేవలం రుణ ప్రణాళికను మాత్రమే విడుదల చేసిన ప్రభుత్వం అభ్యర్థులను ఆశల పల్లకి ఎక్కించింది. గత ఏడాది కూడా ఇలాగే చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు రుణ ప్రణాళిక విడుదల చేసి, నిబంధనలు విడుదల చేయకుండా నిలిపివేసిందని బీసీ సంఘాలు, వివిధ వ ర్గాలకు చెందిన నిరుద్యోగులు, ఉపాధిని ఆశిస్తున్న వారు విమర్శిస్తున్నారు. మరో పక్క కేంద్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌కు నిధులను కుమ్మరిస్తోంది. జిల్లాలో గత ఏడాది నిలిచిపోయిన రుణాలను కూడా తిరిగి మంజూరు చేసి, కొత్తగా రుణ ప్రణాళికతో పాటు మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. దీంతో జిల్లాలో ఈ ఏడాది రూ.11.93 కోట్లతో 1221 యూనిట్లకు రుణాలు ఇవ్వడానికి నిర్ణయించి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటికే 5,588 మందికి పైగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి డిసెంబర్ 4,5 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎస్సీ కార్పొరేషన్‌కు నిధులు ఇస్తుండడంతో ఈ కార్పొరేషన్ పరిధిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీలు లబ్దిపొందే అవకాశం ఉండగా, రాష్ట్రప్రభుత్వం మాత్రం బీసీ కార్పొరేషన్‌కు నిధులు ఇవ్వడం లేదు. రుణ ప్రణాళిక అమలుకు మార్గదర్శకాలు రాలేదు: 2014-15 ఆర్థిక సంవత్సరానికి వార్షిక రుణ ప్రణాళిక ఖరారయింది. అయితే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు రాలేదు. మొత్తం 9,903 యూనిట్లకు రూ.89.90 కోట్ల రుణాలను ఇవ్వడానికి ప్రణాళికను విడుదల చేశారు. మార్గదర్శకాలు వచ్చిన వెంటనే , ప్రకటన చేస్తాం. - నాగరాణి, ఈడీ, బీసీ కార్పొరేషన్, విజయనగరం. -
సోలార్ ‘షాక్’
నిన్న మొన్నటి వరకు ఎండలు మండిపోయాయి. అప్రకటిత విద్యుత్ కోత కారణంగా రాత్రి, పగలు తేడా లేకుండా ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో ప్రభుత్వం సబ్సిడీపై సోలార్ ఇన్వర్టర్లు అందిస్తామంటూ ముందుకు వచ్చింది. దీంతో కష్టపడి సంపాదించిన డబ్బులతో సోలార్ ఇన్వర్టర్ను అమర్చుకుందామని ఆశపడ్డారు. కానీ వారి ఆశలు అడియాశలుగానే మిగిలాయి. నాబార్డు ద్వారా 40 శాతం సబ్సిడీపై బ్యాంకర్ల ద్వారా సోలార్ ఇన్వర్టర్లు ఇస్తామని చెప్పిన గత ప్రభుత్వం, పాలకుల మాటలు నీటి మీద రాతలుగానే మిగిలాయి. సామాన్యునికి సబ్సిడీ ఇవ్వకుండా బడాబాబులకే బ్యాంకర్లు ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఈ పథకం చివరకు ఉన్నత వర్గాలకే పరిమితం అయింది. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందని ద్రాక్షగానే మారింది. నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో విద్యుత్ కోత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సోలార్ విద్యుత్‌పై దృష్టి సారించి సామాన్యులకు అందుబాటులోకి తీసుకువస్తే మేలు జరిగే అవకాశం ఉంది. దెబ్బతిన్న లక్ష్యం : సామాన్యునికి సోలార్ పరికరాలు అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రభుత్వ లక్ష్యం దెబ్బతిన్నది. సోలార్ ఇన్వర్టర్లను 40శాతం సబ్సిడీతో బ్యాంకర్ల ద్వారా ఇప్పిస్తామని గత పాలకులు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు. ఒక కుటుంబానికి సోలార్ ఇన్వర్టర్ కావాలంటే కెపాసిటీని బట్టి రూ.33,750 నుంచి రూ.56,700 వరకు అందుబాటులో ఉన్నాయని డీలర్లు చెబుతున్నారు. ప్రస్తుతం అప్రకటిత విద్యుత్ కోత కారణంగా విద్యుత్ ఇన్వర్టర్ల బ్యాటరీలు ఆరు నెలల కంటే ఎక్కువ పని చేయవని పేర్కొంటున్నారు. సోలార్ విద్యుత్‌కు సంబంధించిన బ్యాటరీలు మాత్రం ఎనిమిది సంవత్సరాల వరకు పని చేస్తాయని డీలర్లు చెబుతున్నారు. సౌర ఫలకాలకైతే 25 సంవత్సరాలకుపైగానే వారంటీ ఉందని అంటున్నారు. ఇంటి అవసరాలకు సరిపడా 75 వాట్ల సోలార్ ఇన్వర్టర్ ధర రూ.33,750 కాగా అందులో రూ.13,500ప్రభుత్వ సబ్సిడీ ఉంటుంది. 90వాట్ల ఇన్వర్టర్ ధర రూ.40,500నుంచి రూ.43,200వరకు ధ ర ఉండగా రూ.17,280 సబ్సిడీ వస్తుంది. 120వాట్ల ఇన్వర్టర్ రూ.54వేలనుంచి రూ.56,700 వరకు ఉండగా అందులో రూ.22,680 సబ్సిడీ వస్తుందని బ్యాంక ర్లు చెబుతున్నారు. సబ్సిడీలు బ్యాంకులకు కేటాయించకపోవడమే కాకుండా సరైన జీఓ బ్యాంకర్లకు జారీ చేయకపోవడంవల్లే ఈ పరిస్థితి నెలకొందని పలువురు ఆరోపిస్తున్నారు. విద్యుత్ కొరత తీవ్రంగా వేధిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సోలార్ విద్యుత్‌పై అధికారులు అవగాహన కల్పించడం లేదని ప్రజలు అంటున్నారు. ఒక్క కొత్తగూడెంలోనే సోలార్ విద్యుత్ వినియోగదారులు 400 వరకు ఉన్నట్లు డీ లర్లు చెబుతున్నారు. మధిర, వైరా, రెబ్బవరం తదితర పట్టణాలు, గ్రామాల్లో ఉన్న పెట్రోల్ బంకుల వారు ఈ సోలార్ విద్యుత్‌తో బంకులు నడుపుతున్నారు. తక్కువ ఖ ర్చు తో ఉపయోగపడే సోలార్ విద్యుత్‌ను ఎక్కువమంది వినియోగించుకోవాలంటే ప్రజలకు చైతన్యం కల్పించాల్సి ఉంది. నాబార్డు ద్వారా వచ్చే సబ్సిడీని బ్యాంకులకు ముందుగానే పంపినట్లయితే వినియోగదారులు ఎక్కువ మంది ముందుకు వచ్చే అవకాశం ఉందని ప్రజలు అంటున్నారు. -
నాణ్యతేదీ?
పంపిణీ అదిగో.. ఇదిగో అని చెబుతూ ఇపుడు హడావుడిగా జిల్లాకు చేర్చిన అరకొర విత్తన వేరుశనగ కాయల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. నాణ్యత పరీక్షలు నిర్వహించకుండానే పంపిణీకి సిద్ధం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విత్తన కాయల సేకరణలో ఆయా కంపెనీల నాన్చుడు వ్యవహారంతో ‘నాసిరకం’ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. రేపు విత్తనం వేశాక సరిగా మొలకెత్తక, ఆశించిన విధంగా దిగుబడి రాకపోతే ఎవరు బాధ్యత వహిస్తారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం అగ్రికల్చర్ : ప్రభుత్వం సబ్సిడీతో పంపిణీ చేయనున్న విత్తన వేరుశనగ నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. విత్తన నాణ్యతా ప్రమాణాలు తెలుసుకున్న తర్వాత రైతులకు పంపిణీ చేయాల్సి ఉండగా.. ఆ దాఖలాలేవీ కన్పించడం లేదు. దీనివల్ల రైతులు నష్టపోయే ప్రమాదముంది. జిల్లాలో ఈ నెల 26 నుంచి మొదటి విడత విత్తన వేరుశనగ పంపిణీ చేపట్టనున్నారు. ఇందుకోసం ఆయిల్‌ఫెడ్, మార్క్‌ఫెడ్, హాకా, ఏపీ సీడ్స్ ఏజెన్సీలు వివిధ జిల్లాల నుంచి కే-6 రకం విత్తన వేరుశనగను సేకరించి సరఫరా చేస్తున్నాయి. ‘వంద శాతం సర్టిఫైడ్ సీడ్’ అంటూ ట్యాగ్ తగిలిస్తున్నాయి. అయితే, అందులోనూ నాసిరకం కాయలు వచ్చే అవకాశముంది. నాసులు, ఊజీ, బూజు పట్టిన విత్తనకాయలను రైతులకు పంపిణీ చేసిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. వేరుశనగతో పాటు ఇతరత్రా అన్ని రకాల విత్తనాలను రైతులకు పంపిణీ చేసే ముందు ప్రయోగశాలలో పరీక్షించి.. నాణ్యతను నిర్ధారించాల్సి ఉంటుంది. విత్తనాలు జిల్లాకు సరఫరా అయిన వెంటనే లాట్ల వారీగా బస్తాల నుంచి రెండు రకాల శ్యాంపిల్స్ (యాక్ట్, సర్వీస్) సేకరించాలి. యాక్ట్ శ్యాంపిల్స్‌ను హైదరాబాద్ లేదా తాడేపల్లిగూడెం ప్రాంతాల్లోని ప్రయోగశాలకు పంపాలి. సర్వీసు శ్యాంపిల్స్‌ను జిల్లాలోనే ఉన్న విత్తన పరీక్ష కేంద్రంలో పరీక్షించాలి. 70 శాతం జర్మినేషన్ (మొలక శాతం), 9 శాతం తేమ (మాయిశ్చరైజ్డ్), 96 శాతం ఫిజికల్ ప్యూరిటీ, 4 శాతం వ్యర్థ పదార్థాలు (వేస్టేజ్) లాంటి వాటిని పరీక్షించి.. నాణ్యతా ప్రమాణాలు తేల్చాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం ఉన్న విత్తనాలు మాత్రమే రైతులకు పంపిణీ చేయాలి. లేని వాటిని తక్షణమే వెనక్కి పంపడంతో పాటు సరఫరా ఏజెన్సీలు లేదా సంస్థలపై శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేయాలి. ఆ తరువాత మరోసారి పరీక్షించి, అందులో వచ్చే గణాంకాలను బట్టి విత్తన చట్టం ప్రకారం చర్యలుంటాయి. ఇంతవరకు బాగానే ఉన్నా, జిల్లాకు వచ్చిన విత్తన వేరుశనగ నుంచి శ్యాంపిల్స్ సేకరించి.. ప్రయోగశాలకు పంపడంలో మండల వ్యవసాయాధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. 2014-15 సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని విత్తన పరీక్ష కేంద్రానికి 600 శ్యాంపిల్స్ లక్ష్యంగా ఇచ్చారు. జిల్లాకు 15 రోజుల నుంచి విత్తన వేరుశనగ సరఫరా అవుతోంది. ప్రస్తుతానికి 50 మండలాలకు పైగా కేంద్రాల్లో నిల్వ చేశారు. అక్కడి నుంచి విత్తన శ్యాంపిల్స్ జిల్లా కేంద్రంలోని ప్రయోగశాలకు చేరడం లేదు. గుత్తి, రాప్తాడు మండలాల నుంచి మాత్రమే పది శ్యాంపిల్స్ వచ్చాయి. అవి కూడా నిన్న, మొన్న వచ్చినట్లు విత్తన పరీక్ష కేంద్రం అధికారులు తెలిపారు. వాటిని పరీక్షించి నాణ్యత తేల్చడానికి 7 నుంచి 10 రోజులు పడుతుంది. అంతలోగా (ఈ నెల 26 నుంచి) రైతులకు విత్తనకాయలు పంపిణీ చేయనున్నారు. వర్షమొస్తే వెంటనే విత్తుకునే పరిస్థితి ఉంది. జిల్లాలోని మిగతా 61 మండలాల నుంచి శ్యాంపిల్స్ ఎప్పుడు వస్తాయి? ప్రయోగశాలలో జర్మినేషన్ మిషన్ ఒకటే ఉన్నందున వాటిని ఎప్పుడు పరీక్షిస్తారు? విత్తుకున్న త ర్వాత నాణ్యత లేదని తేలితే రైతులకు జరిగే నష్టాన్ని ఎవరు భరిస్తారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవారెవరూ లేరు. జిల్లాకు దాదాపు 15 రోజుల నుంచి సరఫరా అవుతున్న విత్తనకాయల శ్యాంపిల్స్‌ను ఎప్పటికప్పుడు ప్రయోగశాలకు పంపివుంటే ఈ పాటికి చాలా వరకు ఫలితాలు వెల్లడయ్యే అవకాశముండేది. ఫలితంగా రైతులకు కొంతలో కొంతైనా ప్రయోజనం కలిగేది. -
రాయితీ విత్తనాల జాడేదీ?
యాచారం, న్యూస్‌లైన్: మెట్ట పంటల సాగుకు సమాయత్తమవుతున్న రైతులు... ప్రభుత్వం రాయితీపై ఇచ్చే విత్తనాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. విత్తుకునే గడువు దగ్గర పడుతుండటం... రాయితీ విత్తనాల జాడలేక పోవడంతో ఆందోళన చెందుతున్నారు. విత్తనాలు ఎప్పుడొస్తాయని వ్యవసాయ శాఖ అధికారులను అడిగితే వస్తాయి... ఇస్తాం అంటున్నారే తప్ప ఎప్పుడొస్తాయనేది స్పష్టంగా చెప్పడం లేదు. దీంతో రైతులు నిత్యం వ్యవసాయ శాఖ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. పక్షం రోజుల క్రితం కురిసిన వర్షాలతో రైతుల మెట్ట పంటల సాగు కోసం పొలాలను సిద్ధం చేసుకున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో రైతులు అత్యధికంగా జొన్న, మొక్కజొన్న, సజ్జ, ఆముదం, కందులు తదితర మెట్ట పంటలు సాగు చేస్తారు. ఈ మెట్ట పంటలను రైతులు రోహిణికార్తె ప్రారంభం నుంచే వర్షం వస్తే విత్తనాలను విత్తుకుంటారు. ఈ ఏడాది మండలంలో దాదాపు వెయ్యి హెక్టార్లపైనే మెట్ట పంటల సాగు కోసం రైతులు సిద్ధమవుతున్నారు. ఈ రెండు, మూడు రోజుల్లో వర్షం కురిస్తే విత్తనాలు విత్తుకుంటారు. కాని విత్తనాలు కొనుగోలు చేసుకుందామన్నా వాటి జాడ లేకపోవడంతో పంటలు ఎట్లా సాగు చేసుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. మరోవైపు ప్రైవేట్ వ్యాపారులు పత్తి విత్తనాల విక్రయాలపైనే అధిక దృష్టి పెట్టడం వల్ల తక్కువ జొన్న, సజ్జ, కందులు, మొక్కజొన్న తదితర విత్తనాల విక్రయంపై ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదు. కూరగాయల విత్తనాల సంగతీ అంతే... మండలంలో మొండిగౌరెల్లి, చౌదర్పల్లి, చింతపట్ల, నందివనపర్తి, సింగారం, కుర్మిద్ద, నక్కర్తమేడిపల్లి తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో రైతులు అత్యధికంగా టమాట, బెండ, చిక్కుడు, వంకాయ, కాకర, మిర్చి తదితర కూరగాయల పంటలను సాగు చేస్తారు. ప్రైవేట్ దుకాణాల్లో నాణ్యమైన విత్తనాలు దొరక్కపోవడం వల్ల ప్రతి యేటా రైతులు ఉద్యాన శాఖ రాయితీపై అందజేసే కూరగాయల విత్తనాలపైనే ఆధారపడతారు. అయితే రాయితీ కూరగాయల విత్తనాలు కూడా ఇంతవరకూ జాడలేవు. విత్తనాల కోసం ఇబ్రహీంపట్నంలోని ఉద్యాన శాఖ కార్యాలయానికి వెళ్లిన రైతులకు నిరాశే మిగులుతోంది. రాయితీ విత్తనాలు ఇప్పట్లో వచ్చే అవకాశమే లేదని అధికారులు చెబుతుండటంతో రైతులు అయోమయంలో పడ్డారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి అవసరమైన రాయితీ విత్తనాలను రెండు, మూడు రోజుల్లో తెప్పించేందుకు కృషి చేయాలని రైతులు కోరుతున్నారు. -
పాలీహౌస్ రైతులను ప్రోత్సహిస్తాం
చేవెళ్ల, న్యూస్‌లైన్: పాలీహౌస్ (గ్రీన్హౌస్) రైతులకు సాధ్యమైనంత త్వరగా సబ్సిడీ అందిస్తామని, వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉద్యానశాఖ రంగారెడ్డి జిల్లా ఏడీ ఉమాదేవి అన్నారు. చేవెళ్ల మండలం చనువల్లిలో మంగళవారం రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్ జిల్లాల పా లీహౌస్ రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉద్యానశాఖ జిల్లా ఏడీ ఉమాదేవి మాట్లాడుతూ పా లీహౌస్ ఏర్పాటు చేసుకున్న అర్హులైన ప్రతి రైతుకూ సబ్సిడీ అందజేస్తామన్నారు. పాలీహౌస్‌లను ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహిస్తుందన్నారు. పాలీహౌస్‌పై అవగాహన కల్పించేం దుకు 29న చేవెళ్ల మండలంలోని సాగర్ ఫుడ్ అండ్ అగ్రిబిజినెస్ స్కూల్లో సదస్సు ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లాలో 40 మందికే మంజూరు.. తెలంగాణ రీజియన్ పాలీహౌస్ రైతుల సం ఘం అధ్యక్షుడు నర్సింహారెడ్డి మాట్లాడుతూ జి ల్లాలో సుమారు 220 మంది రైతులు పాలీ హౌస్ కోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం 40 మందికే మంజూరు ఇచ్చారని అన్నారు. కోశాధికారి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ పాలీహౌస్ రైతులంతా సంఘం లో చేరి పోరాటానికి సిద్ధపడాలన్నారు. చేవెళ్ల పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్‌రెడ్డి, డెరైక్టర్ ఆగిరెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా పాలీహౌస్ రైతుల సంఘం ఇన్చార్జి సత్యనారాయణ, నల్లగొండ జిల్లా ఇన్చార్జి శ్రీని వా స్, సంఘం ప్రతినిధులు ప్రభాకర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, చంద్రకాంత్ మాట్లాడుతూ సబ్సిడీ ఇవ్వడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని వివరించారు. సమావేశం లో చేవెళ్ల డివిజన్ ఉద్యాన అధికారి సంజయ్‌కుమార్, ఏఈఓ రాఘవేందర్, సంఘం ఉపాధ్యక్షురాలు ప్రమోద, సర్పంచ్ ఎన్ను జంగారెడ్డి, పలు జిల్లాల రైతు సంఘం ప్రతినిధులు ఎం.విజయభాస్కర్‌రెడ్డి, జి.ప్రభాకర్‌రెడ్డి, రఘుపతిరెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వృధాగా ఉన్న వ్యవసాయ పరికరాలు
చిన్నకోడూరు, న్యూస్‌లైన్: ప్రభుత్వం రాయితీపై ఇచ్చే వ్యవసాయ పరి కరాలను వినియోగించుకొని ఉత్పత్తులు సాధించవచ్చని భావించిన రైతులకు నిరాశ మిగిలింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల చిన్నకోడూరు మండలం అల్లీపూర్లో లక్షల రూపాయల విలువైన వ్యవసాయ పరికరాలు వినియోగంలోకి రాక వృధాగా ఉన్నా యి. 2006-07లో రాష్ట్రీయ సమ వికాస్ యోజన ద్వారా ఇక్రిశాట్ నిధులతో వంద శాతం రాయితీపై అల్లీపూర్‌కు రూ.5లక్షలకు పైగా విలువైన వ్యవసాయ పరికరాలను ప్రభుత్వం సరఫరా చెసింది. వీటిలో మూడు పవర్‌స్ప్రేయర్స్, ఒక మక్కల నూర్పిడి యంత్రం, మూడు ఎడ్లబండ్లు, వాటి విడిభాగాలు, నాలుగు గిరకలు, నాలుగు నాగళ్లు, రెండు పవర్‌పంపులు ఉన్నాయి. ఇటీవలే కొత్తగా మరో మూడు విత్తనాలు, మందులు వేసే పరికరాలు వచ్చాయి. వీటిని అల్లీపూర్ పంచాయతీ ఆవరణలో ఉంచారు. వాటిని వినియోగించకపోవడంతో అవన్ని వృధాగా ఉన్నాయి. వ్యవసాయ పరికరాల వినియోగానికి సంబంధించి మూడేళ్ల కిందట కమిటీ ఎర్పాటు చేసినా సమావేశాలు నిర్వహించలేదు. మక్కల నూర్పిడి పరికరాన్ని ఇప్పటి వరకు వాడలేదు. అసలు యంత్రాన్ని వినియోగించే అవగాహన కూడా కల్పించలేదని రైతులు వాపోయారు. అలాగే మూడు ఎడ్లబండ్ల పరికరాలు ఉన్నప్పటికి ఒక్క రైతు కూడా వినియోగించుకోలేదు. ఈ విషయమై సిద్దిపేట ఏడీఏ వెంకటేశ్వర్లును వివరణ కోరగా పరికరాల నిర్వహణ బాధ్యతను సంబంధించి గ్రామ పంచాయతీలు చూసుకోవాలన్నారు. సలహాలు, సూచనలు మాత్రమే తమ శాఖ ఇస్తుందన్నారు. -
రేషన్‌కు గండం
నర్సీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలో 10.84 లక్షల మంది రేషన్ కార్డు వినియోగదారులకు ప్రభుత్వం రాయితీపై బియ్యం, కిరోసిన్, నూనె, కందిపప్పు, పంచదారతో పాటు వివిధ రకాలైన సరకులు పంపిణీ చేస్తోంది. ఈ విధంగా ప్రతి నెలా వినియోగదారులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 1,980 రేషన్ షాపులను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ప్రతి నెలా పంపిణీ చేసేందుకు బియ్యం 17 వేల టన్నులు, పంచదార 542 టన్నులు, కిరోసిన్ 2,112 కిలో లీటర్లు, నూనె, కందిపప్పు, చింతపండు, ఉప్పు 10.84 వేల క్వింటాళ్ల వంతున దిగుమతి చేసి రేషన్ షాపుల ద్వారా వినియోగదారులకు అందజేస్తోంది. 18 నుంచే ప్రక్రియ ప్రారంభం : ప్రతి నెలా పంపిణీ చేసే రేషన్ సరుకుల ప్రక్రియ ముందు నెల 20 నుంచే ప్రారంభమవుతుంది. 18 నుంచి రేషన్ షాపుల డీలర్లు రెవెన్యూ అధికారులకు సరుకుల మొత్తానికి అవసరమైన సొమ్మును డీడీల రూపంలో చెల్లిస్తుంటారు. వీటిని తీసుకున్న రెవెన్యూ అధికారులు సరుకుల విడుదలకు సంబంధించిన ఆర్ఓ (రూట్ ఆర్డర్) ఇస్తారు. దీనిని తీసుకున్న డీలర్లు ప్రతి నెలా 25 నుంచి మండల స్టాక్ పాయింట్ వద్ద నుంచి అవసరమైన సరుకులను రేషన్ షాపులకు తరలిస్తుంటారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత డీలర్లు తదుపరి నెల ప్రారంభం నుంచి సరుకులను వినియోగదారులకు అమ్మకాలు చేస్తుంటారు. నిలిచిపోయిన ప్రక్రియ : రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులంతా సమ్మెలో పాల్గొనడంతో పాటు డీలర్లు, హమాలీలు కూడా ఉద్యమంలో భాగస్వాములు కావడంతో సెప్టెంబరు నెలకు సరుకుల విడుదలకు సంబంధించిన ప్రక్రియ దాదాపుగా నిలిచిపోయింది. ఇప్పటికే కొంతమంది డీలర్లు డీడీలు తీసి, రెవెన్యూ కార్యాలయాలకు వెళ్లినా వాటిని తీసుకునే నాథుడే కరువయ్యాడు. తహశీల్దారులంతా సమ్మెలో పాల్గొనడంతో వీటికి అవసరమైన ఆర్ఓలు ఇచ్చేందుకు ఇబ్బందులెదురవుతున్నాయి. దీంతో ఇప్పటికే రేషన్ షాపులకు పంపిణీ కావాల్సిన సరుకుల సరఫరా ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ విషయాన్ని గుర్తించిన పౌరసరఫరాల కమిషనర్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించినా నేటికీ ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఈ పరిస్థితుల్లో సెప్టెంబరు నెల రేషన్ సరుకుల పంపిణీ జరుగుతుందో లేదోనని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.