ఆకేసి...లాగేసి ! | BC by the corporation Loans Not to grant | Sakshi
Sakshi News home page

ఆకేసి...లాగేసి !

Published Sat, Nov 29 2014 4:16 AM | Last Updated on Sat, Sep 2 2017 5:17 PM

ఆకేసి...లాగేసి !

ఆకేసి...లాగేసి !

విజయనగరం కంటోన్మెంట్ :బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు కాకపోవడంతో దరఖాస్తుచేసుకున్న వారు ఇబ్బందులకు గురవుతున్నారు. రుణం వస్తుంది కదా అని వ్యయప్రయాసలకోర్చి దరఖాస్తు చేసుకున్న వారు రుణాల కోసం కళ్లుకాయలుకాసేలా ఎదురుచూస్తున్నారు.    జిల్లాలో బీసీ కార్పొరేషన్  ద్వారా గత ఏడాది 4,941 యూనిట్లకు  రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించారు. వీరికి రూ.19.94 కోట్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందులో 1,154 యూనిట్లకు రూ.3.5 కోట్ల రుణం ఆన్‌లైన్ ద్వారా   మంజూరయింది. దీని కోసం  ఒకటి సబ్సిడీకి, మరొకటి రుణానికి వినియోగించేలా ప్రతి లబ్ధిదారుడూ  రెండేసి బ్యాంక్ ఖాతాలు తెరిచారు.

కానీ ఆ సొమ్ము ఇంతవరకూ లబ్ధిదారులకుఅందలేదు.  50 శాతం సబ్సిడీ సొమ్మును ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది.   కాగా, ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేస్తేనే, రుణాలు అందజేయాలని బ్యాంకర్లకు ఆదేశాలు అందాయి. దీంతో బ్యాంకర్లు రుణాలు మంజూరు చేసి ఖాతాల్లో వేసి ఉంచారు.  ప్రభుత్వం మాత్రం సబ్సిడీని విడుదల చేయకపోవడంతో మంజూరైన రుణ మొత్తం బ్యాంకు ఖాతాల్లో మూలుగుతోంది.  ఇది గత ఏడాది పరిస్థితి.  ఈ ఏడాది  కూడా పరిస్థితి అలాగే ఉంది.   2014-15 ఆర్థిక సంవత్సరానికి రుణ ప్రణాళిక ఖరారైంది.  

ఇందుకోసం లక్ష్యాలు కూడా నిర్దేశించారు. కానీ ఇప్పటివరకూ ఆదేశాలు మాత్రం ఇవ్వలేదు. గతంలో బ్యాంకర్లు రుణాలిచ్చినా సబ్సిడీ విడుదల చేయని ప్రభుత్వ యంత్రాంగం,  ఇప్పుడు వార్షిక రుణప్రణాళిక విడుదల చేసి ఉత్తర్వులు నిలిపివేసింది. దీంతో బీసీ కార్పొరేషన్ రుణాల కోసం లబ్ధిదారులు ఎదరుచూడవలసి వస్తోంది. ఈ ఏడాదికి మార్జిన్ మనీ కింద 8,588 యూనిట్లు, రాజీవ్ అభ్యుదయ యోజన కింద 805,  ఆర్థిక సహాయం కింద 510 యూనిట్లు కేటాయిస్తూ వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. దీనికి సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలన్న ప్రకటన మాత్రం విడుదల చేయలేదు.   దీంతో  ఏం చేయాలా అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.  

ఈ ఏడాది జిల్లాకు  మొత్తం  9,903 యూనిట్లు మంజూరయ్యాయి. రూ. 89.90  కోట్లను రుణంగా అందజేయడానికి  లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందులో మార్జిన్ మనీ కింద రూ.47.17 కోట్లు, మున్సిపాలిటీల్లో రాజీవ్ అభ్యుదయ   కింద 805 యూనిట్లకు రూ.4.42 కోట్లు, ఆర్ధిక సహాయం కింద 510 యూనిట్లకు రూ.38.30 కోట్లు కేటాయించారు. అయితే రుణ ప్రణాళిక విడుదలై రోజులు గడుస్తున్నప్పటికీ   ఏఏ యూనిట్లకు ఎవరు అర్హులు? ఏఏ యూనిట్లకు ప్రాధాన్యం ఇవ్వాలి? విద్య,వయోపరిమితి ఎంత? అన్న విషయాలపై ఇంకా ప్రకటన ఇవ్వకుండా,  కేవలం రుణ ప్రణాళికను మాత్రమే విడుదల చేసిన ప్రభుత్వం అభ్యర్థులను ఆశల పల్లకి ఎక్కించింది.  

గత ఏడాది కూడా ఇలాగే  చేసిన రాష్ట్ర ప్రభుత్వం,  ఇప్పుడు రుణ ప్రణాళిక విడుదల చేసి, నిబంధనలు విడుదల చేయకుండా నిలిపివేసిందని బీసీ సంఘాలు, వివిధ వ ర్గాలకు చెందిన నిరుద్యోగులు, ఉపాధిని ఆశిస్తున్న వారు విమర్శిస్తున్నారు. మరో పక్క కేంద్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌కు నిధులను కుమ్మరిస్తోంది. జిల్లాలో గత ఏడాది నిలిచిపోయిన రుణాలను కూడా తిరిగి మంజూరు చేసి,  కొత్తగా రుణ ప్రణాళికతో పాటు మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. దీంతో జిల్లాలో ఈ ఏడాది రూ.11.93 కోట్లతో 1221 యూనిట్లకు రుణాలు ఇవ్వడానికి నిర్ణయించి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటికే 5,588 మందికి పైగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి డిసెంబర్ 4,5 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎస్సీ కార్పొరేషన్‌కు నిధులు ఇస్తుండడంతో ఈ కార్పొరేషన్ పరిధిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీలు లబ్దిపొందే అవకాశం ఉండగా,  రాష్ట్రప్రభుత్వం  మాత్రం బీసీ కార్పొరేషన్‌కు నిధులు  ఇవ్వడం లేదు.  
 
రుణ ప్రణాళిక అమలుకు మార్గదర్శకాలు రాలేదు:
2014-15 ఆర్థిక సంవత్సరానికి  వార్షిక రుణ ప్రణాళిక ఖరారయింది. అయితే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు రాలేదు. మొత్తం 9,903 యూనిట్లకు రూ.89.90 కోట్ల రుణాలను ఇవ్వడానికి ప్రణాళికను విడుదల చేశారు. మార్గదర్శకాలు వచ్చిన వెంటనే , ప్రకటన చేస్తాం.
- నాగరాణి, ఈడీ,   బీసీ కార్పొరేషన్, విజయనగరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement