
కాలం మారుతోంది... కాలం మారితే కొత్త ప్రశ్నలు వస్తాయి.భర్త మరణించిన తర్వాత స్త్రీల పట్ల వివక్షాపూరితమైన వ్యవహారశైలిమన దేశంలో అన్ని మతాలలో ఉంది.అయితే ఆ ఎడబాటును మానసికంగా ఉంచుకుంటే చాలదా... భౌతిక ఆనవాళ్లతో వివక్షకు గురవ్వాలా అనే చర్చ ఇప్పుడు మహారాష్ట్రలో నడుస్తోంది. అక్కడి 7000 గ్రామాలు వితంతువులు తాము వితంతువులుగా వెలిబుచ్చే చిహ్నాలతో ఉండాల్సిన పనిలేదని నిర్ణయం తీసుకున్నాయి. ఈ గ్రామాల సంఖ్య ఇంకా పెరగనుంది.
నేను చాలా ఇబ్బందులు పడ్డాను. చదువుకుంటుంటే అందరూ అభ్యంతర పెట్టారు... వితంతువుకు చదువు ఏంటని. నా వయసు 42. ఇద్దరు పిల్లలు. భర్త చనిపోయాడు. చదువుకుని టీచర్ అయి నా పిల్లలను చూసుకోవాలని నా ప్రయత్నం. అందుకోసం సల్వార్ కమీజ్ వేసుకుని బయటకు వచ్చినా తప్పే. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది’ అంది సోనాలి పాట్‌దర్. ఈమెది కొల్హాపూర్‌లోని అంబప్ అనే గ్రామం. ఈమే కాదు పశ్చిమ మహారాష్ట్రలోని సుగర్ బెల్ట్‌గా చెప్పుకునే ప్రాంతంలో ఒక విప్లవంలా ఉద్యమం రేగి వితంతువులు వివక్ష లేకుండా జీవించే మార్పులు జరుగుతున్నాయి.
గ్రామాలే మారాలి... మారాయి
మన దేశంలో గ్రామాల్లోనే పట్టింపు ఎక్కువ. ముఖ్యంగా వితంతువులకు గ్రామాల్లో ఎక్కడా లేని అనాదరణ ఉంటుంది. వాళ్లు బొట్టు, గాజులు, పూలు పెట్టుకోకూడదు. మంగళసూత్రం వేసుకోకూడదు. శుభకార్యాలకు రాకూడదు. కొన్నిచోట్లయితే గణేశ్ ఉత్సవాలకు వచ్చినా ఊరుకోరు. వీరిని పనిలో కూడా పెట్టుకోరు. కొన్ని ఇళ్లల్లో వీరు రావాల్సిన ఆస్తి రాక అవస్థలు పడుతుంటారు. వితంతువులు కావడం వారి తప్పా? భర్త చన΄పోయిన బాధ ఒకవైపు... బయట సమాజం నుంచి వచ్చే బాధలు మరోవైపు. తమ బాధ మానసికంగా ఉంచుకుని బయట మామూలు జీవితం గడిపే హక్కు తమకు లేదా అని వారు ప్రశ్నిస్తున్నారు.
2022లో మొదలైన ఉద్యమం
మహారాష్ట్రలో పేరు పొందిన ప్రమోద్ జింజడే అనే సామాజిక కార్యకర్త పల్లెల్లో వితంతు స్త్రీలకు జరిగే అన్యాయాన్ని ఒకరోజు గమనించాడు. ‘భర్త చనిపోయాక ఒక స్త్రీ అతని గుర్తుగా బొట్టూ గాజులు ఉంచుకుంటానని బతిమిలాడుతుంటే సాటి స్త్రీలు వాటిని తొలగించడం చూశాను’ అన్నాడాయన. 2022లో ఒక అర్ధరాత్రి ఆయనకు సుస్తీ చేసింది. ప్రాణంపోపోయే స్థితి. కాని బయటపడ్డాడు. ఆయన ‘కర్మలా’ అనే ఊరిలో ఉంటాడు. వెంటనే ఆయన కర్మలా తాసిల్దార్ దగ్గరకు వెళ్లి ఒక అఫిడవిట్ సబ్మిట్ చేశాడు. ‘నేను చనిపోతే నా భార్య వొంటి మీద బొట్టు గాజులు మంగళసూత్రం తీసే హక్కు ఎవరికీ ఉండకూడదు. అలా చేసినవారిని చట్టపరంగా శిక్షించాలి’ అని ఆ అఫిడవిట్ సారాంశం. అక్కడున్న వారు ప్రమోద్‌కు పిచ్చెక్కిందనుకున్నా క్రమంగా ఈ సంగతి ప్రచారం పొందింది. మే 2022లో ఈ ఘటన జరిగితే వెంటనే ‘హెర్వాడ్’ అనే పల్లె నుంచి ఈ ఉద్యమం మొదలైంది.
ముక్తి పొందిన 7,683 గ్రామాలు
మహారాష్ట్రలో ఇప్పటికి 7,683 గ్రామాలు, 1,182 మునిసిపల్ వార్డులు తాము వితంతువుల పట్ల వివక్ష చూపం అని తీర్మానాలు చేశాయి. వితంతువులు తమకు నచ్చిన ఆహార్యంతో ఉండవచ్చని, అన్ని చోట్లకు రాక΄ోకలు సాగించవచ్చని, ఉద్యోగాలు చేసుకోవచ్చని అవి వారిని ్ర΄ోత్సహించడానికి ముందుకొచ్చాయి. కొన్నిచోట్ల ఆగస్టు పదిహేనున వితంతువులతో జెండా వందనం కూడా చేయిస్తూ ఉన్నారు. ‘ఈ ఉద్యమం ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కూడా పాకుతోంది. ముందుగా గోవా అందుకుంది’ అని ఉద్యమకారులు అంటున్నారు. భర్త చనిపోయాక నిరాశ నిస్పృహల్లో ఉన్న స్త్రీలకు సమాజమే బాసట. దాని నుంచి వందల ఏళ్లుగా ఎదుర్కొంటున్న వివక్షతో ఎంత మంది స్త్రీలు కుమిలిపోయి ఉంటారో అర్థం చేసుకుంటే ఈ ఉద్యమం అవసరం తెలిసి వస్తుందని ఈ ఉద్యమకారుల వాదన. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించింది.
78 శాతం గురించి ఆలోచించాలి
మన దేశంలో జీవిత భాగస్వామిని కోల్పోయిన వారి సంఖ్య సుమారు ఐదున్నర కోట్లు ఉంది. వీరిలో 78 శాతం స్త్రీలు. వీరిలో 32 శాతం సగటున 40 ఏళ్ల వయసున్న వారు. ఈ వయసు స్త్రీలు ఇందరు వివక్షను ఎదుర్కొంటూ జీవితంలో ముందుకు వెళ్లలేక΄ోతే ఎలా అనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వినబడుతోంది. బహుశా ఈ స్త్రీలే తమ ఆకాంక్షలను సమాజానికి మరింత గట్టిగా తెలియ చేస్తారు.