యాచారం, న్యూస్‌లైన్: మెట్ట పంటల సాగుకు సమాయత్తమవుతున్న రైతులు... ప్రభుత్వం రాయితీపై ఇచ్చే విత్తనాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. విత్తుకునే గడువు దగ్గర పడుతుండటం... రాయితీ విత్తనాల జాడలేక పోవడంతో ఆందోళన చెందుతున్నారు. విత్తనాలు ఎప్పుడొస్తాయని వ్యవసాయ శాఖ అధికారులను అడిగితే వస్తాయి... ఇస్తాం అంటున్నారే తప్ప ఎప్పుడొస్తాయనేది స్పష్టంగా చెప్పడం లేదు. దీంతో రైతులు నిత్యం వ్యవసాయ శాఖ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. పక్షం రోజుల క్రితం కురిసిన వర్షాలతో రైతుల మెట్ట పంటల సాగు కోసం పొలాలను సిద్ధం చేసుకున్నారు.
మండలంలోని పలు గ్రామాల్లో రైతులు అత్యధికంగా జొన్న, మొక్కజొన్న, సజ్జ, ఆముదం, కందులు తదితర మెట్ట పంటలు సాగు చేస్తారు. ఈ మెట్ట పంటలను రైతులు రోహిణికార్తె ప్రారంభం నుంచే వర్షం వస్తే విత్తనాలను విత్తుకుంటారు. ఈ ఏడాది మండలంలో దాదాపు వెయ్యి హెక్టార్లపైనే మెట్ట పంటల సాగు కోసం రైతులు సిద్ధమవుతున్నారు. ఈ రెండు, మూడు రోజుల్లో వర్షం కురిస్తే విత్తనాలు విత్తుకుంటారు. కాని విత్తనాలు కొనుగోలు చేసుకుందామన్నా వాటి జాడ లేకపోవడంతో పంటలు ఎట్లా సాగు చేసుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. మరోవైపు ప్రైవేట్ వ్యాపారులు పత్తి విత్తనాల విక్రయాలపైనే అధిక దృష్టి పెట్టడం వల్ల తక్కువ జొన్న, సజ్జ, కందులు, మొక్కజొన్న తదితర విత్తనాల విక్రయంపై ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదు.
కూరగాయల విత్తనాల సంగతీ అంతే...
మండలంలో మొండిగౌరెల్లి, చౌదర్‌పల్లి, చింతపట్ల, నందివనపర్తి, సింగారం, కుర్మిద్ద, నక్కర్తమేడిపల్లి తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో రైతులు అత్యధికంగా టమాట, బెండ, చిక్కుడు, వంకాయ, కాకర, మిర్చి తదితర కూరగాయల పంటలను సాగు చేస్తారు. ప్రైవేట్ దుకాణాల్లో నాణ్యమైన విత్తనాలు దొరక్కపోవడం వల్ల ప్రతి యేటా రైతులు ఉద్యాన శాఖ రాయితీపై అందజేసే కూరగాయల విత్తనాలపైనే ఆధారపడతారు. అయితే రాయితీ కూరగాయల విత్తనాలు కూడా ఇంతవరకూ జాడలేవు. విత్తనాల కోసం ఇబ్రహీంపట్నంలోని ఉద్యాన శాఖ కార్యాలయానికి వెళ్లిన రైతులకు నిరాశే మిగులుతోంది. రాయితీ విత్తనాలు ఇప్పట్లో వచ్చే అవకాశమే లేదని అధికారులు చెబుతుండటంతో రైతులు అయోమయంలో పడ్డారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి అవసరమైన రాయితీ విత్తనాలను రెండు, మూడు రోజుల్లో తెప్పించేందుకు కృషి చేయాలని రైతులు కోరుతున్నారు.
రాయితీ విత్తనాల జాడేదీ?
Published Fri, May 30 2014 10:59 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement