ఆకు పచ్చని బంగారం! | State government to promote bamboo cultivation | Sakshi
Sakshi News home page

ఆకు పచ్చని బంగారం!

Published Tue, Jul 3 2018 12:19 AM | Last Updated on Tue, Jul 3 2018 12:20 AM

State government to promote bamboo cultivation  - Sakshi

వెదురు.. పేదవాడి కలప! ఆర్థికపరంగానే కాకుండా పర్యావరణపరంగా కూడా అభివృద్ధికి దోహదపడే పంటగా వెదురు గుర్తింపు పొందింది. గ్రామీణ పేదలకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కూడా ఇది మంచి సాధనం. అందుకే దీన్ని ‘గ్రీన్‌ గోల్డ్‌’ (ఆకుపచ్చని బంగారం) అని పిలుస్తుంటారు. పంటల సాగుకు తగినంత సారం లేని భూములు, అటవీయేతర ప్రభుత్వ భూములు వెదురు తోటల సాగుకు అనుకూలం.

ఇందుకోసం ప్రత్యేకంగా ‘బాంబూ మిషన్‌’ ద్వారా ఈ ఏడాది ఖరీఫ్‌ నుంచే ప్రోత్సాహకాలు ఇవ్వడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాయత్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా రెండేళ్లలో 1,05,000 హెక్టార్లలో వెదురు తోటల సాగే లక్ష్యం. వెదురు రైతులకు మూడేళ్ల పాటు ప్రభుత్వ సహాయం అందుతుంది. నాలుగో ఏడాది నుంచి వెదురు కోతకు వస్తుంది. ఒక్కసారి నాటితే చాలు.. 60 ఏళ్లపాటు ఏటా రైతుకు ఆదాయం వస్తుందని చెబుతున్నారు. ఈ ఏడాది వెయ్యి ఎకరాల్లో డ్రిప్‌ ద్వారా వెదురు సాగును ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ‘సాగుబడి’ ప్రత్యేక కథనం.


వెదురు అనాదిగా మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నది. సుమారు 1500 రకాలుగా వెదురు ఉపయోగపడుతున్నట్లు అంచనా. అయితే, మన దేశంలో వెదురు ఇన్నాళ్లూ సంరక్షించదగిన అటవీ చెట్ల జాబితాలో ఉంది. అందువల్లనే మన పొలంలో పెరిగిన వెదురు బొంగులను నరకాలన్నా అటవీ శాఖ అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. ఈ ఆంక్షల వల్ల ప్రజల అవసరానికి తగినంత వెదురు దొరక్కుండా పోయింది. అందుకని, కేంద్ర ప్రభుత్వం కొద్ది నెలల క్రితం వెదురును అటవీ చెట్ల జాబితాలో నుంచి తొలగించింది. దీంతో పొలాల్లో వెదురు తోటలు సాగు చేయడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.


                  మధ్యప్రదేశ్‌ రైతు వెదురుతోట ఏరియల్‌ వ్యూ

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెదురు సాగుకు ప్రోత్సాహకాలను ప్రకటిస్తూ ‘బాంబూ మిషన్‌’ను ప్రారంభించింది. ఖర్చులో 60% కేంద్రం, 40% రాష్ట్రం భరించే విధంగా మార్గదర్శకాలు ఇటీవల విడుదలయ్యాయి. తెలంగాణ అదనపు అటవీ సంరక్షణాధికారి రాకేశ్‌ మోహన్‌ డోబ్రియల్‌ ‘సాగుబడి’ ప్రతినిధితో ముఖాముఖిలో వివరించారు. వాతావరణ మార్పులను తట్టుకోవడానికి హరిత విస్తీర్ణాన్ని పెంపొందించే లక్ష్యంతో సాగుకు అంతగా యోగ్యం కాని ప్రైవేటు, అటవీయేతర భూముల్లో వెదురు సాగును ప్రోత్సహిస్తున్నట్లు ఆయన వివరించారు.


భూసారం పెద్దగా లేక పడావు పడిన ప్రభుత్వేతర, అటవీయేతర భూముల్లో వెదురు సాగును ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. సాగుతోపాటు.. నర్సరీల ఏర్పాటుకు, వెదురుతో అగరొత్తులు, ఫర్నిచర్‌ వంటి అనేక ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేందుకు కూడా బాంబూ మిషన్‌ నిధులను సమకూర్చుతున్నది. ఈ కార్యక్రమాల అమలుకు జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో వెదురు అభివృద్ధి సంస్థ(బి.డి.ఎ.) రూపుదిద్దుకుంటున్నది. వ్యవసాయ, ఉద్యాన, అటవీ, గ్రామీణాభివృద్ధి, పరిశ్రమల శాఖల అధికారులు, స్వయం సహాయక బృందాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉంటారు.

రెండు వెదురు జాతులు అనుకూలం!
వెదురును వాణిజ్యపరంగా సాగు చేయదలచినప్పుడు ప్రధానంగా రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. 1. ముళ్లు తక్కువగా ఉండి, లావుగా, నిటారుగా పెరిగే రకమై ఉండాలి. 2. రెండు కణుపుల మధ్య దూరం ఎంత ఎక్కువగా ఉంటే అంత ప్రయోజనకరమైనదిగా భావిస్తారు. ఇటువంటివి ఎక్కువ ధర పలుకుతాయి.ప్రకృతిలో వెదురు జాతులు చాలా ఉన్నప్పటికీ బాంబూసా బాల్కోవా, బాంబూసా టుల్డ అనే రెండు రకాలు రైతులు సాగు చేసి అధికాదాయం పొందడానికి అనువైనవిగా గుర్తించినట్లు డోబ్రియల్‌ తెలిపారు.

మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో వెదురును ఇప్పటికే రైతులు కొందరు సాగు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అధికారుల బృందం ఇటీవల ఈ రాష్ట్రాల్లో పర్యటించి ఏయే వెదురు రకాలు మేలైనవో గుర్తించింది.నీరు నిలవని ఎర్ర నేలలు వెదురు సాగుకు అనుకూలం. మధ్యప్రదేశ్‌లో కొందరు రైతులు నల్లరేగడి భూముల్లో (4“4 మీ. దూరంలో) సాగు చేస్తున్నారు. భూసారం తక్కువగా ఉన్న భూముల్లో కూడా వెదురు పెరుగుతుంది. అయితే, దిగుబడి కొంచెం తక్కువగా వస్తుంది. వెదురు తోటలు నాటిన నాలుగో ఏడాది నుంచి బొంగులను నరకవచ్చు. అప్పటి నుంచి సుమారు 60 ఏళ్ల వరకు ఏటా ఆదాయం వస్తుందని చెబుతున్నారు.

వెదురు తోటల్లో అంతర పంటలు కూడా సాగు చేసుకోవచ్చు.తప్పనిసరిగా డ్రిప్‌ను ఏర్పాటు చేసుకొని.. తగినంత ఎరువులను అందిస్తే.. భూసారం అంతగా లేని భూముల్లోనూ వెదురు సాగు ద్వారా మంచి దిగుబడి పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. భూగర్భజలాలు అడుగంటిన భూముల్లో అయితే ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో మీటరు వెడల్పు, మీటరు లోతులో పొలం అంతటా వాలుకు అడ్డంగా కందకాలు తవ్వుకోవడం ద్వారా నీటి లభ్యతను పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కుండపోత వర్షాలకు కందకాల నుంచి పొంగిపొర్లే నీటిని కూడా పొదివి పట్టుకోవడానికి నీటి కుంటలు తవ్వుకోవచ్చు.      

బాంబూసా టుల్డ రకం
ఇది థాయ్‌లాండ్‌కు చెందిన రకం. చైనా, భూటాన్, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్, ఉత్తర భారత రాష్ట్రాలలో సాగులో ఉంది. దీన్ని భవన నిర్మాణ రంగంలోను, పేపర్‌ మిల్లుల్లోను ఎక్కువగా వాడుతున్నారు. బొంగులు ఆకుపచ్చగా 5–10 సెం.మీ. లావుతో 7–23 మీటర్ల ఎత్తున పెరుగుతాయి. కణుపుల మధ్య 40–70 సెం.మీ. దూరం ఉంటుంది. కింది వైపు కణుపులకు పీచు వేళ్లు ఉంటాయి.
 
బాల్కోవా రకానికి పెద్దపీట
బాంబూసా బాల్కోవా రకం వెదురు నున్నగా అందంగా, ఆకు పచ్చగా, లావుగా, నిటారుగా ఎదుగుతుంది. బొంగులు 12–20 మీటర్ల ఎత్తున, 8–15 సెం.మీ. లావున ఎదుగుతాయి. కణుపుల మధ్య 20–40 సెం.మీ. లావున ఎదుగుతాయి. మన దేశంతోపాటు థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, నేపాల్‌లలో బాల్కోవా రకం కనిపిస్తుంది. దక్షిణాసియా దేశాల్లో ఈ రకం వెదురు ఎక్కువగా సాగులో ఉంది. దీని మొలకలు ఆహారంగా తీసుకోవచ్చు. భవన నిర్మాణంలో, బుట్టలు, తడికెలు వంటివి అల్లడానికి ఈ వెదురు బాగుంటుంది.

5 లక్షల టిష్యూకల్చర్‌ మొక్కలు
ఈ ఏడాది పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా సుమారు 5 లక్షల బాంబూసా బాల్కోవా రకానికి చెందిన నాణ్యమైన టిష్యూకల్చర్‌ మొక్కలను కనీసం వెయ్యి మంది రైతులకు అందిస్తామని ఆయన తెలిపారు. డ్రిప్‌ను సబ్సిడీపై అందిస్తామన్నారు. నర్సరీలను ఏర్పాటు చేసే ప్రభుత్వ సంస్థలకు 100%, ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు 50% సబ్సిడీ ఇస్తారు. వెదురు ఉత్పత్తుల తయారీ కేంద్రాల ఏర్పాటును ప్రోత్సహిస్తారు. స్థానికులకు ఉపాధి అవకాశాలూ పెరుగుతాయని భావిస్తున్నారు. వీటన్నిటికీ మించి.. బీళ్లుగా ఉన్న భూముల్లో పచ్చని చెట్లు ఏడాది పొడవునా పెరుగుతూ ఉంటే.. భూతాపం తగ్గడానికి వీలవుతుంది. ఈ లక్ష్యంతోనే వాతావరణ మార్పులను ఎదుర్కొనే ఒక ఉపాయంగా వెదురు సాగును ఇండోనేషియా వంటి దేశాలు ప్రోత్సహిస్తున్నాయి.

ఎకరానికి రూ. లక్ష ఆదాయం అంచనా
కనీసం 6 నెలల నుంచి 2 ఏళ్ల వయసు మొక్కలను నాటుకోవాలి. వరుసల మధ్య 4 మీటర్లు, మొక్కల మధ్య 3 మీటర్ల(4“3)దూరంలో నాటుకోవచ్చు.  ఎకరానికి 330 మొక్కలు నాటి డ్రిప్‌తో ఎరువులు, నీరు తగినంతగా అందిస్తే.. నాలుగేళ్లలో రూ. 4 లక్షల ఖర్చవుతుంది. నాలుగేళ్ల తర్వాత కుదురుకు 8 చొప్పున సుమారు 2,640 బొంగులు వస్తాయి. బొంగు రూ. 50 చొప్పున ఎకరానికి రూ. 1,32,000 ఆదాయం వస్తుంది. బొంగు బరువు 15 కిలోల చొప్పున 60 వేల కిలోల వెదురు ఉత్పత్తవుతుందని భావిస్తున్నట్లు తెలంగాణ అదనపు అటవీ సంరక్షణాధికారి రాకేశ్‌ మోహన్‌ డోబ్రియల్‌ తెలిపారు. ఆ తర్వాత ఎకరానికి ప్రతి ఏటా రూ. 25 వేలు ఖర్చవుతుంది. ఎకరానికి ఏటా ఆదాయం రూ. లక్ష వస్తుందని అంచనా వేస్తున్నారు.

వెదురు బొంగుల నుంచే మొక్కలు!
వెదురు మొక్కలను రైతులే స్వయంగా తయారు చేసుకునే సులువైన మార్గం ఇది. వెదురు గింజలు మొలవడానికి చాలా రోజులు పడుతుంది. అన్ని గింజలూ మొలవకపోవచ్చు. కాబట్టి, పచ్చి బొంగులను భూమిలో పాతి పెట్టి 60 రోజుల్లో మొక్కలు తయారు చేసుకోవడం ఉత్తమం. ఉత్తరప్రదేశ్‌ ఝాన్సీలోని కేంద్రీయ అటవీ వ్యవసాయ పరిశోధనా సంస్థ(ఐ.సి.ఎ.ఆర్‌. అనుబంధ సంస్థ) శాస్త్రవేత్తలు ఈ పద్ధతిని రైతులకు సూచిస్తున్నారు. రెండేళ్ల వయసున్న ఒక పచ్చి వెదురు బొంగుతో 165 మొక్కలను తయారు చేసుకోవడం మేలని ఐ.సి.ఎ.ఆర్‌. శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

ఒక ఏడాది, మూడేళ్ల బొంగుల కన్నా రెండేళ్ల బొంగులతోనే నాణ్యమైన ఎక్కువ మొక్కలు పొందవచ్చని అధ్యయనంలో తేల్చారు. బాంబూసా వల్గారిస్‌ అనే వెదురు రకం సాగుకు అనువైనదని వారు చెబుతున్నారు. మట్టి తవ్వి పచ్చి బొంగులను ఉంచి.. వాటిపైన.. మట్టి (ఎర్రమట్టి, ఇసుక, పశువుల ఎరువును సమపాళ్లలో కలిపిన) మిశ్రమాన్ని 3 సెం.మీ. మందాన వేయాలి. తేమ ఆరిపోకుండా తగుమాత్రంగా తడుపుతూ ఉండాలి. కణుపుల దగ్గర నుంచి 14వ రోజు నుంచి మొలకలు రావడం మొదలై 35 రోజుల్లో పూర్తవుతుంది.

ఒక కణుపు తర్వాత మరో కణుపునకు మాత్రమే మొలకలు, వేర్లు మొలుస్తాయి. బొంగును మట్టిలో పాతిపెట్టిన 60 రోజులకు మొలకలను బొంగు నుంచి వేరు చేయవచ్చు. బొంగుకు ఇరువైపులా మట్టిని జాగ్రత్తగా తీసివేసి మొక్కలను సికేచర్‌తో కత్తిరించి సేకరించాలి. మట్టి మిశ్రమాన్ని నింపిన పాలిథిన్‌ బ్యాగులలో మొక్కలను పెట్టి, పెంచుకోవాలి. కనీసం ఆరు నెలల మొక్కలనే పొలంలో నాటుకోవాలి. పొలం చుట్టూ గట్లపైన పచ్చి బొంగులను భూమిలో పాతి పెడితే.. మొలకలు వస్తాయి. వాటిని అలాగే పెరగనిస్తే చాలు. అడవి జంతువుల నుంచి పంటను రక్షించుకోవడానికి వెదురు జీవ కంచెను ఇలా పెంచుకోవచ్చు.


1.   బాంబూసా వల్గారిస్‌ వరి రకం బొంగులు భూమిలో పాతిన 28 రోజులకు పెరిగిన మొలకలు.
2.  బొంగులో ఒక కణుపు తర్వాత మరో కణుపునకు మొలకలు, వేర్లు వచ్చిన దృశ్యం
3.  బొంగు మొదలు దగ్గరలో ఉన్న కణుపుల్లో వేర్లు వస్తాయి కానీ మొలకలు రావు.
4.  పాలిథిన్‌ బ్యాగ్‌లలో నాటిన  బాంబూసా వల్గారిస్‌ మొక్కల


– పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement