bamboo plantation
-
రైతు వినూత్న ఆలోచన.. ప్రయోగాత్మకంగా వెదురు సాగు
సాధారణంగా వెదురు అటవీ ప్రాంతాల్లో సహజసిద్ధంగా పెరుగుతుంది. అక్కడి నుంచే మన అవసరాలకు సేకరిస్తుంటారు. కానీ దీన్ని కూడా పంటగా సాగు చేయొచ్చని ఓ రైతుకు ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టాడు. ఎలాంటి చీడపీడలూ, తెగుళ్ల బెడద ఉండదని వెదురు సాగుతో లాభాలు ఆర్జించవచ్చని ఆ రైతు చెబుతున్నాడు. గుమ్మఘట్ట (అనంతపురం జిల్లా): స్వల్ప పెట్టుబడితో దీర్ఘకాలిక పంటకు శ్రీకారం చుట్టి ఆదర్శంగా నిలుస్తున్నారు గుమ్మఘట్ట మండలం గొల్లపల్లికి చెందిన రైతు పాటిల్ వంశీకృష్ణారెడ్డి. ఈయన ఎంబీఏ, ఎల్ఎల్బీ వరకు చదువుకున్నారు. బళ్లారిలో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ అక్కడే నివాసముండేవారు. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో స్వగ్రామానికి తిరిగి వచ్చేశారు. తాత పాటిల్ గోవిందరెడ్డి స్ఫూర్తితో వ్యవసాయం చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా డెన్మార్క్‌లోని మిత్రుడి సలహా, వ్యవసాయ, ఉద్యాన అధికారుల సూచనలతో ఇక్కడ తనకున్న పది ఎకరాల్లో ఎనిమిది నెలల క్రితం వెదురు పంట పెట్టారు. కర్ణాటకలోని హోసూరులో టిష్యూకల్చర్‌తో కూడిన బల్కోవా, న్యూటన్ రకాలకు చెందిన 10 వేల వెదురు పిలకలను రైతు వంశీకృష్ణారెడ్డి రూ.2లక్షలకు కొని, తీసుకొచ్చి పదెకరాల్లో నాటారు. మొక్కకు మొక్కకు మధ్య 10 అడుగుల దూరం పాటించారు. ఎకరా సాగుకు రూ.50 వేల వరకు వెచ్చించారు. అంతర పంటగా మునగ సాగు చేశారు. రెండో విడతలో మరో పది ఎకరాలలో టుల్డా రకం వెదురు సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎంచుకున్న రకాన్ని బట్టి పంట కాలం ఆధారపడి ఉంటుంది. బల్కోవా రకం మూడున్నర సంవత్సరాల వ్యవధిలో కోతకు వస్తుంది. న్యూటన్ రకం నాలుగేళ్లలో కోతకు వస్తుంది. వెదురుకు వ్యాధులు గానీ, తెగుళ్లు గానీ రావు. క్రిమిసంహారక మందులు పిచికారీ చేయాల్సిన అవసరం లేదు. మామిడి, సపోట, జామ, అరటి, దానిమ్మ పంటలు చేతికి వచ్చే వరకు నమ్మకం లేదు. కానీ వెదురు సాగులో ఆ దిగులు ఉండదు. దీర్ఘకాలిక పంటగా నమ్మకమైన లాభాలు వస్తాయి. మొక్కలు పెద్దవైన తరువాత అంతర పంటలుగా అల్లం, పసుపు పంటలను కూడా వేసుకోవచ్చు. విసనకర్రలు, బెంచీలు, కుర్చీలు, బుట్టలు, జల్లెడ, చాట, స్పూన్లు, పేపర్ తయారీ, అగరబత్తీల తయారీ, నిచ్చెన, ఇంటివాసాలు, గుడిసెలు తదితర ఎన్నో వాటికి వెదురును వినియోగిస్తారు. ఈ వెదురుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. టన్ను ధర రూ.3వేల నుంచి రూ.4 వేల వరకు పలుకుతోంది. ఎకరాకు 40 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. తద్వారా సగటున లక్షా నలభై వేల వరకు ఆదాయం వస్తుంది. డెన్మార్క్‌లో ఉన్న మిత్రుడు సతీష్, నేను నేషనల్ బ్యాంబో మిషన్‌ను చూసి వెదురు పంట సాగు చేయాలని నిశ్చయించుకున్నాం. అక్కడ అతను.. ఇక్కడ నేను ఇదే పంట సాగు చేస్తున్నాం. పండ్లతోటలకు వ్యాధులు, తెగుళ్లు ఎక్కువ. పెట్టుబడి ఖర్చులూ అధికంగా ఉంటాయి. లాభాలు వస్తాయన్న గ్యారంటీ ఉండదు. వెదురు సాగులో మందులు పిచికారీ చేయాల్సిన అవసరం లేదు. వెదురుకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. అంతర పంటగా మునగ సాగు చేశాను. – పాటిల్ వంశీకృష్ణారెడ్డి వెదురుతో రైతుకు ఆర్థిక పరిపుష్టి వెదురు సాగు విస్తీర్ణం పెంచుకుంటే అదనపు ఆదాయం లభిస్తుంది. జిల్లాలో ఒక రైతు మాత్రమే సాగు చేస్తున్నాడు. వెదురు పంటను సాగుచేయడం ద్వారా పరిశ్రమలకు ముడి సరుకు పెరుగుతుంది. కాలువ గట్ల పక్కన, ప్రభుత్వ భూములు, వృథా భూముల్లో వెదురును పెంచితే ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధంగా ఉంది. వెదురుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ పంట సాగు చేస్తే రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆసక్తి గల రైతులు సమీపంలోని హార్టికల్చర్ అధికారులను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు. – పద్మలత, జిల్లా ఉద్యాన శాఖ అధికారి -
7 యేళ్లలో 17 లక్షలు సంపాదించిన రైతు.. ఏం పండించాడో తెలుసా?
షేర్ మార్కెట్లో లేదా ఫైనాన్స్‌లో పెట్టుబడులు పెడితే డబ్బులే డబ్బులని హుషారుగా పరుగెడతారు కొందరు. కానీ ఒక్కోసారి ఆశించిన స్థాయిలో లాభం ముట్టదు. ఇప్పుడిది పాత పద్ధతంటున్నాడు ఈ రైతు. నిజమండి..!! తాను పెట్టిన పెట్టుబడికి 7 సంవత్సరాల్లో అక్షరాల 4 రెట్ల లాభం అర్జించనున్నాడు. కేవలం వ్యవసాయం ద్వారా అంత మొత్తం ఎలా సంపాదిస్తున్నాడో? అంత వింతగా ఏం పండించాడో? అదెలా సాధ్యమైందో మీరూ తెలుసుకోండి.. ఎల్ఎల్బీ చదివినప్పటికీ.. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరికి చెందిన సాకేతు గ్రామంలో నివసిస్తున్న 65 యేళ్ల సురేశ్ చంద్ర వర్మ బీఏ, ఎల్ఎల్బీ చదువుకున్నాడు. ఐతే వ్యవసాయం పట్ల మక్కువ కలిగిన వర్మ తన పూర్వికుల ద్వారా సంక్రమించిన భూమిలో రకరకాల పంటలను పండించడం ప్రారంభించాడు. చెరకు, వరి, గోధుమ వంటి పంటలు పండించడంలో ఆరితేరాడు. అంతేకాకుండా మామిడి, ఉసిరి, లీచీ, నిమ్మ వంటి ఉద్యాన పంటల సాగులోనూ నిష్ణాతుడే. అంతర పంటల ద్వారా కూడా అధిక లాభాలను ఆర్జించాడు. కేవలం రూ. 25 లకే.. నాలుగేళ్ల క్రితం పంత్నగర్ వ్యవసాయ యూనివర్సిటీ నుంచి 234 వెదురు మొక్కలను కేవలం రూ. 25 ల చొప్పున కొని ఎకరం భూమిలో నాటాడు. ఐతే ఈ నాలుగేళ్లలో ఒక మొక్క 20 నుంచి 25 వెదురు బొంగులను ఉత్పత్తి చేసింది. అంతేకాకుండా మూడేళ్లపాటు సహపంటగా చెరకును కూడా దీనితో పాటుగా పండించాడు. నాలుగో యేట నుంచి మాత్రం కేవలం వెదురును మాత్రమే కొనసాగించాడు. ప్రస్తుతం దున్నే పనుల్లో ఉంది. ఏడు సంవత్సరాలకు రూ. 17 లక్షలు ఇలా.. ఈవిధంగా ప్రతి మొక్కకు 40 నుంచి 50 వరకు వెదురు వచ్చే అవకాశం ఉంది. పల్లెటూరులో ఒక వెదురు బొంగు రూ.150లు పలుకుతుంది. ఈ విధంగా ప్రతి మొక్కకు 50 వెదుర్లు ఉత్పత్తి అయితే 234 మొక్కలకు 11 వేల 7 వందల వెదుర్లు వస్తాయి. ఒక వెదురును రూ.150లకు అమ్మితే మొత్తంగా రూ. 17 లక్షల 55 వేలు లాభం చేతికొస్తుంది. రేటు కొంచెం ఎక్కువ పలికితే లాభం మరింత పెరగొచ్చు. ఇప్పుడర్థమైందా.. ఈ చదువుకున్న రైతు చేసిన అద్భుతం. చదవండి: మెదడు చురుకుగ్గా ఉండాలంటే.. ఈ ఐదింటికీ పని చెప్పాలట!! -
ఆకుపచ్చ బంగారం.. బిలియన్ల వర్షం
World Bamboo Day 2021: ప్రకృతి సంపదలో పర్యావరణానికి మేలు చేయడంతో పాటు కోట్ల మందికి జీవనోపాధిని అందించేదిగా వెదురు చెట్లకు ఓ ప్రత్యేకత ఉంది. అంతేకాదు అంతర్జాతీయ మార్కెట్లో అది చేసే వ్యాపారం బిలియన్ల డాలర్లను కుమ్మరిస్తుంటుంది. అందుకే వెదురు గొప్పదనం గురించి చెప్పడానికి, వెదురు పెంపకంపై అవగాహన కల్పించే దిశగా ఒక రోజును కేటాయించారు. సెప్టెంబర్ 18న ప్రపంచ వెదురు దినోత్సవం. ►ప్రపంచ వెదురు(పెంపక-పరిరక్షణ నిర్వాహణ) సంస్థ.. ప్రతీ ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ► 2009లో బ్యాంకాక్‌లో జరిగిన వరల్డ్ బాంబూ కాంగ్రెస్‌లో ఈ డేను నిర్వహించాలని తీర్మానించారు. ► వెదురు పెంపకం, సంప్రదాయ పద్ధతుల్లో వాడకం గురించి, వెదురు వాడకం పెంపొందించేలా చర్యల గురించి.. అన్నింటికి మించి అర్థిక పురోగతికి వెదురు ఉత్పత్తులను ఎలా నిర్వహించుకోవాలో అనే విషయాలపై ఇవాళ ప్రధానంగా చర్చిస్తారు. ► అటవీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన ఆదాయ వనరు.. వెదురు ► గిరిజనుల జీవనంలో ఇదొక భాగం ► గిరిజనులకు జీవనోపాధిగానే కాకుండా.. వాళ్ల సంప్రదాయాల్లోనూ పవిత్రతను సంతరించుకుంది వెదురు. ► #plantbamboo.. ‘వెదురు నాటండి’ నినాదంతో ఈసారి Bomboo Day 2021ని నిర్వహిస్తున్నారు. ► చైనా, భారత్ లాంటి ఆసియా దేశాల్లో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు సాధించడంలో వెదురు గణనీయమైన పాత్ర పోషిస్తోంది. ► 65 శాతం సాగుదల ఆసియా ఖండాల్లోనే సాగుతోంది. అమెరికా(ద్వయం), ఆఫ్రికా ఖండాలు ఆ తర్వాతి ప్లేస్‌లో ఉన్నాయి. ► గ్లోబల్ బాంబూ మార్కెట్ విలువ 2019 నాటికి 72 బిలియన్ల డాలర్లుగా ఉంది. 2015 నాటికి అది 98 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది. ► చైనా ఈ విషయంలో 70 శాతంతో అగ్రస్థానంలో ఉండగా.. వెదురు విస్తీర్ణంలో రెండో స్థానంలో ఉన్న భారత్ మాత్రం 4 శాతంతో సరిపెట్టుకుంది. ► వియత్నం, థాయ్‌లాండ, కాంబోడియాలు మార్కెట్ షేర్ మనకంటే ఎక్కువే. ► మన దగ్గర వెదురు విస్తీర్ణంగా పెరుగుతుంది. ఇంకా పెరిగే పరిస్థితులు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, స్పెషల్ బాంబూ ఎకనమిక్ జోన్లను ఏర్పాటు చేసి ఆర్థిక వృద్ధిని సాధించొచ్చు. ► వెదురు వ్యర్థాలతో అద్భుతం చేయొచ్చు. ఆ దిశగా ప్రభుత్వాలు, వ్యవసాయ శాఖ, జాతీయ వెదురు మిషన్లు ప్రయత్నిస్తే.. మన మార్కెట్ సైతం తారా స్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయి. ► పోవాషియే కుటుంబానికి చెందిన వెదురులో.. 115 జాతులు, 1,400 ఉపజాతుల మొక్కలు ఉన్నాయి. ► కొన్ని జాతులు రోజుకి 30 సెంటీమీటర్ల చొప్పున పెరుగుతాయి. ఎటు నుంచి నరికినా.. వేగంగా పెరుగుతుంది కూడా. ► ఈశాన్య ప్రపంచంలో వెదురును పేదవాడి కలపగా చెప్తుంటారు. అంతేకాదు ఆకుపచ్చ బంగారంగా వెదురుకు పేరుంది ► ఆహారంతో పాటు కట్టడాలు, నిర్మాణ మెటీరియాల్‌గా, పేపర్, హస్తకళల్లోనూ వెదురును ఉపయోగిస్తారు ► వెదురు చెట్లను పెంపకానికి రసాయనాలు, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ఏవీ అక్కర్లేదు. వేస్ట్ ల్యాండ్‌లో సైతం పెరిగి.. పర్యావరణాన్ని కాపాడుతుంది వెదురు. అంతేకాదు అధిక వర్షలప్పుడు మట్టి కొట్టుకుపోకుండా అడ్డుకుని అడవుల క్షీణతను అడ్డుకుంటుంది ► పోషక విలువలు సైతం ఉంటాయి ► వెదురు ఆకులు పశుగ్రాసంగా ఉపయోగపడతాయి ► సిలికాను మందుల తయారీలో ఉపయోగిస్తారు ► వెదురు సామాన్లకు, ఫర్నీచర్‌కు, పరికరాలకు, షోకేజ్ వస్తువులకు గ్లోబల్ మార్కెట్లో ఫుల్ గిరాకీ ఉంది - సాక్షి, వెబ్‌డెస్క్ స్పెషల్ -
ఆకు పచ్చని బంగారం!
వెదురు.. పేదవాడి కలప! ఆర్థికపరంగానే కాకుండా పర్యావరణపరంగా కూడా అభివృద్ధికి దోహదపడే పంటగా వెదురు గుర్తింపు పొందింది. గ్రామీణ పేదలకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కూడా ఇది మంచి సాధనం. అందుకే దీన్ని ‘గ్రీన్ గోల్డ్’ (ఆకుపచ్చని బంగారం) అని పిలుస్తుంటారు. పంటల సాగుకు తగినంత సారం లేని భూములు, అటవీయేతర ప్రభుత్వ భూములు వెదురు తోటల సాగుకు అనుకూలం. ఇందుకోసం ప్రత్యేకంగా ‘బాంబూ మిషన్’ ద్వారా ఈ ఏడాది ఖరీఫ్ నుంచే ప్రోత్సాహకాలు ఇవ్వడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాయత్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా రెండేళ్లలో 1,05,000 హెక్టార్లలో వెదురు తోటల సాగే లక్ష్యం. వెదురు రైతులకు మూడేళ్ల పాటు ప్రభుత్వ సహాయం అందుతుంది. నాలుగో ఏడాది నుంచి వెదురు కోతకు వస్తుంది. ఒక్కసారి నాటితే చాలు.. 60 ఏళ్లపాటు ఏటా రైతుకు ఆదాయం వస్తుందని చెబుతున్నారు. ఈ ఏడాది వెయ్యి ఎకరాల్లో డ్రిప్ ద్వారా వెదురు సాగును ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ‘సాగుబడి’ ప్రత్యేక కథనం. వెదురు అనాదిగా మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నది. సుమారు 1500 రకాలుగా వెదురు ఉపయోగపడుతున్నట్లు అంచనా. అయితే, మన దేశంలో వెదురు ఇన్నాళ్లూ సంరక్షించదగిన అటవీ చెట్ల జాబితాలో ఉంది. అందువల్లనే మన పొలంలో పెరిగిన వెదురు బొంగులను నరకాలన్నా అటవీ శాఖ అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. ఈ ఆంక్షల వల్ల ప్రజల అవసరానికి తగినంత వెదురు దొరక్కుండా పోయింది. అందుకని, కేంద్ర ప్రభుత్వం కొద్ది నెలల క్రితం వెదురును అటవీ చెట్ల జాబితాలో నుంచి తొలగించింది. దీంతో పొలాల్లో వెదురు తోటలు సాగు చేయడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. మధ్యప్రదేశ్ రైతు వెదురుతోట ఏరియల్ వ్యూ ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెదురు సాగుకు ప్రోత్సాహకాలను ప్రకటిస్తూ ‘బాంబూ మిషన్’ను ప్రారంభించింది. ఖర్చులో 60% కేంద్రం, 40% రాష్ట్రం భరించే విధంగా మార్గదర్శకాలు ఇటీవల విడుదలయ్యాయి. తెలంగాణ అదనపు అటవీ సంరక్షణాధికారి రాకేశ్ మోహన్ డోబ్రియల్ ‘సాగుబడి’ ప్రతినిధితో ముఖాముఖిలో వివరించారు. వాతావరణ మార్పులను తట్టుకోవడానికి హరిత విస్తీర్ణాన్ని పెంపొందించే లక్ష్యంతో సాగుకు అంతగా యోగ్యం కాని ప్రైవేటు, అటవీయేతర భూముల్లో వెదురు సాగును ప్రోత్సహిస్తున్నట్లు ఆయన వివరించారు. భూసారం పెద్దగా లేక పడావు పడిన ప్రభుత్వేతర, అటవీయేతర భూముల్లో వెదురు సాగును ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. సాగుతోపాటు.. నర్సరీల ఏర్పాటుకు, వెదురుతో అగరొత్తులు, ఫర్నిచర్ వంటి అనేక ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేందుకు కూడా బాంబూ మిషన్ నిధులను సమకూర్చుతున్నది. ఈ కార్యక్రమాల అమలుకు జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో వెదురు అభివృద్ధి సంస్థ(బి.డి.ఎ.) రూపుదిద్దుకుంటున్నది. వ్యవసాయ, ఉద్యాన, అటవీ, గ్రామీణాభివృద్ధి, పరిశ్రమల శాఖల అధికారులు, స్వయం సహాయక బృందాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉంటారు. రెండు వెదురు జాతులు అనుకూలం! వెదురును వాణిజ్యపరంగా సాగు చేయదలచినప్పుడు ప్రధానంగా రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. 1. ముళ్లు తక్కువగా ఉండి, లావుగా, నిటారుగా పెరిగే రకమై ఉండాలి. 2. రెండు కణుపుల మధ్య దూరం ఎంత ఎక్కువగా ఉంటే అంత ప్రయోజనకరమైనదిగా భావిస్తారు. ఇటువంటివి ఎక్కువ ధర పలుకుతాయి.ప్రకృతిలో వెదురు జాతులు చాలా ఉన్నప్పటికీ బాంబూసా బాల్కోవా, బాంబూసా టుల్డ అనే రెండు రకాలు రైతులు సాగు చేసి అధికాదాయం పొందడానికి అనువైనవిగా గుర్తించినట్లు డోబ్రియల్ తెలిపారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో వెదురును ఇప్పటికే రైతులు కొందరు సాగు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అధికారుల బృందం ఇటీవల ఈ రాష్ట్రాల్లో పర్యటించి ఏయే వెదురు రకాలు మేలైనవో గుర్తించింది.నీరు నిలవని ఎర్ర నేలలు వెదురు సాగుకు అనుకూలం. మధ్యప్రదేశ్‌లో కొందరు రైతులు నల్లరేగడి భూముల్లో (4“4 మీ. దూరంలో) సాగు చేస్తున్నారు. భూసారం తక్కువగా ఉన్న భూముల్లో కూడా వెదురు పెరుగుతుంది. అయితే, దిగుబడి కొంచెం తక్కువగా వస్తుంది. వెదురు తోటలు నాటిన నాలుగో ఏడాది నుంచి బొంగులను నరకవచ్చు. అప్పటి నుంచి సుమారు 60 ఏళ్ల వరకు ఏటా ఆదాయం వస్తుందని చెబుతున్నారు. వెదురు తోటల్లో అంతర పంటలు కూడా సాగు చేసుకోవచ్చు.తప్పనిసరిగా డ్రిప్‌ను ఏర్పాటు చేసుకొని.. తగినంత ఎరువులను అందిస్తే.. భూసారం అంతగా లేని భూముల్లోనూ వెదురు సాగు ద్వారా మంచి దిగుబడి పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. భూగర్భజలాలు అడుగంటిన భూముల్లో అయితే ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో మీటరు వెడల్పు, మీటరు లోతులో పొలం అంతటా వాలుకు అడ్డంగా కందకాలు తవ్వుకోవడం ద్వారా నీటి లభ్యతను పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కుండపోత వర్షాలకు కందకాల నుంచి పొంగిపొర్లే నీటిని కూడా పొదివి పట్టుకోవడానికి నీటి కుంటలు తవ్వుకోవచ్చు. బాంబూసా టుల్డ రకం ఇది థాయ్‌లాండ్‌కు చెందిన రకం. చైనా, భూటాన్, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్, ఉత్తర భారత రాష్ట్రాలలో సాగులో ఉంది. దీన్ని భవన నిర్మాణ రంగంలోను, పేపర్ మిల్లుల్లోను ఎక్కువగా వాడుతున్నారు. బొంగులు ఆకుపచ్చగా 5–10 సెం.మీ. లావుతో 7–23 మీటర్ల ఎత్తున పెరుగుతాయి. కణుపుల మధ్య 40–70 సెం.మీ. దూరం ఉంటుంది. కింది వైపు కణుపులకు పీచు వేళ్లు ఉంటాయి. బాల్కోవా రకానికి పెద్దపీట బాంబూసా బాల్కోవా రకం వెదురు నున్నగా అందంగా, ఆకు పచ్చగా, లావుగా, నిటారుగా ఎదుగుతుంది. బొంగులు 12–20 మీటర్ల ఎత్తున, 8–15 సెం.మీ. లావున ఎదుగుతాయి. కణుపుల మధ్య 20–40 సెం.మీ. లావున ఎదుగుతాయి. మన దేశంతోపాటు థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, నేపాల్‌లలో బాల్కోవా రకం కనిపిస్తుంది. దక్షిణాసియా దేశాల్లో ఈ రకం వెదురు ఎక్కువగా సాగులో ఉంది. దీని మొలకలు ఆహారంగా తీసుకోవచ్చు. భవన నిర్మాణంలో, బుట్టలు, తడికెలు వంటివి అల్లడానికి ఈ వెదురు బాగుంటుంది. 5 లక్షల టిష్యూకల్చర్ మొక్కలు ఈ ఏడాది పైలట్ ప్రాజెక్టులో భాగంగా సుమారు 5 లక్షల బాంబూసా బాల్కోవా రకానికి చెందిన నాణ్యమైన టిష్యూకల్చర్ మొక్కలను కనీసం వెయ్యి మంది రైతులకు అందిస్తామని ఆయన తెలిపారు. డ్రిప్‌ను సబ్సిడీపై అందిస్తామన్నారు. నర్సరీలను ఏర్పాటు చేసే ప్రభుత్వ సంస్థలకు 100%, ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు 50% సబ్సిడీ ఇస్తారు. వెదురు ఉత్పత్తుల తయారీ కేంద్రాల ఏర్పాటును ప్రోత్సహిస్తారు. స్థానికులకు ఉపాధి అవకాశాలూ పెరుగుతాయని భావిస్తున్నారు. వీటన్నిటికీ మించి.. బీళ్లుగా ఉన్న భూముల్లో పచ్చని చెట్లు ఏడాది పొడవునా పెరుగుతూ ఉంటే.. భూతాపం తగ్గడానికి వీలవుతుంది. ఈ లక్ష్యంతోనే వాతావరణ మార్పులను ఎదుర్కొనే ఒక ఉపాయంగా వెదురు సాగును ఇండోనేషియా వంటి దేశాలు ప్రోత్సహిస్తున్నాయి. ఎకరానికి రూ. లక్ష ఆదాయం అంచనా కనీసం 6 నెలల నుంచి 2 ఏళ్ల వయసు మొక్కలను నాటుకోవాలి. వరుసల మధ్య 4 మీటర్లు, మొక్కల మధ్య 3 మీటర్ల(4“3)దూరంలో నాటుకోవచ్చు. ఎకరానికి 330 మొక్కలు నాటి డ్రిప్‌తో ఎరువులు, నీరు తగినంతగా అందిస్తే.. నాలుగేళ్లలో రూ. 4 లక్షల ఖర్చవుతుంది. నాలుగేళ్ల తర్వాత కుదురుకు 8 చొప్పున సుమారు 2,640 బొంగులు వస్తాయి. బొంగు రూ. 50 చొప్పున ఎకరానికి రూ. 1,32,000 ఆదాయం వస్తుంది. బొంగు బరువు 15 కిలోల చొప్పున 60 వేల కిలోల వెదురు ఉత్పత్తవుతుందని భావిస్తున్నట్లు తెలంగాణ అదనపు అటవీ సంరక్షణాధికారి రాకేశ్ మోహన్ డోబ్రియల్ తెలిపారు. ఆ తర్వాత ఎకరానికి ప్రతి ఏటా రూ. 25 వేలు ఖర్చవుతుంది. ఎకరానికి ఏటా ఆదాయం రూ. లక్ష వస్తుందని అంచనా వేస్తున్నారు. వెదురు బొంగుల నుంచే మొక్కలు! వెదురు మొక్కలను రైతులే స్వయంగా తయారు చేసుకునే సులువైన మార్గం ఇది. వెదురు గింజలు మొలవడానికి చాలా రోజులు పడుతుంది. అన్ని గింజలూ మొలవకపోవచ్చు. కాబట్టి, పచ్చి బొంగులను భూమిలో పాతి పెట్టి 60 రోజుల్లో మొక్కలు తయారు చేసుకోవడం ఉత్తమం. ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని కేంద్రీయ అటవీ వ్యవసాయ పరిశోధనా సంస్థ(ఐ.సి.ఎ.ఆర్. అనుబంధ సంస్థ) శాస్త్రవేత్తలు ఈ పద్ధతిని రైతులకు సూచిస్తున్నారు. రెండేళ్ల వయసున్న ఒక పచ్చి వెదురు బొంగుతో 165 మొక్కలను తయారు చేసుకోవడం మేలని ఐ.సి.ఎ.ఆర్. శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఒక ఏడాది, మూడేళ్ల బొంగుల కన్నా రెండేళ్ల బొంగులతోనే నాణ్యమైన ఎక్కువ మొక్కలు పొందవచ్చని అధ్యయనంలో తేల్చారు. బాంబూసా వల్గారిస్ అనే వెదురు రకం సాగుకు అనువైనదని వారు చెబుతున్నారు. మట్టి తవ్వి పచ్చి బొంగులను ఉంచి.. వాటిపైన.. మట్టి (ఎర్రమట్టి, ఇసుక, పశువుల ఎరువును సమపాళ్లలో కలిపిన) మిశ్రమాన్ని 3 సెం.మీ. మందాన వేయాలి. తేమ ఆరిపోకుండా తగుమాత్రంగా తడుపుతూ ఉండాలి. కణుపుల దగ్గర నుంచి 14వ రోజు నుంచి మొలకలు రావడం మొదలై 35 రోజుల్లో పూర్తవుతుంది. ఒక కణుపు తర్వాత మరో కణుపునకు మాత్రమే మొలకలు, వేర్లు మొలుస్తాయి. బొంగును మట్టిలో పాతిపెట్టిన 60 రోజులకు మొలకలను బొంగు నుంచి వేరు చేయవచ్చు. బొంగుకు ఇరువైపులా మట్టిని జాగ్రత్తగా తీసివేసి మొక్కలను సికేచర్తో కత్తిరించి సేకరించాలి. మట్టి మిశ్రమాన్ని నింపిన పాలిథిన్ బ్యాగులలో మొక్కలను పెట్టి, పెంచుకోవాలి. కనీసం ఆరు నెలల మొక్కలనే పొలంలో నాటుకోవాలి. పొలం చుట్టూ గట్లపైన పచ్చి బొంగులను భూమిలో పాతి పెడితే.. మొలకలు వస్తాయి. వాటిని అలాగే పెరగనిస్తే చాలు. అడవి జంతువుల నుంచి పంటను రక్షించుకోవడానికి వెదురు జీవ కంచెను ఇలా పెంచుకోవచ్చు. 1. బాంబూసా వల్గారిస్ వరి రకం బొంగులు భూమిలో పాతిన 28 రోజులకు పెరిగిన మొలకలు. 2. బొంగులో ఒక కణుపు తర్వాత మరో కణుపునకు మొలకలు, వేర్లు వచ్చిన దృశ్యం 3. బొంగు మొదలు దగ్గరలో ఉన్న కణుపుల్లో వేర్లు వస్తాయి కానీ మొలకలు రావు. 4. పాలిథిన్ బ్యాగ్‌లలో నాటిన బాంబూసా వల్గారిస్ మొక్కల – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
పేకాట స్థావరంపై దాడి
టి.నరసాపురం: మండలంలోని అప్పలరాజుగూడెం సమీపంలోని వెదురు ఫారెస్ట్‌లో పేకాట స్థావరంపై టి.నరసాపురం పోలీసులు గురువారం సాయంత్రం దాడిచేసి పేకాటరాయుళ్ల నుంచి రూ. 1,05,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. 9 మంది వ్యక్తులను అరెస్టు చేసి 14 మోటార్‌సైకిళ్లను స్వాధీన పర్చుకున్నట్టు టి.నరసాపురం ఎస్‌హెచ్‌వో, హెచ్‌సీ వి.రాం బాబు తెలిపారు.