సాగు చేసిన వెదురును చూపుతున్న రైతు పాటిల్ వంశీకృష్ణారెడ్డి
సాధారణంగా వెదురు అటవీ ప్రాంతాల్లో సహజసిద్ధంగా పెరుగుతుంది. అక్కడి నుంచే మన అవసరాలకు సేకరిస్తుంటారు. కానీ దీన్ని కూడా పంటగా సాగు చేయొచ్చని ఓ రైతుకు ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టాడు. ఎలాంటి చీడపీడలూ, తెగుళ్ల బెడద ఉండదని వెదురు సాగుతో లాభాలు ఆర్జించవచ్చని ఆ రైతు చెబుతున్నాడు.
గుమ్మఘట్ట (అనంతపురం జిల్లా): స్వల్ప పెట్టుబడితో దీర్ఘకాలిక పంటకు శ్రీకారం చుట్టి ఆదర్శంగా నిలుస్తున్నారు గుమ్మఘట్ట మండలం గొల్లపల్లికి చెందిన రైతు పాటిల్ వంశీకృష్ణారెడ్డి. ఈయన ఎంబీఏ, ఎల్‌ఎల్‌బీ వరకు చదువుకున్నారు. బళ్లారిలో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ అక్కడే నివాసముండేవారు. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో స్వగ్రామానికి తిరిగి వచ్చేశారు. తాత పాటిల్ గోవిందరెడ్డి స్ఫూర్తితో వ్యవసాయం చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా డెన్మార్క్‌లోని మిత్రుడి సలహా, వ్యవసాయ, ఉద్యాన అధికారుల సూచనలతో ఇక్కడ తనకున్న పది ఎకరాల్లో ఎనిమిది నెలల క్రితం వెదురు పంట పెట్టారు.
కర్ణాటకలోని హోసూరులో టిష్యూకల్చర్‌తో కూడిన బల్కోవా, న్యూటన్ రకాలకు చెందిన 10 వేల వెదురు పిలకలను రైతు వంశీకృష్ణారెడ్డి రూ.2లక్షలకు కొని, తీసుకొచ్చి పదెకరాల్లో నాటారు. మొక్కకు మొక్కకు మధ్య 10 అడుగుల దూరం పాటించారు. ఎకరా సాగుకు రూ.50 వేల వరకు వెచ్చించారు. అంతర పంటగా మునగ సాగు చేశారు. రెండో విడతలో మరో పది ఎకరాలలో టుల్డా రకం వెదురు సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఎంచుకున్న రకాన్ని బట్టి పంట కాలం ఆధారపడి ఉంటుంది. బల్కోవా రకం మూడున్నర సంవత్సరాల వ్యవధిలో కోతకు వస్తుంది. న్యూటన్ రకం నాలుగేళ్లలో కోతకు వస్తుంది. వెదురుకు వ్యాధులు గానీ, తెగుళ్లు గానీ రావు. క్రిమిసంహారక మందులు పిచికారీ చేయాల్సిన అవసరం లేదు. మామిడి, సపోట, జామ, అరటి, దానిమ్మ పంటలు చేతికి వచ్చే వరకు నమ్మకం లేదు. కానీ వెదురు సాగులో ఆ దిగులు ఉండదు. దీర్ఘకాలిక పంటగా నమ్మకమైన లాభాలు వస్తాయి. మొక్కలు పెద్దవైన తరువాత అంతర పంటలుగా అల్లం, పసుపు పంటలను కూడా వేసుకోవచ్చు.
విసనకర్రలు, బెంచీలు, కుర్చీలు, బుట్టలు, జల్లెడ, చాట, స్పూన్లు, పేపర్ తయారీ, అగరబత్తీల తయారీ, నిచ్చెన, ఇంటివాసాలు, గుడిసెలు తదితర ఎన్నో వాటికి వెదురును వినియోగిస్తారు. ఈ వెదురుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. టన్ను ధర రూ.3వేల నుంచి రూ.4 వేల వరకు పలుకుతోంది. ఎకరాకు 40 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. తద్వారా సగటున లక్షా నలభై వేల వరకు ఆదాయం వస్తుంది.
డెన్మార్క్‌లో ఉన్న మిత్రుడు సతీష్, నేను నేషనల్ బ్యాంబో మిషన్‌ను చూసి వెదురు పంట సాగు చేయాలని నిశ్చయించుకున్నాం. అక్కడ అతను.. ఇక్కడ నేను ఇదే పంట సాగు చేస్తున్నాం. పండ్లతోటలకు వ్యాధులు, తెగుళ్లు ఎక్కువ. పెట్టుబడి ఖర్చులూ అధికంగా ఉంటాయి. లాభాలు వస్తాయన్న గ్యారంటీ ఉండదు. వెదురు సాగులో మందులు పిచికారీ చేయాల్సిన అవసరం లేదు. వెదురుకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. అంతర పంటగా మునగ సాగు చేశాను.
– పాటిల్ వంశీకృష్ణారెడ్డి
వెదురుతో రైతుకు ఆర్థిక పరిపుష్టి
వెదురు సాగు విస్తీర్ణం పెంచుకుంటే అదనపు ఆదాయం లభిస్తుంది. జిల్లాలో ఒక రైతు మాత్రమే సాగు చేస్తున్నాడు. వెదురు పంటను సాగుచేయడం ద్వారా పరిశ్రమలకు ముడి సరుకు పెరుగుతుంది. కాలువ గట్ల పక్కన, ప్రభుత్వ భూములు, వృథా భూముల్లో వెదురును పెంచితే ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధంగా ఉంది. వెదురుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ పంట సాగు చేస్తే రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆసక్తి గల రైతులు సమీపంలోని హార్టికల్చర్ అధికారులను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు.
– పద్మలత, జిల్లా ఉద్యాన శాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment