నాణ్యతేదీ?
పంపిణీ అదిగో.. ఇదిగో అని చెబుతూ ఇపుడు హడావుడిగా జిల్లాకు చేర్చిన అరకొర విత్తన వేరుశనగ కాయల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. నాణ్యత పరీక్షలు నిర్వహించకుండానే పంపిణీకి సిద్ధం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విత్తన కాయల సేకరణలో ఆయా కంపెనీల నాన్చుడు వ్యవహారంతో ‘నాసిరకం’ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. రేపు విత్తనం వేశాక సరిగా మొలకెత్తక, ఆశించిన విధంగా దిగుబడి రాకపోతే ఎవరు బాధ్యత వహిస్తారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం అగ్రికల్చర్ : ప్రభుత్వం సబ్సిడీతో పంపిణీ చేయనున్న విత్తన వేరుశనగ నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. విత్తన నాణ్యతా ప్రమాణాలు తెలుసుకున్న తర్వాత రైతులకు పంపిణీ చేయాల్సి ఉండగా.. ఆ దాఖలాలేవీ కన్పించడం లేదు. దీనివల్ల రైతులు నష్టపోయే ప్రమాదముంది. జిల్లాలో ఈ నెల 26 నుంచి మొదటి విడత విత్తన వేరుశనగ పంపిణీ చేపట్టనున్నారు. ఇందుకోసం ఆయిల్‌ఫెడ్, మార్క్‌ఫెడ్, హాకా, ఏపీ సీడ్స్ ఏజెన్సీలు వివిధ జిల్లాల నుంచి కే-6 రకం విత్తన వేరుశనగను సేకరించి సరఫరా చేస్తున్నాయి. ‘వంద శాతం సర్టిఫైడ్ సీడ్’ అంటూ ట్యాగ్ తగిలిస్తున్నాయి. అయితే, అందులోనూ నాసిరకం కాయలు వచ్చే అవకాశముంది. నాసులు, ఊజీ, బూజు పట్టిన విత్తనకాయలను రైతులకు పంపిణీ చేసిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. వేరుశనగతో పాటు ఇతరత్రా అన్ని రకాల విత్తనాలను రైతులకు పంపిణీ చేసే ముందు ప్రయోగశాలలో పరీక్షించి.. నాణ్యతను నిర్ధారించాల్సి ఉంటుంది. విత్తనాలు జిల్లాకు సరఫరా అయిన వెంటనే లాట్‌ల వారీగా బస్తాల నుంచి రెండు రకాల శ్యాంపిల్స్ (యాక్ట్, సర్వీస్) సేకరించాలి. యాక్ట్ శ్యాంపిల్స్‌ను హైదరాబాద్ లేదా తాడేపల్లిగూడెం ప్రాంతాల్లోని ప్రయోగశాలకు పంపాలి.
సర్వీసు శ్యాంపిల్స్‌ను జిల్లాలోనే ఉన్న విత్తన పరీక్ష కేంద్రంలో పరీక్షించాలి. 70 శాతం జర్మినేషన్ (మొలక శాతం), 9 శాతం తేమ (మాయిశ్చరైజ్డ్), 96 శాతం ఫిజికల్ ప్యూరిటీ, 4 శాతం వ్యర్థ పదార్థాలు (వేస్టేజ్) లాంటి వాటిని పరీక్షించి.. నాణ్యతా ప్రమాణాలు తేల్చాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం ఉన్న విత్తనాలు మాత్రమే రైతులకు పంపిణీ చేయాలి. లేని వాటిని తక్షణమే వెనక్కి పంపడంతో పాటు సరఫరా ఏజెన్సీలు లేదా సంస్థలపై శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేయాలి.
ఆ తరువాత మరోసారి పరీక్షించి, అందులో వచ్చే గణాంకాలను బట్టి విత్తన చట్టం ప్రకారం చర్యలుంటాయి. ఇంతవరకు బాగానే ఉన్నా, జిల్లాకు వచ్చిన విత్తన వేరుశనగ నుంచి శ్యాంపిల్స్ సేకరించి.. ప్రయోగశాలకు పంపడంలో మండల వ్యవసాయాధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. 2014-15 సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని విత్తన పరీక్ష కేంద్రానికి 600 శ్యాంపిల్స్ లక్ష్యంగా ఇచ్చారు. జిల్లాకు 15 రోజుల నుంచి విత్తన వేరుశనగ సరఫరా అవుతోంది. ప్రస్తుతానికి 50 మండలాలకు పైగా కేంద్రాల్లో నిల్వ చేశారు. అక్కడి నుంచి విత్తన శ్యాంపిల్స్ జిల్లా కేంద్రంలోని ప్రయోగశాలకు చేరడం లేదు.
గుత్తి, రాప్తాడు మండలాల నుంచి మాత్రమే పది శ్యాంపిల్స్ వచ్చాయి. అవి కూడా నిన్న, మొన్న వచ్చినట్లు విత్తన పరీక్ష కేంద్రం అధికారులు తెలిపారు. వాటిని పరీక్షించి నాణ్యత తేల్చడానికి 7 నుంచి 10 రోజులు పడుతుంది. అంతలోగా (ఈ నెల 26 నుంచి) రైతులకు విత్తనకాయలు పంపిణీ చేయనున్నారు. వర్షమొస్తే వెంటనే విత్తుకునే పరిస్థితి ఉంది. జిల్లాలోని మిగతా 61 మండలాల నుంచి శ్యాంపిల్స్ ఎప్పుడు వస్తాయి? ప్రయోగశాలలో జర్మినేషన్ మిషన్ ఒకటే ఉన్నందున వాటిని ఎప్పుడు పరీక్షిస్తారు? విత్తుకున్న త ర్వాత నాణ్యత లేదని తేలితే రైతులకు జరిగే నష్టాన్ని ఎవరు భరిస్తారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవారెవరూ లేరు. జిల్లాకు దాదాపు 15 రోజుల నుంచి సరఫరా అవుతున్న విత్తనకాయల శ్యాంపిల్స్‌ను ఎప్పటికప్పుడు ప్రయోగశాలకు పంపివుంటే ఈ పాటికి చాలా వరకు ఫలితాలు వెల్లడయ్యే అవకాశముండేది. ఫలితంగా రైతులకు కొంతలో కొంతైనా ప్రయోజనం కలిగేది.