సాక్షిప్రతినిధి, అనంతపురం: ‘అనంత’రైతులకు తీవ్ర అన్యాయం జరగబోతోందా? ప్రభుత్వ చర్యలతో రైతులు నిలువునా మోసపోతున్నారా? బేషరతుగా రుణమాఫీ చేస్తామని ప్రకటించిన చంద్రబాబు షరతులతో కూడిన మాఫీ ప్రకటించడమే రైతుల పాలిట శాపంగా మారిందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. వారం రోజుల్లో ‘అనంత’రైతులకు 2014కు సంబంధించిన వాతావరణబీమా మంజూరవుతోంది.
గతేడాది రైతులు సాగు చేసిన 5.06లక్షల హెక్టార్లలో మొత్తం పంట ఎండిపోయింది. ఈ క్రమంలో బీమా ప్రీమియం చెల్లించిన రైతులకు 70 శాతం మేర బీమా సొమ్ము అందబోతోందని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ లబ్ధి అతి తక్కువ మంది రైతులకే దక్కనుంది. కారణం చంద్రబాబు రుణమాఫీ ఆశ. ఆ ఆశతోనే రైతులు గత ఏడాది ఎక్కువ మంది రైతులు రెన్యువల్ చేసుకోలేదు. 2014జూన్‌లో చంద్రబాబు సీఎం పీఠమొక్కారు.
దాదాపు 5నెలలదాకా రుణమాఫీ ఊసెత్తలేదు. జూన్ నుంచి ఖరీఫ్ మొదలవ్వడం రుణమాఫీపై ప్రభుత్వం ప్రకటన చేయకపోవడంతో రైతులు బ్యాంకులకు వెళ్లలేకపోయారు. తీరా డిసెంబర్ 4న రుణమాఫీపై ప్రకటన చేశారు. 5 విడతల్లో మాఫీ చేస్తామని చెప్పారు. మొదట విడత సొమ్ము మాత్రమే విడుదల చేశారు. బకాయిలు మొత్తం చెల్లించేదాకా రుణాలు రెన్యువల్ చేయమని బ్యాంకర్లు తెగేసి చెప్పారు. ఈలోగా ఇన్సురెన్స్ ప్రీమియం చెల్లించే గడువు ముగిసింది. దీంతో 6.10లక్షల మందికి గాను లక్ష మంది రైతులే రుణాలు రెన్యువల్ చేసుకుని ప్రీమియం చెల్లించారు.
‘అనంత’ రైతులకు రూ.1600 కోట్ల నష్టం:
2014 వాతావరణ బీమా 70 శాతం మంజూరవుతున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. లక్షమంది రైతులు 14 కోట్ల రూపాయల ప్రీమియం చెల్లించారు. వీరికి 320 కోట్లదాకా
ఇన్సూరెన్స్ సొమ్ము అందనుంది. ఈ లెక్కన 6.10లక్షల మంది రెన్యువల్ చేసుకుని ఉంటే 1900-2వేల కోట్ల రూపాయల దాకా వచ్చేది. కేవలం రుణమాఫీ కాకపోవడం, రైతులు రెన్యువల్ చేసుకోవడానికి ప్రభుత్వం విషమ పరిస్థితులు కల్పించడంతోనే రైతులు తమకు హక్కుగా రావాల్సిన బీమా సొమ్ము కోల్పోతున్నారు. మూడేళ్లుగా కరువుతో అల్లాడుతున్న రైతులకు... ఇలాంటి సమయంలో ఇన్సూరెన్స్ సొమ్ము వచ్చి ఉంటే భారీ లబ్ధి చేకూరేది. కేవలం ప్రభుత్వ చర్యలతో తీవ్రంగా నష్టపోతున్నారు.
వడ్డీ రూపంలో కూడా రూ.1500కోట్ల భారం:
రైతులు సకాలంలో బ్యాంకులో తీసుకున్న రుణాలు చెల్లిస్తే 4 శాతం వడ్డీని చెల్లించేవారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ నాలుగు శాతం వడ్డీని చెల్లించేది. దీంతో రైతులకు వడ్డీలేని రుణాలు అందేవి. అయితే రుణమాఫీ వల్ల నిర్ణీత గడువులోగా రుణాలు రెన్యువల్ చేసుకోలేకపోయారు. దీంతో జిల్లాలో 10.24లక్షల ఖాతాలకు గాను 9.28లక్షల మంది డిఫాల్టర్లుగా మిగిలిపోయారు. వీరందరి నుంచి రెండేళ్లకు గాను సగటున లక్ష రూపాయలకు 35వేల రూపాయల చొప్పున అపరాధ వడ్డీ రూపంలో భారం పడింది.
ఇలా జిల్లా వ్యాప్తంగా 1400-1500కోట్ల రూపాయలు రైతులపై వడ్డీ భారం పడినట్లు బ్యాంకర్లు లెక్క తేల్చినట్లు తెలుస్తోంది. అంటే ఓ వైపు వచ్చే ఇన్సూరెన్స్ ప్రీమియం రుణమాఫీ సక్రమంగా జరగకపోవడం వల్ల దూరమైంది... మరోవైపు రుణమాఫీ అవుతుందని బకాయిలు చెల్లించని కారణంగా రైతులపై 1500కోట్లు అదనపు భారం పడింది. ఇలా కేవలం ప్రభుత్వం చర్యలతో ‘అనంత’ రైతులు 3,100కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వచ్చింది.
‘అనంత’రైతులకు తీరని అన్యాయం చేశారు:
చంద్రబాబు మాటలు నమ్మి ‘అనంత’ రైతులు తీవ్ర ంగా అన్యాయమయ్యారు. ప్రభుత్వ చర్యలతో రైతులు అప్పుల ఊబిలో మునిగిపోయారనేది కఠోర వాస్తవం. ఇన్సూరెన్స్ ఓ వైపు, వడ్డీ భారంతో మరో వైపు రైతులు దిక్కుతోచనిస్థితిలో ఉన్నారు. బతికే మార్గం లేక 20-25ఎకరాల భూస్వాములు కూడా వలసెళ్లుతున్నారు. ఈ వాస్తవాలను సీఎం, జిల్లాలోని అధికారపార్టీ ప్రజాప్రతినిధులు గ్రహించలేని దుస్థితిలో ఉన్నారు. తమ బాధ్యతలను విస్మరించి జిల్లా రైతులకు తీరని అన్యాయం చేసి వీరంతా రైతు కంటకులుగా మారారు. అనంత వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్‌సీపీ.
ముంచేశావు ‘బాబు’!
Published Sun, Jul 19 2015 3:11 AM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM
Advertisement
Advertisement