సాక్షి, హైదరాబాద్: గృహ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న విద్యుత్ సబ్సిడీల వివరాలను ఇకపై కరెంటు బిల్లుల్లో పొందు పరచనున్నారు. వినియోగించిన విద్యుత్, ప్రభుత్వ సబ్సిడీ పోగా చెల్లించాల్సిన చార్జీల వివరాలను మాత్రమే ఇప్పటివరకు బిల్లుల్లో పేర్కొనేవారు. సబ్సిడీ మినహాయించిన తర్వాత ప్రతి యూనిట్ విద్యుత్ వినియోగంపై చెల్లించాల్సిన విద్యుత్ టారీఫ్ పట్టికను బిల్లుల వెనక ముద్రించేవారు. దీంతో ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీల గురించి గృహ వినియోగదారులకు పెద్దగా అవగాహన ఉండటం లేదు.
ఈ నేపథ్యంలో వినియోగించిన విద్యుత్, విద్యుత్ సరఫరాకు జరిగిన వాస్తవ ఖర్చు, అందులో రాష్ట్ర ప్రభుత్వం భరించే రాయితీలు, రాయితీలు పోగా వినియోగదారులు చెల్లించాల్సిన చార్జీల వివరాలను బిల్లుల్లో పొందుపరుస్తారు. ఈ మేరకు రాష్ట్రంలో 2018–19లో అమలు చేయాల్సిన కొత్త విద్యుత్ టారిఫ్‌ను ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ (టీఎస్‌ఈఆర్సీ) తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. సబ్సిడీ వివరాలను బిల్లుల్లో పొందుపరచాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో వరుసగా రెండేళ్లపాటు చార్జీలు పెంచకపోవడం, సాధారణ ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో ప్రభుత్వానికి ప్రచారం కల్పించేందుకు ఈఆర్సీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
రూ.4,984 కోట్ల సబ్సిడీ..
వ్యవసాయానికి ఉచితంగా, గృహ వినియోగదారులకు తక్కువ చార్జీలతో విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు ఏటా సబ్సిడీలు మంజూరు చేస్తోంది. 2018–19లో రూ.4,984.3 కోట్ల సబ్సిడీ ఇచ్చేందుకు అంగీకరించింది. ఈఆర్సీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యయం (కాస్ట్ ఆఫ్ సప్‌లై) సగటున యూనిట్‌కు రూ.6.04 అవుతోంది. నెలకు 200 యూనిట్ల లోపు వినియోగించే పేద, మధ్య తరగతి గృహ వినియోగదారులకు ప్రభుత్వ సబ్సిడీతో అంతకంటే తక్కువ ధరకు విద్యుత్ అందుతోంది. 100 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తే తొలి 50 యూనిట్లకు రూ.1.45 చొప్పున, 51–100 లోపు యూనిట్లకు రూ.2.60 చొప్పున మాత్రమే చార్జీలు వసూలు చేస్తున్నారు. వినియోగం 100–200 యూనిట్ల మధ్య ఉంటే తొలి 100 యూనిట్లకు రూ.3.30, 101–200 యూనిట్లకు రూ.4.30 చొప్పున చార్జీలు వర్తింపజేస్తున్నారు.
200 యూనిట్లకు మించితే?
అయితే విద్యుత్ సరఫరా 200 యూనిట్లు దాటితే ఎలాంటి సబ్సిడీలు వర్తించకపోగా, వాస్తవ విద్యుత్ సరఫరా వ్యయం కన్నా అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్నారు. వినియోగం 200 యూనిట్లకు మించితే తొలి 200 యూనిట్లకు రూ.5, ఆపై 201–300 యూనిట్లకు రూ.7.2, 301–400 యూనిట్లకు రూ.8.5, 401–800 యూనిట్లకు రూ.9 చొప్పున చార్జీలు మోత మోగిస్తున్నారు. వినియోగం 800కు మించిన తర్వాతి యూనిట్లకు 9.5 చొప్పున చార్జీలు వడ్డిస్తున్నారు. ఈ వినియోగదారులకు జారీ చేసే బిల్లుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ఈఆర్సీ స్పష్టత ఇవ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment