బాలినేని అడిగిందొకటి..ఈసీ చేస్తోందొకటి..! | - | Sakshi
Sakshi News home page

బాలినేని అడిగిందొకటి..ఈసీ చేస్తోందొకటి..!

Published Wed, Aug 21 2024 7:34 AM | Last Updated on Wed, Aug 21 2024 9:44 AM

-

రీచెక్‌పై ఈసీ ఉలికిపాటెందుకో..?

ఈవీఎంలను, వీవీ ప్యాట్‌ స్లిప్‌లతో పరిశీలనకు వెనకడుగు

సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్‌ను గాలికి వదిలేసిన అధికారులు

మాక్‌పోలింగ్‌ పేరుతో ఈవీఎంల్లోని డేటా తొలగించేందుకు సిద్ధం

 వైఎస్సార్‌ సీపీ బహిష్కరించడంతో నిలిచిపోయిన మాక్‌పోలింగ్‌

 డేటా తొలగించాక కోర్టు వెరిఫికేషన్‌ చేయమంటే ఏం చేసేవారో

ఎన్నికల కమిషన్‌, అధికారుల తీరుపై విమర్శలు

మానవ హక్కుల కమిషన్‌కూ ఫిర్యాదు చేసిన బాలినేని

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల్లో అవకతవకలు జరిగాయని దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు నాయకులను, ఓటర్లను విస్మయానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలో ఒంగోలు నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈవీఎంల అవకతవకలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పోలింగ్‌ రోజు వినియోగించిన ఈవీఎంల్లోని ఓట్లను పరిశీలించాలని కోరుతూ ఈసీ నిర్దేశించిన రూ.5,66,400 రుసుము చెల్లించారు. నగరంలోని 12 పోలింగ్‌ కేంద్రాల ఈవీఎంల ఓట్లను, వీవీ ప్యాట్‌లలోని సింబల్‌ స్లిప్‌లతో సరిచూడాలని ఫిర్యాదులో కోరారు. 

పరిశీలనకు 6, 26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 పోలింగ్‌ కేంద్రాలను ఎంపిక చేశారు. దీంతో ఈసీ ఈవీఎంల చెకింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 19వ తేదీన జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో మాక్‌ పోలింగ్‌ నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే బాలినేని కోరిన విధంగా కాకుండా పోలింగ్‌ రోజు వినియోగించిన ఈవీఎంల్లోని ఓట్లను డిలీట్‌ చేసి, కేవలం ఈవీఎంల పనితీరును మాత్రమే చెక్‌ చేస్తామని స్పష్టం చేశారు. దీనిపై బాలినేని అభ్యంతరం వ్యక్తం చేశారు. 

ఈవీఎంలు కొత్తగా వచ్చినపుడు ఫస్ట్‌లెవల్‌ చెకింగ్‌, కమిషన్‌ చెకింగ్‌ చివరికి పోలింగ్‌ రోజు కూడా అన్నీ పార్టీల ఏజెంట్ల ద్వారా మాక్‌ పోలింగ్‌ నిర్వహిస్తారని మరళా ఇప్పుడు మాక్‌పోలింగ్‌ నిర్వహించడం అర్థం లేదన్నారు. పోలింగ్‌ రోజు వినియోగించిన ఈవీఎంల్లోని ఓట్లు, వీవీ ప్యాట్‌ స్లిప్‌లతో సరిచేస్తే సందేహాలు నివృత్తి అవుతాయని ఆయన అన్నారు. అయితే కలెక్టర్‌ ఎన్నికల సంఘం ఎస్‌ఓపీ మేరకు ఈవీఎంల చెకింగ్‌ మాత్రమే చేస్తామని అధికారుల నుంచి సమాధానం వచ్చింది. ఇలాగైతే న్యాయం జరగదని భావించిన బాలినేని హైకోర్టును ఆశ్రయించారు. 

ఒక వైపు కోర్టులో విచారణ జరుగుతుండగానే జిల్లా అధికారులు మాక్‌ పోలింగ్‌కు ఏర్పాటు చేశారు. సోమవారం ఒంగోలులో ఈవీఎంలు భద్రపరిచిన గోదాము వద్దకు అధికారులతో పాటు వివిధ రాజకీయ పక్షాల నేతలు హాజరయ్యారు. మాక్‌పోలింగ్‌ ప్రక్రియను బహిష్కరిస్తున్నామని బాలినేని తరఫున హాజరైన వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మాక్‌పోలింగ్‌ను నిలిపివేస్తున్నట్టు ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ప్రకటించారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

సుప్రీం తీర్పు ఏం చెబుతోందంటే...
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఏదైనా అనుమానాలు వస్తే ఈవీఎంల్లో వచ్చిన ఓట్లు, వీవీ ప్యాట్‌ల్లో ఉన్న స్లిప్‌లతో సరిపోల్చాలని ఎన్నికల్లో పోటీ చేసి రెండు, మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు ఈసీని కోరవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సుప్రీం తీర్పు ప్రకారం నియోజకవర్గంలో 5 శాతం ఈవీఎంలను పరిశీలించాల్సి ఉంది. అయితే సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ను ఎన్నికల సంఘం అధికారులు గాలికొదిలేశారు. అభ్యర్థి కోరిన పోలింగ్‌ బూతుల్లో వినియోగించిన ఈవీఎం ఓట్లను తొలగించి మాక్‌ పోలింగ్‌ నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు. 

దీంతో ఈవీఎంల అవకతవకలపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఒకవేళ పోలింగ్‌ రోజు వినియోగించిన ఈవీఎంల్లోని ఓట్లను తొలగించి మాక్‌పోలింగ్‌ నిర్వహించి ఉంటే కోర్టు ఈవీఎంల వెరిఫికేషన్‌ చేయాలని ఉత్తర్వులు ఇస్తే అధికారులు ఏం చేసి ఉండేవారో అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మాక్‌పోలింగ్‌ ప్రక్రియ ఎవరి మెప్పు కోసం నిర్వహిస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మాక్‌పోలింగ్‌ కాకుండా ఈవీఎంల్లోని ఓట్లను వీవీప్యాట్‌లతో సరిచూడాలని బాలినేని హైకోర్టును ఆశ్రయించిన కేసు బుధవారానికి వాయిదా పడింది. 

ఈ విషయంపై అవసరమైతే సుప్రీం కోర్టును కూడా ఆశ్రయిస్తానని బాలినేని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఎన్నికల సంఘం, అధికారులు పోలింగ్‌ రోజు ఓట్లను తొలగించి మాక్‌ పోలింగ్‌ నిర్వహిస్తామనడంపై బాలినేని మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

ఓట్లను తొలగిస్తే నిజాలు నిగ్గు తేలేది ఎలా..?
ఎన్నికల సంఘం, అధికారులు ఈవీఎంల్లో అవకతవకలు ఉన్నాయని వచ్చిన అనుమానాలు నివృత్తి చేయాల్సింది పోయి కంటి తుడుపు చర్యలు తీసుకోవడం విస్మయానికి గురి చేస్తోంది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఈవీఎంలను పరిశీలించాల్సిందిపోయి ఈసీ వ్యవహరిస్తున్న తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్‌ రోజు ఓట్లను ఈవీఎంల్లో తొలగిస్తామని, ఎన్నికల సంఘం ఎస్‌ఓపీ మేరకు కేవలం డమ్మీ బ్యాలెట్‌తో యంత్రాలు సరిగా పనిచేస్తున్నాయా లేదా చెక్‌ చేస్తామనడంలో అర్థంలేదని రాజకీయపక్షాలు విమర్శిస్తున్నాయి. 

ఏ తప్పులు జరగకుంటే పోలైన రోజు ఈవీఎం ఓట్లను, వీవీ ప్యాట్‌లోని స్లిప్‌లతో పరిశీలించవచ్చు కదా అని నిలదీస్తున్నారు. ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు ఆరోపణలకు మరింత బలం చేకూర్చేలా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement