ఏపీలో పాలనపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు | High Court fires on State Government | Sakshi
Sakshi News home page

ఇదేమి పరిపాలన?

Dec 6 2017 1:03 AM | Updated on Nov 9 2018 5:56 PM

High Court fires on State Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలిపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అక్కడి వ్యవహారాలను గమనిస్తుంటే గుండె దహించుకుపోతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. తమ ముందుకు వస్తున్న అనేక కేసులను విచారిస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అవగతమవుతోందని తెలిపింది. పాలన మొత్తం ఒక పద్ధతి లేకుండా గందరగోళంగా తయారైందని వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ మలేసియా, సింగపూర్, కొరియా కంపెనీలను ఆహ్వానిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక్కడి కంపెనీలు, పరిశ్రమల గురించి పట్టదా? అని ప్రశ్నించింది. పరిశ్రమ ఏర్పాటు కోసం భూములు కేటాయించినప్పుడు, రెవెన్యూ రికార్డుల్లో ఆ మేరకు మార్పులు చేయకపోగా, పరిశ్రమ ఏర్పాటు చేయలేదంటూ ఆ భూములు స్వాధీనం చేసుకోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

రికార్డుల్లో మార్పులు చేయకపోవడం వల్ల ఆ పరిశ్రమ యాజమాన్యం రుణాలు తీసుకునే అవకాశం లేకుండా పోయిందని, దీంతో ఆ భూములను అలా వదిలేయాల్సి వచ్చిందని తెలిపింది. రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయాలని జిల్లా కలెక్టర్‌ చెప్పినా స్థానిక తహసీల్దార్‌ పట్టించుకోకపోవడం రాష్ట్రంలో పాలన తీరుకు అద్దం పడుతోందని వ్యాఖ్యానించింది. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు వచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పింది. పరిశ్రమకు కేటాయించిన భూమిని తిరిగి ఆ కంపెనీకి స్వాధీనం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి ఎం.ఎస్‌.రామచంద్రరావు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

ఐదేళ్ల పాటు భూ బదలాయింపు నిలుపుదల...
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వెంకటగిరి మండలం, చెవిరెడ్డిపల్లి గ్రామం, సర్వే నంబర్‌ 105లో స్పిన్నింగ్‌ మిల్లు ఏర్పాటు నిమిత్తం ఎస్కో కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం 1991లో మార్కెట్‌ ధరపై 30 ఎకరాల భూమిని బదలాయించింది. దీంతో ఆ కంపెనీ మిల్లు ఏర్పాటుకు అవసరమైన అనుమతుల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం భూ బదలాయింపును తాత్కాలికంగా నిలిపేస్తూ 1992లో ఉత్తర్వులిచ్చింది. ఐదేళ్ల తర్వాత 1997లో ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. దీంతో ఆ కంపెనీ ఏపీఐఐసీ, ఏపీఎస్‌ఎఫ్‌సీలను ఆశ్రయించి తిరిగి రుణం తీసుకునే ప్రయత్నాలను మొదలు పెట్టింది. అయితే కేటాయించిన భూమి తాలూకు ఒరిజినల్‌ డాక్యుమెంట్లు తీసుకురావాల్సిందిగా ఏపీఎస్‌ఎఫ్‌సీ అధికారులు కోరారు.

అయితే జిల్లా కలెక్టర్‌ ఆదేశించినా రికార్డుల్లో కంపెనీ పేరు చేర్చి మార్పులు చేయడానికి ఎమ్మార్వో నిరాకరించారు. రుణం అందకపోవడంతో ఆ కంపెనీ స్పిన్నింగ్‌ మిల్లు ఏర్పాటు పనులను నిలిపేసింది. 2016లో ఎస్కో కంపెనీకి అధికారులు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. పరిశ్రమ ఏర్పాటు చేయనందున భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోరాదో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. కంపెనీ ఇచ్చిన వివరణను పట్టించుకోకుండా ఆ భూమిని వెంకటగిరి మునిసిపాలిటీకి అప్పగించారు. ఇందుకు సంబంధించి ఎస్కో కంపెనీకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో ఎస్కో.. తమకు కేటాయించిన భూమిని తిరిగి తమకు స్వాధీనం చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్‌ రామచంద్రరావు మంగళవారం మరోసారి విచారించారు. అధికారుల తీరు వల్లే కంపెనీ రుణాలు పొందలేకపోయిందని, ఆ కారణంగానే తాము పరిశ్రమ పనులను ప్రారంభించలేకపోయామని పిటిషనర్‌ తరఫు న్యాయవాది జి.జగదీష్‌ తెలిపారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. పిటిషనర్‌ ఏళ్ల తరబడి మౌనంగా ఉన్నారని, సంబంధిత అధికారులను కలసి తన ఇబ్బంది గురించి మాట్లాడలేదని అన్నారు. 

అధికారులు అన్యాయంగా వ్యవహరిస్తున్నారు..
న్యాయమూర్తి స్పందిస్తూ.. అధికారులను అడుక్కోవాలా? అని ప్రశ్నించారు. ‘ఈ కోర్టులో ఓ రోజు మీరు (ఏజీ) కూర్చోండి. అధికారులు ఏం చేస్తున్నారో మీకు తెలు స్తుంది. ఎంత అన్యాయంగా వ్యవహరిస్తు న్నారో అర్థమవుతుంది. వేధింపులకు సైతం అధికారులు వెనుకాడటం లేదు. ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తుంది. ఇక్కడ ఉన్న కంపెనీలు, పరిశ్రమల గురించి మాత్రం పట్టించుకోదు. పెట్టుబడులు ఊరికే వస్తాయా? అందుకు అనువైన వాతావరణం ఉండాలి కదా.. ప్రస్తుతం ఉన్న వాతావరణం ఇలాగే కొనసాగితే ఒక్క కంపెనీ కూడా రాష్ట్రానికి రాదు. నేను ఈ విషయాలను చాలా బాధతో చెబుతున్నా. మీరైనా ప్రభుత్వాన్ని గైడ్‌ చేయండి. కలెక్టర్‌ ఆదేశిస్తే తహసీల్దార్‌ చేయరా? ఇదేనా పాలన? దేవుడు వరమిచ్చినా పూజారి పట్టించుకోలేదంటే ఇదే. ఇలాగైతే రాష్ట్రానికి ఎవరొస్తారు?’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎస్కో నుంచి స్వాధీనం చేసుకున్న భూమిని తిరిగి ఆ కంపెనీకి ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement