అసైన్డ్‌ భూములకు హక్కులపై మరింత స్పష్టత  | government has given more clarity land ownership rights | Sakshi
Sakshi News home page

అసైన్డ్‌ భూములకు హక్కులపై మరింత స్పష్టత 

Published Wed, Dec 20 2023 4:50 AM | Last Updated on Wed, Dec 20 2023 7:35 AM

government has given more clarity land ownership rights - Sakshi

సాక్షి, అమరావతి : అసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కులు కల్పించే విషయంలో రెవెన్యూ యంత్రాంగానికి ప్రభుత్వం మరింత స్పష్టత ఇచ్చింది. పలు కారణాలతో హక్కులు కల్పించేందుకు వెనుకాడుతున్న నేపథ్యంలో వాటన్నింటిపైనా ఎలా ముందుకెళ్లాలో తెలియజేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ మంగళవారం జీవో నంబర్‌ 596 జారీ చేశారు.

పలు జిల్లాల కలెక్టర్లు, జేసీలు, ఆర్డీవోలు, తహశీల్దార్లతో ఇటీవల నిర్వహించిన వర్క్‌షాప్‌లో చర్చించిన మీదట అసైన్డ్‌ భూములపై ఆంక్షలు తొలగించే అంశాలపై తాజా ఆదేశాలు జారీ చేశారు. చుక్కల భూములు, ఈనాం భూములు, జాయింట్‌ ఎల్‌పీఎంల విభజన, ప్రొవిజనల్‌ పట్టాలు, ఎస్సీ కార్పొరేషన్‌ భూములకు సంబంధించి స్పష్టత ఇచ్చారు.   

ఈ కేసుల్లో యాజమాన్య హక్కులివ్వాలి 
► డీకేటీ రిజిస్టర్, డీకేటీ పట్టా ఆఫీస్‌ కాపీ, అసైన్‌మెంట్‌ కమిటీ మినిట్స్‌ లేకపోయినా వెబ్‌లాండ్‌ అడంగల్, పీఓఎల్‌ఆర్, పాత అడంగల్, 10 (1) రిజిస్టర్‌ వంటి ఏదో ఒక రెవెన్యూ రికార్డులో సంబంధిత రైతు పేరు ఉన్నా, 2017 22ఏ జీవోలు లేక 20 సంవత్సరాల క్రితం జారీ అయిన పట్టాదారు పాస్‌బుక్‌ ఆధారంగానైనా సంబంధిత భూములకు యాజమాన్య హక్కులు కల్పించాలి.

ఆ భూమిని కేటాయించిన పట్టాదారు ఆదీనంలో ఉంటేనే హక్కులు ఇవ్వాలి. ఒకవేళ ఎవరైనా పట్టాదారు సమర్పించిన పాస్‌బుక్‌ నకిలీదని తహశీల్దార్‌ ధ్రువీకరిస్తే,  దానిని నిరూపించే బాధ్యత కూడా సంబంధిత తహశీల్దార్‌దే. కాల క్రమంలో రెవెన్యూ పరిపాలనలో జరిగిన మార్పుల వల్ల రికార్డులు అందుబాటులో లేవనే కారణంతో అసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కులను నిరాకరించకూడదు. 

►  భూ బదలాయింపు జరగకపోయినప్పటికీ, సుప్రీంకోర్టు ఉత్తర్వులు, హైకోర్టు రిట్‌ పిటిషన్‌ 140/2022 ఆదేశాల ప్రకారం మినహాయింపు పొందిన భూములకు హక్కులు కల్పించాలి. 

► ఏడబ్ల్యూడీ భూములుగా మార్చకుండా తోపు/మేత పోరంబోకులను అసైన్‌ చేస్తే ఇప్పుడు జిల్లా కలెక్టర్లు ఏడబ్ల్యూడీగా మార్చి వాటికి యాజమాన్య హక్కులివ్వొచ్చు. 

► డి పట్టా జారీ అయినా, రికార్డుల్లో ఆ సర్వే నంబర్‌తో సరిపోలకపోతే, వారి ఆదీనంలో ఉన్న భూమి సర్వే నంబర్‌ను నమోదు చేయాలి. అలాంటి భూములకు యాజమాన్య హక్కులు ఇవ్వడం కోసం వారికి భూమి అసైన్‌ చేసిన పాత తేదీని పరిగణనలోకి తీసుకోవాలి. 

► ఖాతా నంబర్‌ 10 వేల లోపు ఉండి, మిగులు భూమిగా రికార్డయి, అసైన్డ్‌ భూములుగా నమోదవని వాటిని అసైన్‌మెంట్‌ రీ వెరిఫికేషన్‌కు పంపాలి. ఇలాంటి భూములకు యాజమాన్య హక్కులిచ్చేందుకు ఎల్రక్టానిక్‌ రెవెన్యూ రికార్డుల్లో పట్టాదార్‌ పేరును మార్చవచ్చు. 

► అసైన్‌మెంట్‌ చేసిన రాస్తా పోరంబోకు భూములను ఇప్పుడు భూ మారి్పడి (లాండ్‌ కన్వర్షన్‌) చేసి వాటికి హక్కులివ్వాలి 

► ఆర్‌ఎస్‌ఆర్‌లో అటవీ భూమిగా నమోదైన భూమి అసైన్‌మెంట్‌ జరిగి ఆర్‌ఓఆర్‌ రికార్డుల్లోనూ నమోదై ఉంటే.. ఆ భూమిని అటవీ చట్టంలోని సెక్షన్‌ 4(1) కింద నోటిఫికేషన్‌ జారీ చేయకపోతే దానిపై హక్కులివ్వొచ్చు. 

► భూమి స్వభావంలో ‘ప్రభుత్వ భూమి – నాట్‌ ఎలాటెడ్‌’గా నమోదై.., వాస్తవానికి అసైన్‌మెంట్‌ జరిగి ఉన్న కేసులను జిల్లా స్థాయి వెరిఫికేషన్‌కు పంపాలి. వెరిఫికేషన్‌లో ఆ భూముల హక్కుల కల్పనకు అర్హత సాధిస్తే అప్పుడు వాటిపై హక్కులు ఇవ్వొచ్చు. 

► అర్హత ఉన్న అసైన్డ్‌ భూములు పొరపాటున పట్టా భూమిగా నమోదై 22ఎ జాబితాలో ఉంటే, జిల్లా కలెక్టరు వాటిని ఆ జాబితా నుండి తొలగించాలి. రిమార్క్స్‌ కాలమ్‌లో యాజమాన్య హక్కులు ఇచ్చిన విధానాన్ని నమోదు చేయవచ్చు. 

► 20 సంవత్సరాల క్రితం జారీ అయిన తాత్కాలిక పట్టాలైనా, డీకేటీ పట్టాలు జారీ అయ్యాయా లేదా అనే దాంతో సంబంధం లేకుండా వాటిపై యాజమాన్య హక్కులివ్వాలి.  

► భూ బదలాయింపు (లాండ్‌ కన్వర్షన్‌) జరిగి, అసైన్‌మెంట్‌ జరిగి 20 సంవత్సరాలు పూర్తయిన జల వనరుల పోరంబోకు భూములపై యాజమాన్య హక్కులివ్వాలి. 

► అసైన్డ్‌ భూములైనా ఆన్‌లైన్‌ రెవెన్యూ రికార్డుల్లో నమోదుకాని భూములను అసైన్డ్‌ భూముల జాబితాలో చేర్చేలా దరఖాస్తులను స్వీకరించడానికి ఏపీ సేవా పోర్టల్‌లో ఆప్షన్‌ ఉంది. ఇలాంటి కేసులను సుమోటోగా స్వీకరించేందుకు జేసీల లాగిన్‌లో అవకాశం కల్పిస్తాం. ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఆ భూములకు హక్కులు ఇవ్వాలి. 

► రికార్డులు అందుబాటులో లేని, నీటి వనరులుగా గుర్తించిన కారణంగా యాజమాన్య హక్కులు ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకోలేని అసైన్డ్‌ భూములన్నింటినీ మళ్లీ ధ్రువీకరణ కోసం వీఆర్‌వో లాగిన్‌కు పంపాలి. ధ్రువీకరణలో అర్హత పొందితే వాటికి హక్కులివ్వాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement