కార్మికులు మీడియాతో మాట్లాడకూడదంటూ యాజమాన్యం షరతు
మాట్లాడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక
కార్మికుల నియామక నిబంధనలు గుర్తుచేస్తూ సర్క్యులర్ జారీ
కార్మికుల ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
యాజమాన్యం బెదిరింపులకు భయపడేదిలేదంటున్న కార్మిక సంఘాలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అధికారంలోకి రాకముందు విశాఖ ఉక్కు ఉద్యమం సడలనివ్వనంటూ ప్రగల్భాలు పలికారు.. కూటమి పేరుతో గద్దెనెక్కిన తర్వాత.. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు పరోక్షంగా కుట్రలకు పదును పెడుతున్నారు. కార్మికులు మీడియాతో మాట్లాడకూడదంటూ యాజమాన్యం షరతులు విధిస్తూ.. కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించింది. దీనిపై కార్మిక సంఘాలు మండిపడుతూ.. యాజమాన్యం బెదిరింపులకు భయపడేదేలేదని తేల్చిచెబుతున్నాయి. కార్మిక నియామక నిబంధనల్ని సర్క్యులర్‌లో పేర్కొంటూ.. మీడియాతో మాట్లాడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరికలు జారీచేసింది. దీంతో కార్మిక వర్గాల్లో అలజడి మొదలైంది. మరోవైపు.. 4,200 మంది కార్మికుల్ని యాజమాన్యం ఒకేసారి తొలగించి మళ్లీ తాత్కాలికంగా విధుల్లోకి తీసుకుని వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. దీంతో కార్మికులు మండిపడుతున్నారు.
కార్మికుల మెడపై కత్తి..
ఇక పొమ్మనలేక పొగపెట్టినట్లు.. కార్మికులు, ఉద్యోగుల్ని యాజమన్యం నిరంకుశ నిర్ణయాలతో వేధింపులకు గురిచేస్తోంది. ఒక్కో నిర్ణయాన్ని అమలుచేస్తూ.. కార్మికుల మెడపై ఒక్కో కత్తి వేలాడదీస్తుండటంతో వారు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఇటీవల పొదుపు చర్యల పేరుతో 500 మంది అధికారుల్ని, ఉద్యోగుల్ని ఛత్తీస్‌గఢ్‌లోని నగర్‌నార్ స్టీల్‌ప్లాంట్‌కు డిప్యుటేషన్‌పై పంపించేందుకు రంగం సిద్ధంచేయడం వారిని తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. అలాగే, రోజురోజుకూ క్షీణించిపోతున్న ఆర్థిక పరిస్థితివల్ల గత ఎనిమిది నెలలుగా ఉద్యోగులు ఒకే విడతలో జీతం అందుకున్న దాఖలాల్లేవు.
నెలనెలా రూ.10వేల నుంచి రూ.30వేల నష్టం..
అలాగే, 2017 జనవరి 1న జరగాల్సి వేతన ఒప్పందం జరగకపోవడంవల్ల ఉద్యోగులు ప్రతీనెలా కనీసం రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు నష్టపోతున్నారు. ఉద్యోగుల ఆర్థిక అవసరాలకు అండగా ఉండే పీఎఫ్, త్రిఫ్ట్ సొసైటీలకు యాజమాన్యం సకాలంలో నగదు చెల్లించకపోవడంతో వారి నుంచి ఉద్యోగులకు రుణాలు సైతం నిలిచిపోయాయి. దీంతో ఉద్యోగుల కష్టాలు రెట్టింపయ్యాయి. దీనికి తోడు అధికారులకు ప్రోత్సాహకాలు తగ్గించడం, టౌన్‌షిప్‌లో నివసిస్తున్న కార్మికులకు విద్యుత్ చార్జీల పెంపు అమలు, బోనస్, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే (పీఆర్‌పీ) తాత్కాలికంగా నిలుపుదల, ఈఎల్ ఎన్‌క్యాష్ మెంట్ తాత్కాలికంగా నిలుపుదల తదితర అనేక చర్యలకు ఉపక్రమించింది.
ఇలా ప్రతి అంశంలోనూ కార్మకుల్ని యాజమాన్యం రోడ్డున పడేస్తూ.. మానసికంగా వేధింపులకు గురిచేస్తోంది. ఒక్కో కఠిన నిర్ణయాన్ని అమలుచేస్తూ.. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణగదొక్కేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలతో కార్మికులు, ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు. ప్రభుత్వాలు చెబుతున్న మాటలకు, ప్లాంట్‌లో జరుగుతున్న పరిణామాలకు అస్సలు పొంతనలేదంటూ కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. మీడియాతో మాట్లాడొద్దంటూ జారీచేసిన సర్క్యులర్‌ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment