సాక్షి, అమరావతి: దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ల్యాండ్ టైట్లింగ్ చట్టం ద్వారా భూ యాజమాన్య హక్కులకు పూర్తి భరోసా లభించనుంది. భూ యజమానులకే కాకుండా కొనుగోలుదారులకు సైతం భూమి హక్కులపై భద్రత ఏర్పడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. భూములకు సంబంధించిన సమస్యలు, మోసాలు పెరిగిపోయిన నేపథ్యంలో వాటికి ఆస్కారం లేకుండా చేయడమే లక్ష్యంగా తెచ్చిన ఈ చట్టం భూముల వ్యవస్థ స్వరూపాన్ని మారుస్తుందని విశ్లేషిస్తున్నారు.
బ్రిటీష్ కాలంలో తయారైన భూ రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడం, ఆధునికీకరించకపోవడంతో పలు సమస్యలు తలెత్తాయి. రికార్డుల తారుమారు, నకిలీల కారణంగా భూ యజమానులు నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. సివిల్ వివాదాలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోవడంతో పరిష్కరించడం కష్టసాధ్యంగా మారింది.
వీటివల్ల శాంతి భద్రతల సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. తన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా వీటిని గుర్తించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ల్యాండ్ టైట్లింగ్ బిల్లును తేవడంతోపాటు భూముల రీ సర్వేను ప్రారంభించారు. ప్రస్తుతం భూముల రీ సర్వే విజయవంతంగా కొనసాగుతుండగా ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి ఇటీవలే కేంద్రం ఆమోదం తెలపడంతో వెంటనే అమల్లోకి తెచ్చారు.
హైకోర్టులో ఎప్పుడైనా అప్పీల్‌కు అవకాశం
ఈ చట్టం వల్ల భూ యజమానుల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదు. రీ సర్వే ద్వారా భూముల డిజిటల్ రికార్డులను ఇప్పటికే పక్కాగా తయారు చేస్తున్న విషయం తెలిసిందే. స్థిరాస్తుల శాశ్వత రిజిష్టర్ రూపకల్పనతో ఆ ఆస్తిని యజమాని మినహా మరెవరూ విక్రయించేందుకు అవకాశం ఉండదు. దాని ప్రకారమే రిజిస్ట్రేషన్లు, ఆటో మ్యుటేషన్ జరగడంతో వివాదాలకు ఆస్కారం ఉండదు.
ఇప్పటికే రాష్ట్రంలో ఆటో మ్యుటేషన్ అమల్లోకి వచ్చింది. హక్కుల రిజిస్టర్‌లో నమోదైన పేర్లపై ఎవరికైనా అభ్యంతరాలుంటే రెండేళ్లలోపు కొత్తగా ఏర్పడే జిల్లా, రాష్ట్ర స్థాయి ట్రిబ్యునళ్లలో అప్పీల్‌కు అవకాశం ఉంటుంది. అభ్యంతరాలు లేకపోతే రెండేళ్ల తర్వాత ఆ భూములకు శాశ్వత హక్కుదారులుగా గుర్తించి శాశ్వత రిజిస్టర్‌లో నమోదు చేస్తారు.
రెండేళ్ల తర్వాత ట్రిబ్యునళ్లలో అవకాశం లేకపోయినా హైకోర్టులో మాత్రం ఎప్పుడైనా అప్పీల్ చేసుకోవచ్చు. హైకోర్టులో సివిల్ వివాదాలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక బెంచ్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీనివల్ల వివాదాలు త్వరితగతిన పరిష్కారం కానున్నాయి.
కింది కోర్టులపై తగ్గనున్న భారం
కొత్త చట్టం ద్వారా ఇప్పటి మాదిరిగా కింది స్థాయి సివిల్, రెవెన్యూ కోర్టులకు భూ వివాదాలను పరిష్కరించే అధికారం ఉండదు. ఆయా కోర్టుల్లో వేలాది సివిల్ కేసులు పెండింగ్‌లో ఉండడం విపరీతమైన భారం పడుతున్న విషయం తెలిసిందే. కింది స్థాయి సివిల్ కోర్టుల్లో భూ వివాదాల పరిష్కారానికి ఏళ్ల తరబడి సమయం పడుతోంది.
సంవత్సరాలు గడిచినా కొన్ని కేసులు పరిష్కారానికి నోచుకోవడంలేదు. ఎక్కడైనా ఒక భూమికి సంబంధించిన వివాదం తలెత్తితే ఆర్డీవో, జేసీ కోర్టుల్లో వెంటనే పరిష్కారం కావడంలేదు. ఆ వివాదం సివిల్ కోర్టుకు వెళితే తేలేందుకు ఎన్ని ఏళ్లు పడుతుందో తెలియని పరిస్థితి. రెండు మూడు తరాలు గడిచినా ఇవి తేలకపోవడంతో న్యాయస్థానాలపై కేసుల భారం పెరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment