సాక్షి, అమరావతి : భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని ఇంకా అమల్లోకి తీసుకురాలేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నందున, ఆస్తి వివాదాలపై దాఖలయ్యే దావాలు వేటినీ తిరస్కరించొద్దని హైకోర్టు బుధవారం రాష్ట్రంలోని అన్నీ సివిల్ కోర్టులను ఆదేశించింది. కక్షిదారులు దాఖలు చేసే అన్ని దావాలపై విచారణ చేపట్టాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
యాజమాన్య హక్కు చట్టం నిబంధనలను ప్రభుత్వం ఇంకా రూపొందించలేదని తెలిపింది. భూ యాజమాన్య హక్కు చట్టంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టాన్ని సవాలు చేస్తూ కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలూ), రాష్ట్ర బార్ కౌన్సిల్ తరపున కె.చిదంబరం, ముప్పాళ్ల సుబ్బారావు, జి.సుదర్శన్ హైకోర్టులో వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.
పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు గంటా రామారావు, ఎన్.సుబ్బారావు, న్యాయవాది యలమంజులు బాలాజీ తదితరులు వాదనలు వినిపించారు. భూ యజమాన్య హక్కుల చట్టం ప్రజల హక్కులను హరించే విధంగా ఉందన్నారు. ఈ చట్టం ఇప్పటికే అమల్లోకి వచ్చిందంటూ స్థిరాస్తి వివాదాలపై దాఖలయ్యే దావాలన్నింటినీ సివిల్ కోర్టులు తిరస్కరిస్తున్నాయని, సంబంధిత అధికారుల వద్దకే వెళ్లాలని కక్షిదారులకు చెబుతున్నాయని తెలిపారు.
ఇంకా నోటిఫికేషనే ఇవ్వలేదు
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. భూ యాజమాన్య హక్కుల చట్టం ఇంకా అమల్లోకి రాలేదని చెప్పారు. చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం ఆయా ప్రాంతాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ కోసం నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుందన్నారు. ఇంకా నోటిఫికేషన్ జారీ చేయలేదని, కొంత సమయం పడుతుందని తెలిపారు. నిబంధనలను కూడా రూపొందించాల్సి ఉందన్నారు.
టైటిల్ రిజిస్ట్రేషన్ (టీఆర్‌వో), ల్యాండ్ టైట్లింగ్ అప్పిలేట్ అధికారులను (ఎల్‌టీఏవో) కూడా నియమించాల్సి ఉందన్నారు. కాబట్టి, స్థిరాస్తి దావాలను సివిల్ కోర్టులు తిరస్కరించాల్సిన అవసరం లేదన్నారు. కక్షిదారులు సివిల్ కోర్టులకు వెళ్లకుండా ఎలాంటి నిషేధం లేదని తెలిపారు. కొత్త దావాలను తిరస్కరించవద్దని ప్రభుత్వ న్యాయవాదుల ద్వారా సివిల్ కోర్టులను కోరుతున్నట్లు చెప్పారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, స్థిరాస్తి దావాలను తిరస్కరించవద్దని సివిల్ కోర్టులను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment