‘కొల్లేర’వుతున్నా పట్టించుకోరా?
=యథేచ్ఛగా చేపల చెరువులు తవ్వకం
= నిబంధనలు గాలికి...
= పట్టించుకోని అధికారగణం
ముదినేపల్లి రూరల్, న్యూస్‌లైన్ : పట్టా, అసైన్డ్, పోరంబోకుతో సహా పచ్చని పైరుతో కళకళలాడుతున్న ముదినేపల్లి మండలంలోని భూములన్నీ నేడు కొల్లేరును తలపిస్తున్నాయి. ఈ ప్రాంతంలోని బడా బాబులు సెంటు భూమినీ వదలకుండా విచ్చలవిడిగా చేపలు, రొయ్యల చెరువులుగా మార్చేయడమే దీనికి కారణం. ఓ వైపు రాజ కీయ పలుకుబడి, మరోవైపు ధనబలంతో ఉన్న వారు లొంగదీసుకుంటున్నందు వల్లే సంబంధిత అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. భూములను చెరువులుగా మార్చాలంటే చిత్తడి నేలలు మాత్రమే ఉండాలి.
ఇతర భూముల్లో కానీ.. పంటభూముల్లోకానీ చెరువులు తవ్వేందుకు నిబంధనలు అనుమతించవు. అలాగే సాగునీటిని అస్సలు వినియోగించకూడదు. వీటన్నింటికీ తోడు సరిహద్దు రైతులు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకూడదు. ఇవన్నీ ఉంటేనే మండల స్థాయి కమిటీ దరఖాస్తులు పరిశీలిస్తుంది. ఆపై డివిజన్, జిల్లా స్థాయి కమిటీలు ఆమోదించిన తరువాత మాత్రమే చెరువుల తవ్వకాలు చేపట్టాలి. మండలంలో మాత్రం ఇలాంటి నిబంధనలు ఎక్కడా పాటించడంలేదనే విమర్శలొస్తున్నాయి.
అనేక గ్రామాల్లో పంట భూములన్నీ చెరువులుగా మారిపోయినా రెవెన్యూ రికార్డుల్లో మాత్రం ఇప్పటికీ ఆ భూముల్లో వరిసాగు జరుగుతున్నట్లు నమోదు చేయడం గమనార్హం. వైవాక, ఊటుకూరు, దేవపూడి, చిగురుకోట, పెదగొన్నూరు తదిత ర గ్రామాల్లో నిబంధనలు అతిక్రమించి చెరువులు తవ్వినా సంబంధిత వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
పత్రికల్లో వార్తలు వెలువడిన రోజున మాత్రం మొక్కుబడిగా ఒకటి రెండు పొక్లెయిన్లు స్వాధీనం చేసుకుని నామమాత్రపు జరిమానా వేసి వదలివేస్తున్నారు. తవ్వకాలకు పెద్ద మొత్తంలో వ్యయం చేస్తున్న బడా బాబులపై ఇలాంటి జరిమానాలు ఏమాత్రం ప్రభావం చూపడంలేదు. మాట వినని రెవెన్యూ అధికారులపై రాజకీయ పలుకుబడి ఉపయోగిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. దీంతో ఉద్యోగ భద్రతకోసం అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తూ తవ్వకాలకు పరోక్షంగా తమవంతు సహకారాన్ని అందిస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి.
కొంతమంది వీఆర్వోలు బడా బాబులను రెవెన్యూ అధికారుల కార్యాలయాలకు తీసుకెళ్లి తవ్వకాలకు ఆమోద ముద్ర వేయిస్తున్నారు. పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే అతి తక్కువ కాలంలోనే మండలం మొత్తం కొల్లేరుకు ప్రతిరూపంగా మారుతుందనడంలో సందేహం లేదనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని చెరువుల తవ్వకాలపై ఉక్కుపాదం మోపాలని కోరుతున్నారు.