
నకిలీ..మకిలీ!
యాచారం రెవెన్యూలో అక్రమ బాగోతం
నకిలీ సంతకాలతో పాసుపుస్తకాలు, పహాణీల జారీ
రుణమాఫీ పథకాన్ని పొందిన వైనం
రెవెన్యూ విభాగంలో మరో నకిలీ బాగోతం వెలుగులోకి వచ్చింది. భూమి లేకున్నా.. పట్టాదారు పాసుపుస్తకాలు జారీ అయ్యాయి. అంతేకాదు.. పహాణీలు సైతం క్రమం తప్పకుండా అప్‌డేట్ అవుతున్నాయి. ఇలాంటి పాసుపుస్తకాలు, పహాణీలతో కొందరు ఏకంగా రుణమాఫీ పథకాన్ని సైతం పొందడం గమనార్హం. యాచారం మండల రెవెన్యూ పరిధిలో బయటపడిన అక్రమ పాసుపుస్తకాల వ్యవహారంపై స్థానిక రెవెన్యూ అధికారులు తీగ లాగగా.. తప్పుడు పాసుపుస్తకాలు పొందిన డొంక మెల్లగా కదులుతోంది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా/ యాచారం
సాక్షి, రంగారెడ్డి జిల్లా/ యాచారం: మండల రెవెన్యూ పరిధిలో నకిలీ పాసుపుస్తకాల గుట్టు బయటపడింది. రెవెన్యూ రికార్డుల్లోని వివరాలతో సంబంధం లేకుండా పదుల సంఖ్యలో పట్టాదారు పాసుపుస్తకాలు తయారయ్యాయి. ఆ పాసుపుస్తకాల్లో ఉన్న వారి పేర్లతో పహాణీలు సైతం జారీఅవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. యాచారం మండలం నక్కర్తమేడిపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వేన ంబరు 181, 184, 213 లలో 400 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉంది. గతంలో భూపంపిణీలో భాగంగా పలువురు రైతులకు అసైన్ చేసినప్పటికీ.. పొజిషన్ ఇవ్వలేదు. ఈ క్రమంలో కొందరు అక్రమార్కులు ఈభూమిపై కన్నేసి నకిలీ పట్టాదారు పుస్తకాలు సృష్టించారు. అంతేకాకుండా పహాణీలను సైతం తయారు చేసి ప్రభుత్వ పథకాలను అనుభవిస్తున్నారు.
వెలుగులోకి ఇలా..
అక్రమంగా పాసుపుస్తకాలు పొందడమే కాకుండా ప్రభుత్వ పథకాలను అనుభవిస్తున్న తీరుపై పల్లెచెల్కతండాకు చెందిన స్థానికులు కొందరు ఈనెల 13న మండల తహసీల్దారుకు ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించి కొన్ని ఆధారాలు సైతం సమర్పించడంతో అధికారులు విచారణకు ఉపక్రమించారు. పట్టాదారు సర్టిఫికెట్లు జారీ చేసిన ఫైలుకు సంబంధించిన అంకెలను రెవెన్యూ రికార్డులతో సరిపోల్చారు. అయితే రెండింట్లో భిన్నమైన నంబర్లున్నట్లు గుర్తించారు.
అదేవిధంగా సర్టిఫికెట్లు జారీ అయిన తేదీల్లో పనిచేసిన అధికారి కాకుండా ఇతర అధికారుల సంతకాలున్నట్లు తేల్చారు. దీంతో వాటిని నకిలీవిగా పరిగణిస్తూ మండల తహసీల్దారు ప్రాథమికంగా నిర్ధారించారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టి అసలు సంగతి పసిగడతామని తహసీల్దార్ వసంతకుమారి ‘సాక్షి’తో పేర్కొన్నారు.
పహణీల జారీ నిలుపుదల..
నక్కర్తమేడిపల్లిలోని సర్వేనంబర్లు 181, 184, 213లోని భూమికి సంబంధించి ఫిర్యాదులు రావడంతో ఆ మేరకు ఆన్‌లైన్ పహణీల జారీని నిలిపివేయాలని తహసీల్దార్ వసంతకుమారి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. అదేవిధంగా విచారణ పూర్తయ్యేవరకు ఆ సర్వేనంబర్లలోని పట్టాదారులకు కొంతకాలం రుణాల మంజూరును కూడా నిలిపివేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు.