జన్వాడ సందర్శించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు
నాలా పరిస్థితి, కబ్జా తీరు పరిశీలన
నాలాపై ప్రహరీ, ప్రధాన గేటు ఉన్నట్లు గతంలోనే గుర్తింపు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడలో మాజీ మంత్రి కేటీఆర్ లీజుకు తీసుకున్నట్లు చెబుతున్న ఫాంహౌస్‌కు ఆనుకుని ఉన్న బుల్కాపూర్ నాలాను మంగళవారం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ తేజ, సర్వేయర్ సాయి తేజ, ఇరిగేషన్ ఇన్‌స్పెక్టర్ లింగంలు సందర్శించారు. రెవెన్యూ రికార్డులతో పాటు గ్రామ నక్ష ఆధారంగా.. కబ్జాకు గురైన బుల్కాపూర్ నాలా ఎటు నుంచి ఎటు వైపు వెళ్తోంది? ఎన్ని మీటర్ల మేర కబ్జాకు గురైంది? ఎవరి కబ్జాలో ఉంది? వంటి వివరాలపై ఆరా తీశారు.
రెవెన్యూ రికార్డులను, క్షేత్రస్థాయిలో నాలా పరిస్థితిని సరిపోల్చుకున్నారు. శంకర్‌పల్లి–ఖానాపూర్ రోడు్డలో ఉన్న ఈ నాలా ప్రస్తుతం చాలావరకు కన్పించకుండా పోయింది. మాజీ మంత్రి కేటీఆర్ సన్నిహితునిదిగా చెబుతున్న జన్వాడ ఫాంహౌస్ ప్రధాన గేటు, ప్రహరీ ఈ నాలాపై నిర్మించినట్లు 2020 జూన్‌లోనే ఇరిగేషన్ అధికారులు నిర్ధారించారు. సర్వే నంబర్ 301, 302, 309, 311, 313లో దాదాపు 27 ఎకరాల్లో ఈ ఫాంహౌస్ ఉంది.
ఇందులో అక్రమ నిర్మాణాలతో పాటు 2.24 ఎకరాల నాలా, 11 గుంటల బఫర్ జోన్ ఉన్నట్లు ధ్రువీకరించారు. ఫాంహౌస్ తూర్పు భాగంలో, నాలా, బఫర్ జోన్లు ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. తాజాగా నాలా ఎంత మేర కబ్జాకు గురైందనే అంశాన్ని నిర్ధారించేందుకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయికి చేరుకుని, కొలతలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా ఆయా విభాగాల అధికారులు బుధవారం మరోసారి జన్వాడను సందర్శించే అవకాశం ఉందని తెలిసింది.
గతంలో రేవంత్‌పై కేసు, అరెస్టు
సీఎం రేవంత్‌రెడ్డి గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జన్వాడ ఫాంహౌస్ సందర్శనకు వెళ్లారు. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నివసిస్తున్న ఈ ఫాంహౌస్‌పై డ్రోన్లు ఎగరేశారనే ఆరోపణలతో అప్పట్లో రేవంత్‌పై కేసు నమోదు చేసి, అరెస్టు కూడా చేశారు.
ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఇటీవల చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో హైడ్రాను తెరపైకి తీసుకురావడం తెలిసిందే. ఇదే క్రమంలో జన్వాడ ఫాంహౌస్‌కు నోటీసులు జారీ చేయగా, హైడ్రా చర్యలను ఆపాల్సిందిగా కోరుతూ కేటీఆర్ సన్నిహితుడు బి.ప్రదీప్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో నిబంధనల మేరకు నడుచుకోవాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment