జన్వాడ ఫామ్‌హౌస్‌కు సర్పంచ్ అనుమతులు ఉన్నాయన్న అంశంపై సీఎం రేవంత్
పదేళ్లు మంత్రిగా చేసిన కేటీఆర్‌కు ఇది తెలియదా?
ఎన్నికల అఫిడవిట్‌లో ఫామ్‌హౌస్ లీజు వ్యవహారం వెల్లడించారా?
లేకుంటే అనర్హత వేటు, విచారణతప్పదు
అక్రమాలను ఉమ్మడిగా పరిశీలిద్దాం.. విపక్ష నేతలు రావాలి
మా కుటుంబ సభ్యుల అక్రమ నిర్మాణాలున్నట్టు చూపితే నేనే దగ్గరుండి కూల్చివేయిస్తా
‘111 జీవో’లో మార్పులు చేయలేం..
ఓఆర్‌ఆర్‌కు ఆనుకుని ఉన్న గ్రామాల వరకే హైడ్రా పరిధి
హరీశ్, కేటీఆర్ రుణమాఫీ జరగని వారి వివరాలిస్తే మాఫీ చేస్తాం
కేజ్రీవాల్‌కు బెయిల్ రాకముందే కవితకు ఎలా వచ్చిందని ప్రశ్న
మీడియాతో సీఎం ఇష్టాగోష్టి
సాక్షి, హైదరాబాద్: ‘‘జన్వాడలో తాను లీజుకు తీసుకున్న ఫామ్‌హౌస్‌కు సర్పంచ్ ఇచ్చిన అనుమతులు ఉన్నాయని కేటీఆర్ అంటున్నారు. సర్పంచ్‌లకు అనుమతులిచ్చే అధికారం ఉండదనే విషయం పదేళ్లు మంత్రిగా చేసిన కేటీఆర్‌కు తెలియదా? డీటీసీపీకి మినహా సీఎంకు సైతం ఆ అధికారం లేదు. అసలు ఫామ్‌హౌజ్ లీజు విషయాన్ని కేటీఆర్ ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారా? వెల్లడించకుంటే కేటీఆర్‌పై అనర్హత వేటుతో పాటు విచారణను ఎదుర్కోక తప్పదు..’’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
తాను 2020లో జన్వాడ ఫామ్‌హౌస్‌పై కోర్టులో కేసు వేసినప్పుడు, అక్రమాలుంటే తానే కూల్చివేస్తానని కేటీఆర్ అన్నారని.. మరి ఎందుకు కూల్చివేయలేదని ప్రశ్నించారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్‌సాగర్‌లు జలమండలి పరిధిలోకి వస్తాయని.. 111 జీవో పరిధిలో నిర్మాణాలకు ఆ సంస్థే ఎన్‌ఓసీ ఇవ్వాల్సి ఉంటుందని, సర్పంచ్ కాద ని స్పష్టం చేశారు. తన కుటుంబ సభ్యుల అక్రమ నిర్మాణాలేమైనా ఉంటే కేటీఆర్ ఆ జాబితా తీసుకురావాలని.. తానే దగ్గరుండి కూల్చివేయిస్తానని రే వంత్ చెప్పారు. బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
111 జీవోలో మార్పుల్లేవు
సుప్రీంకోర్టు నిబంధనలను పూర్తిగా అమలుచేయకుండా 111 జీవో విషయంలో అంగుళం మార్పు కూడా చేయలేమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. భూముల రేట్లు పెంచి వ్యాపారం చేసుకోవడానికే గత ప్రభుత్వం 111 జీవో ఎత్తివేత కోసం కమిటీని ఏర్పాటు చేసిందని ఆరోపించారు. ఆ కమిటీలోని అధికారులు రిటైర్ కావడంతో కదలిక లేదని చెప్పారు.
ఉమ్మడిగా తనిఖీలకు వెళ్దాం.. వస్తారా?
విపక్ష నేతలు, ఎమ్మెల్యేలే లక్ష్యంగా కూల్చివేతలు జరుగుతున్నాయనే ఆరోపణలను రేవంత్ తోసిపుచ్చారు. కాంగ్రెస్ నేత పల్లంరాజు కట్టడాన్ని కూడా కూల్చామని చెప్పారు. ‘‘చెరువుల్లో అక్రమ నిర్మాణాలపై ఉమ్మడిగా తనిఖీలు చేద్దాం రండి. ప్రజాకోర్టు నిర్వహించి నిజనిర్ధారణ చేద్దాం. ప్రభుత్వ శాఖల అధికారులూ ఇందులో పాల్గొంటారు..’’అని విపక్ష నేతలకు సవాలు విసిరారు. అకడమిక్ సంవత్సరం మధ్యలో విద్యార్థులకు నష్టం జరగవద్దన్న ఉద్దేశంతో.. అక్బరుద్దీన్, పల్లా రాజేశ్వర్‌రెడ్డిల కాలేజీల భవనాలను కూల్చకుండా హైడ్రా సమయం ఇచ్చిందని చెప్పారు. శాస్త్రీపురంలో ఐదంతస్తుల కట్టడాన్ని (ఓ ఎంఐఎం ఎమ్మెల్యేకు సంబంధించిన) కూల్చామని, అక్కడ ఎవరుంటారో మీకు తెలుసు కదా అని అసదుద్దీన్ ఒవైసీని ఉద్దేశించి పరోక్షంగా ప్రస్తావించారు.
భూములు కొన్నవారిదే బాధ్యత!
కూల్చివేతలతో సాధారణ ప్రజలు కూడా నష్టపోతారని మీడియా ప్రశ్నించగా.. స్థలాల కొనుగోళ్లకు ముందు దస్తావేజుల తనిఖీ బాధ్యత కొనుగోలుదారులదేనని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలంలో 50 ఏళ్ల నుంచీ ఉన్నా కూల్చివేయడానికి నోటీసులు అవసరం లేదంటూ రాయదుర్గ్‌లోని లిడ్‌క్యాప్ స్థలంలో జరిపిన కూల్చివేతలను సమర్ధించారు. అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు తప్పవన్నారు.
ఇక కూల్చివేయడమే!
ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్, నాలా, పార్కుల్లో అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించడానికి ఆస్కారం ఉండదని, వాటిని కూల్చివేయడమే లక్ష్యమని రేవంత్‌రెడ్డి చెప్పారు. హైడ్రా పరిధిని ఔటర్ రింగ్‌రోడ్డును తాకే గ్రామపంచాయతీల వరకు నోటిఫై చేసినట్టు తెలిపారు. హైడ్రా పరిధి వెలుపలి ప్రాంతాల్లోని మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలోని అక్రమ కట్టడాల కూల్చివేతకు హైడ్రా సహాయాన్ని కోరవచ్చని చెప్పారు. హైడ్రాకు పోలీసుస్టేషన్ హోదా కల్పించి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసే అధికారం ఇస్తామని తెలిపారు.
10 ఏళ్లలో రికార్డులు మాయం
హెచ్‌ఎండీఏ ఎన్ని చెరువులను నోటిఫై చేసిందనే అంశంపై పరిశీలన జరుగుతోందని రేవంత్ చెప్పారు. గత పదేళ్లలో కొన్ని రికార్డులు మాయమయ్యాయని, దీంతో రాష్ట్రం ఏర్పాటుకు ముందున్న రికార్డులను పరిశీలిస్తున్నామని తెలిపారు. జీవో 58, 59 కింద గత ప్రభుత్వంలో అక్రమంగా క్రమబధ్దీకరించిన ప్రభుత్వ భూములను గుర్తించి నిషేధిత భూముల జాబితాలో చేర్చినట్టు వెల్లడించారు.
వారంలో జర్నలిస్టుల సొసైటీకి స్థలాలు
జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్టు కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ (జేఎన్‌జే)కి పేట్‌బïÙరాబాద్‌లో కేటాయించిన భూములను వారంలోగా అప్పగిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఖమ్మం జిల్లా పర్యటనలో సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొనాల్సి ఉండడంతో.. గురువారం రవీంద్రభారతిలో తలపెట్టిన సమావేశాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు.
కేజ్రీవాల్‌కు బెయిల్ రాలేదు.. కవితకు ఎలా వచ్చింది?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌కు ఇంకా బెయిల్ రాలేదని.. మనీశ్ సిసోడియాకు బెయిల్ కోసం 16 నెలలు పట్టిందని.. కవితకు 5 నెలల్లోనే ఎలా బెయిల్ వచ్చిందని సీఎం రేవంత్ ప్రశ్నించారు. కవితకు ఒక న్యాయం, మిగతా వారికి ఇంకో న్యాయమా? అని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తమ ఓట్లను బీజేపీకి బదిలీ చేసిందని, ఆ రెండు పార్టీల మధ్య అవగాహన జరిగిందని ఆరోపించారు.
కేటీఆర్ కొడంగల్‌కు వెళ్తే అభ్యంతరం లేదు
రుణమాఫీపై హరీశ్‌రావు, కేటీఆర్‌ల ఆరోపణలు అవాస్తవమని.. ఆగస్టు 15లోగా 22,37,848 ఖాతాలకు రూ.17,933 కోట్ల రుణమాఫీ చేశామని రేవంత్ చెప్పారు. గత ప్రభుత్వం 2018–23 మధ్యకాలంలో 23,61,849 ఖాతాలకు సంబంధించి రూ.13,329 కోట్ల రుణాలను వాయిదాల్లో మాఫీ చేసిందన్నారు. హరీశ్, కేటీఆర్, బీఆర్‌ఎస్ కార్యకర్తలు గ్రామగ్రామాన తిరిగి రుణమాఫీ జరగని వారి వివరాలను సేకరించి ప్రభుత్వానికి అందిస్తే వారికీ రుణమాఫీ చేస్తామన్నారు. కొడంగల్‌లో రుణమాఫీ పరిశీలనకు కేటీఆర్ వెళ్తానని అన్నారని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. తనకేమీ అభ్యంతరం లేదని చెప్పారు. నెలాఖరులోగా కొత్త బీసీ కమిషన్ ఏర్పాటు చేసి కులగణన ప్రారంభిస్తామన్నారు.
ఏపీకి రూ.2,500 కోట్ల వడ్డీల చెల్లింపు..
ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న రుణాలను జనాభా దామాషా ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పంచుకోవాలన్న తెలంగాణ వాదనను తమ ప్రభుత్వ కృషితో ఏపీ అంగీకరించిందని రేవంత్ చెప్పారు. తెలంగాణ వాటా వడ్డీల కింద ఏపీకి రూ.2,500 కోట్లను చెల్లించడానికి కేంద్రం రుణాన్ని మంజూరు చేసిందని, దానితో తెలంగాణకు మేలు జరిగిందని చెప్పారు. కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు వాటాలు అందాయన్న కేటీఆర్ ఆరోపణలను రేవంత్ తోసిపుచ్చారు. బీఆర్‌ఎస్ నేతలకే వాటాలు ఉండవచ్చని విమర్శించారు. రాష్ట్రంలో నిజమైన కేసుల విచారణకు సీబీఐకి అనుమతిస్తామని, తప్పుడు కేసులకు ఇవ్వబోమని ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment