‘చుక్కల’ భూములు చక్కబెట్టేద్దాం! | TDP leaders Heavy sketch to the 24 lakh acres of land | Sakshi
Sakshi News home page

‘చుక్కల’ భూములు చక్కబెట్టేద్దాం!

Published Wed, Feb 22 2017 1:59 AM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM

‘చుక్కల’ భూములు చక్కబెట్టేద్దాం! - Sakshi

‘చుక్కల’ భూములు చక్కబెట్టేద్దాం!

24 లక్షల ఎకరాలకు ‘పచ్చ’తమ్ముళ్ల భారీ స్కెచ్‌...

రూ. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కొట్టేసేందుకు పన్నాగాలు.. అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు
అనుభవదారులు, రెవెన్యూ సిబ్బందికి బెదిరింపులు..మాట వినని సిబ్బందికి బదిలీలు
బోగస్‌ పత్రాలతో రికార్డులు తారుమారు
అనుభవదారుల స్థానంలో తమ పేర్లు రాయిస్తోన్న టీడీపీ నేతలు
త్వరలో అసెంబ్లీలో చుక్కల భూముల పరిష్కార బిల్లు
ఈలోగా రికార్డుల్లో అనుభవదారులుగా పేర్లు నమోదు చేయించుకుంటున్న తెలుగుదేశం తమ్ముళ్లు
చట్టం అమల్లోకి రాగానే భూములు సొంతం చేసుకొనే వ్యూహం


సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎవరికీ చెందకుండా రెవెన్యూ రికార్డుల్లో చుక్కల భూములుగా నమోదైన లక్షలాది ఎకరాలపై తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ల కన్ను పడింది. అడంగల్‌లను తారుమారు చేసి, తామే అనుభవదారులుగా చూపించి, వాటన్నింటినీ సొంతం చేసుకొనే వ్యూహంలో టీడీపీ నేతలు ఉన్నారు. ఈ భూముల విషయంలో కొన్ని దశాబ్దాలుగా వివాదం ఉంది. స్వాతంత్య్రా నంతరం రెవెన్యూ రికార్డులను తిరగరాసే సమయంలో కొన్ని సర్వే నంబర్లకు చెందిన భూమి ప్రభుత్వానిదా? ప్రైవేటు వ్యక్తులదా అన్న విషయం తేలలేదు. దీంతో ఆ భూముల రికార్డుల్లో హక్కుదారు కాలమ్‌లో చుక్క పెట్టి వదిలేశారు.

వీటినే చుక్కల భూములుగా పిలుస్తారు. ఇలాంటి భూములు రాష్ట్రంలో 24 లక్షల ఎకరాలు ఉన్నాయి. వీటిలో 3 లక్షల ఎకరాలు ప్రైవేటు వ్యక్తులవి చెందినవి. మరో 21 లక్షల ఎకరాలు ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. ఈ భూముల హక్కులపై వివాదం నడుస్తోంది. ఇవన్నీ ప్రభుత్వానివేనని రెవెన్యూ శాఖ వాదిస్తోంది. ఇవి తమవేనని అనుభవదారులు వాదిస్తున్నారు. ఈ వివాదం శాశ్వత పరిష్కారానికి త్వరలోనే శాసన సభలో బిల్లు రానుంది. ఇదే అదనుగా భావించిన టీడీపీ నేతలు ఈ భూముల అనుభవదారులుగా తమ పేర్లను నమోదు చేయిస్తున్నారు. బిల్లు ఆమోదం పొంది, చట్ట రూపం దాల్చేలోగా రికార్డుల్లో ఈ భూములకు అనుభవదారులుగా పేర్లు చేర్చడం ద్వారా వాటిని సొంతం చేసుకోవడం టీడీపీ నేతల వ్యూహం.

మాట వినకపోతే బెదిరింపులు
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులోని సర్వే నంబర్‌ 15లోని కొన్ని భూములు రెవెన్యూ రికార్డుల్లో చుక్కల భూములుగా నమోదయ్యాయి. అదే విధంగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం జంబులదిన్నె గ్రామంలో 100. 109, 149, 165, 175, 180, 190, 197, 201, 217 సర్వే నంబర్లలోని భూముల్లో కూడా కొన్ని చుక్కల భూములుగా ఉన్నాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 24 లక్షల ఎకరాలు ఉన్నాయి. వేల కోట్ల రూపాయల విలువైన ఈ చుక్కల భూముల్లో దశాబ్దాలుగా రైతులు సాగు చేసుకుంటున్నారు. ఈ భూములు వివాదాస్పదమైనవైనందున, వీటి  అనుభవదారులకు ఈ భూములపై పంట రుణాలు అందడం లేదు. అత్యవసరమై అమ్ముకోవాలన్నా వీలుకాని పరిస్థితి. అందుకే ఈ చుక్కల సమస్యను పరిష్కరించాలని అనుభవదారులు కోరుతున్నారు. అయితే, దీన్ని ఆసరాగా చేసుకుని మొత్తం భూములను కొట్టేసే ప్రయత్నంలో అధికార పార్టీ నాయకులు ఉన్నారు.

ఇప్పటికే పచ్చటి పంట పొలాలు, అసైన్డ్‌ భూములు, కొండ పోరంబోకు, లంక భూములను నయానో భయానో చేజిక్కించుకుంటున్న టీడీపీ నేతలు.. ఇప్పుడు చుక్కల భూములను కూడా సొంతం చేసుకొనే పనిలో పడ్డారు. రైతులను, రెవెన్యూ సిబ్బందిని బెదిరించి చుక్కల భూముల అనుభవదారులుగా అడంగల్‌లో తమ పేర్లు రాయించుకుంటున్నారు. ఇందుకు బోగస్‌ పత్రాలు సృష్టించి, అడంగళ్లనే మార్చేస్తున్నారు. మాట వినని క్షేత్రస్థాయి అధికారులను బెదిరిస్తున్నారు. ఇంకా అవసరమైతే బదిలీ కూడా చేయిస్తున్నారు. ఈ అరాచకాలకు అడ్డుకట్ట వేయకపోతే చుక్కల భూములన్నీ చేజారిపోతాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘చుక్కల భూములను తెలుగుదేశం వారి పరం చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. చూస్తూ ఊరుకోవడం మినహా ఏమీ చేయలేని పరిస్థితి’’ అని ఒక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి చెప్పారు.

బిల్లు రాకముందే రికార్డులు తారుమారు
చుక్కల భూమలు సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం గతంలోనే కేబినెట్‌ సబ్‌ కమిటీని నియమించింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలని సబ్‌ కమిటీ సూచించింది. సబ్‌ కమిటీ సిఫార్సులను అనుసరించి ఈ వివాదాన్ని పరిష్కరించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. విధి విధానాలను రూపొందించే బాధ్యతను రెవెన్యూ శాఖకు అప్పగించింది. ఈ భూములను ఐదు విభాగాలుగా వర్గీకరించి, వాటి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో రెవెన్యూ శాఖ విధివిధానాలు రూపొందించి, అసెంబ్లీలో బిల్లు కోసం ముసాయిదాను ప్రభుత్వానికి సమర్పించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి, చుక్కల భూముల వివాదాల పరిష్కార చట్టాన్ని అమల్లోకి తేవాలని యోచిస్తున్నారు. దీంతో అధికార పార్టీ నేతలు రంగప్రవేశం చేశారు.

బిల్లు రాకముందే ఈ భూములను తమ ఖాతాలో వేయించుకునేందుకు గ్రామాల్లో టీడీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. రికార్డుల్లో ఈ భూములు తమవని తప్పుడు ఆధారాలు సృష్టించి పెడితే, బిల్లు చట్టరూపం దాల్చగానే దాని ప్రకారం చుక్కల స్థానంలో భూ యాజమాన్య రికార్డు (1–బి)లో తమ పేరు చేరుతుందని భావిస్తున్నారు. డబ్బు కోసం కొందరు, రాజకీయ ఒత్తిళ్ల వల్ల మరికొందరు క్షేత్రస్థాయి సిబ్బంది టీడీపీ నేతలకు సహకరించి,  తప్పుడు రికార్డులు సృష్టిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోని చుక్కవ భూములను కూడా గుంజుకొంటున్నారు. వీటి అనుభవదారులును బెదిరించి, రికార్డులు తారుమారు చేస్తున్నట్లు సమాచారం. రికార్డుల్లో తమ పేరు ఉంటే, బిల్లు చట్ట రూపం దాల్చగానే భూములు సొంతం చేసుకోవచ్చన్నది అధికార పార్టీ నేతల వ్యూహం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement