Lands Right
-
గిరిజనుల భూమి గిరిజనులకే!
ప్రధాన జీవన స్రవంతిలో ఆదివాసీ ప్రజల అస్తిత్వం, గౌరవం, కృషి ఏ మేరకు గుర్తింపునకు నోచుకున్నాయిఅనేదాన్నిబట్టి ఆ జాతి సమగ్ర మూర్తిమత్వం అర్థమవుతుంది. అల్లూరి సీతారామరాజు, రాంజీ గోండ్, కొమురం భీం లాంటి యోధులు ‘జల్’, ‘జంగల్’, ‘జమీన్ ’ పేరిట వారి హక్కుల సాధన కొరకు పోరాడి ప్రాణాలర్పించారు. అయితే స్వతంత్ర భారతదేశంలో గిరిజనుల కోసం చేసిన చట్టాలు నిర్వీర్యమయ్యాయి. చొరబాటుదారులు అడవి ద్వారాలు తీశారు. ఆదిమ జాతీయులకు వారి భూమి వారికి దక్కకుండా పోవడం క్షమించరానిది. ప్రభుత్వాలు, పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు ఆలోచించి ఒక ఆమోదయోగ్యమైన కార్యాచరణను రూపొందించుకోకపోతే ఆందోళనకరమైన పరిస్థితులు అనివార్యమవుతాయని గత ఉద్యమాల చరిత్ర చెబుతోంది.మాతృమూర్తైనా, మాతృభాషైనా, మాతృదేశమైనా పలికేటప్పుడు వేరువేరుగా వినిపించినా ఆ మూడింటి అంతఃసూత్రం ఒకటే బంధం. తల్లి గర్భాల యంలో మనం నేర్చుకున్న మనదైన భాషలో మాతృదేశంలో తొలి అడుగు మోపే నవజాత శిశువుకు ఈ మూడింటి అస్తిత్వం అనివార్యంగా ఇవ్వబడుతుంది. ఇలాంటిదే ఒక జాతికి కూడా ఉంటుంది. అదే మూలవాసీ సంస్కృతి. ప్రధాన జీవన స్రవంతిలో ఆదివాసీ ప్రజల అస్తిత్వం, గౌరవం, కృషి ఏ మేరకు గుర్తింపునకు నోచుకు న్నాయి అనేదాన్నిబట్టి ఆ జాతి సమగ్ర మూర్తిమత్వం అర్థమవుతుంది.సుద్దాల అశోక్‌తేజ రాసిన ‘కొమురం భీముడో’ అన్న సినీ గేయం కొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తుంది. అడవి తల్లి తన గిరిజన సంతానాన్ని ఆత్మ గౌరవ బావుటా ఎగురెయ్యాలని సందేశాత్మకంగా చేసిన హెచ్చరి కలను స్పష్టం చేసేవిధంగా ఈ పాట సాగింది. వారి హక్కుల కోసం వారే ఉద్యమించాలనే ఉద్వేగాన్ని నింపుతుంది. ఈ పాట ప్రతి గిరిజనుడిని అగ్ని కణంలా వెంటాడింది. దేశంలో గిరిజన ప్రాంతా లున్న అన్ని రాష్ట్రాలలో వారి భాషలోకి తర్జుమా చేసి వినిపించాలనే ప్రణాళికతో అక్కడి నాయకులు ముందుకుపోతున్నారు. ‘మన సంస్కృతి మూలాల్ని నాశనం చేస్తున్న విదేశీయుల మీద నా పోరాటం’ అన్నారు బిర్సా ముండా. నూరేళ్ళ జీవితానుభవంతో 25 ఏళ్లు బతికి ధిక్కార హెచ్చరికను వినిపించి, బ్రిటిష్‌వాళ్ల గుండెల్లో ఫిరంగులు పేల్చాడు. ఆయన జయంతి నవంబర్ 15న ‘జన్ జాతీయ దివస్’గా జరుపుకొంటున్నాం. బిర్సా ముండా చిత్రపటాన్ని పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఉంచడంతో పాటు, రాంచీ విమానాశ్ర యానికి, ఇంకా ఎన్నో సంస్థలకు ఆ వీరుని పేరు పెట్టడం జరిగింది. అల్లూరి సీతారామరాజు, రాంజీ గోండ్, కొమురం భీం లాంటి యోధులు ‘జల్’, ‘జంగల్’, ‘జమీన్ ’ పేరిట వారి హక్కుల సాధన కొరకు పోరాడి ప్రాణాలర్పించారు. బ్రిటిష్ పాలనలో మొత్తం 75 సార్లు గిరిజన తిరుగుబాట్లు జరిగాయంటే వారి చైతన్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలి. తెలంగాణా గవర్నరు జిష్ణుదేవ్ వర్మ ఈ మధ్యన తెలంగాణ గిరిజన ప్రాంతాలలో పర్యటించడం ముదావహం. గిరిజనులకు బాస టగా నిలవడానికి ‘యాక్ట్ 1/70’ని రూపొందించుకున్నాం. అందులో ఉన్న సెక్షన్ 3(1)(ఎ) ప్రకారం, వివాదాలు తేలేంతవరకు షెడ్యూల్డ్ ప్రాంతాలలో ఉన్న భూమి గిరిజనులదిగానే భావించబడుతుంది. ఈ మధ్యన గవర్నరు పర్యటించిన ప్రాంతం ఆ కోవకే చెందుతుంది. వారికి అధికారులు ఏ మేరకు పరిస్థితులను విశదీకరించారో గానీ, రాజ్యాంగంలోని ‘షెడ్యూల్ 5’ ప్రకారం గవర్నరుకు విశేషాధికారాలు ఉంటాయి. ఇది వజ్రాయుధం లాంటిది. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ‘రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు పరిచేవాళ్ళు చెడ్డవాళ్లైతే అది కూడా చెడ్డది కావడం ఖాయం. రాజ్యాంగం ఎంత చెడ్డదైనా దాన్ని అమలు పరిచేవాళ్ళు మంచివాళ్లైతే అది కూడా మంచిదవటం అంతే ఖాయం’ అన్నారు. మన రాజ్యాంగ సంవిధాన మౌలిక నిర్మాణం ఎంతో గొప్పది. సామాజిక అణచివేతకు గురైనవారి అభ్యున్నతి కోసం తోడ్పడడమే రాజ్యాంగంలోని రిజర్వే షన్ల లక్ష్యం.స్వాతంత్య్రానంతరం పాలకులు ఆదివాసీలను చేరడానికి ముఖ్యంగా మూడు ఆలోచనలు చేశారు. ఏకాంతవాసం, కలిసి పోవటం, అభ్యున్నతి. 1958లో మన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈ కలిసిపోవటాన్ని ఎంచుకున్నారు. అంటే ఆదివాసీలతో కలిసి వారిని అభివృద్ధి పరచాలని. ఆదివాసీలను దోపిడీ నుంచి కాపా డాలని, రక్షణగా నిలవాలని, వారికి సంక్షేమ పథకాలు రూపొందింపజేయాలని భావించి ‘పంచశీల’ను ఎంచుకున్నారు. ఆ తరువాత యాక్ట్ డి.ఎఫ్. 1970 చట్టం తీసుకొచ్చారు. గిరిజనుల భూమిని, అటవీ సంపదను ఇది కవచంలాగా కాపాడుతుందని ఊదరగొట్టారు. కానీ ఆ చట్టాలు నిర్వీర్యం అయ్యాయి. చొరబాటుదారులు అడవి ద్వారాలు తీశారు.తెలంగాణాలో నిజాం కాలంలో దీనికోసం హైమన్ డార్ఫ్‌ని తన సలహాదారుగా నియమించుకున్నారు. ఎన్నో సంస్కరణలు చేశామను కున్నారు. కానీ 1948 అనంతరం ఏర్పడిన ప్రభుత్వాలు ఈ దిశగా పెద్దగా చర్యలు తీసుకోలేదు. 1976, ’77లో ఆదిలాబాద్‌లోని ఉట్నూరు ప్రాంతాన్ని సందర్శించినప్పుడు విస్తుపోయే వాస్తవాలెన్నో వెలుగులోకి వచ్చాయి. సంపన్నతే చుట్టరికంగా మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రా ప్రాంతాల నుండి వచ్చిన ధనికులు గిరిజనుల భూమిని ఆక్రమించుకొని, అసలు హక్కుదారులైన గిరిజనులను అక్కడ నుండి తరిమేశారనీ, దాంతో వారు దూరంగా వచ్చి తలదాచుకున్నారనీ, ఇప్పుడు ఆ స్థలాల నుండి కూడా అటవీ అధికారులు వేరే ప్రాంతాలకు వెళ్ళాలని బెదిరిస్తున్నారనీ గిరిజనులు చెప్పుకొచ్చారు.ఇదంతా వింటుంటే చరిత్రలోని చివరి మొఘల్ రాజు బహదూర్ షా జాఫర్ కథ గుర్తొస్తోంది. 1857 తిరుగుబాటు అణచివేయబడి బ్రిటిష్ సైన్యం చేతిలో ఆయన ఓడిపోయిన తరువాత రెండు గజాల భూమి తన భారతదేశంలో తనకు దొరకలేదనీ, ఆ బాధతోనే తన చివరి రోజుల్లో బర్మాలోనే గడుపుతూ అక్కడే ఖననం చేయబడ్డాడనీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గిర్‌గిలాని తన ఉపన్యాసంలో ఉట్టంకించటం గుర్తొస్తోంది. ఇక్కడ మనం చర్చించాల్సిన అంశం ఒకటుంది. రాజ్యాంగంలోని 5వ, 6వ షెడ్యూళ్ళ ద్వారా గవర్నర్లకు విశేష అధికారాలే కల్పించారు. వారి జీవన స్రవంతిని, సంస్కృతి, వైవిధ్యాలను రక్షిస్తూ తమకు నచ్చిన రీతిలో జీవించే విధంగా గవర్నర్లు రెగ్యులరైజేషన్ ద్వారా పరిపాలించే అధికారాలను ఈ అధికరణలు ఇవ్వడం జరిగింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే గిరిజనులు, వారి భూములపై హక్కుల అంశంపై అధ్యయనం చేయడానికి ల్యాండ్ కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదికను 2005 ఆగస్టు 15న జె.ఎన్. గిర్‌గిలాని ఆనాటి శాసనసభకు సమర్పించారు. అందులో ఎన్నో భయంకర నిజాలు, గిరిజనేతరులు కబళించిన భూవివరాలు వెల్లడ య్యాయి. అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలోని గిరిజన ప్రాంతాల కోసం ఐఏఎస్ మూర్తి గారిని నియామకం చేసింది ప్రభుత్వం. వీరి నివేది కలో కేంద్రంలో కొంతమంది ఉన్నతాధికారులు అసలు 5వ షెడ్యూ ల్నే రాజ్యాంగం నుంచి ఎత్తివేయాలని ప్రభుత్వానికి సూచించినట్లు ఒక ఆశ్చర్యకరమైన అంశం వెలుగులోకి వచ్చింది. ఈ రెండు నివే దికలు ‘రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్’ ద్వారానే బహిర్గతమయ్యాయి తప్ప, అసలు శాసనసభ మెట్లు ఎక్కలేదన్నది నిజం. తెలంగాణ గవర్నర్ పర్యటించిన ములుగు జిల్లా గోవింద రావు పేట మండలంలోని గిరిజనుల భూముల అన్యాక్రాంతం గురించి ప్రభుత్వం నియమించిన కమిటీ 25 సంవత్సరాల క్రితమే నివేదిక లిచ్చినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ట్రైబల్ రెగ్యులేషన్ యాక్ట్ కింద వేలాది ఎకరాలు అన్యాక్రాంతమైనాయనీ, వాటిని గిరిజనులకు అప్పగించాలనీ తీర్పులిచ్చినా చలనం లేదు. తరతరాల నుండి జరిగిన అన్యాయాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ‘ఫారెస్ట్ రైట్ యాక్ట్ 2006’ కూడా నిరర్థకంగా మారింది. బిహార్‌లో గిరిజన యోధుడు బిర్సా ముండా త్యాగాన్ని శ్లాఘిస్తూ ఏళ్ల తరబడి గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న డాక్టర్ ఫెలిక్స్ పెడల్‌ను ఇక్కడ ఉదాహరణగా చెప్పుకోవాలి. ఈయన ఎంతో చరిత్ర ఉన్న చార్లెస్ డార్విన్ మునిమనవడు. ఆయన నుండి స్ఫూర్తిని పొందాలి. ‘ఆజాద్ కా అమృతోత్సవ్’ దేశమంతటా జరుపుకొంటున్న శుభ వేళ ఆదిమ జాతీయులకు మాత్రం వారి భూమి వారికి దక్కకుండా పోవడం క్షమించరానిది. ఏ చర్యలు తీసుకున్నామని వివిధ ప్రభు త్వాలు, ప్రభుత్వ యంత్రాంగాలు, వివిధ రాజకీయ పార్టీలు,స్వచ్ఛంద సంస్థలు ఆలోచించాలి. దృఢ సంకల్పంతో ఒక ఆమోద యోగ్యమైన కార్యాచరణను రూపొందిచుకోకపోతే ఆందోళనకరమైన పరిస్థితులు అనివార్యమవుతాయని గత ఉద్యమాల చరిత్ర స్పష్టం చేస్తోంది.సి.హెచ్. విద్యాసాగర్‌రావు వ్యాసకర్త మహారాష్ట్ర మాజీ గవర్నర్ -
వ్యవసాయం ద్వారా జీవనోపాధి
సాక్షి, అమరావతి: ఆర్వోఎఫ్ఆర్ (రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) మంజూరు ద్వారా గిరిజనులు వ్యవసాయం చేసుకుని జీవనోపాధి పొందేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. గిరిజనులకు దారి చూపించేలా వ్యవహరించాలని, మానవత్వంతో పని చేసి.. ప్రతి ఒక్కరికీ మంచి చేయాలన్నారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాలపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనం చేసే మంచిని గిరిజనులు కలకాలం గుర్తు పెట్టుకుంటారని, ప్రతి ఆర్వోఎఫ్ఆర్ పట్టాను ఆధార్‌తో లింక్ చేయాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. గిరిజనులకు మేలు జరిగేలా చూడాలి ► ఆర్వోఎఫ్ఆర్ పట్టా ఉన్న వారికి మనం రైతు భరోసా అమలు చేస్తున్నాం. అటవీ భూములపై వారికి హక్కులు కల్పించడం ద్వారా పెట్టుబడి సహాయం పొందడానికి అవకాశం కల్పించినట్లు అవుతుంది. ► గిరిజనులు ఆదాయం పొందడానికి మనం అవకాశాలు కల్పించాలి. అటవీ భూములపై హక్కులు కల్పించే అంశంలో అవినీతి ఉండకూడదు. అధికారులు గిరిజనులకు దారి చూపించేలా వ్యవహరించాలి. ► వచ్చిన దరఖాస్తులను మరోసారి పరిశీలించండి. ఆదివాసీ దినోత్సవం నాటికి వారికి అటవీ భూములపై హక్కులు కల్పించేలా చూడాలి. ► సమీక్షలో డిప్యూటీ సీఎంలు పిల్లి సుభాష్ చంద్రబోస్, పి.పుష్ప శ్రీవాణి, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ కాంతిలాల్ దండే, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్‌కుమార్ ప్రసాద్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రతీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గిరిజనుల ప్రయోజనాల పరిరక్షణకు కృషి జీవో నంబరు 3పై (షెడ్యూల్ ఏరియాల్లో ఉపాధ్యాయుల నియామకాల్లో నూరు శాతం ఎస్టీలనే నియమించాలి) గిరిజనుల ప్రయోజనాలను రక్షించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. సమీక్షలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, అధికారులు ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు సీఎం పై విధంగా స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పులోని అంశాలను నిశితంగా అధ్యయనం చేయాలని ఇదివరకే ఆదేశాలిచ్చామని, పరిశీలన పూర్తయ్యాక తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. గిరిజనుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుందని చెప్పారు. -
‘చుక్కల’ భూములు చక్కబెట్టేద్దాం!
-
‘చుక్కల’ భూములు చక్కబెట్టేద్దాం!
24 లక్షల ఎకరాలకు ‘పచ్చ’తమ్ముళ్ల భారీ స్కెచ్... ⇒ రూ. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కొట్టేసేందుకు పన్నాగాలు.. అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు ⇒ అనుభవదారులు, రెవెన్యూ సిబ్బందికి బెదిరింపులు..మాట వినని సిబ్బందికి బదిలీలు ⇒ బోగస్ పత్రాలతో రికార్డులు తారుమారు ⇒ అనుభవదారుల స్థానంలో తమ పేర్లు రాయిస్తోన్న టీడీపీ నేతలు ⇒ త్వరలో అసెంబ్లీలో చుక్కల భూముల పరిష్కార బిల్లు ⇒ ఈలోగా రికార్డుల్లో అనుభవదారులుగా పేర్లు నమోదు చేయించుకుంటున్న తెలుగుదేశం తమ్ముళ్లు ⇒ చట్టం అమల్లోకి రాగానే భూములు సొంతం చేసుకొనే వ్యూహం సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎవరికీ చెందకుండా రెవెన్యూ రికార్డుల్లో చుక్కల భూములుగా నమోదైన లక్షలాది ఎకరాలపై తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ల కన్ను పడింది. అడంగల్‌లను తారుమారు చేసి, తామే అనుభవదారులుగా చూపించి, వాటన్నింటినీ సొంతం చేసుకొనే వ్యూహంలో టీడీపీ నేతలు ఉన్నారు. ఈ భూముల విషయంలో కొన్ని దశాబ్దాలుగా వివాదం ఉంది. స్వాతంత్య్రా నంతరం రెవెన్యూ రికార్డులను తిరగరాసే సమయంలో కొన్ని సర్వే నంబర్లకు చెందిన భూమి ప్రభుత్వానిదా? ప్రైవేటు వ్యక్తులదా అన్న విషయం తేలలేదు. దీంతో ఆ భూముల రికార్డుల్లో హక్కుదారు కాలమ్‌లో చుక్క పెట్టి వదిలేశారు. వీటినే చుక్కల భూములుగా పిలుస్తారు. ఇలాంటి భూములు రాష్ట్రంలో 24 లక్షల ఎకరాలు ఉన్నాయి. వీటిలో 3 లక్షల ఎకరాలు ప్రైవేటు వ్యక్తులవి చెందినవి. మరో 21 లక్షల ఎకరాలు ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. ఈ భూముల హక్కులపై వివాదం నడుస్తోంది. ఇవన్నీ ప్రభుత్వానివేనని రెవెన్యూ శాఖ వాదిస్తోంది. ఇవి తమవేనని అనుభవదారులు వాదిస్తున్నారు. ఈ వివాదం శాశ్వత పరిష్కారానికి త్వరలోనే శాసన సభలో బిల్లు రానుంది. ఇదే అదనుగా భావించిన టీడీపీ నేతలు ఈ భూముల అనుభవదారులుగా తమ పేర్లను నమోదు చేయిస్తున్నారు. బిల్లు ఆమోదం పొంది, చట్ట రూపం దాల్చేలోగా రికార్డుల్లో ఈ భూములకు అనుభవదారులుగా పేర్లు చేర్చడం ద్వారా వాటిని సొంతం చేసుకోవడం టీడీపీ నేతల వ్యూహం. మాట వినకపోతే బెదిరింపులు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులోని సర్వే నంబర్ 15లోని కొన్ని భూములు రెవెన్యూ రికార్డుల్లో చుక్కల భూములుగా నమోదయ్యాయి. అదే విధంగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం జంబులదిన్నె గ్రామంలో 100. 109, 149, 165, 175, 180, 190, 197, 201, 217 సర్వే నంబర్లలోని భూముల్లో కూడా కొన్ని చుక్కల భూములుగా ఉన్నాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 24 లక్షల ఎకరాలు ఉన్నాయి. వేల కోట్ల రూపాయల విలువైన ఈ చుక్కల భూముల్లో దశాబ్దాలుగా రైతులు సాగు చేసుకుంటున్నారు. ఈ భూములు వివాదాస్పదమైనవైనందున, వీటి అనుభవదారులకు ఈ భూములపై పంట రుణాలు అందడం లేదు. అత్యవసరమై అమ్ముకోవాలన్నా వీలుకాని పరిస్థితి. అందుకే ఈ చుక్కల సమస్యను పరిష్కరించాలని అనుభవదారులు కోరుతున్నారు. అయితే, దీన్ని ఆసరాగా చేసుకుని మొత్తం భూములను కొట్టేసే ప్రయత్నంలో అధికార పార్టీ నాయకులు ఉన్నారు. ఇప్పటికే పచ్చటి పంట పొలాలు, అసైన్డ్ భూములు, కొండ పోరంబోకు, లంక భూములను నయానో భయానో చేజిక్కించుకుంటున్న టీడీపీ నేతలు.. ఇప్పుడు చుక్కల భూములను కూడా సొంతం చేసుకొనే పనిలో పడ్డారు. రైతులను, రెవెన్యూ సిబ్బందిని బెదిరించి చుక్కల భూముల అనుభవదారులుగా అడంగల్‌లో తమ పేర్లు రాయించుకుంటున్నారు. ఇందుకు బోగస్ పత్రాలు సృష్టించి, అడంగళ్లనే మార్చేస్తున్నారు. మాట వినని క్షేత్రస్థాయి అధికారులను బెదిరిస్తున్నారు. ఇంకా అవసరమైతే బదిలీ కూడా చేయిస్తున్నారు. ఈ అరాచకాలకు అడ్డుకట్ట వేయకపోతే చుక్కల భూములన్నీ చేజారిపోతాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘చుక్కల భూములను తెలుగుదేశం వారి పరం చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. చూస్తూ ఊరుకోవడం మినహా ఏమీ చేయలేని పరిస్థితి’’ అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్పారు. బిల్లు రాకముందే రికార్డులు తారుమారు చుక్కల భూమలు సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం గతంలోనే కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలని సబ్ కమిటీ సూచించింది. సబ్ కమిటీ సిఫార్సులను అనుసరించి ఈ వివాదాన్ని పరిష్కరించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. విధి విధానాలను రూపొందించే బాధ్యతను రెవెన్యూ శాఖకు అప్పగించింది. ఈ భూములను ఐదు విభాగాలుగా వర్గీకరించి, వాటి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో రెవెన్యూ శాఖ విధివిధానాలు రూపొందించి, అసెంబ్లీలో బిల్లు కోసం ముసాయిదాను ప్రభుత్వానికి సమర్పించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి, చుక్కల భూముల వివాదాల పరిష్కార చట్టాన్ని అమల్లోకి తేవాలని యోచిస్తున్నారు. దీంతో అధికార పార్టీ నేతలు రంగప్రవేశం చేశారు. బిల్లు రాకముందే ఈ భూములను తమ ఖాతాలో వేయించుకునేందుకు గ్రామాల్లో టీడీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. రికార్డుల్లో ఈ భూములు తమవని తప్పుడు ఆధారాలు సృష్టించి పెడితే, బిల్లు చట్టరూపం దాల్చగానే దాని ప్రకారం చుక్కల స్థానంలో భూ యాజమాన్య రికార్డు (1–బి)లో తమ పేరు చేరుతుందని భావిస్తున్నారు. డబ్బు కోసం కొందరు, రాజకీయ ఒత్తిళ్ల వల్ల మరికొందరు క్షేత్రస్థాయి సిబ్బంది టీడీపీ నేతలకు సహకరించి, తప్పుడు రికార్డులు సృష్టిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోని చుక్కవ భూములను కూడా గుంజుకొంటున్నారు. వీటి అనుభవదారులును బెదిరించి, రికార్డులు తారుమారు చేస్తున్నట్లు సమాచారం. రికార్డుల్లో తమ పేరు ఉంటే, బిల్లు చట్ట రూపం దాల్చగానే భూములు సొంతం చేసుకోవచ్చన్నది అధికార పార్టీ నేతల వ్యూహం.