గిరిజనుల భూమి గిరిజనులకే! | Sakshi Guest Column On Tribal land Rights | Sakshi
Sakshi News home page

గిరిజనుల భూమి గిరిజనులకే!

Published Tue, Sep 3 2024 5:40 AM | Last Updated on Tue, Sep 3 2024 5:40 AM

Sakshi Guest Column On Tribal land Rights

అభిప్రాయం

ప్రధాన జీవన స్రవంతిలో ఆదివాసీ ప్రజల అస్తిత్వం, గౌరవం, కృషి ఏ మేరకు గుర్తింపునకు నోచుకున్నాయిఅనేదాన్నిబట్టి ఆ జాతి సమగ్ర మూర్తిమత్వం అర్థమవుతుంది. అల్లూరి సీతారామరాజు, రాంజీ గోండ్, కొమురం భీం లాంటి యోధులు ‘జల్‌’, ‘జంగల్‌’, ‘జమీన్‌ ’ పేరిట వారి హక్కుల సాధన కొరకు పోరాడి ప్రాణాలర్పించారు. అయితే స్వతంత్ర భారతదేశంలో గిరిజనుల కోసం చేసిన చట్టాలు నిర్వీర్యమయ్యాయి. చొరబాటుదారులు అడవి ద్వారాలు తీశారు. ఆదిమ జాతీయులకు వారి భూమి వారికి దక్కకుండా పోవడం క్షమించరానిది. ప్రభుత్వాలు, పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు ఆలోచించి ఒక ఆమోదయోగ్యమైన కార్యాచరణను రూపొందించుకోకపోతే ఆందోళనకరమైన పరిస్థితులు అనివార్యమవుతాయని గత ఉద్యమాల చరిత్ర చెబుతోంది.

మాతృమూర్తైనా, మాతృభాషైనా, మాతృదేశమైనా పలికేటప్పుడు వేరువేరుగా వినిపించినా ఆ మూడింటి అంతఃసూత్రం ఒకటే బంధం. తల్లి గర్భాల యంలో మనం నేర్చుకున్న మనదైన భాషలో మాతృదేశంలో తొలి అడుగు మోపే నవజాత శిశువుకు ఈ మూడింటి అస్తిత్వం అనివార్యంగా ఇవ్వబడుతుంది. ఇలాంటిదే ఒక జాతికి కూడా ఉంటుంది. అదే మూలవాసీ సంస్కృతి. ప్రధాన జీవన స్రవంతిలో ఆదివాసీ ప్రజల అస్తిత్వం, గౌరవం, కృషి ఏ మేరకు గుర్తింపునకు నోచుకు న్నాయి అనేదాన్నిబట్టి ఆ జాతి సమగ్ర మూర్తిమత్వం అర్థమవుతుంది.

సుద్దాల అశోక్‌తేజ రాసిన ‘కొమురం భీముడో’ అన్న సినీ గేయం కొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తుంది. అడవి తల్లి తన గిరిజన సంతానాన్ని ఆత్మ గౌరవ బావుటా ఎగురెయ్యాలని సందేశాత్మకంగా చేసిన హెచ్చరి కలను స్పష్టం చేసేవిధంగా ఈ పాట సాగింది. వారి హక్కుల కోసం వారే ఉద్యమించాలనే ఉద్వేగాన్ని నింపుతుంది. ఈ పాట ప్రతి గిరిజనుడిని అగ్ని కణంలా వెంటాడింది. దేశంలో గిరిజన ప్రాంతా లున్న అన్ని రాష్ట్రాలలో వారి భాషలోకి తర్జుమా చేసి వినిపించాలనే ప్రణాళికతో అక్కడి నాయకులు ముందుకుపోతున్నారు. 

‘మన సంస్కృతి మూలాల్ని నాశనం చేస్తున్న విదేశీయుల మీద నా పోరాటం’ అన్నారు బిర్సా ముండా. నూరేళ్ళ జీవితానుభవంతో 25 ఏళ్లు బతికి ధిక్కార హెచ్చరికను వినిపించి, బ్రిటిష్‌వాళ్ల గుండెల్లో ఫిరంగులు పేల్చాడు. ఆయన జయంతి నవంబర్‌ 15న ‘జన్‌ జాతీయ దివస్‌’గా జరుపుకొంటున్నాం. బిర్సా ముండా చిత్రపటాన్ని పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో ఉంచడంతో పాటు, రాంచీ విమానాశ్ర యానికి, ఇంకా ఎన్నో సంస్థలకు ఆ వీరుని పేరు పెట్టడం జరిగింది. అల్లూరి సీతారామరాజు, రాంజీ గోండ్, కొమురం భీం లాంటి యోధులు ‘జల్‌’, ‘జంగల్‌’, ‘జమీన్‌ ’ పేరిట వారి హక్కుల సాధన కొరకు పోరాడి ప్రాణాలర్పించారు. బ్రిటిష్‌ పాలనలో మొత్తం 75 సార్లు గిరిజన తిరుగుబాట్లు జరిగాయంటే వారి చైతన్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలి. 

తెలంగాణా గవర్నరు జిష్ణుదేవ్‌ వర్మ ఈ మధ్యన తెలంగాణ గిరిజన ప్రాంతాలలో పర్యటించడం ముదావహం. గిరిజనులకు బాస టగా నిలవడానికి ‘యాక్ట్‌ 1/70’ని రూపొందించుకున్నాం. అందులో ఉన్న సెక్షన్‌ 3(1)(ఎ) ప్రకారం, వివాదాలు తేలేంతవరకు షెడ్యూల్డ్‌ ప్రాంతాలలో ఉన్న భూమి గిరిజనులదిగానే భావించబడుతుంది. ఈ మధ్యన గవర్నరు పర్యటించిన ప్రాంతం ఆ కోవకే చెందుతుంది. వారికి అధికారులు ఏ మేరకు పరిస్థితులను విశదీకరించారో గానీ, రాజ్యాంగంలోని ‘షెడ్యూల్‌ 5’ ప్రకారం గవర్నరుకు విశేషాధికారాలు ఉంటాయి. ఇది వజ్రాయుధం లాంటిది. 

డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ‘రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు పరిచేవాళ్ళు చెడ్డవాళ్లైతే అది కూడా చెడ్డది కావడం ఖాయం. రాజ్యాంగం ఎంత చెడ్డదైనా దాన్ని అమలు పరిచేవాళ్ళు మంచివాళ్లైతే అది కూడా మంచిదవటం అంతే ఖాయం’ అన్నారు. మన రాజ్యాంగ సంవిధాన మౌలిక నిర్మాణం ఎంతో గొప్పది. సామాజిక అణచివేతకు గురైనవారి అభ్యున్నతి కోసం తోడ్పడడమే రాజ్యాంగంలోని రిజర్వే షన్ల లక్ష్యం.

స్వాతంత్య్రానంతరం పాలకులు ఆదివాసీలను చేరడానికి ముఖ్యంగా మూడు ఆలోచనలు చేశారు. ఏకాంతవాసం, కలిసి పోవటం, అభ్యున్నతి. 1958లో మన తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఈ కలిసిపోవటాన్ని ఎంచుకున్నారు. అంటే ఆదివాసీలతో కలిసి వారిని అభివృద్ధి పరచాలని. ఆదివాసీలను దోపిడీ నుంచి కాపా డాలని, రక్షణగా నిలవాలని, వారికి సంక్షేమ పథకాలు రూపొందింపజేయాలని భావించి ‘పంచశీల’ను ఎంచుకున్నారు. ఆ తరువాత యాక్ట్‌ డి.ఎఫ్‌. 1970 చట్టం తీసుకొచ్చారు. గిరిజనుల భూమిని, అటవీ సంపదను ఇది కవచంలాగా కాపాడుతుందని ఊదరగొట్టారు. కానీ ఆ చట్టాలు నిర్వీర్యం అయ్యాయి. చొరబాటుదారులు అడవి ద్వారాలు తీశారు.

తెలంగాణాలో నిజాం కాలంలో దీనికోసం హైమన్‌  డార్ఫ్‌ని తన సలహాదారుగా నియమించుకున్నారు. ఎన్నో సంస్కరణలు చేశామను కున్నారు. కానీ 1948 అనంతరం ఏర్పడిన ప్రభుత్వాలు ఈ దిశగా పెద్దగా చర్యలు తీసుకోలేదు. 1976, ’77లో ఆదిలాబాద్‌లోని ఉట్నూరు ప్రాంతాన్ని సందర్శించినప్పుడు విస్తుపోయే వాస్తవాలెన్నో వెలుగులోకి వచ్చాయి. సంపన్నతే చుట్టరికంగా మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రా ప్రాంతాల నుండి వచ్చిన ధనికులు గిరిజనుల భూమిని ఆక్రమించుకొని, అసలు హక్కుదారులైన గిరిజనులను అక్కడ నుండి తరిమేశారనీ, దాంతో వారు దూరంగా వచ్చి తలదాచుకున్నారనీ, ఇప్పుడు ఆ స్థలాల నుండి కూడా అటవీ అధికారులు వేరే ప్రాంతాలకు వెళ్ళాలని బెదిరిస్తున్నారనీ గిరిజనులు చెప్పుకొచ్చారు.

ఇదంతా వింటుంటే చరిత్రలోని చివరి మొఘల్‌ రాజు బహదూర్‌ షా జాఫర్‌ కథ గుర్తొస్తోంది. 1857 తిరుగుబాటు అణచివేయబడి బ్రిటిష్‌ సైన్యం చేతిలో ఆయన ఓడిపోయిన తరువాత రెండు గజాల భూమి తన భారతదేశంలో తనకు దొరకలేదనీ, ఆ బాధతోనే తన చివరి రోజుల్లో బర్మాలోనే గడుపుతూ అక్కడే ఖననం చేయబడ్డాడనీ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి గిర్‌గిలాని తన ఉపన్యాసంలో ఉట్టంకించటం గుర్తొస్తోంది. ఇక్కడ మనం చర్చించాల్సిన అంశం ఒకటుంది. రాజ్యాంగంలోని 5వ, 6వ షెడ్యూళ్ళ ద్వారా గవర్నర్లకు విశేష అధికారాలే కల్పించారు. వారి జీవన స్రవంతిని, సంస్కృతి, వైవిధ్యాలను రక్షిస్తూ తమకు నచ్చిన రీతిలో జీవించే విధంగా గవర్నర్లు రెగ్యులరైజేషన్‌  ద్వారా పరిపాలించే అధికారాలను ఈ అధికరణలు ఇవ్వడం జరిగింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే గిరిజనులు, వారి భూములపై హక్కుల అంశంపై అధ్యయనం చేయడానికి ల్యాండ్‌ కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదికను 2005 ఆగస్టు 15న జె.ఎన్‌. గిర్‌గిలాని ఆనాటి శాసనసభకు సమర్పించారు. అందులో ఎన్నో భయంకర నిజాలు, గిరిజనేతరులు కబళించిన భూవివరాలు వెల్లడ య్యాయి. 

అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలోని గిరిజన ప్రాంతాల కోసం ఐఏఎస్‌ మూర్తి గారిని నియామకం చేసింది ప్రభుత్వం. వీరి నివేది కలో కేంద్రంలో కొంతమంది ఉన్నతాధికారులు అసలు 5వ షెడ్యూ ల్‌నే రాజ్యాంగం నుంచి ఎత్తివేయాలని ప్రభుత్వానికి సూచించినట్లు ఒక ఆశ్చర్యకరమైన అంశం వెలుగులోకి వచ్చింది. ఈ రెండు నివే దికలు ‘రైట్‌ టు ఇన్ఫర్మేషన్‌  యాక్ట్‌’ ద్వారానే బహిర్గతమయ్యాయి తప్ప, అసలు శాసనసభ మెట్లు ఎక్కలేదన్నది నిజం. 

తెలంగాణ గవర్నర్‌ పర్యటించిన ములుగు జిల్లా గోవింద రావు పేట మండలంలోని గిరిజనుల భూముల అన్యాక్రాంతం గురించి ప్రభుత్వం నియమించిన కమిటీ 25 సంవత్సరాల క్రితమే నివేదిక లిచ్చినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ట్రైబల్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ కింద వేలాది ఎకరాలు అన్యాక్రాంతమైనాయనీ, వాటిని గిరిజనులకు అప్పగించాలనీ తీర్పులిచ్చినా చలనం లేదు. 

తరతరాల నుండి జరిగిన అన్యాయాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ‘ఫారెస్ట్‌ రైట్‌ యాక్ట్‌ 2006’ కూడా నిరర్థకంగా మారింది. బిహార్‌లో గిరిజన యోధుడు బిర్సా ముండా త్యాగాన్ని శ్లాఘిస్తూ ఏళ్ల తరబడి గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న డాక్టర్‌ ఫెలిక్స్‌ పెడల్‌ను ఇక్కడ ఉదాహరణగా చెప్పుకోవాలి. ఈయన ఎంతో చరిత్ర ఉన్న చార్లెస్‌ డార్విన్‌ మునిమనవడు. ఆయన నుండి స్ఫూర్తిని పొందాలి. 

‘ఆజాద్‌ కా అమృతోత్సవ్‌’ దేశమంతటా జరుపుకొంటున్న శుభ వేళ ఆదిమ జాతీయులకు మాత్రం వారి భూమి వారికి దక్కకుండా పోవడం క్షమించరానిది. ఏ చర్యలు తీసుకున్నామని వివిధ ప్రభు త్వాలు, ప్రభుత్వ యంత్రాంగాలు, వివిధ రాజకీయ పార్టీలు,స్వచ్ఛంద సంస్థలు ఆలోచించాలి. దృఢ సంకల్పంతో ఒక ఆమోద యోగ్యమైన కార్యాచరణను రూపొందిచుకోకపోతే ఆందోళనకరమైన పరిస్థితులు అనివార్యమవుతాయని గత ఉద్యమాల చరిత్ర స్పష్టం చేస్తోంది.

సి.హెచ్‌. విద్యాసాగర్‌రావు 
వ్యాసకర్త మహారాష్ట్ర మాజీ గవర్నర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement