జనాభాలో 12 కోట్ల పైచిలుకు ఉన్న అమాయక ఆదివాసీ ప్రజలకు హిందూ అస్తిత్వాన్ని అంటగట్టే ప్రయత్నం జరుగుతోంది. జనగణనలో ఆదివాసీలను హిందువులుగా నమోదుచేస్తూ... వారి చారిత్రక అస్తిత్వాన్ని మాయం చేస్తున్న వైనం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కుల వ్యవస్థ పునాదిగా ‘ఏకీకృత హిందూ అస్తిత్వం’ నినాదంతో సాగుతున్న సాంఘిక పునర్నిర్మాణ జగన్నాథ రథ చక్రాల కింద ‘బహుళ అస్తిత్వాల’ భారతీయ సమాజం నలిగిపోతోంది. ఈ దేశ బహుళత్వాన్ని అంతర్థానం చేయడం ద్వారా, అతి పెద్ద ఓటు బ్యాంకును సంఘటితం చేస్తున్నారు. అనేక జాతులు, కులాలు, మతాలుగా ఉన్న భారతీయులు తమ తమ సాముదాయక అస్తిత్వాలను కాపాడుకోవడానికి పోరాటాలకు దిగాల్సిన అవసరం ఉంది.
ఈ దేశంలో కోట్లమంది మూలవాసులు కేవలం తమ అస్తిత్వం కోసమే పోరాడాల్సిన పరిస్థితి దాపురించింది. కులం, మతం, ప్రాంతం, జాతి, భాష, జెండర్ తదితర బహుళ అస్తిత్వాలు అంశీభూతాలుగా ఉన్న భార తీయ సమాజం... నేడు అస్తిత్వ వైషమ్యాల సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. పాలక, ఆధిపత్య అస్తిత్వాలూ; అణగారిన అస్తిత్వాల మధ్య ఒక విధమైన యుద్ధ వాతావరణం నెలకొంది. దళిత, బహుజన సామాజిక సమూహాలూ; ముస్లిం తదితర మైనారిటీ సమూహాలూ నేడు మెజారిటీ మత, కుల అస్తిత్వ దాష్టీకానికీ, విద్వేషకాండకూ గురవుతున్నాయి. కుల వ్యవస్థ పునాదిగా ఉన్న ‘ఏకీకృత హిందూ అస్తిత్వం’ అనే నినాదంతో సాగుతున్న సాంఘిక పునర్నిర్మాణ జగన్నాథ రథ చక్రాల కింద బహుళ అస్తిత్వాల భారతీయ సమాజం బీటలు వారుతోంది.
2024 నాటికి దేశ జనగణన డిజిటైజేషన్ పూర్తి చేయాలనే లక్ష్యంతో సాగుతున్న సర్వే వివాదాస్పదంగా మారింది. కుల గణన జరగాలని ఓబీసీలు ఉద్యమిస్తున్నారు. లింగాయత్ తదితర అస్తిత్వ సమూహాలు తమను హిందూ మతంలో భాగంగా కాక, ప్రత్యేక మైనారిటీ మతస్థులుగా గుర్తించాలని 20వ శతాబ్దం ప్రారంభం నుంచీ డిమాండ్ చేస్తూ అనేక ఉద్యమాలు నిర్వహించాయి. ఇప్పుడు అత్యంత నిశ్శబ్దంగా దేశ జనాభాలో 8.6 శాతంగా ఉన్న ఆదివాసీ సమూహాల అస్తిత్వ ఆకాంక్షలను ధ్వంసం చేస్తూ జనగణన సాగిస్తు న్నారు. ఆదివాసీ ప్రజానీకాన్ని హిందువులుగా చిత్రించడానికి వారి దేవతలను సైతం హైందవీకరిస్తున్నారు. అందుకు ఇటీవలి ఉదాహ రణ కోయల కులదేవత సమ్మక్కను హిందూ దేవతను చేస్తున్న వైనం!
జనగణన సమయంలో ఆదివాసులు తమను హిందువులుగా నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ‘ఏకీకృత హిందూ అస్తిత్వం’లో ఈ దేశ బహుళత్వాన్ని అంతర్థానం చేయడం ద్వారా, అతిపెద్ద ఓటు బ్యాంకును సంఘటితం చేస్తున్నారు. తద్వారా కేంద్రీకృత అధికారాన్ని సుస్థిరం చేయాలని మెజారిటీ మతతత్వ శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగమే... దేశ జనాభాలో 12 కోట్ల పైచిలుకు ఉన్న అమాయక ఆదివాసీ ప్రజలకు హిందూ అస్తిత్వాన్ని అంటగట్టే ప్రయత్నం!
షెడ్యూల్డ్ తెగలుగా రాజ్యాంగంలో వర్గీకరణకు గురైన ఆదివాసీ ప్రజల్లో చాలామంది హిందూ, క్రైస్తవం, ఇస్లాం మత శాఖల్లో అంతర్భాగం అయినప్పటికీ... ఇప్పటికీ గణనీయమైన సంఖ్యలో సాంప్రదాయిక ఆదివాసీ మతస్థులుగానే కొనసాగుతున్నారు. 2011 జనగణన ప్రకారం ఆనాటి 121 కోట్ల మంది జనాభాలో 79 లక్షల మంది హిందూ, ఇస్లాం, క్రైస్తవం, సిక్కు, బౌద్ధం, జైన మతాలకు చెందినవారు కాదు. నాస్తికులు, జొరాస్ట్రియన్లు, యూదులు, నిర్దిష్ట, అనిర్దిష్ట ఆదివాసీ మతాలకు చెందిన వారినందరినీ కలిపి ‘ఇతర మతాలు, విశ్వాసాలు’ అనే వర్గీకరణ కింద చేర్చారు.
జార్ఖండ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, అస్సాం రాష్ట్రాల పరిధిలోని ఛోటానాగ్‌పూర్ పీఠభూమి ప్రాంతానికి చెందిన ముండా, భూమిజ్, ఖారియా, బైగా, హో, కురుఖ్, సంతాల్ తెగలకు చెందిన ప్రజలు సంప్రదాయిక చారి త్రక సంలీన మతమైన ‘సార్నాయిజం’కు చెందినవారు. సార్నా మతస్థులు 49 లక్షల మంది, సారి ధమ్మ 5 లక్షలు మంది ఉన్నారనీ; వీరితో పాటు వీరికి తోడు సంతాల్, కోయపూనెమ్, దోన్‌యీ– పోలోయిజం, సానామహిజం, ఖాసీ, నియామ్‌త్రే అనే మత విశ్వాసా లున్నట్టు 2011 జనగణనలో నమోదయ్యింది. ఆదివాసీ మతం, ప్రకృతి మతం, ‘సర్వాత్మ వాదం’ విశ్వాసులు కూడా ఉన్నట్టు అందులో నమోదు చేశారు. ఇంతటి వైవిధ్యం గల ఆదివాసీ ప్రజలను రాజకీయ దురు ద్దేశాల నేపథ్యంలో చారిత్రక అస్తిత్వ రహితులుగా మార్చివేసేందుకు పాలకులు ప్రయత్నిస్తుండటం అన్యాయం.
వివిధ విశ్వాసాలు, ఆలోచనా ధోరణులు సామాజిక పరిణామ క్రమంలో సమకాలీన పాలక వర్గాల, ప్రజల అవసరాలకు అను గుణంగా ‘చారిత్రక సంలీనం’కు గురయ్యాయి. ఆయా జాతుల, తెగల, రాజ్యాల, సామ్రాజ్యాల పాలకవర్గాల అవసరాలకు అను గుణంగా చారిత్రక సంలీనం మెజారిటీ మతానికి చెందిన పాలకుల ఆధిపత్యాన్ని సుస్థిరం చేసేందుకు ఉపకరించేది. అలాంటి సంలీనం చారిత్రకంగా ప్రతీఘాతుక పాత్ర నిర్వహిస్తుంది.
గ్రీకో– ఈజిప్షియన్, హెలినిస్టిక్ కాలంలో, గ్రీకో– రోమన్ మత చారిత్రక సంలీనాలు; షింటో–బౌద్ధం; అక్బర్ స్థాపించిన దీన్ –ఇ– ఇలాహి మతం; జర్మానిక్– సెల్టిక్– క్రిస్టియన్ మత విశ్వాసాల సంలీనాలు; నాజీ జర్మనీలో హిట్లర్ ప్రోత్సహించిన ‘జర్మన్ ఎవలాంజికల్ చర్చ్’; రష్యాలో ప్రతీఘాతుక విప్లవం కోసం ఏర్పాటైన ‘లివింగ్ చర్చ్’ అనే ఉద్యమం... అన్నీ కూడా మత చారిత్రక సంలీనాలే. ఇవన్నీ రాజ్య సుస్థిరత కోసం పాలకుల ప్రోత్సాహంతో ఏర్పాటైన మత చారిత్రక సంలీనాలు. ఈ నేపథ్యంలోనే నేడు ఇండియా వ్యాప్తంగా ‘ఏకీకృత హిందూ అస్తిత్వ’ కార్యక్రమం కూడా ఒక మత చారిత్రక సంలీనమే!
భారతీయ న్యాయవ్యవస్థ ప్రకారం స్థానిక లేదా మూలవాసీ మతాలన్నీ హిందూ మతం పరిధిలోకి వస్తాయి. వైదిక మతాలు మాత్రమే హిందూ మతం కిందికి వస్తాయని రాజ్యాంగం గుర్తించక పోవడం వల్ల... ఆదివాసీ లాంటి మైనారిటీ మతాలకు ప్రత్యేక గుర్తింపు రాకుండా పోయింది. ద్వీపకల్పంలోని స్థానిక మతాలన్నిటినీ కలిపి హిందూ మతంగా గుర్తించడం పర్షియన్ల కాలం నుంచి ప్రారంభమైంది. వివిధ విశ్వాసాలకు, ప్రకృతి మతాలకు నిలయంగా ఉన్న ఇండియాను సులభంగా గుర్తించేందుకు వీలుగా పర్షియన్లు ‘హిందూ’ అని పిలవడంతో ఇక్కడి మతాలన్నిటినీ హిందూ మతంగా గుర్తించడం పరిపాటిగా మారింది.
1955 హిందూ వివాహ చట్టంలో కూడా క్రైస్తవులు, ముస్లింలు, యూదులు కాని వారంతా హిందువులే నని నిర్వచించడం ఒక పెద్ద చారిత్రక తప్పిదమయింది. రాజ్యాంగం లోని ఈ లొసుగును ఆసరాగా తీసుకొని పాలకులు ఆదివాసీలకు జనగణన ద్వారా హిందూ అస్తిత్వాన్ని పులుముతూ, మెజారిటీ ఓటు బ్యాంకును రూపొందించాలనే కుయుక్తులు పన్నుతున్నారు.
హిందూ అస్తిత్వం అనేది ఏకరీతి వ్యవస్థ కాదు. కుల అస్తిత్వమనే అసమానత్వం, అస్పృశ్యతల దుర్మార్గమైన దొంతర్ల వ్యవస్థ అది. 12 కోట్లౖకు పెగా ఉన్న ఆదివాసీ ప్రజానీకం అసమానతల దొంతర్ల వ్యవస్థలో భాగమయ్యే ప్రమాదం ఉంది. వీర శైవం, లింగాయత్, శ్రీవైష్ణవం, ఆదివాసీల ప్రకృతి మతాలు కాల క్రమంలో హిందూ చారి త్రక సంలీనానికి గురయ్యాయి. ఇటువంటి ప్రయత్నాలు ఎన్ని జరి గినా ఇప్పటికీ అవైదిక వ్యక్తీకరణలు ఆయా ప్రకృతి మతాల్లో కొన సాగుతూనే ఉన్నాయి. అలాంటి చిన్నపాటి ప్రత్యేకతలను కూడా తొల గించి ‘సామాజిక ఫాసిజానికి’ గురి చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నారు.
ఆదివాసీ ప్రజలను 2011 నాటి జనగణనలోని వర్గీకరణతో గానీ, మొత్తం ‘ప్రకృతి మతం’ అనే వర్గీకరణతోగానీ నమోదు చేయాలి. అదే సమయంలో మైదాన ప్రాంతాల్లోని హిందూ మతం గొడుగుకింద తమ విశిష్టతలను కోల్పోయిన లింగాయత్, శ్రీవైష్ణవం తదితర మత శాఖలను హిందూ మతంలో భాగంగా కాకుండా విడి విడిగా మైనారిటీ మతాలుగా గుర్తించాల్సి ఉంది. వైదికేతర విశిష్ట మతాలను, ఆదివాసీల మతాలను మైనారిటీ మతాలుగా పరిగణిస్తూ రాజ్యాంగ లోపాన్ని సవరణ చేయాలి.
మైనారిటీ మత గుర్తింపు కోసం ఆయా మతçస్థులు ఉద్యమిస్తే, ‘ఏకీకృత హిందూ అస్తిత్వం’ అనే ఓటు బ్యాంకు రాజకీయ కుట్రలను ఎదుర్కొనడం సాధ్యమవుతుంది! శ్రమ సంబంధాల ప్రాతిపదికన దళిత, మైనారిటీ తదితర అణచివేత సమూ హాలలోని నిజ అస్తిత్వ ప్రజానీకంతో సంఘటితమైన ‘ఏకీకృత నిజ అస్తిత్వ’ ఉద్యమ నిర్మాణమే తక్షణ కర్తవ్యం. ఆత్మగౌరవ, కుల వివక్ష వ్యతిరేక, కుల నిర్మూలనా ఉద్యమాలు ‘ఏకీకృత నిజ అస్తిత్వ’ ఉద్య మాలుగా అవతరిస్తేనే హిందూ చారిత్రక సంలీనాన్ని అడ్డుకోగలం!
వ్యాసకర్త: వెన్నెలకంటి రామారావు
సీనియర్ జర్నలిస్ట్
మొబైల్: 95503 67536
Comments
Please login to add a commentAdd a comment